'కేవలం 40 శాతం మందికే ఉద్యోగాలు'
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కొరత ఏ మేర ఉందో మరోసారి స్పష్టమైంది. కేవలం 40 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ప్లేస్మెంట్లలో ఉద్యోగం సంపాదిస్తున్నారని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్లేస్మెంట్ దృక్పథాన్ని మరింత మెరుగుపర్చాల్సి ఉందని జవదేకర్ చెప్పారు. కనీసం 75 శాతం మంది విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్షిప్ అందించాలని ఏఐసీటీఈ నిర్ణయించిందని ఆయన తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో కనీసం 60 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జవదేకర్ ఉద్ఘాటించారు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, ట్రైనింగ్ కాలేజీల టీచర్ల విషయంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. సభ్యుల ఆందోళన అనంతరం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్టడీలో కేవలం 40 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిసిందని జవదేకర్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా ఈ శాతాన్ని పెంచుతామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్షిప్ లు ఇవ్వడానికి పరిశ్రమ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.