హోంగార్డు పోస్టుకు ఇంజనీర్ల పోటీ
32 హోంగార్డుల పోస్టులకు 24,353 మంది దరఖాస్తు
కంప్యూటర్ ఆపరేటర్లుగా బీటెక్‌ల పోటీ
అనూహ్య స్పందనతో ఎంపిక వాయిదా
నేర పరిశోధన విభాగం(సీఐడీ) 32 హోంగార్డు పోస్టులకు గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 24,353 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 761 మంది చొప్పున పోటీ పడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: హోంగార్డులు పేరుకు పోలీసు విభాగంలో పని చేస్తున్నా సాధారణ కార్మికుల కంటే దారుణమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. దినసరి వేతనం మినహా మరే ఇతర సదుపాయాలు, అలవెన్సులు వారికి ఉండవు. హోంగార్డుల్లో అత్యధికులు ఉన్నతాధికారుల కనుసన్నల్లో ఆర్డర్లీలుగానే బతుకెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. నెలవారీగా జీతమంటూ లేని వీరికి రోజు వేతనం కింద రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. పని చేసిన రోజులకు మాత్రమే వేతనం దక్కుతుంది.
వారాంతపు సెలవుల సహా మరే ఇతర సౌకర్యాలు వీరికి ఉండవు. మహిళా హోంగార్డులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఉండవు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కనీస అవసరాల కోసం హోంగార్డులు ఎన్నోసార్లు వేడుకున్నా ఫలితం దక్కలేదు. ఇదంతా ఒక ఎత్తు కాగా గత నెలలో 32 హోంగార్డుల పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్‌కు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి సైతం దరఖాస్తులు రావటంతో అధికారులు కంగుతిన్నారు.
కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన
సీఐడీలో 32 హోంగార్డు పోస్టుల భర్తీకి గత నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. బి-క్యాటగిరీలో ఉండే ఈ ఉద్యోగులు హైదరాబాద్‌తోపాటు 13 జిల్లాల్లో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఏడో తరగతి మాత్రమే కనీస విద్యార్హతగా నిర్ణయించినా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారూ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు. 32 పోస్టులకు 24,353 దరఖాస్తులు వచ్చాయి.
కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 12 పోస్టులకు 9,810 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు బీటెక్ పూర్తి చేసిన వారున్నారు. గత నెల 27, 28వ తేదీల్లోనే విజయవాడ బందర్ రోడ్‌లో ఉన్న స్వరాజ్ మైదాన్‌లో ఎంపిక ప్రక్రియను నిర్వహించాలని భావించినా భారీగా అందిన దరఖాస్తులను చూసి వాయిదా వేశారు. ప్రస్తుతం దరఖాస్తుల్ని పరిశీలించటంపై దృష్టి సారించారు.
‘వెయిటేజీ’ ఆశతోనే భారీగా దరఖాస్తులు
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, కుప్పలుతెప్పలుగా సీట్లు పేరుకుపోవటంతో ఇంజనీరింగ్ చదివిన వారి సంఖ్య పెరుగుతోంది. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా చాలామందికి నైపుణ్యాలు లేకపోవటం, ఫ్రెషర్స్‌గా పరిగణించటంతో వీరికి ఏ రంగంలో చూసుకున్నా గరిష్టంగా రూ.8 వేలకు మించి జీతాలు రావడం లేదు.
ఈ నేపథ్యంలోనే కాస్త జీతం తక్కువైనా పోలీసు విభాగంలో చేరాలనే ఉద్దేశంతోనే బీటెక్ పూర్తి చేసిన వాళ్లూ హోంగార్డు పోస్టులకు దరఖాస్తు చేసి ఉంటారని అధికారులు విశ్లేషిస్తున్నారు. ‘హోంగార్డులుగా పని చేస్తే పోలీసు విభాగం అనే గౌరవంతోపాటు కాని స్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయినప్పుడు వెయిటేజ్ లభిస్తుందనే ఉద్దేశంతో పలువురు ఉన్నత వి ద్యావంతులు దరఖాస్తు చేసినట్లు భావిస్తున్నాం’ అని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.