home guard post
-
హోంగార్డ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 1,800 హోంగార్డు పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఒక్కో కమిషనరేట్‌లో 900 చొప్పున ఉన్న పోస్టులకు ఆయా కమిషనరేట్ల పరిధిలో నివసించే స్థానికులు అర్హులని కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేశ్ ఎం.భగవత్ స్పష్టం చేశారు. శనివారం నుంచి ఈ నెల 25 వరకు(పని దినాల్లో) దరఖాస్తులు విక్రయించనున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులకు గచ్చిబౌలిలోని పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులు అంబర్‌పేటలోని రాచకొండ సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 మధ్య రూ.25 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. అక్కడే అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకుంటారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జిరాక్స్ ప్రతులు, 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో రావాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్ విధుల్ని ‘ఎ’ కేటగిరీలో, డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, సీసీ కెమెరా టెక్నీషియన్, కుక్, శానిటేషన్/మెయింటెనెన్స్ స్టాఫ్, స్వీపర్, ధోబీ, బార్బర్, ప్లంబర్, పెయింటర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఆటో మెకానిక్ పోస్టుల్ని ‘బీ’ కేటగిరీలో చేర్చారు. ‘ఏ కేటగిరీ’ పోస్టులకు పదో తరగతి, ‘బీ కేటగిరీ’కి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పురుషులు కనీసం 165 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 160 సెం.మీ.), మహిళా అభ్యర్థులు 150 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 145 సెం.మీ.) ఉండాలి. నిర్ణీత పోస్టులకు సంబంధించిన వృత్తివిద్యా సర్టిఫికెట్లూ జత చెయ్యాలి. దరఖాస్తుతో పాటు బర్త్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ (ఉన్నట్లైతే), 2014 సెప్టెంబర్ 30కి ముందు జారీ చేసిన డ్రైవింగ్ లెసైన్స్, విద్యార్హత పత్రాలు, ఆధార్ ప్రతు ల్ని జత చేయాలి. అభ్యర్థుల ఫిట్నెస్, పూర్వాపరాల పరిశీలన తర్వాత ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి రోజుకు రూ.400 చొప్పున వేతనం చెల్లిస్తారు. -
హోంగార్డు పోస్టుకు ఇంజనీర్ల పోటీ
32 హోంగార్డుల పోస్టులకు 24,353 మంది దరఖాస్తు కంప్యూటర్ ఆపరేటర్లుగా బీటెక్‌ల పోటీ అనూహ్య స్పందనతో ఎంపిక వాయిదా నేర పరిశోధన విభాగం(సీఐడీ) 32 హోంగార్డు పోస్టులకు గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 24,353 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 761 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: హోంగార్డులు పేరుకు పోలీసు విభాగంలో పని చేస్తున్నా సాధారణ కార్మికుల కంటే దారుణమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. దినసరి వేతనం మినహా మరే ఇతర సదుపాయాలు, అలవెన్సులు వారికి ఉండవు. హోంగార్డుల్లో అత్యధికులు ఉన్నతాధికారుల కనుసన్నల్లో ఆర్డర్లీలుగానే బతుకెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. నెలవారీగా జీతమంటూ లేని వీరికి రోజు వేతనం కింద రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. పని చేసిన రోజులకు మాత్రమే వేతనం దక్కుతుంది. వారాంతపు సెలవుల సహా మరే ఇతర సౌకర్యాలు వీరికి ఉండవు. మహిళా హోంగార్డులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఉండవు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కనీస అవసరాల కోసం హోంగార్డులు ఎన్నోసార్లు వేడుకున్నా ఫలితం దక్కలేదు. ఇదంతా ఒక ఎత్తు కాగా గత నెలలో 32 హోంగార్డుల పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్‌కు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి సైతం దరఖాస్తులు రావటంతో అధికారులు కంగుతిన్నారు. కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన సీఐడీలో 32 హోంగార్డు పోస్టుల భర్తీకి గత నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. బి-క్యాటగిరీలో ఉండే ఈ ఉద్యోగులు హైదరాబాద్‌తోపాటు 13 జిల్లాల్లో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఏడో తరగతి మాత్రమే కనీస విద్యార్హతగా నిర్ణయించినా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారూ హోంగార్డుల పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు. 32 పోస్టులకు 24,353 దరఖాస్తులు వచ్చాయి. కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 12 పోస్టులకు 9,810 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు బీటెక్ పూర్తి చేసిన వారున్నారు. గత నెల 27, 28వ తేదీల్లోనే విజయవాడ బందర్ రోడ్లో ఉన్న స్వరాజ్ మైదాన్‌లో ఎంపిక ప్రక్రియను నిర్వహించాలని భావించినా భారీగా అందిన దరఖాస్తులను చూసి వాయిదా వేశారు. ప్రస్తుతం దరఖాస్తుల్ని పరిశీలించటంపై దృష్టి సారించారు. ‘వెయిటేజీ’ ఆశతోనే భారీగా దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, కుప్పలుతెప్పలుగా సీట్లు పేరుకుపోవటంతో ఇంజనీరింగ్ చదివిన వారి సంఖ్య పెరుగుతోంది. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా చాలామందికి నైపుణ్యాలు లేకపోవటం, ఫ్రెషర్స్‌గా పరిగణించటంతో వీరికి ఏ రంగంలో చూసుకున్నా గరిష్టంగా రూ.8 వేలకు మించి జీతాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే కాస్త జీతం తక్కువైనా పోలీసు విభాగంలో చేరాలనే ఉద్దేశంతోనే బీటెక్ పూర్తి చేసిన వాళ్లూ హోంగార్డు పోస్టులకు దరఖాస్తు చేసి ఉంటారని అధికారులు విశ్లేషిస్తున్నారు. ‘హోంగార్డులుగా పని చేస్తే పోలీసు విభాగం అనే గౌరవంతోపాటు కాని స్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయినప్పుడు వెయిటేజ్ లభిస్తుందనే ఉద్దేశంతో పలువురు ఉన్నత వి ద్యావంతులు దరఖాస్తు చేసినట్లు భావిస్తున్నాం’ అని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.