సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహించింది.
దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్‌ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది.
ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ..
కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది.
ముందు వరుసలో హైదరాబాద్..
- అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్‌గావ్, మంగళూరు ఉన్నాయి.
- రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది.
- ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది.
- ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు
రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న
వారి శాతం
- మహారాష్ట్ర 64.17
- తమిళనాడు 60.97
- ఉత్తరప్రదేశ్ 56.55
- కర్ణాటక 51.21
- ఆంధ్రప్రదేశ్ 48.18
- ఢిల్లీ 42.57
- తెలంగాణ 41.31
- గుజరాత్ 36.68
- పశ్చిమబెంగాల్ 35.72
- రాజస్తాన్ 31.87
కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం)
కోర్సు 2019 2020 2021
- బీఈ/బీటెక్ 57.09 49 46.82
- ఎంబీఏ 36.44 54 46.59
- బీఏ 29.3 48 42.72
- బీకాం 30.06 47 40.3
- బీఎస్సీ 47.37 34 30.34
- ఎంసీఏ 43.19 25 22.42
- పాలిటెక్నిక్ 18.05 32 25.02
- బీఫార్మసీ 36.29 45 37.24
Comments
Please login to add a commentAdd a comment