కథలో ప్రత్యేకత లేకున్నా... కథనంలో వైవిధ్యత!
నేను 2002 నుంచి మల్లాది గారి నవలల్ని దొరికినవి అన్నీ చదువుతున్నాను. ఆయన రాసిన మిగిలిన వాటికన్నా త్రీమంకీస్ విభిన్నంగా ఉంది. కథగా చూస్తే ప్రత్యేకత పెద్దగా లేదు. నిరుద్యోగులైన ముగ్గురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నేరస్తులై జైల్లో కలుసుకుంటారు. ఓ సొరంగం లోంచి పారిపోయి, మరో సొరంగంలోంచి ఓ బేంక్ దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో దొంగల బృందం విఫలం కాకుండా బేంక్ సొమ్ము దొరకడం ఓ మలుపైతే, ఆ దొరికిన డబ్బు చేజారడం ఇంకో మలుపు. తిరిగి వారు దాన్ని సంపాదిస్తారనే పాజిటివ్ (నెగెటివ్?) నోట్‌తో నవలని ముగిస్తూ, ఎలా అన్నది పాఠకుల ఊహకే వదిలేశాడు. రేపటి కొడుకు కూడా మల్లాది పాఠకుల ఊహకి వదిలేసి ముగించడం గుర్తొచ్చింది.
కామెడీ నవలల్లో మల్లాది తమాషా పాత్రలని ప్రవేశపెడతారు. ‘ష్... గప్‌చుప్’లో కోపం వస్తే చెట్టెక్కేసే తండ్రి, ‘రెండు రెళ్ళు ఆరు’లో వంట చేసే భర్త, ‘నీకూ నాకూ పెళ్ళంట’లో అబద్ధాలని అమ్మే వ్యాపారస్తుడైన హీరో, ‘ఒక నువ్వు - ఒక నేను’లో ఆటోబయోగ్రఫీ రాయించుకోవాలనే పిచ్చి గల సినీ నిర్మాత, ‘కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్’లో ఆడపిచ్చి గల హీరో.. ఇలా! త్రీ మంకీస్‌లో చిన్న పాత్రలని కూడా విభిన్నంగా మలిచాడు.
భార్యా ద్వేషి అయిన మేజిస్ట్రేట్, ఆధ్యాత్మిక పిచ్చి గల వేమన, అంత్యాక్షరి పిచ్చి గల పట్టయ్య, శుభ్రత పిచ్చిగల శుభ్రజ్యోత్స్న స్వచ్ఛ, కుక్కల్ని ప్రేమించే వైతరణి మొదలైనవి. పాత్రల పేర్లు కూడా నవ్వొచ్చేవే పెట్టారు... ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌కి వెళ్లిన కుటుంబరావు, ఒబేసిటీ సెంటర్‌కి వెళ్లిన లావణ్య... ఇలా! అసలు హీరో పేర్లే కోతికి చెందినవి అయి ఉండడం, పేర్లుగానే అనిపించడం విశేషం.
ఈ వ్యాసం రాయడానికి కట్‌చేసి దాచిన త్రీ మంకీస్ మళ్లీ చదివితే నాకు విసుగు అనిపించకపోవడానికి కారణం షార్ట్ అండ్ షార్ప్ పంచ్ డైలాగ్సే. మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రీ కోక్ కొట్టేయడం ఎలా, ఫేస్‌బుక్ హాస్యాలు, పాస్‌వర్డ్ పంచెస్, కోక్2హోమ్‌డాట్‌కామ్ (నేనీ సైట్లోకి వెళ్లి షాపు ధరలో పది శాతం డిస్కౌంట్‌తో కోక్ జీరోని ఇంటికే ఉచితంగా తెప్పించుకున్నాను) లాంటివి నేటి సమాజానికి ప్రతిబింబం.
సావిరహే, చంటబ్బాయ్, రెండు రెళ్ళు ఆరు లాంటి హాస్య నవలల్లో హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ చాలా బలంగా రాశారు. ఈ తరం యువతీ యువకుల మధ్య ప్రేమ ఎంత బలహీనంగా ఉంటుందో హాస్యంగా ముగ్గురు యువకులు, ఆరుగురు యువతులతో చెప్పారు. కాలంతోపాటు రచయిత మారడం అంటే ఇదేనేమో? మొత్తంమీద చక్కటి సీరియల్స్ కోసం మొహం వాచిపోయిన నాలాంటి వారికి సాక్షి ఓ సీరియల్‌ని అందించి మంచి పని చేసింది.
- డి. కృష్ణ తేజస్విని
ధర్మారెడ్డి కాలనీ, ఫేజ్-1, కెపిహెచ్‌బి, హైదరాబాద్ - 500 072.