Three Monkeys
-
త్రీ మంకీస్ సినిమా రివ్యూ
సినిమా : త్రీ మంకీస్ నటీనటులు: సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, కారుణ్య చౌదరి దర్శకత్వం: జి.అనిల్ కుమార్ నిర్మాత: నగేష్. జి సంగీతం: జి. అనిల్ కుమార్ బ్యానర్: ఓరుగల్లు సినీ క్రియేషన్స్ జానర్: హారర్ కామెడీ ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం అంతగా ఆడకపోయినా బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ మరోసారి హీరోగా ముందుకొచ్చాడు. పైగా ఈసారి తన జబర్దస్త్ టీం శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి సినిమా చేయడం విశేషం. ఇక ట్రైలర్ బాగుందంటూ మెగాస్టార్ చిరంజీవి ‘త్రీ మంకీస్’ను అభినందించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జబర్దస్త్ షో పాపులారిటీ సినిమాకు ఏమేరకు ప్లస్ అయ్యింది? బుల్లితెరపై కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఈ టీమ్ వెండితెరపై ఏమేరకు నవ్వులు పండించగలిగింది..? సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా ప్రేక్షకులను మెప్పించారా లేదా అనేది చూద్దాం.! కథ: సంతోష్ (సుధీర్) మార్కెటింగ్ శాఖలో పనిచేస్తుంటాడు. అతనికి ఫణి (గెటప్ శ్రీను), ఆనంద్ (ఆటో రాంప్రసాద్) ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి చేసే కోతిచేష్టలకు అంతే లేదు. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సన్నీలియోన్ ఎందుకు వచ్చింది? అసలు ఆమె ఎవరు.. ఎలా చనిపోయింది? ఆమె చావుకు ఈ ముగ్గురికి సంబంధమేంటి? ఇంతలో సుధీర్ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడు. అతన్ని కాపాడేందుకు ఫణి, ఆనంద్ ఏం చేశారు? అసలే చిక్కుల్లో ఉన్న వీరిపై ఓ పాపను కాపాడాల్సిన బాధ్యత ఎలా పడింది. ఆమెను వీరు ఎలా కాపాడారు..? అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..! (వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు) విశ్లేషణ: సాయం అనే మందు లేక చాలామంది చనిపోతున్నారనే అంశాన్ని దర్శకుడు కథలో అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా తొలి అర్ధభాగం త్రీ మంకీస్ పంచ్‌లు, సరదా సన్నివేశాలతో పరవాలేదనిస్తుంది. వాళ్ల పంచ్‌లు పేలడంతో పెద్దగా బోర్ కొట్టదు. అయితే, సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ముగ్గురు స్నేహితులను ఓ హత్య కేసులో ఇరికించి, ప్రేక్షకుడిని థ్రిల్ చేద్దామనుకున్న దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కథ క్రైమ్ జానర్లోకి వెళ్లిన తర్వాత దర్శకుడు తేలిపోయాడు. అమ్మాయి హత్య కేసులో ముగ్గురు ఇరుక్కు పోయినప్పుడు.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా పండలేదు. ఏది ఆశించి.. కథ రాసుకున్నాడో అది నిజం చేసేందుకు దర్శకుడి పనితనం సరిపోలేదు. తొలి అర్థభాగం జబర్దస్త్ పంచ్‌లతో ఫరావాలేదనిపంచిన దర్శకుడు.. రెండో అర్థభాగం థ్రిల్లర్ నేపథ్యంలో కథ నడపలేకపోయాడు. ఇక పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేవు. రెండు పాటలు ఫరవాలేదనిపించాయి. బుల్లితెరపై అల్లరి చేసే త్రీ మంకీస్‌లో.. ఎమోషన్స్ అనే కొత్త కోణం చూపించారు. షకలక శంకర్, కారుణ్య చౌదరి ఓకే అనిపిస్తారు. చిన్న సినిమా అయినా.. సాంకేతికంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక ముగ్గురు హాస్యనటుల్ని ఒకేసారి వెండితెరపై చూపడం.. సగటు అభిమానికి నచ్చుతుంది. అయితే, వాళ్లలోని ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథ మాత్రం కాదని చెప్పాలి. దర్శకుడు కేవలం కామెడీనే నమ్ముకుంటే బాగుండేంది. ప్లస్ పాయింట్స్: సుధీర్, శ్రీను, రాంప్రసాద్ నటన కామెడీ టైమింగ్ మైనస్ పాయింట్స్: కొత్తదనం లేకపోవడం భయపడేంత హారర్ సీన్లు లేకపోవడం -
ఇప్పుడే హీరో ట్యాగ్ వద్దు
‘‘ప్రేక్షకులకు వినోదం పంచాలని ఇండస్ట్రీకి వచ్చాను. టీవీ, సిల్వర్ స్క్రీన్, యూట్యాబ్ చానెల్ ఇలా ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్లేదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. నగేష్. జి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర చేశా. మా సినిమాకి ఊహించిన స్థాయిలో థియేటర్స్ రాకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నాం. చిరంజీవిగారు మా ట్రైలర్ చూసి చాలా బాగుందన్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. నేను హీరోగా చేసిన ‘సాఫ్ట్వేర్ సుధీర్’కి మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే నా ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో అనే ట్యాగ్ వద్దు’’ అన్నారు. -
ఇండస్ట్రీలోని త్రీ మంకీస్ మేమే
‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి. ‘3 మంకీస్’ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్. హీరో ఆకాష్ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్ సన్నీ మాట్లాడారు. -
వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు
‘‘త్రీ మంకీస్’ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో నేను, సుధీర్, గెటప్ శ్రీను కోతి చేష్టలు చేస్తుంటాము’’ అన్నారు రాంప్రసాద్. ‘జబర్దస్త్’ ఫేమ్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన∙చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో జి. నగేశ్ నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. గలగల మాట్లాడుతూ, పంచ్‌లు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ‘నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సినవాడివి’ అనేవారు. దాంతో లగేజ్ సర్దుకుని హైదరాబాద్ వచ్చేశాను (నవ్వుతూ). కానీ ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎంతో స్ట్రగులయ్యాక ‘జబర్దస్త్’ టీవీ షో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ షో ద్వారా ‘ఆటో రాంప్రసాద్’గా పాపులరయ్యాను. ‘త్రీ మంకీస్’ కథ నచ్చి మేం సినిమా చేయాలనుకున్నాం. సరదాగా సాగిపోయే ముగ్గురు స్నేహితులకు ఒక సమస్య ఎదురవుతుంది. అందులో నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథాంశం. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. ‘త్రీ మంకీస్’ చూసి వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరని చెప్పగలను. టీవీని, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ పని చేయాలనుకుంటున్నాను. దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
త్రీ మంకీస్ పైసా వసూల్ చిత్రం
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ – ‘‘కామెడీతో పాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది’’ అన్నారు. ‘‘త్రీ మంకీస్’ చిత్రం మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అన్నారు నగేష్. ‘‘మేం ముగ్గురం కలసి సరదాగా నటించాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు గెటప్ శ్రీను. ‘‘సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాంప్రసాద్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి. -
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
చెడు అనకు.. కనకు.. వినకు
సీతానగరం (తాడేపల్లి రూరల్): సీతానగరం పుష్కర ఘాట్‌లో ముగ్గురు యువతులు మూడు కోతుల సామెత చందంగా చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు.. సంకేతాలు చూపుతూ కనిపించారు. పుష్కరాల్లో భాగంగా సీతానగరం ఘాట్‌లో శనివారం పలువురు యువతులు తమ ఫోటోలను సెల్ఫీల్లో బంధిస్తూ, కష్ణమ్మ జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నారు. -
కథలో ప్రత్యేకత లేకున్నా... కథనంలో వైవిధ్యత!
నేను 2002 నుంచి మల్లాది గారి నవలల్ని దొరికినవి అన్నీ చదువుతున్నాను. ఆయన రాసిన మిగిలిన వాటికన్నా త్రీమంకీస్ విభిన్నంగా ఉంది. కథగా చూస్తే ప్రత్యేకత పెద్దగా లేదు. నిరుద్యోగులైన ముగ్గురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నేరస్తులై జైల్లో కలుసుకుంటారు. ఓ సొరంగం లోంచి పారిపోయి, మరో సొరంగంలోంచి ఓ బేంక్ దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో దొంగల బృందం విఫలం కాకుండా బేంక్ సొమ్ము దొరకడం ఓ మలుపైతే, ఆ దొరికిన డబ్బు చేజారడం ఇంకో మలుపు. తిరిగి వారు దాన్ని సంపాదిస్తారనే పాజిటివ్ (నెగెటివ్?) నోట్‌తో నవలని ముగిస్తూ, ఎలా అన్నది పాఠకుల ఊహకే వదిలేశాడు. రేపటి కొడుకు కూడా మల్లాది పాఠకుల ఊహకి వదిలేసి ముగించడం గుర్తొచ్చింది. కామెడీ నవలల్లో మల్లాది తమాషా పాత్రలని ప్రవేశపెడతారు. ‘ష్... గప్‌చుప్’లో కోపం వస్తే చెట్టెక్కేసే తండ్రి, ‘రెండు రెళ్ళు ఆరు’లో వంట చేసే భర్త, ‘నీకూ నాకూ పెళ్ళంట’లో అబద్ధాలని అమ్మే వ్యాపారస్తుడైన హీరో, ‘ఒక నువ్వు - ఒక నేను’లో ఆటోబయోగ్రఫీ రాయించుకోవాలనే పిచ్చి గల సినీ నిర్మాత, ‘కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్’లో ఆడపిచ్చి గల హీరో.. ఇలా! త్రీ మంకీస్‌లో చిన్న పాత్రలని కూడా విభిన్నంగా మలిచాడు. భార్యా ద్వేషి అయిన మేజిస్ట్రేట్, ఆధ్యాత్మిక పిచ్చి గల వేమన, అంత్యాక్షరి పిచ్చి గల పట్టయ్య, శుభ్రత పిచ్చిగల శుభ్రజ్యోత్స్న స్వచ్ఛ, కుక్కల్ని ప్రేమించే వైతరణి మొదలైనవి. పాత్రల పేర్లు కూడా నవ్వొచ్చేవే పెట్టారు... ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌కి వెళ్లిన కుటుంబరావు, ఒబేసిటీ సెంటర్‌కి వెళ్లిన లావణ్య... ఇలా! అసలు హీరో పేర్లే కోతికి చెందినవి అయి ఉండడం, పేర్లుగానే అనిపించడం విశేషం. ఈ వ్యాసం రాయడానికి కట్‌చేసి దాచిన త్రీ మంకీస్ మళ్లీ చదివితే నాకు విసుగు అనిపించకపోవడానికి కారణం షార్ట్ అండ్ షార్ప్ పంచ్ డైలాగ్సే. మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రీ కోక్ కొట్టేయడం ఎలా, ఫేస్బుక్ హాస్యాలు, పాస్వర్డ్ పంచెస్, కోక్2హోమ్డాట్కామ్ (నేనీ సైట్లోకి వెళ్లి షాపు ధరలో పది శాతం డిస్కౌంట్‌తో కోక్ జీరోని ఇంటికే ఉచితంగా తెప్పించుకున్నాను) లాంటివి నేటి సమాజానికి ప్రతిబింబం. సావిరహే, చంటబ్బాయ్, రెండు రెళ్ళు ఆరు లాంటి హాస్య నవలల్లో హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ చాలా బలంగా రాశారు. ఈ తరం యువతీ యువకుల మధ్య ప్రేమ ఎంత బలహీనంగా ఉంటుందో హాస్యంగా ముగ్గురు యువకులు, ఆరుగురు యువతులతో చెప్పారు. కాలంతోపాటు రచయిత మారడం అంటే ఇదేనేమో? మొత్తంమీద చక్కటి సీరియల్స్ కోసం మొహం వాచిపోయిన నాలాంటి వారికి సాక్షి ఓ సీరియల్‌ని అందించి మంచి పని చేసింది. - డి. కృష్ణ తేజస్విని ధర్మారెడ్డి కాలనీ, ఫేజ్-1, కెపిహెచ్బి, హైదరాబాద్ - 500 072. -
త్రీ మంకీస్ - 26
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 26 - మల్లాది వెంకటకృష్ణమూర్తి మగాళ్ళల్లా బాయ్ కట్ క్రాఫ్ హెయిర్ స్టైల్. జీన్స్ పేంట్. టి షర్ట్. పాలరాయిలా తెల్లటి చర్మం. చూపరులని ఇట్టే ఆకట్టుకునే అందం ఆమెది. బట్టల సబ్బు కోసం ఆ విభాగంలోకి వచ్చిన కపీష్ ఆమెని, ఆమె రెండు చేతులతో లాఘవంగా తోసే రెండు ట్రాలీలని చూశాడు. వాటి నిండుగా బ్రష్‌లు, చీపుళ్ళు, క్లీనింగ్ లోషన్లు, హేండ్ శానిటైజర్స్, డెటాల్ బాటిల్స్... ‘‘మే ఐ హెల్ప్ యు?’’ అడిగాడు. ‘‘ఓ! థాంక్స్’’ ఆమె కృతజ్ఞతగా చెప్పింది. ఓ ట్రాలీని తోస్తూ ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు. ‘‘మీరు హాస్టల్లో ఉంటారా?’’ ‘‘ఊహూ. దేనికలా అనుకున్నారు?’’ ‘‘ఈ సామాను చూసి’’ ‘‘సిల్లీ. ఇవన్నీ మా ఇంటికే.’’ ఆమెది చాలా పెద్ద ఇల్ల్లై ఉంటుందని, అంటే ధనవంతురాలు అయి ఉంటుందని కూడా కపీష్ భావించాడు. ‘‘మీరు నార్త్ ఇండియనా?’’ అడిగాడు. ‘‘కాదు. తెలంగాణియన్ని. ఏం?’’ ‘‘మీ చర్మం రంగు ఏపిలో కాని, తెలంగాణాలో కాని అరుదు. తమన్నాలా నార్త్ వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు.’’ ‘‘మా నాన్న యుపి. మా అమ్మ ఏపి. నేను తెలంగాణియన్ని.’’ ఆ వస్తువులకి ఆమె చెకౌట్ కౌంటర్లో బిల్‌ని చెల్లించాక పార్కింగ్ లాట్ దాకా వెళ్ళి టాటా సఫారీలో వాటిని ఎక్కించాడు. ‘‘మీ ఫోన్ నంబర్?’’ నసిగాడు. ‘‘మీది చెప్పండి.’’ ఆమె తన సెల్ తీసి అతను చెప్పే నంబర్ని నొక్కి కాల్ చేసింది. అతని సెల్‌ఫోన్ మోగాక చెప్పింది. ‘‘ఫీడ్ చేసుకోండి. నా పేరు స్వచ్ఛ.’’ ‘‘స్వేచ్ఛా?’’ ‘‘కాదు. స్వచ్ఛ.’’ ‘‘మీ నాన్న గారి పేరు భారత్ కదా?’’ ‘‘కాదు. భరత్.’’ ‘‘నా పేరు కపీష్. సూపర్ బజార్ అని ఏడ్ చేసుకుంటే నేను గుర్తుండచ్చు’’ సూచించాడు. ‘‘ఆ అవసరం లేదు. ఏ హంసవర్ధనో, మృగాంకో అయితే గుర్తుండకపోవచ్చు. కపీష్ లాంటి పేరు ఎవరికీ ఉండదని పందెం. బై’’ ఆమె వాహనం వెళ్ళిన రెండు నిమిషాలకి స్వచ్ఛకి కాల్ చేశాడు. ‘‘యస్ మిస్టర్ కపీష్. ఏదైనా కింద పడిందా? అప్పటికీ కింద చూసే ఎక్కానే?’’ స్వచ్ఛ మాటలు వినిపించాయి. ‘‘నాకు ఎందుకో దిగులుగా ఉంది’’ అతను చెప్పాడు. ‘‘దేనికి దిగులు?’’ ‘‘దేనికి కాదు. ఎవరి మీద అని అడగండి... మీ మీద... మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని! సాయంత్రం మీరు ఫ్రీనేనా?’’ ‘‘ఏ టైంకి?’’ ‘‘ేన బిట్విన్ సిక్స్ అండ్ సెవెన్.’’ ‘‘ఐ యామ్ నాట్ ష్యూర్... యస్ ఫ్రీ’’ మొహమాటపడి చెప్పింది. ‘‘గుడ్. జివికె మాల్లోని ఫుడ్ కోర్టులో కలుద్దామా?’’ ‘‘వైనాట్?’’ ‘‘థాంక్స్. డన్.’’ ‘‘మీకు ఏం ఇష్టం?’’ అడిగాడు. ‘‘మీకు?’’ స్వచ్ఛ అడిగింది. ‘‘మోమోస్ ఓకే?’’ ‘‘ఫైన్. నాన్ ఫేనింగ్, టేస్టీ’’ కపీష్ లేచి వెళ్ళి ఓరియెంటల్ వెజ్ మోమోలు రెండు ప్లేట్లని కొన్నాడు. ఇటీవల మోమోలు ఫుడ్ కోర్టుల్లో ప్రాచుర్యం పొంది యువతని ఆకర్షిస్తున్నాయి. మైదా పిండిని చపాతీలా వత్తి అందులో కేరట్, కేబేజ్, కేప్సికం, ఉల్లిపాయ, బ్రకోలి తరుగుని, అల్లం వెల్లుల్లి, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని ఉంచి అర్ధచంద్రాకారంలో మడిచి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించి, సోయా, చిలీ సాస్‌లతో సర్వ్ చేసే ఈ సింగపూర్, సౌత్ కొరియా స్నాక్ ఇప్పుడు ఇండియాలో ఇంకా స్ట్ట్రీట్ ఫుడ్‌గా (రోడ్ల మీద బళ్ళ మీదకి) రాలేదు. వెజిటబుల్స్ బదులు చికెన్, ప్రాన్స్, ఫిష్ మొదలైనవి కూడా పెట్టి మోమోలు తయారు చేస్తారు. వాటిని చూసి ఆమె హేండ్ బేగ్లోంచి హేండ్ శానిటైజర్ తీసి అతని చేతులని చాపమని అతని అరచేతుల మీద, తన అరచేతుల మీద పోసి చెప్పింది. ‘‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్ ్సటు గాడ్లీనెస్’’ ‘‘అఫ్కోర్స్. అఫ్కోర్స్.’’ ఆమెతో అరగంట పైనే కబుర్లు చెప్పాడు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్. తల్లి ఫిజియోథెరపిస్ట్. ‘‘నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ భాషలోని పదాల మీద డాక్టరేట్ చేస్తున్నాను.’’ ‘‘ఓ! పదాల పుట్టుక మీద రీసెర్చా?’’ ‘‘కాదు. నేను ప్రత్యామ్నాయ పదాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పదాల కన్నా ఇంకాస్త స్పష్టమైన పదాలని సృష్టించే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను.’’ ‘‘అంటే?’’ ‘‘అమెరికా ఇందులో అందె వేసిన చెయ్యి. ఇలా అక్కడ సృష్టించబడ్డ కొత్త పదాలు ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘సెకండ్ హేండ్ కారు’ అనగానే అదేదో నాసిరకంది అన్న భావన కలుగుతుంది. కాబట్టి ఆ పరిశ్రమ వారు ‘యూజ్డ్ కార్స్’ అనే కొత్త పేరుని సృష్టించారు. ఇప్పుడు అదీ నాసిరకం అనిపించి ‘ప్రీ-ఓన్డ్ కార్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఇలాగే నీగ్రోలని బ్లాక్స్ అనే వాళ్ళు. చర్మం రంగు వివక్షత సరి కాదని ఇప్పుడు ‘ఆఫ్రో-అమెరికన్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఈ తరహాలో నేను సృష్టించిన కొన్ని పదాలని మా ప్రొఫెసర్ పేనల్ అప్రూవ్ చేసింది. పేరుని బట్టి ఆ వస్తువేదో స్ఫురించాలి.’’ ‘‘గ్రేట్! కంగ్రాట్స్. మీరు సృష్టించిన పదాలు ఏమిటి?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు. (ఫింగర్ పాంట్స్ అంటే?) -
త్రీ మంకీస్ - 24
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 24 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అవును. మీకెలా తెలుసు?’’ ‘‘కొన్ని వద్దన్నా తెలిసిపోతూంటాయి. రెండు కేపిటల్స్, రెండు అంకెలు గల ఓ ఎనిమిది నించి పది అక్షరాల పదాన్ని రాయండి’’ సూచించింది. ఐ లవ్ యు లో ఐ బదులు ఒకటి, ఎల్ బదులు నాలుగు వేశాడు. వైయులని కేప్స్లో రాసి చూపించి అడిగాడు. ‘‘ఇది ఓకేనా?’’ ‘‘ఓకే. దీన్ని ఇప్పుడు టైప్ చేసి సబ్మిట్ చేయండి.’’ చివరలో ఆమె పేరు సీతాని కలిపి టైప్ చేసి సబ్మిట్ చేశాడు. పాస్వర్డ్ ఏక్సెప్టెడ్. వెల్కం. నౌ యు ఆర్ ది ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఎకౌంట్ ఇన్ ఫేస్బుక్ అని వచ్చింది. ‘‘ఇంత సింపులా?’’ ఆశ్చర్యపోయాడు. ‘‘వెల్కం టు ఎఫ్బి ఫేమిలీ’’ సీత చిరునవ్వుతో చెప్పింది. ‘‘ఓ! మీరు కూడా ఎఫ్‌బిలో ఎకౌంట్ తెరిచారా?’’ అడిగాడు. ‘‘అవును. స్టేటస్ మార్చుకోడానికి వచ్చాను.’’ ‘‘స్టేటస్ మార్చడమేమిటి? ఎఫ్‌బిలో ఒక్క మాట మీదే ఉండకూడదా?’’ ‘‘ఉండకూడదు.’’ ఆమె ఓపికగా లైక్స్, కామెంట్స్, ఛాట్స్ గురించి, స్టేటస్ మార్చుకోవడం గురించి, ఫ్రెండ్ రిక్వెస్ట్ గురించి బోధించింది. అతన్నించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపించుకుని ఏక్సెప్ట్ చేని చెప్పింది. ‘‘నేనేం పెట్టినా మీ ఎఫ్బి అకౌంట్లో కనిపిస్తుంది. మీరు అన్నిటికీ లైక్‌లు కొడుతూండాలి. ఎన్ని లెక్స్ వస్తే అంత గొప్ప’’ చెప్పింది. ‘‘లైకేనా? లవ్ కొడతాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇంకా ఆ సౌకర్యం జుకర్‌బెర్గ్ గారు ఇవ్వలేదు. కాబట్టి ప్రస్థుతానికి లైక్ కొట్టండి చాలు.’’ ‘‘జుకర్‌బెర్గ్ గారెవరు?’’ ‘‘ఎఫ్బి బ్రహ్మ లెండి. ఆయన గురించి ఆనక చెప్తా కాని మీరు లేస్తారా?’’ ఆ తర్వాత నిత్యం వానర్ ఎఫ్బిలోకి వెళ్ళి ఆమె పోస్ట్ చేేన ఫొటోలకి లైక్ కొట్టసాగాడు. టివి సీరియల్ చూస్తూ ఆమె అమ్మమ్మ మాడకొట్టిన ముద్ద పప్పు ఫొటోకి లైక్ కొట్టాడు. ఆమె వండిన మొదటి ఆనపకాయ ఆమ్లెట్ (కర్టసీ సాక్షి టివి చానల్)కి లైక్ కొట్టాడు. ఆవిడ నానమ్మకి కాలు విరిగిన ఫొటోకి, ఆవిడ తల్లికి బిపి వచ్చిందన్న ఫొటోకి కూడా లైక్ పెట్టాడు. ఐతే సీతా హరిహరన్ అందుకు కోప్పడలేదు. ఆమె పెట్టిన జోక్స్‌కి కూడా లైక్ పెట్టాడు. వాటిలో ఇదొకటి. నేషనల్ రోబట్- మన్మోహన్ సింగ్ నేషనల్ జోక్ - రజనీకాంత్ నేషనల్ సీక్రెట్ - సోనియా నేషనల్ ఇష్యూ - సల్మాన్ ఖాన్ పెళ్ళి నేషనల్ గెస్ట్స్ - కసబ్, అఫ్జల్ గురు నేషనల్ పేలెస్ - తీహార్ నేషనల్ బేంక్ - స్విస్బేంక్ నేషనల్ డిస్‌గ్రేస్ - ఆంధ్ర ప్రదేశ్ విభజనా విధానం నేషనల్ బర్డ్ - ట్విటర్ నేషనల్ బుక్- ఫేస్బుక్ యధేచ్చగా అతనితో కాఫీడేకి వెళ్ళి సీతా హరిహరన్ గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునేది. ఆమె సమక్షంలో వానర్‌కి కాలం తెలీకుండా గడిచిపోయేది. ఇలా లాస్ట్ టర్మ్ దాకా సాగింది. వానర్ ఆ క్రమంలో ఎఫ్బి వ్యసనపరుడైపోయాడు. అందులోకి వెళ్ళేందుకు తలుపు ఉందని తెలుసు కాని బయటకి వచ్చేందుకు తలుపు లేదని తెలీలేదు. అభిమన్యుడికి, ఫేస్బుక్లో ఎకౌంట్ ఉన్న వారికి మధ్య పెద్దగా తేడా ఉండదు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి తేలిగ్గా వెళ్ళగలడు. తిరిగి బయటకి ఎలా రావాలో తెలీదు. ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్స్‌కి కూడా అదే సమస్య. ఇక బయటకి రాలేరు. అందులో ఉండనూ లేరు. కాలేజీ ఇంకో రోజులో మూసేస్తారనగా సీతా హరిహరన్ అతనితో ఓ విషయం సీరియస్‌గా చర్చించాలని, కాఫీడేలో కలవమని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. అది పెళ్ళి గురించని వానర్ తేలిగ్గా ఊహించాడు. ‘‘మై డియర్ వాన్ (ఆమె అతన్ని పిలిచే ముద్దు పేరు) ఇక మనం విడిపోతున్నాం. ఇదే నువ్వు తాగించే ఆఖరి కాఫీ’’ చెప్పింది. పక్కలో బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వానర్ అడిగాడు. ‘‘అదేమిటి?’’ ‘‘అవును వాన్. ఇంక మనం కలవబోం.’’ ‘‘ఏం?’’ ‘‘నన్ను నీకన్నా రెయిన్ బాగా ప్రేమిస్తున్నాడు.’’ ‘‘రెయినా? వాడెవడు?’’ ‘‘మా సీనియర్. పేరు వర్షిష్. నేను నిన్న రాత్రి కూర్చుని బేరీజు వేసుకున్నాను. అబ్బే! నీ ప్రేమ అతని ప్రేమ ముందు ఇట్టే తేలిపోయింది.’’ ‘‘ఎలా తెలిసింది?’’ కాఫీని, కోపాన్ని మింగి అడిగాడు. (వానర్, సీత హరిహరన్‌ల ప్రేమ ఎందుకు ఫ్లాప్ అయింది?) -
త్రీ మంకీస్ - 19
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 19 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మన ముఖ్య అతిథి వచ్చేశారు... ఇది ఆఖరి జోక్... పాకిస్థాన్ ప్రెసిడెంట్ నుంచి భారత రాష్ట్రపతికి కానుకగా ఓ పార్సెల్ అందింది. సెక్యూరిటీ వారు దాన్ని తనిఖీ చేసి బాంబులేం లేవని నిర్ధారించాక ఆయన దాన్ని తెరిచి చూస్తే అందులో మలం ఉంది. ‘మీకు, మీ భారతీయులకి’ అని రాసి ఉంది. రాజకీయ చాణక్యుడైన మన రాష్ట్రపతికి ఇదో లెక్కా? పాకిస్థాన్ ప్రెసిడెంట్‌కి భారత రాష్ట్రపతి నించి బదులుగా అలాంటి ఓ పార్సెల్ వెళ్ళింది. దాన్ని వాళ్ళు విప్పి చూస్తే అందులో వాళ్ళు భయపడ్డట్లుగా బాంబ్ కాక, ఏ మొబైల్ ఫోన్తోనైనా ఆపరేట్ చేేన 1800 జిబి మెమొరీ గల అతి చిన్న కంప్యూటర్, త్రిడి హాలోగ్రాం మానిటర్ కనిపించాయి. అది భారతీయ ఐటి నిపుణులు రూపొందించిన అత్యాధునిక లేప్టాప్. దాంతోపాటు వచ్చిన కాగితంలో ఇలా రాసి ఉంది. ‘ఓ నాయకుడు తమ ప్రజలు తయారు చేసేదే ఇంకో దేశాధినేతకి బహుమతిగా పంపగలడు.’’ ప్రేక్షకులంతా గట్టిగా ఈలలు వేసూ చప్పట్లు కొట్టారు. ‘‘పాకిస్థాన్‌లోని రావల్పిండిలో దిగిన ఓ విమానం లోంచి ఓ ఆఫ్ఘనిస్తానీ దిగి ఇమిగ్రేషన్ కౌంటర్‌కి వెళ్ళాడు. ‘మీరేం చేస్తూంటారు?’ అని పాకిస్థానీ ఇమిగ్రేషన్ అధికారి ప్రశ్నిస్తే ‘నేను అఫ్ఘనిస్తాన్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్‌ని’ అని జవాబు చెప్పాడు. ‘అబద్ధం. అఫ్ఘనిస్తాన్కి సముద్రమే లేనప్పుడు నీ అండ్ పోర్ట్స్ మినిస్టర్ ఎలా ఉంటాడు?’ అని ఇమిగ్రేషన్ అధికారి గద్దిస్తే ‘మీ పాకిస్థాన్‌లో లా లేకపోయినా లా మినిష్టర్ ఉన్నట్లుగానే’ అని అతను జవాబు చెప్పాడు.’’ మళ్ళీ గట్టిగా ఈలలు, చప్పట్లు వినిపించాయి. ‘‘ఇంకొక్క జోక్‌కి టైం ఉన్నట్లుంది... అనగనగా ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగారు. ఎలాగైనా గెలవాలనుకున్న ఓ అభ్యర్థి ఓటుకి వెయ్యి రూపాయల చొప్పున తళతళలాడే కొత్త కరెన్సీ నోట్లని పంచిపెట్టి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఈ సంగతి తెలుసుకున్న రెండో అభ్యర్థి ఓటర్ల వద్దకి వెళ్ళి ఆ అభ్యర్థి పంచిన నోట్లన్నీ దొంగ నోట్లని ప్రచారం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. మూడో అభ్యర్థి పాత ఐదు వందల రూపాయల నోట్లతో ఓటర్లని కలుసుకుని కొత్త వెయ్యి నోటుకి పాత ఐదు వందల నోటు మార్పిడి చేసి ‘చూశారా? మీ దొంగ నోటుకి అసలు నోటిచ్చాను. మీ ఓట్లన్నీ నాకే’ అని చెప్పాడు. ఓట్లతో పాటు ఓటరుకి అయిదు వందల రూపాయల చొప్పున అతగాడు లాభం పొందాడు... థాంక్స్ ఫర్ ఎంజాయింగ్ ది జోక్స్. బికాస్ ఐ యామ్ నాట్ గ్రేట్. బికాస్ దే ఆర్ వర్త్ ఎంజాయింగ్.’’ జోక్స్ మధ్యలో కపీష్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలోకి వచ్చాడు. అతను వానర్‌కి కనుసైగ చేశాడు. బదులుగా వానర్ కూడా కనుసైగ చేశాడు. లోపలకి వచ్చిన మర్కట్ కపీష్ చెవిలో ఏదో గుసగుసలాడాడు. ‘‘వెరీ గుడ్’’ కపీష్ చెప్పాడు. ఆ ముగ్గురూ చదివే ఇంజనీరింగ్ కాలేజీకి ముఖ్య అతిథిగా వచ్చింది, దాన్లో బినామీ భాగస్వామ్యం గల ఓ ఎం.పి. ఆయన స్టేజి మీదకి రాగానే విద్యార్థులంతా కావాలని గట్టిగా చప్పుడు చేస్తూ ఆవులిస్తూంటే ప్రిన్స్‌పాల్ గట్టిగా అరిచాడు. ‘‘సెలైన్స్, సెలైన్స్’’. ముందు సీట్లోని కపీష్‌ని, అతను ధరించిన టీషర్ట్ మీది అక్షరాలని చూసి ముఖం చిట్లించాడు. ఆ ఎర్ర టీ షర్ట్ మీద నల్ల అక్షరాల్లో ఇలా ముద్రించి ఉంది. ‘ఐ యాం సెలైంట్లీ కరెక్టింగ్ యువర్ గ్రామర్’ ప్రిన్స్‌పాల్ కోపంగా అందరి వంకా చూసి చెప్పాడు. ‘‘పూర్వం తల మీది టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. మీరు మీ చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని తీసి వీరికి మీ గౌరవాన్ని తెలపండి.’’ అయిష్టంగానే అంతా హెడ్‌ఫోన్స్‌ని ఓ వైపు చెవుల నించి మరోవైపు స్మార్ట్ఫోన్ల నించి తీసేశారు. విద్యార్థుల చేష్టలని పట్టించుకోకుండా ముఖ్య అతిథి స్పీచ్‌ని చెప్పాడు. తన సెక్రటరీ రాసిచ్చిన స్పీచ్ కాదది. ఆశువుగా చెప్పాడు. ‘‘ముందుగా నాకు చాలా మంచి బట్టలు ఉన్నాయి. ప్రతిపక్షాలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాసిన బట్టలతో వచ్చాను. మీరు కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ జీవితంలోని చివరి దశ దాకా ప్రభుత్వం మీ జీవితాలని ఎన్నోవిధాల టచ్ చేస్తూనే ఉంటుంది. అసలు ప్రభుత్వం ఎలా పని చేస్తుంది? ప్రభుత్వంలో నేనో చిన్న భాగాన్ని కాబట్టి నాకు తెలిసింది చెప్తా వినండి. మీ అందరికీ ఇటుక అంటే ఏమిటో తెలుసు. తెలీని వాళ్ళు చేతులు ఎత్తండి.’’ దాదాపు అంతా చేతులు ఎత్తారు. ‘‘గుడ్. ప్రభుత్వం చేతికి ఇటుకని ఇస్తే ఇది వాటిని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తుందో చూడండి. దీన్నిబట్టి ప్రభుత్వం అంటే ఏమిటో మీకు తెలిసిపోతుంది.’’ వెంటనే ఆవులింత శబ్దాలు ఆగిపోయాయి. (కాలేజీలో నాలుగు గాడిదలు ఏవో తెలుసా?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * కపీస్, మర్కట్. వానర్ పేర్లు త్రీమంకీస్కు ఎంతగానో ఇమిడాయి. కలలో ఫేస్బుక్లో స్టేటస్ మార్చడం చివరి కోరికగా వానర్ చెప్పటం సహజసిద్ధ హాస్యాన్ని పండించింది. నవ్విస్తూ చదివిస్తున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి అభినందనలు. - కటుకోఝ్వుల రమేష్, ఇల్లందు, ఖమ్మం జిల్లా. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గురించిన కామెడీ వివరణ నాకు బాగా నచ్చింది.సీరియల్ ఫన్నీగా ఉంది. - సాయి కీర్తి ముత్యాల (mutyalasaikeerthi@gmail.com) -
త్రీ మంకీస్ - 18
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 18 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ఓ ధనవంతుడు ప్రధానమంత్రి అవచ్చని నెహ్రూ ఋజువు చేశాడు. ఓ బీదవాడు ప్రధానమంత్రి అవచ్చని లాల్‌బహదూర్ శాస్త్రి ఋజువు చేశాడు. ఓ మహిళ ప్రధానమంత్రి అవచ్చని ఇందిరాగాంధీ ఋజువు చేసింది. ఓ వృద్ధుడు ప్రధానమంత్రి అవచ్చని మొరార్జీ దేశాయ్ ఋజువు చేశాడు. ఓ చదువు రాని వాడు ప్రధానమంత్రి అవచ్చని చరణ్ సింగ్ ఋజువు చేశాడు. ఓ అసమర్థ పైలట్ ప్రధానమంత్రి అవచ్చని రాజీవ్ గాంధీ ఋజువు చేశాడు. ఓ రాజవంశీకుడు ప్రధానమంత్రి అవచ్చని వి పి సింగ్ ఋజువు చేశాడు. ఓ పండితుడు ప్రధానమంత్రి అవచ్చని పివి నరసింహారావు ఋజువు చేశాడు. ఓ కవి ప్రధానమంత్రి అవచ్చని వాజ్‌పేయ్ ఋజువు చేశాడు. ఎవరైనా ప్రధానమంత్రి అవచ్చని దేవెగౌడ ఋజువు చేశాడు. ఓ టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అవచ్చని మోడీ ఋజువు చేశాడు. భారతదేశానికి అసలు ప్రధానమంత్రి అవసరమే లేదని మన్మోహన్ సింగ్ ఋజువు చేశాడు.’’ గట్టిగా నవ్వులు, ఈలలు, చప్పట్లు. ‘‘మై డియర్ ఫ్రెండ్స్, నేనా మధ్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ముంబై వెళ్తూంటే ఎయిర్‌హోస్టెస్ సెల్‌ఫోన్స్‌ని ‘మన్మోహన్ సింగ్ మోడ్‌లో ఉంచమని’ ప్రకటించింది. అంటే ఏమిటో మీకు తెలుసు... మన్మోహన్ సింగ్ ఇప్పుడు తన ఆత్మకథని రాస్తున్నాడని తెలుసా? దాని పేరు? ఫోర్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ : టు జి, త్రి జి, సోనియాజి, రాహుల్జి... సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌కి ఎస్సెమ్మెస్ పంపింది, విసుగ్గా ఉందని, ఏదైనా మంచి జోక్‌ని పంపమని! ‘ఇప్పుడు కుదరదు మేడం. నేను మంత్రిమండలి మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నాను’ అని జవాబు ఎస్సెమ్మెస్ పంపారు మన్మోహన్. వెంటనే సోనియాజీ నించి ఆయనకి ఇంకో ఎస్సెమ్మెస్ వచ్చింది - ‘చాలా మంచి జోక్. ఇంకోటి పంపండి’ అని! ‘‘మీరీ జోక్స్ ఎంజాయ్ చేస్తున్నారా?’’ సిద్ధాంత్ అడిగాడు. ‘‘యస్’’ చాలామంది అరిచారు. ‘‘గుడ్. రజనీకాంత్ జోకులు మీ అందరికీ తెలుసు. విలన్ పేల్చిన బుల్లెట్‌ని చేత్తో పట్టుకుని దాన్ని విలన్ మీదకే విసిరి చంపేది ప్రపంచంలో ఒక్క రజనీకాంతే. ఆయన్నించి జేమ్స్ బాండ్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అలాంటి రజనీకాంత్‌కి ప్రధానమంత్రి అవాలనే కోరిక గల ప్రణబ్ ముఖర్జీ ఓ సవాల్ విసిరాడు. ‘నేను చెప్పిన మూడిటిని లేపితే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు. లేదా నేషనల్ జోక్వి అవుతావు.’ రజనీకాంత్ ఆ సవాలుని అంగీకరించాక ఎవరెస్ట్ దగ్గరకి తీసుకెళ్ళి దాని శిఖరాన్ని ఓసారి లేపి కింద పెట్టమని ప్రణబ్ ముఖర్జీ కోరాడు. మన రజనీకాంత్‌కి అదో లెక్కా? నిమిషంలో ఎడం చేత్తో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి బాబాలోని తన పెద్ద డైలాగ్‌ని చెప్పి దాన్ని యథాస్థానంలో ఉంచాడు. తర్వాత ఆల్ఫ్స్ పర్వతం దగ్గరకి తీసుకెళ్ళి దాన్ని ఓసారి ఎత్తమని ప్రణబ్ సవాల్ విసిరాడు. రజనీకాంత్ మళ్ళీ దాన్ని ఎత్తి అరుణాచలం సినిమాలోని పెద్ద డైలాగ్‌ని చెప్పి కింద ఉంచాడు. ‘ఈ రెండూ తేలికే. మూడోది చాలా కష్టం. దాంట్లో గెలిస్తే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు’ అని మన్మోహన్ సింగ్ కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ కుర్చీ దగ్గరకి తీసుకువెళ్ళి సింగ్ గారిని కుర్చీలోంచి లేపమని, ఆయన లేవగానే తను కూర్చోడానికి తయారుగా నిలబడ్డారు. ఎవరు? ప్రణబ్ గారు. ‘లే’ అంటూ ఎడం చేత్తో రజనీకాంత్ మన్మోహన్ చెయ్యి పట్టుకుని లాగాడు. ఊహు. లేపలేకపోయాడు. ఈసారి రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఎత్తినా మన్మోహన్ సింగ్ లేవలేదు. ‘ఎత్తు నాయినా. ఎత్తు’ అని ఆయన గారు నవ్వారు. రజనీకాంత్ రెండు చేతులని సింగ్ గారి చంకల కిందకి పోనించి లేపే ప్రయత్నం చేశారు. రజనీకాంత్‌కి చమటలు కమ్మాయి తప్ప మన్మోహన్ సింగ్ మిల్లీమీటర్ కూడా కదల్లేదు. ‘ఏనుగులని మింగావా? పర్వతాలని ఫలహారం చేశావా?’ అని అరిచి ఎంత ప్రయత్నించినా రజనీకాంత్ ప్రైమ్ మినిస్టర్ సీట్లోంచి మన్మోహన్ సింగ్‌ని లేపలేకపోయాడు’’ మన్మోహన్ సింగ్ మీద మరికొన్ని పొలిటికల్ జోక్స్ చెప్పాక సిద్ధార్థ చెప్పాడు. ‘‘ఇరవయ్యవ శతాబ్దంలో రెండు దేశాలకి ఒకేరోజు స్వతంత్రం వచ్చింది. వాటిలోని ఓ దేశం మార్స్‌కి రాకెట్‌ని పంపింది. రెండో దేశం ఇంకా పక్క దేశంలోకి చొరబడాలనే ప్రయత్నిస్తూ విఫలం అవుతోంది... ముఖ్య అతిథి దారిలో ఉన్నారని తెలిసింది... ఈలోగా కొన్ని పొలిటికల్ సామెతలు చెప్తాను... పార్టీ పోరు, పార్టీ పోరు ఓటరు తీర్చాడు... గంజికి లేనమ్మకి గేస్స్టవ్ ఇచ్చినట్లు... అపోజిషన్ పార్టీ లీడర్ని ఎందుకు కలిశావంటే మన పార్టీ పరిస్థితి తెలుసుకోడానికన్నాట్ట... రాజకీయాల్లో తల దూర్చి రౌడీలకి భయపడితే ఎలా?... జగమెరిగిన జయప్రదకి రాజమండ్రి అయినా ఒకటే, రాంపూర్ అయినా ఒకటే... సీటు రాక సిట్టింగ్ ఎంఎల్ఏ ఏడుస్తూంటే రెబెల్ వచ్చి రాళ్ళేద్దాం రమ్మన్నాట్ట... సర్వేలు చేసి సన్న్యాసికి టికెట్ ఇచ్చినట్టు... పరుగెత్తి పక్క పార్టీలో చేరే కంటే, నిలబడి ఉన్న పార్టీలో ఉండటం మేలు... టికెట్ చిక్కిన వేళ, పదవి దక్కిన వేళ... దేశానికి అధినేత అయినా ఓటరుకు అభ్యర్థే. నక్సలైట్లతో నారాయణ! కుబేర్లతో గోవిందా! ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి...’’ ఒకతను స్టేజి మీదకి వచ్చి సిద్ధార్ధ చెవిలో ఏదో చెప్పి వెళ్ళాడు. (పూర్వం తల మీద టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. ఇప్పుడో?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ 1. ముగ్గురు టెక్ దొంగల పేర్లు టైటిల్‌కి జస్టిఫై అయ్యాయి. జైలర్ అటెన్డెన్స్ తీసుకునే సన్నివేశం కామెడీగా ఉంది. ట్రూలీ దిసీజ్ కామెడీ అండ్ థ్రిల్లర్. - క్రిష్ టి. (kittu.onair85@gmail.com) 2. కథనం చాలా ఆసక్తిగా ఉండి, నేటి యువతరం చదువు తర్వాత వారి ఆలోచనా సరళిని తెలియజేస్తోంది. ఈ సీరియల్ పుణ్యమా అని నేను పాతికేళ్ళు వెనక్కి వెళ్లాను... రచనల స్వర్ణయుగంలోకి! - టి. భాస్కర బాబు (babubhaskar04@gmail.com) -
త్రీ మంకీస్ - 17
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ - 17 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘చూస్తూండండి. వానర్! వెళ్ళి అందరికీ మళ్ళీ గ్లాసులు నింపుకురా’’ కపీష్ నర్మగర్భంగా చెప్పాడు. ‘‘నాకు ఐస్ ఒద్దు’’ మటర్కట్ చెప్పాడు. అతను ట్రేలో ఆ మూడు గ్లాసులని తీసుకెళ్ళి కోక్ని నింపుకుని రాగానే మేక్‌డొనాల్డ్స్ మేనేజర్ వీళ్ళ టేబిల్ దగ్గరకి వచ్చాడు. ‘‘చచ్చాం! నేను నింపుకోవడం చూశాడు. పోలీసులకి ఫోన్ చేస్తాడేమో?’’ వానర్ భయంగా చెప్పాడు. ‘‘వాడి వైపు చూడకండి’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ ఆయన పలకరించాడు. అంతా మేకపోతు గాంభీర్యంతో అతని వంక చూశారు. ‘‘ఎలా ఉంది కోక్?’’ ‘‘కోక్ ఎప్పటి కోక్లానే తియ్యగా ఉంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఐస్?’’ ‘‘ఐస్ ఐస్‌లా చల్లగా ఉంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీరు ఐస్ తక్కువ వేసుకున్నట్లున్నారు?’’ ‘‘లేదు. కరిగింది. ఐనా తాగాల్సింది చల్లటి కోక్ని కాని, చల్లటి నీళ్ళని కాదు కదా?’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కాని, ఫిర్యాదు కానీ లేదు కదా?’’ మేనేజర్ మర్యాదగా అడిగాడు. ‘‘లేదు.’’ ‘‘థాంక్స్. ప్లీజ్ కీప్ కమింగ్.’’ అతను వెనక్కి తిరిగి వెళ్ళాక ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు. ‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సి రావచ్చని భయపడి చచ్చాను’’ వానర్ చెప్పాడు. కపీష్ జేబులోంచి చేతి రుమాలు తీసిముక్కుకి అడ్డం పెట్టుకుని కిందకి చూశాడు. వానర్ చుట్టూ నేల మీద చిన్న మడుగు. పేంట్ తడిసి ఉంది. ‘‘ఏమిటీ పని?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘భయపడితే నాకిలా అవుతుందని ఇప్పుడే తెలిసింది గురూ.’’ ‘‘పనైందిగా. ఇంక లేవండి’’ కపీష్ లేస్తూ చెప్పాడు. ఆరోజు హైద్రాబాద్‌లో పటాన్‌చెరువులోని ఆ ఇంజనీరింగ్ కాలేజిలోని వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంది. సీనియర్ విద్యార్ధులకి జూనియర్లు సెండాఫ్ చెప్పే వేడుక కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతోంది. ముఖ్యఅతిథి రావడానికి ఇంకా టైం ఉండటంతో ఫ్యాన్సీ డ్రన్ వేడుక తర్వాత సెకండియర్ విద్యార్ధి సిద్ధాంత్ జోక్స్ చెప్తాడనే ప్రకటన వినపడగానే చాలామంది ఆనందంగా చప్పట్లు కొట్టారు. కొందరు విజిల్స్ కూడా వేశారు. అంతా చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని ఉత్సాహంగా తీసేశారు. అతను వచ్చి మైక్‌లో చెప్పాడు. ‘‘హలో జూనియర్స్, సీనియర్స్, ఫెలో స్టూడెంట్స్, లేడీస్ అండ్ లేడీస్ అండ్ ఎవ్విరిబడీ! దిసీజ్ యువర్ సిద్ధూ టెలింగ్ యు ది జోక్స్... ఆరతి! నీకొక్కదానికే కాదు డార్లింగ్... అందరికీ చెప్తున్నాను... మరేం లేదు. మన కాలేజీలో నన్ను సిద్ధూ అని పిలిచేది ఒక్క ఆరతే... చీకట్లో. ముందుగా కొన్ని పొలిటికల్ జోక్స్ చెప్తాను. దానికి ముందుగా ఇది మీరు తప్పనిసరిగా వినాలి. యూరప్‌లో స్పెయిన్ దేశం ఉంది. జిందగీ న మిలేగీ దుబారా చూశారుగా...’’ కొన్ని ఈలలు వినపడ్డాయి. ‘‘ఆ స్పెయిన్‌లో బార్సిలోనా ఉంది. ఆ నగరంలో టీట్రెన్యూ అనే కామెడీ క్లబ్ ఉంది. అక్కడి ప్రభుత్వం నాటకాల మీద వినోదపు పన్నుని ఎనిమిది నించి ఇరవై ఒక్క శాతానికి పెంచడంతో... బహుశ మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీనే సలహా ఇచ్చి ఉంటారు... ఏమిటీ? చిదంబరమా?... వీటిలో ఆయన ఎక్కువ సమర్థుడు కాబట్టి చిదంబరం సలహా మీద ఏడాదిలో టిక్కెట్ల అమ్మకాలు ముప్ఫై శాతం తగ్గాయి. దాంతో టీట్రెన్యూ కామెడీ క్లబ్ ‘పే-పర్-లాఫ్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని కనుక్కొంది. నాటకశాలలో ప్రతీ సీన్ ముందు ప్రేక్షకుడి మొహంలోని చిరునవ్వుని గుర్తించే ఓ ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంని అమర్చారు. అది మనిషి నవ్వినప్పుడల్లా లెక్క కడుతుంది. ప్రవేశం ఉచితం. వారి ప్రదర్శన ప్రేక్షకుడిలో నవ్వులని సృష్టించకపోతే ఏం చెల్లించకుండా బయటకి వెళ్ళచ్చు. ఎన్నిసార్లు నవ్వితే అన్ని ముప్ఫై యూరో సెంట్లు చెల్లించాలన్న నిబంధనతో తమ నాటకాలని ప్రదర్శించసాగారు. అలా సగటున ప్రతీ ప్రేక్షకుడు ఓ నాటకానికి ఆరు యూరోలని చెల్లిస్తున్నాడు. మీడియా కవరేజ్ వల్ల ముప్ఫై ఐదు శాతం ప్రేక్షకులు పెరిగారు. ఒకో నాటకానికి ఇరవై ఎనిమిది వేల యూరోలు వసూలవుతున్నాయట! అదృష్టవశాత్తు మీరు బార్సిలోనాలో లేరు. నేను చెప్పే జోక్‌లకి మొహమాటపడకుండా నవ్వండి. మీ నవ్వులని కొలిచే ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ఈ ఆడిటోరియంలో అమర్చలేదు. నవ్వినందుకు మీ ఆస్తిని ఎవరికీ రాసివ్వక్కర్లేదు. కాబట్టి మజా చేయండి. గట్టిగా పోటీపడి నవ్వండి.’’ ఆ ఓపెనింగ్ తమకి నచ్చినట్లుగా కొందరు ఈలలు వేశారు. ‘‘సరే. పొలిటికల్ జోక్స్‌తో మొదలెడతాను. పొలిటికల్ జోక్ అనగానే మనకి గుర్తొచ్చేది ఖచ్చితంగా మన మాజీ ప్రధానమంత్రి. మన మాజీ ప్రధానమంత్రుల్లో అధికంగా జోక్స్‌కి అర్హుడు ఎవరో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. (పొలిటికల్ జోక్స్ అనగానే గుర్తొచ్చే ప్రధానమంత్రి ఎవరో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ మల్లాది గారి ‘3 మంకీస్’ సీరియల్ ఆకర్షణీయమైన పేర్లతో, అబ్బురపరిచే సన్నివేశాల మేళవింపుతో కామెడీ-థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ‘పాఠకుల అభిరుచి మారింది. ప్రముఖ రచయితలు అందరూ అస్త్రసన్యాసం చేశారు’ అని రచనల పరంపరను కొనసాగించలేక, అభియోగాన్ని పాఠకుల మీదకు నెట్టి పక్కకు తప్పుకున్నది రచయితలు మాత్రమే. ఆసక్తికర రచనలు చేస్తే పాఠకులు ఎప్పుడూ చదువుతారని ఈ సీరియల్ నిరూపిస్తోంది. ఇలాంటి రచనలను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యానికి పాఠకులందరి తరఫున కృతజ్ఞతలు. మున్ముందు కూడా సాక్షిలో సీరియల్ సీక్వెన్స్ కొనసాగుతుందని, కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ... - యంజర్లపాటి కమలాకర్‌రెడ్డి, ఖమ్మం -
త్రిమంకీస్
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 16 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘దీన్నిబట్టి నాకోటి అర్థమైంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘ఎవరైనా తమ బెస్ట్ఫ్రెండ్స్ని కలుసుకోవాలనుకుంటే జైలుకి వెళ్ళాలి.’’ ‘‘నాలుగో గాడిద ఏమైంది?’’ మర్కట్ కపీష్‌ని ప్రశ్నించాడు. ‘‘అవును. నాలుగో గాడిద ఏమైంది?’’ వానర్ కూడా ప్రశ్నించాడు. వాళ్ళా ప్రశ్నలు అడిగింది వారి నాలుగో మిత్రుడి గురించి అనుకుంటే పొరపాటే. అసలు ఈ ముగ్గురూ కూడా గాడిదలు అనుకుంటే పొరపాటే. వాళ్ళని వాళ్ళు గాడిదలుగా భావించడం లేదు. ఆ నాలుగో గాడిద గురించి తెలుసుకోవాలనుకుంటే, ఓ ఏడాది వెనక్కి వెళ్ళాలి. ఏడాది క్రితం ఎక్కడికి? ముందుగా వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని మేక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్లోకి! తర్వాత కాలేజీ లోకి! 5 ‘‘మన దగ్గర తైలం ఉందా?’’ మెక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్ బయట నిలబడ్డ కపీష్ మిగిలిన ఇద్దరు మిత్రుల్నీ అడిగాడు. ‘‘ఎంత?’’ ‘‘ఓ ఒన్ ఫిఫ్టీ. మూడు కోక్స్కి.’’ ‘‘లేదు’’ ఇద్దరూ చెప్పారు. ‘‘ప్లాన్ ఏ ఫెయిలైంది. సరే. పదండి. తాగుదాం.’’ ‘‘నీ దగ్గర డబ్బుందా?’’ మర్కట్ అడిగాడు. ‘‘లేదు. ప్లాన్ బి ఉంది. పదండి.’’ ముగ్గురిలోకి తెలివైన కపీష్ దారిలోని రెండు టేబిల్స్ మీద ఉన్న ట్రేల్లోని రెండు ఖాళీ కోక్ గ్లాస్‌లని తీసుకుని, మిత్రులకి ఇచ్చి చెప్పాడు. ‘‘వెళ్ళి ఫౌంటెన్‌లో నింపుకుని రండి.’’ తర్వాత ట్రాష్ బిన్లో చేతిని ఉంచి లాఘవంగా ఇంకో డిస్పోజబుల్ కోక్ గ్లాస్‌ని తీసుకుని అందులోని ఐస్‌ని ఆ బిన్లో కుమ్మరించాడు. వాళ్ళ వెనక నిలబడి తన వంతు రాగానే కోక్ని నింపుకున్నాడు. ‘‘భలే ట్రిక్’’ వానర్ కోక్ని రుచి చూసి చెప్పాడు. ‘‘ఇది ఇక్కడే సాధ్యం. మనం కోక్ అడిగితే వాళ్ళు డబ్బు తీసుకుని ఖాళీ గ్లాస్‌ని ఇస్తారు. ఫౌంటెన్లోంచి నింపుకోవాలి. తర్వాత ఆ ఖాళీ గ్లాస్‌ని వెనక్కి తీసేసుకోరు. వాటిని మళ్ళీ ఎన్నిసార్లు నింపుకున్నా ఎవరూ ఏమీ అనరు. ఈ సిస్టమ్‌లోని లోపాన్ని పట్టేసాను. ఇదే ప్లాన్ బి’’ కపీష్ చెప్పాడు. ‘‘ముగ్గురం మూడు ఏభై రూపాయలు ఆదా చేశాం’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురూ కూర్చున్నాక ఎమ్మెస్ అలర్ట్ రాగానే మర్కట్ మెసేజ్ ఎక్కడ నించో చూశాడు కాని దాన్ని చదవకపోవడంతో వానర్ అడిగాడు. ‘‘ఏం మెసేజ్?’’ ‘‘నా బేంక్ నించి బేలన్స్ తెలియచేస్తూ ఎస్సెమ్మెస్ వచ్చింది. దాన్ని చూడను. నా అకౌంట్లో ఎంత లేదో తెలుస్తుందని భయం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇవాళే మన కాలేజీ ఆఖరి రోజు’’ వానర్ విచారంగా చెప్పాడు. ‘‘అవును. అందుకేగా ఇవాళ ప్రిన్సిపాల్ కాలేజీ ఆడిటోరియంలో మనందరికీ స్పీచ్ ఇస్తున్నాడు.’’ ‘‘కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’’ కపీష్ తన ఇద్దరు మిత్రులని అడిగాడు. ‘‘ముందుగా నీది చెప్పు’’ వానర్ కోరాడు. ‘‘ఎస్సై ఉద్యోగం సంపాదించడం’’ కపీష్ జవాబు చెప్పాడు. ‘‘ఇంజనీరింగ్ చదివి ఎస్సై ఉద్యోగమా?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఇప్పటికే చాలామంది ఇంజనీర్లు ఎస్సైలయ్యారని తెలీదా? నీ ప్లాన్ ఏమిటి?’’ కపీష్ వానర్ని అడిగాడు. ‘‘పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ట్లో చేరాలని! జీతం కోసం కాదు... పై సంపాదన కోసం. నువ్వు చెప్పు భాయ్’’ వానర్ మర్కట్‌ని అడిగాడు. ‘‘కోటీశ్వరుడు అవ్వాలని. నా ముప్ఫై ఐదో ఏడు వచ్చేలోగా ఓ ఐదు కోట్లు సంపాదించాలని. కుదిరితే డాలర్లు. లేదా కనీసం రూపాయలు.’’ ‘‘బావుంది.’’ వానర్ మెచ్చుకున్నాడు. ‘‘మనం కోటీశ్వరుడు కావడానికి జస్ట్ ఒక్క స్టెప్ దూరంలో ఉన్నాం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏమిటా స్టెప్?’’ మర్కట్ అడిగాడు. ‘‘మనం ఓ కోటిని సంపాదించాలి.’’ ‘‘కాని అందుకు ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ వానర్ అడిగాడు. ‘‘కోట్లు సంపాదించడం తేలికే కాని పోలీసులతో సమస్య వస్తుంది.’’ ‘‘ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. కాబట్టి ఆ పరిష్కారం కనుక్కుంటే అది సాధ్యమే అంటాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఈ ఆఖరి రోజు మనం అందరికీ గుర్తుండి పోయేలా గోల చేయాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘ప్రిన్స్‌పాల్ స్పీచ్ ఇస్తూండగా మన పేర్లు రాసిన కాగితం విమానాలు ఆయన మీదకి వేేన్త సరి. విసిరింది మనమని తెలిసినా కాలేజీ నించి ఇక డిస్మిస్ చెయ్యలేడుగా?’’ ‘‘అది ప్రైమరీ స్కూల్ వాళ్ళు చేేన అల్లరి. మనం గ్రాడ్యుయేట్ విద్యార్ధి స్థాయిలో అల్లరి చేయాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘అంటే?’’ (పే-ఫర్-లాఫ్ కాన్సెప్ట్ అంటే?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3ఝౌజుజ్ఛీట.ట్చజుటజిజీఃజఝ్చజీ.ఛిౌఝ లెటర్స్ The names of the three monkeys are very different and their robberies are quite unexpected and humourous which make a reader curious. Thanks to Malladi sir. - Sowjanya Reddy (sowjanyareddy155@gmail.com) త్రీ మంకీస్ సీరియల్ స్టోరీ బావుంది. ముగ్గురు మిత్రులు కలిశాక ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఉంది. - దేవేందర్ నాయక్, (devendar.nayak75@gmail.com) -
త్రీ మంకీస్ - 15
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 15 - మల్లాది వెంకటకృష్ణమూర్తి దుర్యోధన్ గార్డ్ వెనకే నడిచాడు. ‘‘సర్. నేనోటి అడగచ్చా?’’ గార్డ్ సందేహిస్తూ అడిగాడు. ‘‘ఏమిటో చెప్తే అడగచ్చో, లేదో చెప్తాను.’’ ‘‘మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా అని అడగచ్చా?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘సార్. మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా?’’ ‘‘ఎవరూ పెట్టలేదు. నేనూ పెట్టుకోలేదు. మా నాన్నే ఆ పేరు పెట్టాడు.’’ ‘‘దేనికని అడగచ్చా సార్?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘దేనికి మీ నాన్న మహాభారతంలోని ఓ విలన్ పేరు మీకు ఎందుకు పెట్టారు?’’ ‘‘మా నాన్న మహాభారతం చదవలేదు. చూడలేదు. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ ఎన్టీఆర్ కాదు. ఇతన్ని పుట్టించిన బాబుని పుట్టించిన ఎన్టీఆర్ అభిమాని. ఆయన నటించిన డివిఎస్ కర్ణ చూసి మూర్ఛపోయి నాకీ పేరు పెట్టారు.’’ ‘‘డివిఎస్ కర్ణ? అంటే?’’ ‘‘దాన వీర శూర కర్ణ. అందులో ఆయన దుర్యోధనుడిగా నటించిన తీరు చూసి మా నాన్న నాకా పేరు పెట్టారు.’’ ‘‘మీ అన్న పేరు సర్?’’ ‘‘మీ అన్న పేరు అడగచ్చా అని అడగాలి.’’ ‘‘మీ అన్న పేరు అడగచ్చా సర్?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘మీ అన్న పేరు సర్?’’ ‘‘రావణ్.’’ ‘‘ఆ పేరుకీ ఓ చరిత్ర ఉందాండి అని అడగచ్చా?’’ ‘‘అడగచ్చు. ఉంది. మా నాన్న ఎన్టీఆర్ నటించిన సీతారామకళ్యాణం, భూకైలాస్లు చూశాడు. వాటిలో రావణుడిగా నటించిన ఎన్టీఆర్ నటనని చూసి మూర్ఛపోయాడు. ఆయన నటనతో ఆ పాత్రల మీద అభిమానం ఏర్పడి మా అన్నకి స్ట్టైల్గా రావణ్ అనే పేరు పెట్టాడు.’’ ఇద్దరూ జైలు ఆవరణలోని ఆరుబయటకి చేరుకున్నారు. అక్కడ ఓ వైపు రిమాండ్ ఖైదీలంతా వరసగా నిలబడి ఉన్నారు. దుర్యోధన్ ఆ వరసలోకి వెళ్ళి నిలబడ్డాడు. అతను రాగానే జైలర్ విజిల్ ఊది రోల్ కాల్ పిలవసాగాడు. ‘‘అంతా వచ్చేసినట్లేనా?’’ ‘‘వచ్చేసినట్లే’’ కొందరు జవాబు చెప్పారు. ‘‘రాని వారు చేతులెత్తండి... వెరీ గుడ్. ఎవరూ చేతిని ఎత్తలేదంటే ఎవరూ సెల్స్‌లో లేరన్నమాట... నంబర్ ఫైవ్ సిక్స్ త్రి ఎయిట్.’’ ‘‘ప్రజెంట్ సార్’’ ఓ జేబు దొంగ ఓ అడుగు ముందుకి వేసి చెప్పాడు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ త్రి నైన్.’’ ‘‘ఎస్సార్’’ ఓ చెయిన్ స్నాచర్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో.’’ ‘‘హాజర్ సాబ్’’ ఇళ్ళకి కన్నం వేసేదొంగ ఓ అడుగు ముందుకు వేసి చెప్పాడు. అక్కడికి కొద్ది దూరంలో ఆడ ఖైదీలు నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర రక్షణగా ఉన్న మహిళా గార్డ్ ఇటువైపు చూస్తే, తన వంకే కళ్ళప్పగించి చూసే మర్కట్ కనిపించాడు. ఆమె తన వంక చూడగానే అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె ముందు సందేహించినా తర్వాత నవ్వింది. అతను చేతిని ఊపాడు. ఆమె బదులుగా చేతిని ఊపలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్’’ జైలర్ తర్వాతి నంబర్ పిలిచాడు. ఎవరూ ముందుకు రాలేదు. హాజరు పలకలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్... కపీష్’’ తన పేరు వినగానే కపీష్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు. ‘‘ప్రజెంట్ సార్. పేరు పెట్టి పిలుస్తారనుకున్నాను.’’ ‘‘ఇక్కడ పేర్లుండవు. అందుకే నంబర్లు ఇచ్చారు. నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు...’’ మళ్ళీ ఎవరూ ముందుకు రాలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... మర్కట్.’’ ‘‘ప్రజెంట్ సార్.’’ ‘‘నీకూ ప్రత్యేకంగా చెప్పాలా, పేర్లుండవు, నంబర్లకే హాజరు పలకాలని? మీ ఇంజనీర్ క్లాసుల్లో నంబర్లు పిలిచేవారా లేక పేర్లా? నాకు తెలీకడుగుతున్నాను చెప్పు.’’ ‘‘మేం క్లాస్‌కి వెళ్ళకపోయినా మా హాజరు ఇంకెవరైనా పలికేవారు సార్. ఇక్కడా అంతే అనుకున్నాను.’’ అప్పటికే కపీష్, మర్కట్ ఒకర్ని మరొకరు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రి సర్. వానర్ సార్. ఉన్నాను సర్’’ వానర్ ముందుకి ఓ అడుగేని చెప్పాడు. కపీష్, మర్కట్లు అతన్ని చూశారు. అతనూ వీళ్ళ వంక చూశాడు. మళ్ళీ అందరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. ‘‘లైన్ డిస్మిస్డ్ ఎవరైనా సరే, పారిపోయే ప్రయత్నం చేస్తే చర్మం ఒలుస్తా. వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నావు?’’ జైలర్ వానర్ వంక చూస్తూ కోపంగా అడిగాడు. ‘‘ఏం లేదు సార్. నథింగ్.’’ ‘‘నథింగ్? నథింగ్? లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసన్. బట్ వెన్ యు లాఫ్ వితౌట్ రీజన్ యు నీడ్ మెడిసన్. చీల్చేస్తాను జాగ్రత్త. యు ఆర్ ఆల్ డిస్మిస్డ్ వెళ్ళండి.’’ అందరి హాజరు పూర్తవడంతో జైలర్ హాజర్ పుస్తకంతో వెళ్ళిపోయాడు. అంతా తమ తమ సెల్స్‌కి వెళ్ళసాగారు. కాని ఆ ముగ్గురు యువకులూ కదల్లేదు. ఒకరివైపు మరొకరు అడుగులు వేశారు. తర్వాత ముగ్గురూ ఒకేసారి ఆనందంగా అరిచారు. ‘‘హుర్రే.’’ ముగ్గురూ ఒకరిని మరొకరు ఆనందంగా కౌగిలించుకున్నారు. (మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ముగ్గురు మిత్రులు కోక్ని ఎలా సంపాదించారు?) -
త్రీమంకీస్ - 11
- మల్లాది వెంకటకృష్ణమూర్తి డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 11 ‘‘దేనికో?’’ జైలర్ అడిగాడు. ‘‘భయంతో సార్.’’ ‘‘నోట మాట రాలేదా?’’ ‘‘వచ్చింది సార్. కాని భయంతో ఇంకోటి కూడా వచ్చింది’’ వానర్ సిగ్గుపడుతూ చెప్పాడు. ‘‘సరే. మీ నాన్న పేరు?’’ ‘‘సింహాచలం.’’ ‘‘ఊరు కూడా సింహాచలం కదా?’’ ‘‘కాదు సర్. భద్రాచలం.’’ ‘‘నువ్వేం దొంగతనం చేశావ్?’’ ‘‘ఏటియం లోంచి డబ్బుని విత్‌డ్రా చేసినందుకు పట్టుకున్నారు సార్.’’ ‘‘అదేం నేరం కాదే? నేనూ ఇవాళ ఉదయం ఏటియంలోంచి ఐదు వేలు విత్‌డ్రా చేశాను.’’ ‘‘కాని నా దగ్గర ఏటియం కార్డ్ లేదు సార్.’’ ‘‘ఓహో. అసలు బేంక్‌లో అకౌంటే లేదా?’’ ‘‘లేదు సార్. మెషీన్ డిజైన్ సబ్జెక్ట్‌లో నాకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సార్. కాబట్టి ఏటియం యంత్రాన్ని ఎలా పగలకొట్టాలో దాని డ్రాయింగ్‌ని పరిశీలించగానే ఇట్టే అర్ధమైంది సర్.’’ ‘‘అసలు నీకా డ్రాయింగ్ ఎక్కడిది?’’ ‘‘నెట్టింట్లో సార్.’’ ‘‘బేంక్ మేనేజర్ నట్టింట్లోనా?’’ ‘‘కాదు సార్. నెట్టిల్లంటే ఇంటర్నెట్ అని అర్ధం సర్. ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే దొరికింది సార్.’’ ‘‘నేనెన్నడూ గూగుల్ చేయను. ఎందుకంటే మా ఆవిడకి అంతా తెలుసు. ఇంటర్నెట్‌ని బాగా ఉపయోగిస్తూంటావా?’’ జైలర్ ప్రశ్నించాడు. ‘‘ఇంట్లో ఉంటే సగం రోజు దాంట్లోనే ఉంటాను సర్.’’ ‘‘ఎలా పట్టుబడ్డావు? సర్వైలెన్స్ కెమేరాలో చిక్కా?’’ ‘‘నేను మూర్ఖుడ్ని కాను సర్. బట్టతో నా మొహం కప్పుకుని లోపలకి వెళ్ళి దాని లెన్స్ మీదకి ఆ బట్టని వేశాను సర్.’’ ‘‘మరెలా పట్టుబడ్డావు?’’ ‘‘నెట్టిల్లు వల్ల సార్.’’ ‘‘ఆ?’’ ‘‘అదే. ఇంటర్నెట్ వల్ల సార్.’’ ‘‘ఇంటర్నెట్టే పట్టించిందా?’’ ‘‘అవును సర్.’’ ‘‘హౌ ఇంట్రెస్టింగ్? ఎలా? ఇంటర్నెట్ ఎలా పట్టించింది?’’ జైలర్ ఆసక్తిగా అడిగాడు. ‘‘నాది మొదటి దొంగతనం కదా సార్? ఏటియం యంత్రాన్ని విప్పాక అందులోంచి తీసి కుప్పగా పోసిన ఐదు లక్షల రూపాయల నోట్ల మధ్య సెల్ఫీ ఫొటో తీసుకుని దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాను సర్. దీన్ని చాలామంది షేర్ చేశారు సార్. అలా అలా అది సిఐ గారి మరదలికి చేరింది. ఆమె గారు సిఐ గారికి చెప్పారు సర్. ఆయన మా ఇంటికి వచ్చి డబ్బు స్వాధీనం చేసుకుని నన్ను ఇక్కడికి తెచ్చారు సార్.’’ ‘‘ఫేస్బుక్ రాక మునుపు ఎంతమంది నేరస్థులు తప్పించుకున్నారో?’’ సిఐ విచారంగా చెప్పాడు. ‘‘ఐతే నువ్వు ఉత్త స్టుపిడ్వి అన్నమాట’’ జైలర్ చెప్పాడు. ‘‘స్టుపిడిటీ నేరమా సార్?’’ వానర్ అడిగాడు. ‘‘కాదు.’’ ‘‘స్టుపిడిటీ నేరం కానప్పుడు నన్ను జైల్లో ఎందుకు కూర్చోపెడుతున్నారు సార్?’’ ‘‘కోర్టులో ఈ పాయింట్ మీద వాదించి బయటపడు. బెస్టాఫ్ లక్.’’ ‘‘థాంక్స్ సర్.’’ ‘‘ఏమైనా అనుమానాలు ఉన్నాయా?’’ ‘‘పీజాహట్ నించి మేం పీజాని ఆర్డర్ చేసి మా సెల్‌కి తెప్పించుకోవచ్చాండి?’’ ‘‘లేదు. కుదరదు.’’ ‘‘పోనీ కోక్2హోమ్డాట్ కామ్ నించి కోక్ని? ఫెస్టివ్ ఆఫర్ నడుస్తోంది సార్.’’ ‘‘అలాంటి ఆలోచనలు పెట్టుకోక. బయట ప్రపంచంతో ఇక నీకు సంబంధం కట్’’ జైలర్ చెప్పాడు. ‘‘అలాగే సర్. చూస్తూండండి. నేను ఈ జైల్లోని బెస్ట్ ఖైదీ అనే పేరు తెచ్చుకుంటాను.’’ వానర్ తనకి ముట్టినట్లుగా జైలర్ సిఐ అఫీషియల్‌గా కాగితం ఇచ్చాక అతను వెళ్ళిపోయాడు. గార్డ్లు వానర్ని రిమాండ్ ఖైదీల సెల్‌కి తీసుకెళ్ళారు. ఆ సెల్ కూడాఅన్ని సెల్స్‌లా ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. అందులో అప్పటికే ఉన్న ఖైదీ ఏదో కూనిరాగం తీస్తున్నాడు. కింద బెర్త్ మీద పడుకున్న వ్యక్తి తెల్ల జుట్టు కనిపిస్తోంది. అలికిడికి ఆయన తల తిప్పి చూశాడు. వయసు డెబ్బై ఐదు పైనే ఉండచ్చని ముడతలు పడ్డ అతని మొహాన్ని బట్టి వానర్ అనుకున్నాడు. గార్డ్ ఆ సెల్ తలుపు బయట తాళం పెట్టుకుని వెళ్ళాక ఆయన లేచి కూర్చుంటూ అడిగాడు. ‘‘ఏం చేసి వచ్చావ్?’’ ‘‘దొంగతనం.’’ ‘‘జేబా? ఘరానానా?’’ ‘‘ఏటిఎం పగలకొట్టాను.’’ ‘‘పేరు? కూర్చో’’ పక్కకి జరిగాడు. ‘‘వానర్. మీ పేరు?’’ ‘‘పట్టయ్య. పట్టాభి రామయ్య. కాని అంతా పట్టయ్య అంటారు. నేను రైళ్ళల్లో పాటలు పాడుకుంటూ సంపాదించేవాడ్ని. రైల్వే తత్కాల్ టిక్కెట్లని దొంగ పేర్లతో బ్లాక్ చేని ప్రయాణీకులకి అమ్ముతున్న నేరం మీద పట్టుకున్నారు. రెండు విచారణలు అయ్యాయి.’’ (రేపు ఈ సీరియల్లో మరో రెండు కొత్త వింత పాత్రలని ఊహించగలరా?) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ - ఆదివారం పొద్దుపుచ్చడం కోసం సీరియల్ చూసి ఈ 2 రోజుల నుంచి పేపర్ కొంటున్నాను. వెరైటీగా ఉంది. నిన్నటి భాగంలో పాత్రల పేర్లతో (జడ్జ్ సాక్షులు వచ్చారా అని అడిగినప్పుడు లాయర్ చెప్పిన సంభాషణలు) చాలాచాలా వెరైటీగా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉంది ఈ సీరియల్. - భరద్వాజ్ వైవిఎస్, (bharadwazhr@gmail.com) -
త్రీ మంకీస్ - 9
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 9 - మల్లాది వెంకటకృష్ణమూర్తి అక్కడ కోక్ దొరికింది. దాన్ని తాగుతూ టేబిల్ మీది దినపత్రికలో ఆ వేన్ దొంగతనం గురించి చదివాడు. టో అండ్ టో షూస్ కంపెనీ వారు దొంగతనాన్ని అరికట్టడానికి కుడి, ఎడమ బూట్ల జతలని విడదీసి విడివిడిగా రవాణా చేస్తారు. దొంగలు అవి నిరుపయోగం అని గ్రహించాక వాటిని వదిలేస్తారని, ఈ సందర్భంలో సరిగ్గా ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ వేన్ ఎక్కడ విడిచిపెట్టబడిందో కూడా రాశారు. దొంగలు ఆ వేన్‌ని సంకరజాతి పశువుల వారి కార్యాలయం ముందు వదిలి వెళ్ళారు. తను చేసిన మొదటి దొంగతనం నించి మంచి పాఠాన్ని నేర్చుకున్నాడని మర్కట్ అనుకున్నాడు. లేచి కోకోకోలా టిన్ని చెత్త బుట్టలో వేసేదాకా తనని, తన కాళ్ళని అక్కడ కూర్చున్న ఓ వ్యక్తి తదేకంగా గమనిస్తున్నాడని మర్కట్కి తెలీదు. తర్వాత అతని వైపు తిరిగి అడిగాడు. ‘‘ఏమిటి? చూస్తున్నావ్?’’ ‘‘బావున్నాయి. ఆ బూట్లెక్కడివి?’’ అతను ప్రశ్నించాడు. ‘‘టో అండ్ టో కంపెనీ షూస్కంపెనీ ఫ్యాక్టరీ నించి బయటికి వచ్చాయి.’’ ‘‘ఏ షాపులో కొన్నావు?’’ ‘‘లాభం లేదు. ఇలాంటి ఇంకో జత అక్కడ లేదు. నేను అమ్మను.’’ ‘‘నేనూ కొనదలచుకోలేదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సిఐడి.’’ అతను జేబులోంచి తన ఐడెంటిటీ కార్డుని చూపించి చెప్పాడు. ‘‘ఈ బూట్లు ధరించడం నేరం అని నాకు తెలీదే?’’ మర్కట్ ఆశ్చర్యంగా చెప్పాడు. ‘‘ఈ బూట్లు ధరించడం నేరం.’’ అతను వెంటనే తన జేబులోంచి ఓ పరికరాన్ని బయటికి తీశాడు. అలాంటివి మర్కట్ జేమ్స్ బాండ్ సినిమాలో చూశాడు. ఆ సినిమాలో లాగానే అందులోని ఎర్ర లైటు ఆరి వెలుగుతూ తను తొడుక్కున్న బూట్ల వైపు బాణం గుర్తు చూపిస్తోంది. ‘‘అటు, ఇటు నడు’’ సిఐడి కోరాడు. మర్కట్ ఎటు నడిస్తే ఆ బాణం గుర్తు అటు వైపు చూపించసాగింది. ‘‘ఉహు. అమ్మకపోవడమే కాదు. నా బూట్లని దాంతో ఎక్స్చేంజ్ కూడా చేయను.’’ చెప్పి వెళ్ళబోయే మర్కట్ కాలర్ని అతను పట్టుకుని ఆపాడు. అంతదాకా ఆ షాపు బయట అడుక్కునే గుడ్డి బిచ్చగాడు, వాడి అసిస్టెంట్లు కూడా వచ్చి మర్కట్ చేతులని పట్టుకున్నారు. ‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ మర్కట్ నివ్వెరపోతూ అడిగాడు. ‘‘నువ్వు చదివిన ఈ వార్తలో రాయనిది నేను చెప్తా విను. టో అండ్ టో కంపెనీ వారు తాము రవాణా చేసే ప్రతీ బూట్ల వేన్లో ఓ మామూలు జత బూట్లని కూడా ఉంచుతారు. దాని సోల్లో అమర్చిన ఎలక్ట్రానిక్ జిపిఎస్ని ఈ రిసీవర్ ట్రేస్ చేసి కనుక్కుంటుంది. ఇదంతా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా జరుగుతుంది.’’ ‘‘నాకు తెలీదు. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని కాను. మెకానికల్ ఇంజనీర్ని’’ మర్కట్ నీరసంగా చెప్పాడు. మర్కట్ సెల్‌లోకి వెళ్ళాక గార్డ్ తలుపు మూసి బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. కింది బెర్త్‌లో కూర్చున్న ఒకతను సిగరెట్ కాలుస్తున్నాడు. అతను తల తిప్పి మర్కట్ వంక పరీక్షగా చూసి అడిగాడు. ‘‘ఏం నేరం?’’ ‘‘చెప్పుల దొంగతనం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏ గుళ్ళో? అలాంటి వారినీ పోలీసులు పట్టుకుంటున్నారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘నేనంత నీచంగా కనిపిస్తున్నానా? చెప్పుల వేన్‌ని దొంగిలించి పట్టుబడ్డాను. నా పేరు మర్కట్. నీ పేరు?’’ ‘‘ఏం పేర్లో? ఏమిటో? నా పేరు వేమన. దొంగ నోట్ల చలామణి. పాకిస్థాన్‌లో ప్రింటైన దొంగ నోట్లని కన్యాకుమారికి వెళ్ళి కొనుక్కొచ్చి మారుస్తూంటాను. పై బెర్త్త్ నీది.’’ ‘‘పాకిస్థాన్‌లోనా? ఐతే కాశ్మీర్ కాదా వెళ్ళేది?’’ ‘‘కాదు. కాశ్మీర్లో దొంగ నోట్ల కోసం పోలీసులు వెదుకుతారు కాని కన్యాకుమారిలో వెదకరు కదా.’’ ‘‘పాయింటే. జైల్లో జీవితం బావుంటుందా?’’ చిన్నగా నిట్టూర్చి సిగరెట్ మసిని నేల మీద రాల్చి చెప్పాడు. ‘‘మన మనసే ఓ జైలు. దాన్లోంచి బయట పడితే ఇంకా ఎక్కడైనా బావుంటుంది.’’ మళ్ళీ నిట్టూర్చి అడిగాడు. ‘‘బ్రహ్మం ఒక్కటా? రెండా?’’ ‘‘నాకవి తెలీవు. చెప్పినా వినను.’’ పై బెర్త్ మీదకి ఎక్కి పడుకున్నాడు. ‘‘విక్టర్ హ్యూగో అబద్ధం రాశాడు’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఆయనెవరు?’’ వేమన అడిగాడు. ‘‘ఫ్రెంచ్ రచయిత.’’ ‘‘ఏం అబద్ధం రాశాడు?’’ ‘‘ఇద్దరు జైలు కిటికీలోంచి చూస్తే ఒకడికి నక్షత్రాలు కనిపిస్తే ఇంకొకడికి మట్టి కనిపించిందని రాశాడు. జైల్లో అసలు కిటికీలే లేవు’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏం నక్షత్రాలో? ఏం మట్టో. అన్నీ పంచభూతాల నిర్మితమేగా?’’ మర్కట్కి అతను వేదాంతి అని అర్ధం అయింది. మళ్ళీ చెప్పాడు - ‘‘మార్క్ టై్వన్ కూడా అబద్ధం చెప్పాడు.’’ ‘‘ఆయనెవరు?’’ ‘‘అమెరికన్ రచయిత.’’ ‘‘ఏం అబద్ధం చెప్పాడు?’’ ‘‘స్కూల్ తలుపులోంచి లోపలకి వెళ్ళిన వారు జైలు తలుపులోంచి లోపలకి వెళ్ళరు అని.’’ ‘‘వాళ్ళు కూడా ఇక్కడే ఏదో సెల్స్‌లో ఉండి ఉంటారు’’ వేమన చెప్పాడు. 3 చీకటి పడుతూండగా సిఐ ఆ సందులో ‘సస్టిస్ భవన్’ అని రాసి ఉన్న ఇంటి ముందు పోలీన్ వేన్ దిగాడు. ఆ ఖరీదైన ఇంటి బయట షామియానా వేసి ఉంది. లోపలి నించి మంగళ వాయిద్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఓ ఇరవై మూడేళ్ళ ముద్దాయితో సిఐ లోపలికి నడిచాడు. (మేజిస్ట్రేట్ యమధర్మరాజు దగ్గరికి తీసుకురాబడ్డ మూడో మంకీ పేరేమిటి?) -
త్రీ మంకీస్ - 8
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 8 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మా అన్నయ్య అలా తగలడ్డాడు సార్. నేనూ తగలడదామని బేంక్‌కి వెళ్తే మా అన్న లోన్ తీర్చలేదని వాళ్ళ రికార్డుల్లో ఉందట. దాంతో మా అన్న లోన్ని కడితేనే నాకు లోన్ ఇస్తామన్నారు సార్. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్నాను.’’ ‘‘ఏ ఉద్యోగాలకో?’’ ‘‘కొరియర్ బోయ్, రోడ్లూడ్చేవాడు, ఇసుక మోసేవాడు... చెప్పులరిగేలా తిరిగినా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు సార్.’’ ‘‘నువ్వు పిడబ్ల్యుడిలోనో, జి హెచ్ ఎంసిలోనో ఇంజినీర్‌గా పనికొస్తావుగా?’’ ‘‘కాని ఎంపి, ఎంఎల్ఏ, కనీసం ఎంఎల్‌సి రికమండేషనైనా లేకపోతే అక్కడ ఉద్యోగాలు ఎలా వస్తాయి సార్? నేను వాళ్ళెవరికీ తెలియను.’’ ‘‘అందుకని?’’ ‘‘దాంతో ఉద్యోగానికి తిరిగి తిరిగి చెప్పులు అరిగాయి. వాటిని కొనే స్థోమత కూడా లేకపోవడంతో విధి లేక దొంగతనానికి దిగాను సార్.’’ ‘‘ఈ స్టేట్మెంట్ చదివే సంతకం చేశావా?’’ ‘‘అవును సార్.’’ ‘‘ఇందులో రాసిట్లుగానే నువ్వు దొంగతనం చేశావా?’’ ‘‘అవును సార్.’’ వెంటనే జైలర్ పకపక నవ్వి చెప్పాడు. ‘‘ఐతే నువ్వూ దురదృష్టవంతుడివే అన్నమాట. సరే. నేను ఇక్కడికి వచ్చే అందరికీ చెప్పే మాటలే చెప్తాను. ఇకనించి నువ్వు మా విశ్రాంతి గృహంలో అతిథివి. వెల్కం. ఇప్పుడు ఆ దొంగతనం ఎలా చేశావో నీ మాటల్లో చెప్పు.’’ ఆ రోజు మర్కట్ దగ్గర అతని జీవితాంతానికి సరిపడా డబ్బుంది. అతనేదైనా కొనాలనుకుంటే తప్ప. కోకోకోలా కేన్ని కొనాలనుకున్నాడు. కాని దొంగతనం చేేన్త కాని కోకోకోలా కేన్ కొనేందుకు కూడా డబ్బు లేదు. ‘అవుటాఫ్ మనీ ఎక్స్‌పీరియెన్స్’ ఉన్న అతను చాలామందిలా సందేహించలేదు. తక్షణం దొంగతనంలోకి దిగాడు. ఆ రాత్రి అతను దొంగతనం చేయడానికి గాయత్రి జూవెలరీ దుకాణం వైపు నడుస్తూంటే ఓ చెప్పుల షాపు బయట ఆగి ఉన్న ఓ వేన్ కనిపించింది. దాని మీది ప్రకటనని బట్టి అది ఆ దుకాణానికి చెప్పులని డెలివరీ చేయడానికి వచ్చిందని గ్రహించాడు. వేన్ మీద ఇలా పెయింట్ చేసి ఉంది. ‘కొనండి మా టో అండ్ టో జోళ్ళు. బై రైట్ సైడ్ షూ. గెట్ లెఫ్ట్ సైడ్ షూ ఫ్రీ.’ ఒకతను సెల్ఫోన్లో మాట్లాడేది విని మర్కట్ అతను దాని డ్రెవర్ అని గ్రహించాడు. ‘‘మీ గోడౌన్ ఎక్కడ? యాదగిరి వైన్స్ పక్క గల్లీలోనా? అదెక్కడుంది? అస్టోరియా రెస్టారెంట్ ఎదురుగానా? సరే. వస్తున్నాను. అక్కడే ఉండండి’’ అతను సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ ముందుకి కాలినడకనే సాగాడు. మర్కట్ ఆ వేన్ దగ్గరికి వెళ్ళి దాని వెనక తలుపు లాగాడు. తెరుచుకోలేదు. కేబిన్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసాడు. ఇగ్నీషన్ తాళంచెవి వేలాడుతూ కనిపించింది. అతను క్షణకాలం సందేహించాడు. కొద్దిసేపు ‘తనకి డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా ఆ వేన్‌ని డ్రైవ్ చేయచ్చా?’ అనే మీమాంసలో పడ్డాడు. ఆ నైతిక మీమాంసలోంచి బయట పడ్డాక ఇక సందేహించలేదు. వేన్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి డ్రయివర్ వెళ్ళిన వైపు కాక దానికి వ్యతిరేక దిశలో వేన్‌ని పోనిచ్చాడు. ఓ కిలోమీటర్ దూరంలో ఓ డెడ్ ఎండ్ సందులో వేన్‌ని ఆపి తాళం చెవి తీసుకుని దిగి వెనక తలుపు తెరిచాడు. లోపల చీకటిగా ఉండడంతో తడిమి స్విచ్ ఆన్ చేశాడు. ఎదురుగా చెప్పుల పెట్టెలు ఒక దాని మీద మరొకటి పేర్చి కనిపించాయి. వెంటనే తన కాళ్ళ వంక చూసుకున్నాడు. అవి బోసిగా ఉన్నాయి. ఓ పెట్టెని అందుకుని తెరిచి అందులోని బూట్లని నేల మీద పడేశాడు. వాటి వంక చూస్తే నల్లరంగు బూట్లు. దాదాపు డజను పెట్టెల్లోంచి బూట్లని కింద పడేశాక అతను వెతికే బ్రౌన్ రంగు బూట్లు కనిపించాయి. అవి తన సైజో కాదో చూసుకోవాలని ఒంగి వాటిని అందుకుని కుడి కాలి బూటుని తొడుక్కున్నాడు. చక్కగా సరిపోయింది. తర్వాత ఎడమ కాలి బూటుని తొడుక్కోడానికి విశ్వ ప్రయత్నం చేసినా అది ఎక్కలేదు. దాన్ని పరీక్షగా చూస్తే అదీ కుడి కాలి బూటే! పేకర్లని తిట్టుకుంటూ కింద ఉన్న నల్ల బూటుని అందుకుని కుడి కాలికి తొడుక్కున్నాడు. అదీ సరిగ్గా సరిపోయింది. తర్వాత ఎడమ కాలి బూటుని తొడుక్కోబోతే పట్టలేదు. రెండు మూడు జతల బూట్లని తొడుక్కునే ప్రయత్నం చేశాక అనుమానం వచ్చి ఇంకొన్ని పెట్టెల్ని తెరిచి చూస్తే ప్రతీ పెట్టెలో కేవలం కుడి కాలి బూట్ల జతలే కనిపించాయి. ఓపికగా ఆ వేన్‌లోని ఐదు వందల అరవై నాలుగు పెట్టెలని తెరచి చూస్తే అతని అదృష్టం బావుండి ఓ పెట్టెలో మాత్రం కుడి, ఎడమ కాళ్ళ బూట్లు ఉన్నాయి. అది పేకర్ చేసిన పొరపాటు అనుకున్నాడు. వాటిని తొడుక్కుంటే అవి చక్కగా సరిపోవడంతో అటు, ఇటు నడిచి చూసి తృప్తి పడ్డాడు. ‘దీన్ని కుట్టినవాడికి నా పాదం సైజు ఎలా తెలుసో?’ అనుకున్నాడు. డేష్ బోర్డ్ వెదికితే నాలుగు పది రూపాయల నోట్లు కనిపించాయి. వాటిని జేబులో ఉంచుకున్నాడు. కోక్ ప్రియుడైన మర్కట్ మర్నాడు ఉదయం ఆ నాలుగు పది రూపాయల నోట్లతో ఓ సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్లోకి వెళ్ళి అడిగాడు. ‘‘కోక్ కేన్ కావాలి.’’ ‘‘సారీ. పెప్సీ ఉంది. ఓకేనా?’’ కేషియర్ అడిగాడు. ‘‘నా దగ్గర మోనోపలీ ఆటకి వాడే డబ్బుంది. అది ఓకేనా?’’ సమీపంలోని అలాంటి ఇంకో రెస్టారెంట్‌కి వెళ్లాడు. బయట అడుక్కునే వాళ్ళు చేతిని చాపగానే అరిచాడు. ‘‘దుక్కల్లా ఉన్నారు. కూలి పని చేసుకోక ఏమిటిది?’’ (మర్కట్ పోలీసులకు పట్టుబడ్డ ఫన్నీ కారణం ఊహించగలరా?) -
త్రీ మంకీస్ - 6
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 6 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఓ కూతురు ఉంది సార్.’’ ‘‘సరే కేసు గురించి మీరు చెప్పండి.’’ యమధర్మరాజు భర్త వైపు లాయర్ని అడిగాడు. ‘‘నా క్లైంట్ భార్య అతని మీద గృహ హింస చట్టం 498ఏ కింద కేసు పెట్టింది. నిజానికి నా క్లైంట్‌కి హింస పడదు. గాంధీ గారి ఫాన్. సరిహద్దు గాంధీ గారి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు కూడా. అందువల్ల ఆయన మనసు బాధ పడింది. అహం దెబ్బ తింది. తన భార్యంటే అసహ్యం వేసింది. దాంతో విడాకులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాడు. యువర్ ఆనర్. ఆ కారణంగా ఆయనకి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను’’ లాయర్ కోరాడు. ‘‘మై లెరెన్డ్ కౌన్సెల్. ఆ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వకూడదని తెలీదా?’’ యమధర్మరాజు ఓపికగా చెప్పాడు. ‘‘విడాకులు అతని హక్కు యువర్ ఆనర్. అవి తీసుకోడానికి నా క్లైంట్ బయటకి రావాల్సి ఉంది యువర్ ఆనర్’’ లాయర్ చెప్పాడు. ‘‘దేనికి విడాకులు?’’ ‘‘మనసు బాధపడటంతో, అహం దెబ్బ తినడంతో, తన భార్య మీద అసహ్యం వేసి నిజానికి ఈ కేసులో ఇంకో ఇష్యూ కూడా ఉంది యువర్ ఆనర్.’’ ‘‘ఏమిటది?’’ ‘‘నా క్లైంట్ తన కిడ్నీని వెనక్కి కోరుతున్నాడు.’’ ‘‘సరిగ్గా విన్నానా? ఇడ్లీని వెనక్కి కోరడమేమిటి?’’ ‘‘వినలేదు యువర్ ఆనర్. కిడ్నీ అన్నాను.’’ ‘‘సిడ్నీ అన్నారా?’’ ‘‘కిడ్నీ అన్నాను యువర్ ఆనర్. రెండేళ్ళ క్రితం నా క్లైంట్ భార్య రెండు కిడ్నీలు పని చేయడం ఆగిపోయింది. ఆవిడ బిపి పేషెంట్. అందువల్ల కిడ్నీలు దెబ్బ తిన్నాయి. నా క్లైంట్‌కి తన భార్య మీద అప్పట్లో గల ప్రేమాభిమానాలతో తన రెండు కిడ్నీలలో ఒక దాన్ని ఆమెకి ఉచితంగా దానం చేశాడు.’’ ‘‘అబ్జెక్షన్ యువర్ ఆనర్. దానం అంటేనే ఉచితం అని. ఉచితంగా దానం ఏమిటి నా బొంద?’’ భార్య తరఫు లాయర్ అభ్యంతరం చెప్పాడు. ‘‘ఇదిగో నాయుడు. టెక్నికల్ పాయింట్ల మీద తప్ప ఇలాంటి వాటి మీద అభ్యంతరాలు ఒద్దని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ‘‘ఆయన కథలు రాయడం వల్ల మనకీ పీడ యువర్ ఆనర్. సరే. నా క్లైంట్ కిడ్నీని డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఆమెకి అమర్చారు. ఆమె తన మీద గృహహింస కేసు పెట్టిన కారణంగా ఆమె నించి విడాకులు తీసుకోబోతున్నాడు కాబట్టి తన వస్తువు తన భార్య దగ్గర ఉండటం ఇష్టం లేదు. కాబట్టి దాన్ని తిరిగి వెనక్కి ఇప్పించాల్సిందిగా నా క్లైంట్ కోర్టుని కోరుతున్నాడు.’’ ‘‘ఇది నిజమేనా? కిడ్నీ ప్రస్తుతం మీ క్లైంట్ దగ్గర ఉందా?’’ యమధర్మరాజు భార్య వైపు లాయర్ని అడిగాడు. ‘‘నిజమే సార్. ఉంది.’’ ‘‘అది తిరిగి ఇవ్వడానికి ఆమెకి అభ్యంతరం ఉందా?’’ ‘‘ఉంది యువర్ ఆనర్.’’ ‘‘ఏమిటా అభ్యంతరం?’’ భర్త తరఫు లాయర్ భార్య వైపు లాయర్ని ప్రశ్నించాడు. ‘‘నేను ఇక్కడే ఉన్నాను. అది నేను అడగాల్సిన ప్రశ్న. ఏమిటా అభ్యంతరం?’’ యమధర్మరాజు చిరాగ్గా చెప్పాడు. ‘‘ఆమె డయాలసిస్‌లో ఉండగా ఆమె భర్త ఆమెకి కిడ్నీని డొనేట్ చేశాడు. ఇప్పుడు ఆమె శరీరం నించి దాన్ని వేరు చేస్తే ఆమెకి మరణం తప్పదు. కాబట్టి అది హత్యాప్రయత్నం కిందకి వస్తుంది యువర్ ఆనర్’’ భార్య తరఫు లాయర్ చెప్పాడు. ‘‘దీనికి మీరేమంటారు?’’ యమధర్మరాజు భర్త తరఫు లాయర్ని అడిగాడు. ‘‘కాని అతని క్లైంట్ ప్రాణాలు యమధర్మరాజు చేతిలో తప్ప నా క్లైంట్ చేతుల్లో లేవు యువర్ ఆనర్’’ భర్త వైపు లాయర్ చెప్పాడు. ‘‘నా చేతుల్లోనా?’’ యమధర్మరాజు ఉలిక్కిపడి అడిగాడు. ‘‘అంటే ఆయన చేతుల్లో’’ చేతిని పైకి చూపిస్తూ భర్త తరఫు లాయర్ చెప్పాడు. ‘‘ఐసీ’’ యమధర్మరాజు పైకి చూసి ఆ కేసు ఫైల్లో ఏదో రాసుకున్నాడు. ‘‘అంతే కాక నా క్లైంట్ ఆమెకి కిడ్నీ దానం చేశాడు కాని ప్రాణదానం చేయలేదు. తను దేంతో పుట్టాడో దాన్నే, కేవలం తనకి చెందినదాన్ని, అదీ గతంలో ఉచితంగా ఇచ్చిన దాన్నే నా క్లైంట్ కోరుతున్నాడు. అది సబబు. అది న్యాయం.’’ లాయర్ చెప్పాడు. ‘‘అది సబబు కాదు. అది అన్యాయం’’ రెండో లాయర్ చెప్పాడు. ‘‘యువర్ ఆనర్. ఆమె అది తనదే అన్నట్లుగా ఇవ్వననడం న్యాయం కాదు. కొన్నది ఏదైనా తనది అవుతుంది. కిడ్నీని తను కొన్నదా? బిల్ లేదా ఇన్‌వాయిస్‌ని చూపించమనండి. కొనలేదు. కాబట్టి వాటిని చూపించలేదు. పోనీ బహుమతిగా పొందిందా? గిఫ్ట్ డీడ్ని చూపించమనండి. లేదు. పోనీ కేవలం అప్పుగా తీసుకుంది అనుకుందాం. నిజానికి ఆ కిడ్నీకి ఆమె వడ్డీగా ఇంకో చిన్న కిడ్నీని కూడా కలిపి ఇవ్వాలి. కాని నా క్లైంట్ దయగల వాడు కాబట్టి వడ్డీని మాఫీ చేసి కేవలం తను అప్పుగా ఇచ్చిన తన కిడ్నీనే వెనక్కి ఇవ్వమని కోరుతున్నాడు’’ లాయర్ చెప్పాడు. ‘‘ఇదన్యాయం. అక్రమం.’’ ‘‘పోస్టాఫీస్‌లో మనిఆర్డర్ ఫారం రాయడానికి ఇచ్చిన రెండు రూపాయల పెన్నునే తిరిగి అడుగుతాం. అలాంటిది పది లక్షల ఖరీదు చేేన కిడ్నీని ఉచితంగా ఏ తలకి మాసినవాడూ ఇవ్వడు.’’ ‘‘దాని ధర పది లక్షలా? పది లక్షలు ఇస్తుందేమో నా క్లైంట్‌ని అడుగుతాను. వాయిదా కోరుతున్నాను’’ భార్య వైపు లాయర్ చెప్పాడు. ‘‘ఊహూ. నా క్లైంట్ దాన్ని అమ్మనని చెప్పాడు. అమ్మినా తన భార్యకి అసలు అమ్మనని చెప్పాడు. రైట్స్ ఆఫ్ ఎడ్మిషన్ రిజర్వ్డ్. మై క్లైంట్ డిమాండ్స్ హిజ్ కిడ్నీ బేక్’’ ఆఖరిలో ప్రతీ ఇంగ్లీష్ పదం బల్ల గుద్దుతూ చెప్పి లాయర్ తన ఆర్గ్యుమెంట్‌ని ముగించాడు. -
త్రీ మంకీస్ - 3
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 3 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మిమ్మల్నే. ఎవరిదా ఫోన్ అంటే వినపడదా?’’ ఆయన గొంతు పెంచాడు. ‘‘మీ గురించి తెలుసు కాబట్టి నల్ల కోట్ల వారిదై ఉండదు యువర్ ఆనర్. కొత్తవాళ్ళదై ఉంటుంది’’ క్లర్క్ చెప్పాడు. ‘‘నేను పది లెక్కపెట్టేలోగా ఎవరి సెల్‌ఫోన్ మోగిందో వారు వెంటనే చేతిని ఎత్తండి. ఒన్... టు...’’ ఎవరూ ఎత్తలేదు. ‘‘నాకు ఓపిక లేదు. లేదా అందరికీ శిక్ష వేస్తాను. మీ పదిహేడు మందికి. త్రి... టెన్. సరే. వీళ్ళందర్నీ ఈ రాత్రి లాకప్‌లో ఉంచి రేపు విడుదల చేయండి. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు విధులని అడ్డగించారు’’ యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. కిక్కురుమంటే శిక్ష పెరుగుతుందని అంతా భయపడి నోరు మెదపకుండా కానిస్టేబుల్స్ వెంట బయటికి నడిచారు. వాళ్ళు బయటికి వెళ్ళాక కారిడార్లోంచి పెద్దగా వారి మాటలు వినిపించాయి. ‘‘ఇంకో ముద్దాయి ఎవరు?’’ యమధర్మరాజు సిఐని అడిగాడు. ‘‘ఇతను సార్.’’ ‘‘నేనే ముద్దాయిని సార్’’ కపీష్ చెప్పాడు. జీన్స్ పేంట్, టి షర్ట్ ధరించిన ఆ ఇరవై మూడేళ్ళ యువకుడి వంక ఆయన నిరసనగా చూసాడు. టి షర్ట్ మీద రాసింది చదివి మొహం ముడిచాడు. దాని మీద ఇలా రాసి ఉంది. ‘సేవ్ వాటర్. డ్రింక్ బీర్.’ పోలీస్ ఇన్స్పెక్టర్ అందించిన స్టేట్మెంట్ని చదివి మెజిస్ట్రేట్ కపీష్ వంక చూసి కోపంగా అడిగాడు. ‘‘పేరు?’’ ‘‘కపీష్.’’ ‘‘అదేం పేరు? పిచ్చి పేరు?’’ ‘‘వెరైటీ పేరని మా నాన్న పెట్టారు.’’ ‘‘వెరైటీ పేరని ఈ మధ్య పిచ్చిపిచ్చి పేర్లు పెడుతున్నారు. కపీష్ అంటే అర్ధం తెలుసా?’’ ‘‘ఆంజనేయస్వామి. మా నాన్న ఆంజనేయస్వామి భక్తుడు.’’ ‘‘కపీష్ అంటే కోతి అని అర్థం.’’ ‘‘ఛ!?!’’ కపీష్ సిగ్గుగా చెప్పాడు. ‘‘మీ నాన్న పేరు?’’ ‘‘తిరుపతి.’’ ‘‘ఊరి పేరు కాదు. నేనడిగింది మీ నాన్న పేరు.’’ ‘‘నేను చెప్పింది కూడా మా నాన్న పేరే సార్. తిరుపతి.’’ ‘‘ఊరు?’’ ‘‘తిరుపతి.’’ ‘‘కన్ఫ్యూజ్ కాకు. నేను అడిగింది మీ నాన్న పేరు కాదు. మీ నాన్న ఊరి పేరు.’’ ‘‘మీరూ కన్ఫ్యూజ్ కాకండి సార్. నేను చెప్పింది కూడా మా నాన్న ఊరి పేరే.’’ ‘‘అంటే ఆయన పేరు, ఆయన ఊరి పేరు తిరుపతే అంటావ్.’’ ‘‘అవును సార్. అంటాను.’’ ‘‘ఈ సంతకం నీదేనా?’’ ‘‘యస్సార్.’’ ‘‘దీన్ని చదివే పెట్టావా?’’ ఇంకా కోపంగా అడిగాడు. ‘‘యస్సార్.’’ ‘‘ఎవరి బలవంతం లేదుగా?’’ ‘‘నేను పుట్టాక నన్నెవరూ ఏ విషయంలో ఇంతదాకా బలవంతం చేయలేదండి.’’ ‘‘అంటే నీ నేరాన్ని ఒప్పుకున్నట్లేగా. సరే. పధ్నాలుగు రోజులు రిమాండ్.’’ ‘‘థాంక్ యు యువరానర్’’ చెప్పి సీఐ కానిస్ట్టేబుల్స్, ముద్దాయిలు ఇద్దరితో బయటికి నడిచాడు. ‘‘ఏమిటి యువర్ ఆనర్ గారు ఇవాళ ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నారు?’’ సీఐ బంట్రోతుని అడిగాడు. ‘‘సార్ భార్య హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది సార్.’’ ‘‘అయ్యో పాపం’’ కపీష్ చెప్పాడు. సీఐ ఇద్దరు ముద్దాయిలని పోలీస్వేన్ ఎక్కించి సరాసరి జైలుకి తీసుకెళ్ళాడు. కోర్టు ఆర్డర్‌తో పాటు వాళ్ళని జైలర్‌కి అప్పగించాడు. జైలర్ గార్డ్‌తో చెప్పాడు. ‘‘సీనియారిటీ ప్రకారం పంపు.’’ ముందుగా లింబాద్రి వెళ్ళాడు. కొద్ది నిమిషాల్లో అతను జైలర్ గదిలోంచి బయటికి వచ్చాక జైలర్ కపీష్‌ని లోపలికి పిలిచాడు. అతని కేసు ఫైల్ని చదివి అడిగాడు. ‘‘ఏం చదువుకున్నావ్?’’ ‘‘ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని సార్.’’ ‘‘అబ్బో! ఏ బ్రాంచో?’’ ‘‘ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సార్.’’ ‘‘ఐటీలో సీట్ రాకా?’’ ‘‘కాదు. ఈ బ్రాంచ్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువని.’’ ‘‘కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్‌లో ఎంతొచ్చిందో?’’ ‘‘ఎయిటీ సెవెన్ పర్సెంట్ సార్.’’ ‘‘మరి? ఉద్యోగం చేసుకోకుండా దొంగతనానికి దిగావేమిటి?’’ కపీష్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘రాలేదు సార్. రాదు కూడా సార్.’’ ‘‘ఏం రాలేదు? ఏం రాదు కూడా?’’ ‘‘ఉద్యోగం సార్.’’ ‘‘ఫ్లేష్బేకా?’’ ‘‘అవును సార్. నా ఆరో పుట్టినరోజుకి మా నాన్న నాకు ఎస్సై యూనిఫాం కొనిచ్చాడు. దాంతో ఫోటో కూడా తీసుకున్నాను. అలా మొదలైంది నేను పోలీస్ శాఖలో చేరాలనే కోరిక. రిపబ్లిక్ దినోత్సవంలో పోలీసు పతకాలు అందుకునే పోలీసులని టీవీలో చూశాక ఆ కోరిక తపనగా మారింది. ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దయి ఎప్పుడెప్పుడు ఎస్సై అవుదామా అనే తపన.’’ ‘‘మరి ఎందుకు ఎస్సై కాలేదు? బదులుగా దొంగెందుకు అయ్యావు?’’ -
త్రీ మంకీస్ - 2
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 2 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నమ్ముతాను, చెప్పు.’’ ‘‘మా పక్కిల్లే.’’ ‘‘యువర్ ఆనర్. సాక్షి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు’’ లాయర్ మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేసాడు. ‘‘మీ అన్ని ప్రశ్నలకి సరైన జవాబులు ఇస్తూనే ఉన్నాడుగా? సరే. మిగిలిన సాక్షులని విచారించండి’’ యమధర్మరాజు డిఫెన్స్ లాయర్‌కి సూచించాడు. ‘‘వారు రాలేదండి.’’ ‘‘సాక్షులు లేకుండా కేసు ఎలా విచారించను? విట్నెన్ నంబర్ ఫైవ్ లక్ష్మీపతి గారు వచ్చారా?’’ యమధర్మరాజు ఫైల్లోకి చూసి టిక్ పెట్టుకుంటూ అడిగాడు. ‘‘లేరు యువర్ ఆనర్. ఆయన అప్పు కోసం వెళ్ళారు.’’ ‘‘మిగిలిన విట్నెస్ల మాటేమిటి?’’ ‘‘యువర్ ఆనర్, విట్నెస్ నంబర్ సిక్స్ గుండురావు గారు హెయిర్ కటింగ్ చేయించుకోడానికి వెళ్ళారు. నంబర్ సెవెన్ కరుణాకర్ గారు కబేళాకి డ్యూటీకి వెళ్ళారు. క్రైమ్ సీన్లో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ సూర్యారావు గారు కూడా డార్క్ రూంలో ఉన్నారు. శవపరీక్ష చేసిన డాక్టర్ భిక్షపతి గారు అన్నదానం చెయ్యడానికి వెళ్ళారు. కాబట్టి వాయిదా కోరుతున్నాను యువర్ ఆనర్’’ డిఫెన్స్ లాయర్ చెప్పాడు. దాన్ని పదహారో తారీకుకి వాయిదా వేసాక తర్వాతి కేసు విచారణ చివరికి రావడంతో దాని కోసం మెజిస్ట్రేట్ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. ‘‘యువర్ ఆనర్, సెప్టెంబర్ పదహారవ తారీకు పర్చేస్ ఆర్డర్ ప్రకారం సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో నించి టమోటా బుట్టలు నగరంలోని సంక్షేమ ప్రభుత్వ హాస్టల్‌కి అందాయి. ఐతే అవన్నీ కుళ్ళిపోయి పనికి రాకుండా పోయాయి. అందువల్ల సంక్షేమ శాఖ డెరైక్టర్ పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పించమని కోర్టు వారిని చివరగా అభ్యర్థిస్తున్నాను.’’ సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో లాయర్ కోరాడు. ‘‘కాని నా క్లయింట్ ఆర్డర్ చేసింది మంచి టమోటా పళ్ళు తప్ప కుళ్ళినవి కావు. ఎగ్జిబిట్ ఏ గా ప్రవేశపెట్టబడ్డ పర్చేస్ ఆర్డర్‌ని చూడండి’’ సంక్షేమ శాఖ డెరైక్టర్ తరఫు ప్రభుత్వ లాయర్ తన వాదనని వినిపించాడు. ‘‘యువర్ ఆనర్. నా క్లయింట్ సత్తిపండు అఫిడవిట్లోనే కారణం పేర్కొన్నాడు. దారిలో తుఫాను వచ్చి, వాగు పొంగి, చెట్లు కూలి వాటిని రవాణా చేేన లారీ నాలుగు రోజులు ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఒక్క లారీనే గాలికి ఎగిరిపోలేదు. లేదా వాళ్ళకి చితికిన పళ్ళు సరఫరా అయేవి. సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో వారు సరైన సమయానికే టమోటా పళ్ళని లారీకి ఎక్కించారు కాబట్టి నా క్లయింట్ తప్పు లేదు.’’ వారిద్దరి వాదనలు పూర్తయ్యాక యమధర్మరాజు తీర్పు చదివాడు. ‘‘సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో యజమాని అయిన సత్తిపండు దురదృష్టవశాత్తు దేవుడు కాడు. కాబట్టి అతనికి తుఫాను వస్తుందని ముందుగా తెలీదు. దేవుడు కాడు కాబట్టి సత్తిపండు ఆ తుఫానుని కూడా సృష్టించలేదు. అతను దేవుడై ఉంటే అతను సరఫరా చేసిన టమోటాలకి ఏం చెల్లించక్కర్లేదు అన్నది న్యాయం. కాని సత్తిపండుకి దేవుడితో పరిచయం ఉందని, ఆయన వాళ్ళింటికి వచ్చి పోతుంటాడని కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి నేను విశ్వసించను. టమోటా పళ్ళు సకాలానికి చేరుతాయనే విశ్వాసంతో అతను వాటిని లారీకి ఎక్కించాడు కాబట్టి సంక్షేమ శాఖ డెరైక్టర్ అతని బిల్‌ని పర్చేస్ ఆర్డర్ ప్రకారం చెల్లించి తీరాలి. జరిగిన ఆలస్యానికి డిఫెండెంట్ కోరిన ఖర్చులు, పన్నెండు శాతం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పడమైనది. నె క్ట్స్ కేస్.’’ ‘‘మీవి కొత్త మొహాల్లా ఉన్నాయి. యువర్ ఆనర్ గారు శబ్దాన్ని భరించలేరు. పెద్దగా దగ్గడం, తుమ్మడం చేయకండి’’ గుమ్మం దగ్గర కోర్టు బంట్రోతు సిఐ లోపలికి తీసుకెళ్ళే ఇద్దరు ముద్దాయిలని హెచ్చరించాడు. ‘‘అవును. ఓసారి పెద్దగా ఆవలించిన వాడిని కోర్టు ముగిసేదాకా కోర్టు హాల్లో ఒంటి కాలి మీద నించోవాలనే శిక్షని విధించాడు’’ సిఐ కూడా ముద్దాయిలకి చెప్పాడు. ‘‘ఎందుకని?’’ ఓ ముద్దాయి లింబాద్రి అడిగాడు. ‘‘మిసెస్ యువర్ ఆనర్ గయ్యాళి గంపమ్మ. ఇంట్లో ఆవిడ నిద్రపోయే దాకా ఆయన చెవులకి పని ఇస్తూనే ఉంటుంది. దాంతో ఆయన ఇటీవల ఓ సెల్ ఫోన్‌ని కొనిచ్చాక ఈయనతో ఆవిడ గారి మాటలు కొద్దిగా తగ్గాయట. కాని కోర్టులో శబ్దాన్ని భరించలేరు’’ బంట్రోతు చెప్పాడు. ‘‘భార్య గుర్తొస్తుందని కాబోలు’’ రెండో ముద్దాయి కపీష్ సానుభూతిగా చెప్పాడు. యూనిఫాంలో ఉన్న సిఐ యమధర్మరాజుకి నమస్కరించి చెప్పాడు. ‘‘సర్! ఇద్దరు ముద్దాయిలని కస్టడీకి ఇవ్వమని కోరడానికి తెచ్చాను.’’ ‘‘ఎవరు వారు? ఏమిటా కేసులు?’’ చేతి గడియారం వంక చూసుకుని యమధర్మరాజు విసుగ్గా అడిగాడు. ‘‘మొదటి ముద్దాయి పాత కేడీ లింబాద్రి. సినిమా హాల్లో ఓ మహిళ పదకొండు గ్రాముల బంగారు గొలుసు కొట్టేని దాన్ని గుటుక్కున మింగాడు. ఎక్స్‌రేలో అది కనిపించలేదు. ఎండోస్కోపీలో కనిపించింది సార్.’’ సిఐ మెజిస్ట్రేట్‌కి హాస్పిటల్ రిపోర్ట్లని అందించి చెప్పాడు. ‘‘ఎందుకు మింగావు?’’ యమధర్మరాజు గద్దించాడు. ‘‘రెండు రోజుల నించి భోజనం లేక సార్’’ లింబాద్రి మెల్లిగా చెప్పాడు. ‘‘సరే. అరటిపళ్ళు తినిపించారా?’’ రిపోర్ట్లని చూసాక మెజిస్ట్రేట్ అడిగాడు. ‘‘లేదండి.’’ ‘‘ఐతే వాటిని వెంటనే తినిపించండి’’ యమధర్మరాజు చెప్పాడు. ‘‘ఎన్ని యువర్ ఆనర్?’’ ‘‘ఓ ఎనిమిది డజన్లు.’’ ‘‘అంటే తొంభై ఆరు’’ లింబాద్రి చెప్పాడు. ‘‘నీకు లెక్కలు సరిగ్గా రాకపోతే నోరు మూసుకో. తొంభై రెండు’’ యమధర్మరాజు మళ్ళీ గద్దించాడు. ‘‘యస్ యువర్ ఆనర్’’ సిఐ చెప్పాడు. ‘‘హైద్రాబాద్ ట్రాఫిక్ని నమ్మలేం. రిమాండ్‌కి చేరుకునేదాకా మాత్రం అరటిపండన్నది తినిపించకండి. పధ్నాలుగు రోజులు రిమాండ్.’’ అకస్మాత్తుగా కోర్టు హాల్లో ఎవరిదో సెల్ ఫోన్ మోగింది. ‘రింగరింగరింగరింగారే’ అంటూ రింగ్ టోన్. ‘‘చచ్చాడు’’ సిఐ లోగొంతుకతో ఇద్దరు ముద్దాయిలకీ చెప్పాడు. ‘‘ఎవరిదా ఫోన్?’’ అది ఎక్కడ్నించి వస్తోందో అర్థం కాక తీవ్రంగా చూస్తూ యమధర్మరాజు అడిగాడు. ఎవరూ బదులు పలకలేదు. ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. 3monkies.sakshi@gmail.com