త్రీ మంకీస్ - 24
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 24
మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘అవును. మీకెలా తెలుసు?’’
‘‘కొన్ని వద్దన్నా తెలిసిపోతూంటాయి. రెండు కేపిటల్స్, రెండు అంకెలు గల ఓ ఎనిమిది నించి పది అక్షరాల పదాన్ని రాయండి’’ సూచించింది.
ఐ లవ్ యు లో ఐ బదులు ఒకటి, ఎల్ బదులు నాలుగు వేశాడు. వైయులని కేప్స్‌లో రాసి చూపించి అడిగాడు.
‘‘ఇది ఓకేనా?’’
‘‘ఓకే. దీన్ని ఇప్పుడు టైప్ చేసి సబ్మిట్ చేయండి.’’
చివరలో ఆమె పేరు సీతాని కలిపి టైప్ చేసి సబ్మిట్ చేశాడు.
పాస్‌వర్డ్ ఏక్సెప్టెడ్. వెల్‌కం. నౌ యు ఆర్ ది ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఎకౌంట్ ఇన్ ఫేస్‌బుక్ అని వచ్చింది.
‘‘ఇంత సింపులా?’’ ఆశ్చర్యపోయాడు.
‘‘వెల్‌కం టు ఎఫ్‌బి ఫేమిలీ’’ సీత చిరునవ్వుతో చెప్పింది.
‘‘ఓ! మీరు కూడా ఎఫ్‌బిలో ఎకౌంట్ తెరిచారా?’’ అడిగాడు.
‘‘అవును. స్టేటస్ మార్చుకోడానికి వచ్చాను.’’
‘‘స్టేటస్ మార్చడమేమిటి? ఎఫ్‌బిలో ఒక్క మాట మీదే ఉండకూడదా?’’
‘‘ఉండకూడదు.’’
ఆమె ఓపికగా లైక్స్, కామెంట్స్, ఛాట్స్ గురించి, స్టేటస్ మార్చుకోవడం గురించి, ఫ్రెండ్ రిక్వెస్ట్ గురించి బోధించింది. అతన్నించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపించుకుని ఏక్సెప్ట్ చేని చెప్పింది.
‘‘నేనేం పెట్టినా మీ ఎఫ్‌బి అకౌంట్‌లో కనిపిస్తుంది. మీరు అన్నిటికీ లైక్‌లు కొడుతూండాలి. ఎన్ని లెక్స్ వస్తే అంత గొప్ప’’ చెప్పింది.
‘‘లైకేనా? లవ్ కొడతాను’’ వానర్ చెప్పాడు.
‘‘ఇంకా ఆ సౌకర్యం జుకర్‌బెర్గ్ గారు ఇవ్వలేదు. కాబట్టి ప్రస్థుతానికి లైక్ కొట్టండి చాలు.’’
‘‘జుకర్‌బెర్గ్ గారెవరు?’’
‘‘ఎఫ్‌బి బ్రహ్మ లెండి. ఆయన గురించి ఆనక చెప్తా కాని మీరు లేస్తారా?’’
ఆ తర్వాత నిత్యం వానర్ ఎఫ్‌బిలోకి వెళ్ళి ఆమె పోస్ట్ చేేన ఫొటోలకి లైక్ కొట్టసాగాడు. టివి సీరియల్ చూస్తూ ఆమె అమ్మమ్మ మాడకొట్టిన ముద్ద పప్పు ఫొటోకి లైక్ కొట్టాడు. ఆమె వండిన మొదటి ఆనపకాయ ఆమ్లెట్ (కర్టసీ సాక్షి టివి చానల్)కి లైక్ కొట్టాడు. ఆవిడ నానమ్మకి కాలు విరిగిన ఫొటోకి, ఆవిడ తల్లికి బిపి వచ్చిందన్న ఫొటోకి కూడా లైక్ పెట్టాడు. ఐతే సీతా హరిహరన్ అందుకు కోప్పడలేదు. ఆమె పెట్టిన జోక్స్‌కి కూడా లైక్ పెట్టాడు. వాటిలో ఇదొకటి.
నేషనల్ రోబట్- మన్మోహన్ సింగ్
నేషనల్ జోక్ - రజనీకాంత్
నేషనల్ సీక్రెట్ - సోనియా
నేషనల్ ఇష్యూ - సల్మాన్ ఖాన్ పెళ్ళి
నేషనల్ గెస్ట్స్ - కసబ్, అఫ్జల్ గురు
నేషనల్ పేలెస్ - తీహార్
నేషనల్ బేంక్ - స్విస్‌బేంక్
నేషనల్ డిస్‌గ్రేస్ - ఆంధ్ర ప్రదేశ్ విభజనా విధానం
నేషనల్ బర్డ్ - ట్విటర్
నేషనల్ బుక్- ఫేస్‌బుక్
యధేచ్చగా అతనితో కాఫీడేకి వెళ్ళి సీతా హరిహరన్ గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునేది. ఆమె సమక్షంలో వానర్‌కి కాలం తెలీకుండా గడిచిపోయేది. ఇలా లాస్ట్ టర్మ్ దాకా సాగింది. వానర్ ఆ క్రమంలో ఎఫ్‌బి వ్యసనపరుడైపోయాడు. అందులోకి వెళ్ళేందుకు తలుపు ఉందని తెలుసు కాని బయటకి వచ్చేందుకు తలుపు లేదని తెలీలేదు. అభిమన్యుడికి, ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ ఉన్న వారికి మధ్య పెద్దగా తేడా ఉండదు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి తేలిగ్గా వెళ్ళగలడు. తిరిగి బయటకి ఎలా రావాలో తెలీదు. ఫేస్‌బుక్ అకౌంట్ హోల్డర్స్‌కి కూడా అదే సమస్య. ఇక బయటకి రాలేరు. అందులో ఉండనూ లేరు.
కాలేజీ ఇంకో రోజులో మూసేస్తారనగా సీతా హరిహరన్ అతనితో ఓ విషయం సీరియస్‌గా చర్చించాలని, కాఫీడేలో కలవమని ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టింది. అది పెళ్ళి గురించని వానర్ తేలిగ్గా ఊహించాడు.
‘‘మై డియర్ వాన్ (ఆమె అతన్ని పిలిచే ముద్దు పేరు) ఇక మనం విడిపోతున్నాం. ఇదే నువ్వు తాగించే ఆఖరి కాఫీ’’ చెప్పింది.
పక్కలో బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వానర్ అడిగాడు.
‘‘అదేమిటి?’’
‘‘అవును వాన్. ఇంక మనం కలవబోం.’’
‘‘ఏం?’’
‘‘నన్ను నీకన్నా రెయిన్ బాగా ప్రేమిస్తున్నాడు.’’
‘‘రెయినా? వాడెవడు?’’
‘‘మా సీనియర్. పేరు వర్షిష్. నేను నిన్న రాత్రి కూర్చుని బేరీజు వేసుకున్నాను. అబ్బే! నీ ప్రేమ అతని ప్రేమ ముందు ఇట్టే తేలిపోయింది.’’
‘‘ఎలా తెలిసింది?’’ కాఫీని, కోపాన్ని మింగి అడిగాడు.
(వానర్, సీత హరిహరన్‌ల ప్రేమ ఎందుకు ఫ్లాప్ అయింది?)