త్రీ మంకీస్ - 17 | three monkeys daily serial | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 17

Published Wed, Nov 5 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

త్రీ మంకీస్ - 17

త్రీ మంకీస్ - 17

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ - 17
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘చూస్తూండండి. వానర్! వెళ్ళి అందరికీ మళ్ళీ గ్లాసులు నింపుకురా’’ కపీష్ నర్మగర్భంగా చెప్పాడు.
 ‘‘నాకు ఐస్ ఒద్దు’’ మటర్కట్ చెప్పాడు.
 అతను ట్రేలో ఆ మూడు గ్లాసులని తీసుకెళ్ళి కోక్‌ని నింపుకుని రాగానే మేక్‌డొనాల్డ్స్ మేనేజర్ వీళ్ళ టేబిల్ దగ్గరకి వచ్చాడు.
 ‘‘చచ్చాం! నేను నింపుకోవడం చూశాడు. పోలీసులకి ఫోన్ చేస్తాడేమో?’’ వానర్ భయంగా చెప్పాడు.
 ‘‘వాడి వైపు చూడకండి’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఎక్స్‌క్యూజ్ మీ’’ ఆయన పలకరించాడు.
 అంతా మేకపోతు గాంభీర్యంతో అతని వంక చూశారు.
 ‘‘ఎలా ఉంది కోక్?’’
 ‘‘కోక్ ఎప్పటి కోక్‌లానే తియ్యగా ఉంది’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఐస్?’’
 ‘‘ఐస్ ఐస్‌లా చల్లగా ఉంది’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘మీరు ఐస్ తక్కువ వేసుకున్నట్లున్నారు?’’
 ‘‘లేదు. కరిగింది. ఐనా తాగాల్సింది చల్లటి కోక్‌ని కాని, చల్లటి నీళ్ళని కాదు కదా?’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘మీకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కాని, ఫిర్యాదు కానీ లేదు కదా?’’ మేనేజర్ మర్యాదగా అడిగాడు.
 ‘‘లేదు.’’
 ‘‘థాంక్స్. ప్లీజ్ కీప్ కమింగ్.’’
 అతను వెనక్కి తిరిగి వెళ్ళాక ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు.
 ‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సి రావచ్చని భయపడి చచ్చాను’’ వానర్ చెప్పాడు.
 కపీష్ జేబులోంచి చేతి రుమాలు తీసిముక్కుకి అడ్డం పెట్టుకుని కిందకి చూశాడు. వానర్ చుట్టూ నేల మీద చిన్న మడుగు. పేంట్ తడిసి ఉంది.
 ‘‘ఏమిటీ పని?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
 ‘‘భయపడితే నాకిలా అవుతుందని ఇప్పుడే తెలిసింది గురూ.’’
 ‘‘పనైందిగా. ఇంక లేవండి’’ కపీష్ లేస్తూ చెప్పాడు.
   
 ఆరోజు హైద్రాబాద్‌లో పటాన్‌చెరువులోని ఆ ఇంజనీరింగ్ కాలేజిలోని వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంది. సీనియర్ విద్యార్ధులకి జూనియర్లు సెండాఫ్ చెప్పే వేడుక కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతోంది. ముఖ్యఅతిథి రావడానికి ఇంకా టైం ఉండటంతో ఫ్యాన్సీ డ్రన్ వేడుక తర్వాత సెకండియర్ విద్యార్ధి సిద్ధాంత్ జోక్స్ చెప్తాడనే ప్రకటన వినపడగానే చాలామంది ఆనందంగా చప్పట్లు కొట్టారు. కొందరు విజిల్స్ కూడా వేశారు. అంతా చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని ఉత్సాహంగా తీసేశారు. అతను వచ్చి మైక్‌లో చెప్పాడు.
 
‘‘హలో జూనియర్స్, సీనియర్స్, ఫెలో స్టూడెంట్స్, లేడీస్ అండ్ లేడీస్ అండ్ ఎవ్విరిబడీ! దిసీజ్ యువర్ సిద్ధూ టెలింగ్ యు ది జోక్స్... ఆరతి! నీకొక్కదానికే కాదు డార్లింగ్... అందరికీ చెప్తున్నాను... మరేం లేదు. మన కాలేజీలో నన్ను సిద్ధూ అని పిలిచేది ఒక్క ఆరతే... చీకట్లో. ముందుగా కొన్ని పొలిటికల్ జోక్స్ చెప్తాను. దానికి ముందుగా ఇది మీరు తప్పనిసరిగా వినాలి. యూరప్‌లో స్పెయిన్ దేశం ఉంది. జిందగీ న మిలేగీ దుబారా చూశారుగా...’’
 కొన్ని ఈలలు వినపడ్డాయి.
 ‘‘ఆ స్పెయిన్‌లో బార్సిలోనా ఉంది. ఆ నగరంలో టీట్రెన్యూ అనే కామెడీ క్లబ్ ఉంది. అక్కడి ప్రభుత్వం నాటకాల మీద వినోదపు పన్నుని ఎనిమిది నించి ఇరవై ఒక్క శాతానికి పెంచడంతో... బహుశ మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీనే సలహా ఇచ్చి ఉంటారు... ఏమిటీ? చిదంబరమా?... వీటిలో ఆయన ఎక్కువ సమర్థుడు కాబట్టి చిదంబరం సలహా మీద ఏడాదిలో టిక్కెట్ల అమ్మకాలు ముప్ఫై శాతం తగ్గాయి. దాంతో టీట్రెన్యూ కామెడీ క్లబ్ ‘పే-పర్-లాఫ్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని కనుక్కొంది. నాటకశాలలో ప్రతీ సీన్ ముందు ప్రేక్షకుడి మొహంలోని చిరునవ్వుని గుర్తించే ఓ ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంని అమర్చారు.

అది మనిషి నవ్వినప్పుడల్లా లెక్క కడుతుంది. ప్రవేశం ఉచితం. వారి ప్రదర్శన ప్రేక్షకుడిలో నవ్వులని సృష్టించకపోతే ఏం చెల్లించకుండా బయటకి వెళ్ళచ్చు. ఎన్నిసార్లు నవ్వితే అన్ని ముప్ఫై యూరో సెంట్లు చెల్లించాలన్న నిబంధనతో తమ నాటకాలని ప్రదర్శించసాగారు. అలా  సగటున ప్రతీ ప్రేక్షకుడు ఓ నాటకానికి ఆరు యూరోలని చెల్లిస్తున్నాడు. మీడియా కవరేజ్ వల్ల ముప్ఫై ఐదు శాతం ప్రేక్షకులు పెరిగారు. ఒకో నాటకానికి ఇరవై ఎనిమిది వేల యూరోలు వసూలవుతున్నాయట! అదృష్టవశాత్తు మీరు బార్సిలోనాలో లేరు. నేను చెప్పే జోక్‌లకి మొహమాటపడకుండా నవ్వండి. మీ నవ్వులని కొలిచే ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ఈ ఆడిటోరియంలో అమర్చలేదు. నవ్వినందుకు మీ ఆస్తిని ఎవరికీ రాసివ్వక్కర్లేదు. కాబట్టి మజా చేయండి. గట్టిగా పోటీపడి నవ్వండి.’’
 ఆ ఓపెనింగ్ తమకి నచ్చినట్లుగా కొందరు ఈలలు వేశారు.
 ‘‘సరే. పొలిటికల్ జోక్స్‌తో మొదలెడతాను. పొలిటికల్ జోక్ అనగానే మనకి గుర్తొచ్చేది ఖచ్చితంగా మన మాజీ ప్రధానమంత్రి. మన మాజీ ప్రధానమంత్రుల్లో అధికంగా జోక్స్‌కి అర్హుడు ఎవరో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 (పొలిటికల్ జోక్స్ అనగానే గుర్తొచ్చే ప్రధానమంత్రి ఎవరో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!)
 
మళ్లీ  రేపు

ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
లెటర్స్
మల్లాది గారి ‘3 మంకీస్’ సీరియల్ ఆకర్షణీయమైన పేర్లతో, అబ్బురపరిచే సన్నివేశాల మేళవింపుతో కామెడీ-థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ‘పాఠకుల అభిరుచి మారింది. ప్రముఖ రచయితలు అందరూ అస్త్రసన్యాసం చేశారు’ అని రచనల పరంపరను కొనసాగించలేక, అభియోగాన్ని పాఠకుల మీదకు నెట్టి పక్కకు తప్పుకున్నది రచయితలు మాత్రమే. ఆసక్తికర రచనలు చేస్తే పాఠకులు ఎప్పుడూ చదువుతారని ఈ సీరియల్ నిరూపిస్తోంది. ఇలాంటి రచనలను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యానికి పాఠకులందరి తరఫున కృతజ్ఞతలు. మున్ముందు కూడా సాక్షిలో సీరియల్ సీక్వెన్స్ కొనసాగుతుందని, కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ...
 - యంజర్లపాటి కమలాకర్‌రెడ్డి, ఖమ్మం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement