crime comedy thriller
-
త్రీమంకీస్ - 37
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 37 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నా ఖైదీ నంబర్ మార్చుకోవచ్చాండి?’’ వానర్ అడిగాడు. ‘‘ఎందుకో?’’ ‘‘ఫేన్సీ నంబర్ ఉంటే బావుంటుందని. 5555 ఇస్తారా? అదెంత?’’ ‘‘త్రీ మంకీస్! ఇంకోసారి పారిపోయే ప్రయత్నం చేస్తే అదో కొత్త నేరమై మీ శిక్ష పెరుగుతుంది. నీకు కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్‌లో ఎయిటీ సెవెన్ వచ్చినందుకు, నీకు ప్రొడక్షన్ సిస్టమ్స్‌లో ఎయిటీ సిక్స్ వచ్చినందుకు, నీకు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో ఎయిటీ ఫైవ్ వచ్చినందుకు మొదటిసారి తప్పు కాబట్టి ఉపేక్షిస్తున్నాను. వెళ్ళి స్నానం చేయండి. పొండి.’’ ‘‘నేను జర్మనీలో పుట్టినా బావుండేది. ఇంటర్నెట్లో చదివాను. అక్కడ జైళ్ళ నించి పారిపోవడం నేరం కాదు. ఎందుకంటే ప్రతీ మనిషి స్వాభావికంగా స్వేచ్ఛని కోరుకుంటాడని వారికి తెలుసు’’ వానర్ చెప్పాడు. ‘‘నేను స్వీడన్లో పుట్టినా బావుండేది. ఇంటర్నెట్లో చదివాను. అక్కడ ఖైదీలు లేక జైళ్ళని మూసేస్తున్నారు’’ జైలర్ కసురుతూ చెప్పాడు. ‘‘పిల్లలన్నాక తప్పు చేస్తారు. దానికే ఉరి తీయాలా?’ అని రేపిస్ట్‌లని సమర్థిస్తూ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు కదా. నేను అంత పెద్ద తప్పు కాదు కదండీ చేసింది? జస్ట్ చిన్న దొంగతనమేగా. నన్ను వదిలేసేయండి’’ వానర్ చెప్పాడు. ‘‘ఆయన విడిచి పెట్టమంది బలాత్కారం చేసే చిన్న నేరస్థులని తప్ప పెద్ద నేరమైన దొంగతనాన్ని చేసే దొంగల్ని కాదు.’’ ఆయన తిడుతూంటే వానర్ చుట్టూ మడుగు కట్టింది. అదే సమయంలో అతనికి కిటికీలోంచి ఓ దృశ్యం కనిపించింది. ఓ ఖైదీ పేంట్ అడుగుభాగంలోంచి నేల మీదకి మట్టి జార విడుస్తున్నాడు. ‘‘అసలు నువ్వు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతావు? వెళ్ళి స్నానం చేయండి’’ ఆ మడుగుని, వారి వంటి మీది మురికిని చూసి జైలర్ అరిచాడు. ‘‘ఇప్పుడు నాకు జూలోని జంతువులు అన్నిటికీ బెయిల్ ఇప్పించాలని అనిపిస్తోంది’’ బయటకి వచ్చాక వానర్ చెప్పాడు. ముగ్గురూ బాత్రూంలో స్నానాలు చేస్తూ మాట్లాడుకోసాగారు. ‘‘దైవం నా వైపు లేడు’’ వానర్ చెప్పాడు. ‘‘మా ఇలవేల్పు కూడా నా వైపు లేడు’’ మర్కట్ చెప్పాడు. ‘‘మనం మన పక్షం ఉన్నంతసేపు ఎవరూ మన పక్షం ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ సినిమాల్లో రాని కొత్త మార్గం మనం కనుక్కుందాం’’ కపీష్ ధైర్యం చెప్పాడు. ‘‘యస్’’ మిగిలిన ఇద్దరూ స్థిర నిశ్చయంతో చెప్పారు. ‘‘ఇందాక జైలర్ గదిలోంచి ఓ విచిత్రాన్ని చూశాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ కపీష్ అడిగాడు. ‘‘ఒకడు మట్టి మూత్రానికి వెళ్ళడం చూశాను.’’ ‘‘మట్టి మూత్రమా? పిచ్చా? అదేంటి?’’ ‘‘బాస్‌గారి అనుచరుడు పేంట్ రెండు కంతల్లోంచి నేల మీదకి మట్టి జార్చడం స్పష్టంగా చూశాను.’’ ‘‘మట్టి?’’ మర్కట్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘ఐతే అది అతని శరీరంలోంచి వచ్చి ఉండదు. వాడి జేబులోంచి బయటకి పోశాడు’’ కపీష్ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘చిత్రంగా ఉంది. పేంట్ జేబుల్లోకి అసలు అంత మట్టి ఎలా వచ్చినట్లు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నేను చెప్పానే, ది గ్రేట్ ఎస్కేప్ సినిమా. అది ఇదే కథ. ఇక్కడ వాళ్ళు బయటకి సొరంగం తవ్వుతున్నట్లున్నారు. తవ్వగా వచ్చిన మట్టిని ఆ సినిమాలోలా బయట పోస్తున్నారు.’’ ‘‘కాని వాళ్ళకి గునపాలు, పారలు ఎక్కడివి?’’ వానర్ సందిగ్ధంగా అడిగాడు. ‘‘చెంచాలని, గరిటలని కాజేసి అరగదీసి వాటితో తవ్వుతారా సినిమాలో.’’ ‘‘మనం వీరి సొరంగం రహస్యాన్ని కనుక్కోవాలి’’ మర్కట్ ఉత్సాహంగా చెప్పాడు. తనని తిరిగి సెల్‌కి తీసుకెళ్ళే గార్డ్ని మర్కట్ వేమన గురించి అడిగాడు. ‘‘ఆయన ఎవరో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. పేరు తెలీదు. ప్రజలే వేమన అనే పేరు పెట్టారు.’’ ‘‘దేనికి? దిగంబరంగా తిరిగేవాడా?’’ ‘‘కాదు. అబిడ్స్, కోటీ మధ్య తిరుగుతూ దారిన పోయే అందర్నీ వేదాంత ప్రశ్నలు వేసేవాడు. ‘దేవుడికి, మనిషికి మధ్య గల తేడా ఏమిటి?, దేవుడున్నాడా? ఇలాంటివి. ఓ రోజు ఆయన వెళ్ళే ఓ కారుని ఆపి కారులోని ఆవిడ్ని ‘జీవితాంతం దేవుడు లేడని నమ్మి చివరకి ఆయన ఉన్నాడని తెలుసుకోవడం మంచిదా? లేక జీవితాంతం ఆయన ఉన్నాడని నమ్మి చివరికి లేడని తెలుసుకోవడం మంచిదా? ఏది ఉత్తమ మార్గం?’ అని ప్రశ్నించాడు. ఆవిడ డీజీపి భార్య! ఫలితంగా పబ్లిక్ న్యూసెన్స్ కేస్ కింద పధ్నాలుగు రోజుల రిమాండ్‌తో ఇక్కడికి వారం క్రితమే వచ్చాడు.’’ ‘‘అదేమిటి? కన్యాకుమారిలో దొంగ నోట్లని మార్చే నేరంలో పట్టుబడ్డానని చెప్పాడే నాకు?’’ ‘‘ఇంకోసారి ఆయన్ని ఏ నేరం మీద వచ్చాడని అడిగి చూడండి’’ గార్డ్ నవ్వాడు. సెల్‌కి వెళ్ళాక మర్కట్ ఆయన్ని అదే ప్రశ్న వేశాడు. ‘‘అదా? నేను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను. మొదటి పెళ్ళాం పోలీసులకి ఫిర్యాదు చేస్తే పట్టుకొచ్చారు’’ వేమన చెప్పాడు. (పారిపోవడానికి అతికష్టమైన జైలు ఏది?) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ మల్లాది గారి త్రీమంకీస్ సీరియల్ చాలా బాగుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నేను మొదటిగా చదువుతున్నాను. ఈ సీరియల్ మొదటినుంచీ మిస్సవకుండా చదువుతున్నాను. మల్లాది గారు రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. సాక్షి నుంచి ఇలాంటి మరెన్నో సీరియల్స్ ఆశిస్తున్నాను. - భరత్‌రెడ్డి పత్తి (bharathreddy.patti@gmail.com) 3 మంకీస్ చదువుతున్నంతసేపు పాత్రలకి, జోక్స్‌కి నవ్వుకుంటున్నాం. ఇస్తున్న సాక్షికి థ్యాంక్స్. - బి. ప్రేమాలాల్, నిజామాబాద్ -
త్రీమంకీస్ - 36
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 36 - మల్లాది వెంకటకృష్ణమూర్తి. ‘‘మీరు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. వెంటనే బయటకి వచ్చారా సరి. లేదా బట్టల మూటలోకి తుపాకీ బాయ్‌నెట్‌తో పొడుస్తాను- రక్తం కనిపించే దాకా!’’ ఆ మాటలకి వానర్ దాక్కున్న బట్టల మూటలోంచి ఓ ద్రవం కారడం గార్డ్ గమనించాడు. ‘‘మిత్రమా! పొడవక. వస్తున్నాను.’’ రెండు చేతులు మూటలోంచి మళ్ళీ బయటకి వచ్చి ముళ్ళని విప్పాయి. అతను బయటకి వచ్చాక గార్డ్ అతని నెత్తి మీది అండర్‌వేర్‌ని తీసి చెప్పాడు. ‘‘రెండో మిత్రమా! నీకూ ప్రత్యేకంగా చెప్పాలా? చెత్త సంచీలోకి పొడవనా?’’ తను దాక్కున్న చోటు అతనికి ఎలా తెలిసిందా అనుకుంటూ మర్కట్ కూడా సంచీని తెరచి లోపల నించి బయటకి వచ్చాడు. అతని ముక్కుకి అంటుకున్న ఉల్లిపాయ తొక్కలని, నెత్తి మీది వంకాయ ముచికలని వానర్ తొలగించాడు. ‘‘నువ్వు గ్రేట్ మిత్రమా. ఇట్టే కనుక్కున్నావు’’ మర్కట్ గార్డ్‌తో చెప్పాడు. ‘‘నాకు ఓపిక లేదు. మూడోవాడు కూడా త్వరగా బయటకి రావాలి’’ ఆ గార్డ్ అరిచాడు. వేన్ కింద అడ్డంగా ఉన్న ఓ రాడ్‌కి కాళ్ళని పెనవేసి మరో రాడ్‌ని పట్టుకుని ఊపిరి బిగబట్టి వేలాడుతున్న కపీష్ కదల్లేదు. అతనికి కింద నించి తుపాకీ బాయ్నెట్ వెతుకుతూ లోపలకి పొడుచుకురావడం కనిపించడంతో ఠక్కున కాళ్ళని నేల మీదకి పెట్టి, కింద పడుకుని ఇవతలికి దొర్లాడు. గార్డ్ వేన్ తలుపు మూసిగేట్ తెరిచి ‘రైట్ రైట్’ అంటూ తుపాకీ బాయ్‌నెట్‌తో వేన్ వెనక కొట్టాడు. వేన్ ముందుకి సాగిపోయింది. గేట్ మూస్తున్న గార్డ్ వంక చూసి వానర్ అడిగాడు. ‘‘మేం పారిపోతున్నామని నీకు ఎవరు చెప్పారు?’’ ‘‘నాతో కిచెన్‌లో పని చేేన వాడు చెప్పాడా?’’ మర్కట్ అడిగాడు. ‘‘ఊహూ. జైల్లోకి కొత్త ఖైదీలు వచ్చిన రెండో రోజే పారిపోవాలనుకుంటారు. సాధారణంగా వారికి లాండ్రీ, వంట గది డ్యూటీలనే వేస్తారు. వారు మీ పద్ధతిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తారు. నా పధ్నాలుగేళ్ళ సర్వీస్‌లో ఎన్నోసార్లు చూశాను. నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమందిని ఇదే పద్ధతిలో పారిపోతూండగా పట్టుకున్నాను. ప్రత్యేకంగా వెదకనక్కర్లేకుండా ఇలా పిలిేన్త చాలు. వాళ్ళు బయటకి వస్తారు.’’ ‘‘ఓ! నువ్వు చాలా గ్రేట్.’’ ‘‘జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ వేన్ కింద వేలాడుతూ పారిపోయే సన్నివేశం వచ్చాక ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు’’ గార్డ్ చెప్పాడు. ‘‘ఆ సినిమా పేరు ఏమిటి? గుర్తు రావడం లేదు’’ కపీష్ అడిగాడు. ‘‘వెళ్ళండి. జైలర్ తన గదిలో మీకోసం ఎదురు చూస్తున్నాడు’’ గార్డ్ చెప్పాడు. వారిలో ఒకరి నించి మాసిన బట్టల కంపు, ఇంకొకరి నించి కుళ్ళిన కూరగాయల కంపు కొడుతూండటంతో కపీష్ వారి వంక క్షమించమన్నట్లుగా చూశాడు. ‘‘ఈ జైల్లో అభివృద్ధి ఏ సెల్లో ఉంటుంది సార్?’’ వానర్ అడిగాడు. ‘‘అదేం ప్రశ్న?’’ జైలర్ అడిగాడు. ‘‘ప్రస్తుత పాలకులు అభివృద్ధిని అరెస్ట్ చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణని పేపర్లలో చాలాసార్లు చదివాను.’’ ‘‘మిమ్మల్ని పిలిపించింది మీ ప్రశ్నలకి నేను జవాబు చెప్పడానికి కాదు. నా ప్రశ్నలకి మీరు జవాబు చెప్పడానికి. ఎందుకీ ప్రయత్నం చేశారు?’’ జైలర్ వాళ్ళని గద్దిస్తూ అడిగాడు. ‘‘జైలు నించి విడుదలై వచ్చానని బయటకి వెళ్ళాక చెప్పుకోవడం బావుండదనుకుని’’ వానర్ చెప్పాడు. ‘‘నిజానికి జైలుకి వెళ్ళొచ్చానని బయటకి వెళ్ళాక మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అందువల్ల మీకో ప్రయోజనం కూడా ఉంది.’’ ‘‘ఏం ప్రయోజనం?’’ ‘‘జైలుకి వెళ్ళొచ్చా అని చెప్పేవాడు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. నిజానికి మీ క్లోజ్డ్ హార్టే మీ ఘోరమైన జైలు.’’ ‘‘కాని అక్కడ జైలర్ ఉండడు కదండి.’’ ‘‘ఈ జైల్లోని బెస్ట్ ఖైదీ అనే పేరు తెచ్చుకుంటానన్నావు. ఏం వానర్! ఇదేనా అలా పేరు తెచ్చుకోవడం?’’ జైలర్ ప్రశ్నించాడు. ‘‘జైలుకి వచ్చిన విఐపిలంతా తక్షణం హాస్పిటల్లో దేనికి చేరుతారు సర్? జైలు పనికి రాకేగా? బెయిల్‌కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తూంటారు కదా? మేమూ వాళ్ళల్లా స్పందించే మనుషులమేగా?’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఐనా ఇది నా ఐడియా కాదు సార్. నా బుద్ధిని చెడగొట్టింది వీడే’’ వానర్ చెప్పాడు. ‘‘ఎవరు?’’ కొద్దిసేపు మర్కట్ వైపు, కొద్దిసేపు కపీష్ వైపు తన వేలిని చూపించాడు. జైలర్ ఆ ముగ్గుర్నీ ఛడామడా తిట్టి గద్దిస్తూ అడిగాడు. ‘‘అసలు ఈ పథకం ఎవరిది?’’ ‘‘నాది’’ కపీష్ చెప్పాడు. ‘‘విమానంలో పర్స్ కొట్టేసి పారిపోవడానికి పరిగెత్తే వాడిలా కనిపించే వానర్ లాంటి మూర్ఖుడ్ని అసలు ఎలా ఫ్రెండ్ చేసుకున్నావు?’’ ‘‘మూర్ఖుడైన మేథావి కన్నా, తెలివిగల మూర్ఖుడు బెటర్ అని!’’ (మట్టి మూత్రం? ఇదెక్కడి విచిత్రం? ... రేపు) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * నవలలు చదవడం అంతరించిపోతున్న ఈరోజుల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి చేత కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ని మా అభిమాన దినపత్రిక సాక్షి అందించడం సంతోషంగా ఉంది. - మధుసూదన్ (msrk250@gmail.com) * సాక్షి ఫ్యామిలీ పేజీకి నేను బానిసని. మొదటి సంచిక నుంచే క్రైమ్ కామెడీ సస్పెన్స్ సీరియల్ 3 మంకీస్ నన్ను తనవైపు లాగేసుకున్నది. - ఎ. రాజశేఖర్ (rajaannumalla@gmail.com) 3 మంకీస్ సీరియల్ ఫన్నీగా భలే బావుంది. - పి. దీప, సాలూరు -
త్రీమంకీస్ - 35
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 35 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అది మంచిది కాదు.’’ ‘‘ఏది మంచిది కాదు?’’ ‘‘వడ్డీ పెరగడం.’’ ‘‘అవును. అది మంచిది కాదు.’’ ‘‘అలాంటప్పుడు జైలర్‌కి చెప్పి నాకు డబ్బు ఇప్పించచ్చుగా?’’ ‘‘ఏం ఇప్పించచ్చుగా?’’ ‘‘డబ్బు. జైలర్‌కి చెప్పు.’’ ‘‘ఎవరికి చెప్పి?’’ ‘‘ఆ అమ్మాయికి చెప్పి’’ సేఠ్ కోపంగా గదిమాడు. ‘‘ఏం చెప్పి?’’ ‘‘నీకు తద్దినం పెట్టాలని’’ సేఠ్ కోపం పెరిగిపోయింది. ‘‘అలాగే పెడదాం’’ కపీష్ చెప్పాడు. ‘‘అటు కాదు. నేనున్నది ఇటు’’ సేఠ్ గద్దించాడు. కపీష్ ఇహలోకంలోకి వచ్చి ఆయన్ని చూస్తూ చెప్పాడు. ‘‘ఏమన్నారు?’’ ‘‘జైలర్ దగ్గర ఉన్న డబ్బులోంచి నాకు నా వడ్డీ డబ్బుని ఇప్పించమన్నాను. ఈసారైనా వినపడిందా?’’ ‘‘ది. కాని నాకా నియమాలు తెలీవు. కనుక్కుంటాను.’’ ‘‘కనుక్కో. మళ్ళీ రేపు వస్తాను. ఇక్కడ లంచాలకే నా డబ్బంతా అయిపోయేట్లుంది’’ ఆయన సెల్‌ఫోన్ మోగింది. ‘‘నాకా సెల్‌ఫోన్ ఇవ్వరాదూ? రేపు ఫోన్ చేస్తే జైలర్ ఏమన్నాడో చెప్తాను. మీకు లంచాలు, ఇంత దూరం రావడాలు తప్పుతాయి’’ కపీష్ కోరాడు. ‘‘చాల్లే.’’ కోపంగా చెప్పి తులసీరాం వెళ్ళిపోయాడు. ‘‘ఇక లే’’ గార్డ్ చెప్పాడు. కపీష్ ఆమెని చూసి చిన్నగా నవ్వుతూ చేతిని ఊపాడు. ఆమె కూడా బదులుగా చేతిని ఊపింది. ఆమె వైపు గాల్లోకి ముద్దుని విసిరాడు. ఆమె దాన్ని అందుకున్నట్లు నటించి, హేండ్ బేగ్ తెరిచి అందులో ఉంచినట్లు అభినయించింది. ‘‘ఇదేమైనా కాలేజీ అనుకున్నావా? లెమ్మన్నానా?’’ గార్డ్ అరిచాడు. ‘‘ఓ! లెమ్మన్నావా? ఈయనేరి? వెళ్ళిపోయారా?’’ కపీష్ లేచాడు. సాయంత్రం ఏడుకి వానర్ లాండ్రీ సెక్షన్‌కి వెళ్ళాడు. ఉదయం నించి ఇస్త్రీ చేసిన దుస్తులన్నీ సహ ఖైదీ తోపుడు బండిలో తీసుకెళ్ళాక, ఖైదీలు విడిచిన బట్టలన్నీ మూటకట్టి అందులోకి దూరాడు. రెండు చేతులు బయటకి వచ్చి, మూటకి ముళ్ళని బిగించి లోపలకి వెళ్ళాయి. అదే సమయానికి వంట ముగించిన మర్కట్ కిచెన్‌ని ఫినాయిల్‌తో శుభ్రంగా కడిగాడు. తర్వాత చెత్తని వేేన ప్లాస్టిక్ చెత్త సంచీలోకి దిగి దాక్కున్నాడు. మిత్రులు ఇద్దరూ స్వేచ్ఛకోసం ఉత్కంఠగా వేచి చూడసాగారు. రాత్రి సరిగ్గా ఏడున్నరకి అధికారుల పర్యవేక్షణలో జైలు మెయిన్టనెన్స్ వేన్లోకి బట్టల మూటని ఎక్కించారు. ఓ ఎంఎల్ఏకి చెందిన వాషింగ్ కంపెనీ వాటిని ఉతికి పంపడానికి జైళ్ళ విభాగం నించి ఏన్యువల్ కాంట్రాక్ట్‌ని తీసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం వారు దీన్ని నిరసించారు కూడా. వంట చేయిస్తున్నట్లే ఖైదీల చేతే ఉతికించచ్చు కదా? ఎంఎల్ఏని బాగుచేయడానికే ఆ పనిని అతనికి పక్షపాతంతో ఇచ్చారని వారు ఆరోపించారు. బట్టల మూట వేన్లోకి ఎక్కే దాకా అందులోని వానర్ ఊపిరి బిగబట్టాడు. తన గుండె కొట్టుకునే చప్పుడు ఒక్క తనకే కాక బయటకి కూడా వినిపిస్తుందేమోనని భయపడ్డాడు. అతను భయపడ్డట్లుగా జరగకుండా అది వేన్లోకి ఎక్కింది. ఆ వేన్ కదిలి కిచెన్ ముందు ఆగింది. అందులోంచి చెత్త సంచీని ఎత్తుకొచ్చి ఖైదీలు దాన్ని వేన్లో పెట్టాక వేన్ ముందుకి కదిలింది. అది మెయిన్ గేట్ దగ్గరకి వచ్చి ఆగాక మర్కట్కి మిరప ఘాటుకి తుమ్ము వచ్చింది. కాని దాన్ని బలవంతంగా అణచుకోవడంతో గాలి నిశ్శబ్దంగా ముక్కులోంచి బయటకి పోయింది. గేట్ పక్కన కుర్చీలో తలవంచుకుని కూర్చుని, తన గోళ్ళని కత్తిరించుకునే ఓ గార్డ్ తల ఎత్తకుండానే చెప్పాడు. ‘‘బయటకి వచ్చేయండమ్మా.’’ ఆ మాటలు విన్న వానర్, మర్కట్లు అవి తమని ఉద్దేశించి మాట్లాడినవిగా అనుకోలేదు. ‘‘వేన్‌లోని మిత్రుల్లారా! దిగి రండి.’’ ఈసారి కూడా వాళ్ళు తాము ఆ వేన్లో దాక్కున్న సంగతి గార్డ్‌కి ఎలా తెలుస్తుంది, ఇంకెవర్నో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ‘‘మిమ్మల్నే. బయటకి రండి. లేదా నేనే లేచి రావాలా?’’ అతను కొద్దిసేపు ఎదురు చూసి వేన్లోంచి ఎవరూ దిగకపోవడంతో విసుగ్గా నెయిల్ కటర్‌ని జేబులో వేసుకుని, బాయ్నెట్ అమర్చిన తుపాకీని అందుకుని వేన్ దగ్గరకి వచ్చి దాని వెనక తలుపు తెరిచాడు. (ముగ్గురు మిత్రులు ఎలా దొరికారు?) -
త్రీమంకీస్ - 23
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 23 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘తీసుకురాను.’’ ‘‘నీకు నేను జీవితంలో ఏదైనా ఖర్చు చేస్తే అది ఇప్పుడే. ఇక్కడే. ఆలోచించుకో.’’ ‘‘యు ఆర్ ఏ చీట్’’ మర్కట్ ఉక్రోషంగా చెప్పాడు. ’’చూడు బాబ్జీ. నీది తర్టీఫైవ్ ఎంఎం మనసు. నాది సెవెంటీ ఎంఎం కన్నా వైడ్ స్క్రీన్ మనసు. దీన్ని బట్టే నాకు తెలిసిపోతోంది నీకు, నాకు జోడీ కుదరదని. వినలా?’’ ‘‘ఏమిటి?’’ ‘‘లవ్ త్రీ, సెలెక్ట్ టు అండ్ మేరీ ఒన్. నేను సెలెక్ట్ చేసుకున్న ఆ ఇద్దరిలో నువ్వు ఒకడివి. అబ్రకదబ్రా గాడితో థర్డ్ ఇయర్లో కటీఫ్ అయ్యాక నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నేను పెళ్ళి చేసుకునేది ఎన్నారైని. బై’’ ‘‘ఇంతకీ నువ్వా ఇడ్లీలు తిన్నావా?’’ వానర్ అడిగాడు. ‘‘అంతా బావుంది కాని, నువ్వా ఛీజ్ పీజాలు, చికెన్ బర్గర్ల గురించి చెప్పకుండా ఉండాల్సింది’’ కపీష్ తన ప్లేట్లోని పదార్ధాన్ని చూసుకుంటూ బాధగా చెప్పాడు. ‘‘రమ్యరాము చేసింది అన్యాయం’’ వానర్ కోపంగా చెప్పాడు. ‘‘నీ సంగతేమిటి? నువ్వూ ఎవర్నో ప్రేమించావు కదా?’’ మర్కట్ వానర్ని అడిగాడు. వానర్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘నేను ప్రేమించిన సీతా హరిహరన్ రమ్యరాము అంత ఇది కాదు. చిన్న పొరపాటు వల్ల మా మధ్య తేడా వచ్చేసింది.’’ ‘‘ఎవరి వైపు నించి పొరపాటు?’’ ‘‘ఆమె వైపు నించే.’’ ‘‘ఏమిటా పొరపాటు?’’ మర్కట్ అడిగాడు. ‘‘అసలు నీకు, ఆ పీతకి ఎలా పరిచయం అయింది?’’ కపీష్ నవ్వుతూ అడిగాడు. ‘‘నేను ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఆమెతో పరిచయం మొదలైంది.’’ ‘‘ఆమె నీకు ఫేస్బుక్ ద్వారా పరిచయమన్న మాట’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. ఎఫ్‌బిలో నేను అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆమె సహాయం చేయడానికి వచ్చినప్పుడు మాకు పరిచయం అయింది.’’ ‘‘అదేమిటి? ఫేస్బుక్ అకౌంట్‌ని ఎవరికి వారు ఓపెన్ చేసుకోవచ్చుగా? ఇంకొకరి సహాయం దేనికి?’’ కపీష్ ప్రశ్నించాడు. ‘‘నాకు అది అంత తేలిక కాలేదు.’’ వానర్ ఆనాటి అనుభవాన్ని చెప్తూంటే మిత్రులు ఇద్దరూ ఆసక్తిగా వినసాగారు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ దాకా వానర్‌కి ఆర్కుట్లో అకౌంట్ ఉండేది. కాని ఫేస్‌బుక్‌కి ప్రాచుర్యం లభిస్తూండటంతో, అందులో కూడా అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు. కాలేజీ లైబ్రరీకి వెళ్ళి ఉచిత కంప్యూటర్ని, ఉచిత ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఫేస్బుక్ ఓపెనింగ్ పేజీకి వెళ్ళాడు. పేరు, వయసు లాంటివన్నీ సక్రమంగా పూర్తి చేసాక ఆ పేజీ పాస్‌వర్డ్‌ని కోరింది. ఏం పాస్వర్డ్ పెట్టాలి అని ఆలోచనగా చుట్టూ చూస్తే లైబ్రేరియన్ కనపడింది. ఆమె మొహం ముడతలతో, ఉబ్బెత్తుగా కనిపించడంతో ‘కేబేజీ’ అని పాస్‌వర్డ్‌ని టైప్ చేశాడు. వెంటనే ఇలా వచ్చింది. సారీ! ది పాస్వర్డ్ మస్ట్బి మోర్ దేన్ ఎయిట్ కేరక్టర్స్. మరోసారి లైబ్రేరియన్ మొహాన్ని చూస్తూంటే, ఆవిడ అతని వంక చూసి నవ్వింది. వెంటనే ‘బాయిల్డ్ కేబేజి’ అని టైప్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఒన్ న్యూమరికల్ కేరక్టర్ అని మళ్ళీ ఎర్ర అక్షరాల్లో కనపడింది. ఆవిడ వంక చూస్తే ముక్కు ఒకటి అంకెలా కనిపించడంతో ‘1 బాయిల్డ్ కేబేజి’ అని టైప్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ కాన్ట్ హేవ్ బ్లేంక్ స్పేస్ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది. 50డేమ్న్డ్బాయిల్డ్కేబేజెస్’ అని టైప్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఎట్లీస్ట్ ఒన్ అప్పర్ కేస్ కేరక్టర్ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది. ‘50డేమ్న్డ్బాయిల్డ్కేబేజెస్’లో డిఏఎమ్ఎన్ఇడిలని అప్పర్ కేస్‌లో టైప్ చేసి మళ్ళీ సబ్మిట్ చేశాడు. ‘సారీ! ది పాస్వర్డ్ మస్ట్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ కేరక్టర్స్ కంటిన్యువస్లీ’ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది. వానర్‌కి కోపం వచ్చింది. ఇలా టైప్ చేసి సబ్మిట్ చేశాడు. 50డి-ఏ-ఎమ్-ఎన్-ఇ-డిబాయిల్డ్కేబేజెస్విల్’ సారీ! ది పాస్వర్డ్ కెనాట్ కంటైన్ పంక్చువేషన్స్ అని మళ్ళీ వచ్చింది. ‘నౌ!50డిఏఎమ్ఎన్ఇడిబాయిల్డ్కేబేజెస్యుఫూల్’ అని టైప్ చేసి, రీసబ్మిట్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని కనిపించగానే వానర్‌కి పిచ్చెక్కిపోయింది. లేచి నిలబడి కీ బోర్డుని ఎత్తి నెత్తి మీద కొట్టుకోసాగాడు. సరిగ్గా ఆ సమయంలో లోపలకి వచ్చిన సీతా హరిహరన్ అతని దగ్గరకి వచ్చి అడిగింది. ‘‘ఎక్స్‌క్యూజ్‌మి! మీ పనైతే నాకు ఓసారి కంప్యూటర్ని ఇస్తారా?’’ ‘‘కాలేదు.’’ ‘‘మరి?’’ ‘‘ఇదిగో. చివర్లో ఇది ఏడిపిస్తోంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటి? చివర్లో ఎవరు ఏడిపిస్తున్నారు?’’ ఆమె నవ్వుతూ అడిగింది. తన పాస్వర్డ్ భాగవతం వినిపించాడు. ‘‘మీరు కొంపతీసి ఇండస్ట్ట్రియల్ ప్రొడక్షన్ బ్రాంచా?’’ అడిగింది. (మన నేషనల్ బ్యాంకు ఏది? నేషనల్ పక్షి ఏది?) -
త్రీ మంకీస్
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 22 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మొదటి సారా జైలుకి రావడం?’’ ‘‘అవును.’’ ‘‘జైల్లో స్పూన్లు ఇవ్వరు. దాన్ని అరగదీసి కత్తిలా ఉపయోగించి తోటి ఖైదీలని చంపుతారని’’ వడ్డించేవాడు చెప్పాడు. ముగ్గురూ ఖాళీగా ఉన్న ఓ బల్ల ముందు కూర్చున్నారు. వాళ్ళు ప్లేట్లోది తాగబోతూంటే ఇందాక బాత్రూంలోని శాల్తీ గద్దించాడు. ‘‘లెండి. ఇది బాస్ బల్లని తెలీదా?’’ వాళ్ళు లేచి ఇంకో బల్ల ముందు కూర్చుని ఉడికీ ఉడకని ఇడ్లీని తాగసాగారు. ‘‘ఛ! ఆకల్లేకపోతే ఇలాంటి ఇడ్లీలని పెట్టినందుకు హంగర్ స్ట్రయిక్ చేసేవాడిని.’’ మర్కట్ చెప్పాడు. ‘‘తరచు జైల్లోంచి ఖైదీలు ఎందుకు పారిపోతూంటారో ఇప్పుడు నాకు అర్థమైంది. జైలుని అత్తవారింటితో పోల్చడం అనుభవం లేని వాళ్ళు చేసేది.’’ వానర్ కసిగా చెప్పాడు. ‘‘వాడి ప్లేట్లో చూడండి’’ కపీష్ గొంతు తగ్గించి చెప్పాడు. చూస్తే పక్క టేబిల్లో దుర్యోధన్ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అతని ప్లేట్లో యంఎల్‌ఏ పెసరట్, ఓ గారె, వెన్న రాసి నవనవలాడే రెండు ఇడ్లీలు కనిపించాయి. ‘‘అది హోటల్ నించి తెచ్చిందిలా ఉంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘అదిగో. కవర్ మీద మినర్వా కాఫీ షాప్ అని ఉంది. వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ ఉందని మనకి ఎవరూ చెప్పలేదే?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘అదేం కాదు. బలం రిజర్వేషన్ కేసు. జైల్లో ఏదైనా జరగచ్చు’’ కపీష్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘అన్నట్లు మన కాలేజీలో రమ్య రాముతో నీ ప్రేమ వ్యవహారం ఎంతదాకా వచ్చింది?’’ వానర్ మర్కట్‌ని అడిగాడు. ‘‘అవును. మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు కదా?’’ కపీష్ అడిగాడు. ‘‘అది ఫెయిలైంది’’ మర్కట్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘అరెరె! నువ్వు ఆ అమ్మాయిని పీజా హట్‌కి. కెఎఫ్సికి, కాఫీ డేకి బాగానే తీసుకెళ్ళే వాడివిగా?’’ ‘‘అవును. రమ్య రాము ఓ రోజు అసలు విషయం కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది’’ మర్కట్ బాధగా చెప్పాడు. ‘‘ఏమని?’’ వానర్ ఆసక్తిగా అడిగాడు. వాళ్ళిద్దరూ ఇనార్బిట్ మాల్లోని ఫుడ్ కోర్ట్‌లో చైనీస్ నూడుల్స్ తింటున్నారు. ‘‘నీకు ఇవాళ ఆకలి ఎక్కువగా ఉన్నట్లుంది?’’ మర్కట్ రమ్య రాముని అడిగాడు. ‘‘అవును. ఎందుకంటే ఇది నువ్వు నాకు చెల్లించే ఆఖరి బిల్లు కదా? ఓ ప్లేట్ ఇడ్లీ కూడా తీసుకురా.’’ ‘‘ఆఖరి బిల్లేమిటి?’’ ‘‘చెప్తే ఇడ్లీ తీసుకురావు. ముందు అది తే.’’ మర్కట్ లేచి వెళ్ళి ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాక అడిగాడు. ‘‘ఊ. ఇప్పుడు చెప్పు.’’ ‘‘ఇక మీదట మనం కలవం కదా.’’ ‘‘కలవమా? మనం ప్రేమికులం కదా. ఎందుకు కలవం?’’ ‘‘మనది కాలేజీ ప్రేమ మాత్రమే. నీకోటి తెలుసా? నూడుల్స్‌కి సాంబార్ మంచి కాంబినేషన్. కాలేజీ గోడలు దాటి బయటకి వచ్చాక మన ప్రేమ బంద్.’’ ‘‘ఎందుకని?’’ ‘‘ఇక లైఫ్‌లో సీరియస్‌గా ప్రేమించదలచుకున్నాను.’’ ‘‘ప్రేమలో ఈజీ, సీరియస్ ప్రేమలు ఉంటాయా?’’ ‘‘అవును.’’ ‘‘ఈజీ ప్రేమంటే?’’ ‘‘శిక్షణా తరగతి లాంటిది. ఎలా ప్రేమించాలి అన్నది నేర్చుకోడానికి ఉపయోగించేది. నేను లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకునేది పిడబ్ల్యుడిలో ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ, ఎండలో నిలబడి రోడ్లు వేయించి, తారు అంటిన దుస్తుల్లో ఇంటికి వచ్చే భర్త కాదు. స్వంత కారు డ్రైవ్ చేసుకుంటూ శాన్ఫ్రాన్సిస్కోలోనో, న్యూజెర్సీలోనో స్వంత వ్యాపారం చేసేవాడిని.’’ ‘‘నీ కడుపులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని నేను ఎన్నడూ అనుకోలేదు.’’ ‘‘ఇప్పుడు ప్రతి అమ్మాయి కడుపులో ఉన్నది ఇదే. గుండెలు బాదుకోకు. ఎవర్ని ప్రేమిస్తే, అష్టకష్టాలైనా పడి, వాడినే పెళ్ళి చేసుకోవాలనుకునే బ్లాక్ అండ్ వైట్, తర్టీ ఫైవ్ ఎంఎం రోజులు కావివి. వైడ్ స్క్రీన్, కలర్, స్ట్టీరియోఫోనిక్, డిజిటల్ రోజులు. ఒకవేళ నచ్చి ప్రేమించినా వాడ్ని కాక ఎవరు కన్వీనియంటో వాడినే చేసుకునే రోజులివి. నా లైఫ్మేట్ దొరికాడు.’’ ‘‘ముందే చెప్తే ఇడ్లీని కొనేవాడ్ని కాదు’’ మర్కట్ పళ్ళు పటపట కొరికాడు. ‘‘నాకది తెలుసు కనుకే ముందే కొనిపించాను. నీక్కావాలంటే ఇడ్లీ తిను. ఈ రోజుల్లో యూత్ ఎవరూ బర్గర్లు తప్ప ఇడ్లీలు తినరు. సాంబార్ కోసం కొనిపించానంతే.’’ ‘‘ఎవరతను?’’ ‘‘ఇప్పటికే ఫేస్బుక్లో పరిచయం అయి, చాట్‌లో అభిప్రాయాలు కలిసి స్కైప్‌లో పెళ్ళిచూపులు అయిపోయాయి.’’ ‘‘ఇదన్యాయం రమ్యరాము.’’ ‘‘నా ఫ్రెండ్స్‌ని ఎవర్నైనా ఇదే ప్రశ్న అడుగు. అన్యాయం కాదని చెప్పకపోతే చెప్పు తీసుక్కొట్టు. అక్కడ మసాలా టీ బావుంటుంది. ఇద్దరికీ పట్రా. ఇంద.’’ హేండ్ బేగ్ తెరిచి డబ్బు ఇవ్వబోయింది. (ఫేస్బుక్ తెరవడం ఎందుకంత కష్టం?) ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com -
త్రీమంకీస్ - 20
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 20 ‘‘ప్రభుత్వం ఇటుకని గాలికి కొట్టుకోకుండా డోర్ స్టాపర్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. పొడి చేసి పళ్ళపొడిగా ఇస్తుంది. ఆఫీసుల్లో పేపర్ వెయిట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. వెయిట్ లిఫ్టర్స్కి వెయిట్ లిఫ్టింగ్ రాళ్ళుగా ఇస్తుంది. విసిరే ఆయుధంగా, తల మీద కొట్టే ఆయుధంగా ఇస్తుంది. షూటింగ్ రేంజ్లో గుళ్ళు బయటకి వెళ్ళకుండా ఆపడానికి ఇస్తుంది. ఫ్లవర్ పాట్స్ నిర్మించడానికి ఇస్తుంది. ఎయిర్ హోస్టెస్ శిక్షణలో వాళ్ళు కరెక్ట్ పోశ్చర్‌లో నడవడానికి తల మీద ఉంచడానికి ఇటుకలని ఇస్తుంది. రాత్రుళ్ళు కొవ్వొత్తులని వెలిగించుకోడానికి హోల్డర్లుగా ఇటుక మీద రెండు రంధ్రాలని చేసి ఇస్తుంది. బీదలు కుంకుడుకాయలని కొట్టుకోడానికి ఇస్తుంది. దాన్ని పొడి చేసి నీళ్ళు కలిపి పెయింట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. కారు చక్రాలు జారిపోకుండా టైర్లకి అడ్డంగా పెట్టుకోడానికి ఇస్తుంది. పార్కుల్లో దారికి అటు, ఇటు నలభై అయిదు డిగ్రీల్లో పాతడానికి ఇస్తుంది. పేవ్మెంట్ మీద పరవడానికి ఇస్తుంది. ఇటుక మీద ఇటుక పేర్చి ఎత్తు చేసి, దాని మీద నించుని అటక మీద నించి ఏదైనా దింపుకోడానికి ఇస్తుంది. పండగలకి గిఫ్ట్ రేపర్ చుట్టి బహుమతిగా ఇస్తుంది. ఇంకా ఇటుకలతో కొత్త కొత్త ఉపయోగాలని కనుక్కుంటుంది. అంతే తప్ప అది ఇళ్ళు, గోడలు కట్టుకోడానికి ఇటుకలని చస్తే ఇవ్వదు. అలా ఇచ్చే ప్రభుత్వాలు చరిత్రలో ఇంతదాకా ఏ దేశాన్నీ పాలించలేదు. అలాంటి ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు.’’ విద్యార్థులు శ్రద్ధగా వినసాగారు. ‘‘ఓ పొలిటికల్ పార్టీ తమకే ఓటు వేస్తే ప్రజల కష్టాలని తీరుస్తామని పెన్నుల మీద ముద్రించి ఉచితంగా పంచింది. ‘మీకేమైనా సమస్య ఉంటే మీరు ఎన్నుకునే నాకు ఫోన్ చేయండి’ అని ఆ అభ్యర్థి ఫోన్ నంబర్ దాని మీద అచ్చు వేశారు. చాలామంది ఫోన్ చేసి ఆ పెన్ రాయడం లేదని తమ సమస్యగా ఫిర్యాదు చేశారు. ఇలా చేయకండి. యువత కాబట్టి మీరు ఈ దేశాన్ని చేతైతే బాగు చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇంకాస్త చెడగొట్టకండి. మీరు ఓటర్లు కాబట్టి ఈసారైనా జాగ్రత్తగా ఆలోచించి ఓట్లు వేయండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మా పార్టీ ప్రభుత్వానికి ఓటు వేయండి. చివరగా త్రీ ఆర్స్ ప్రిన్సిపల్ గురించి చెప్పి నేను ముగిస్తాను. రెస్పాన్సిబిలిటీ ఫర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్. ఈ రెండూ పాటిస్తేనే రైట్ అనేది వస్తుంది. జైహింద్.’’ యం పి స్పీచ్ పూర్తవగానే విద్యార్థులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని ప్రకటించారు. ప్రిన్స్‌పాల్ లేచి చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ అకస్మాత్తుగా హాల్లోంచి గట్టిగా గాడిదల ఓండ్ర వినిపించింది. ‘‘సెలైన్స్. సెలైన్స్’’ ఆయన కోపంగా అరిచాడు. ఆయన మళ్ళీ తన స్పీచ్‌ని మొదలెట్టాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ మరోసారి గాడిద అరుపులు వినిపించాయి. ‘‘సెలైన్స్... నేనింత కాలం గాడిదలకి పాఠాలు చెప్తున్నానని అనుకోలేదు’’ స్టేజి మీది వైస్ ప్రిన్స్‌పాల్ మైక్‌ని అందుకుని కోపంగా చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ ప్రిన్స్‌పాల్ మళ్ళీ చెప్పగానే, కూర్చున్న విద్యార్థ్ధులంతా అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. వారి మధ్య నించి రెండు గాడిదలు స్టేజి ముందుకు వచ్చి నిలబడి, స్టేజీ మీది వారి వంక చూస్తూ ఓండ్ర పెట్టాయి. ఆ స్టేజి మీది పెద్ద మనుషులంతా వాటి వంక నివ్వెరపోతూ చూశారు. ‘‘నాకు చెప్పకుండా అసలు వీటిని కాలేజీలో ఎందుకు చేర్చుకున్నారు? ఫీజ్ కోసమా?’’ యం పి కోపంగా అడిగాడు. ‘‘లేదు సార్. ఇవి మన కాలేజీలో చదివే గాడిదలు కావు. అల్లరి చేయడానికి ఎవడో అడ్డగాడిద వీటిని ఇక్కడ తెచ్చి వదిలాడు’’ ప్రిన్స్‌పాల్ ఆందోళనగా చెప్పాడు. గాడిదల మీద బొగ్గుతో అంకెలు, పేర్లు రాసి ఉండటం యం పి గమనించాడు. ‘‘వాటి మీద ఏం రాశారు?’’ ఆయన అడిగాడు. ‘‘సర్. ఓ గాడిదకి ఓ వైపు నంబర్ 1 అని, ఇంకోవైపు సెక్రటరీ అని రాశారు’’ ఓ విద్యార్థి చెప్పాడు. యం పి పగలబడి నవ్వుతూ అడిగాడు. ‘‘రెండో గాడిద మీద?’’ ‘‘నంబర్ 2- వైస్‌ప్రిన్సిపాల్.’’ ‘‘మూడోది?’’ యం పి నవ్వు ఇంకా పెరిగింది. ‘‘నంబర్ 3. ప్రిన్సిపాల్’’ విద్యార్థులు అరిచారు. ‘‘నాలుగో గాడిద?’’ యం పి పొట్ట పట్టుకుని నవ్వుతూ అడిగాడు. ‘‘నంబర్ 5. చీఫ్ గెస్ట్’’ వెంటనే ఆయన నవ్వు ఠక్కున ఆగిపోయింది. ముఖం కందగడ్డలా మారింది. ముక్కు పుటాలు అదిరాయి. ‘‘నంబర్ 4 గాడిద ఏది?’’ సెక్రటరీ అడిగాడు. వెంటనే విద్యార్థులంతా కలిసి ఆడిటోరియం మొత్తం వెదికారు. అది కనపడలేదు. తర్వాత కాలేజీ ఆవరణ, క్లాస్ రూంలు అంతా వెదికారు. ఎక్కడా నంబర్ ఫోర్ గాడిద ఎవరికీ కనపడలేదు. (ముగ్గురు మిత్రులు, దుర్యోధనుల ముఖాముఖి ఎలా ఉంటుంది?) -
త్రీ మంకీస్ - 19
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 19 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మన ముఖ్య అతిథి వచ్చేశారు... ఇది ఆఖరి జోక్... పాకిస్థాన్ ప్రెసిడెంట్ నుంచి భారత రాష్ట్రపతికి కానుకగా ఓ పార్సెల్ అందింది. సెక్యూరిటీ వారు దాన్ని తనిఖీ చేసి బాంబులేం లేవని నిర్ధారించాక ఆయన దాన్ని తెరిచి చూస్తే అందులో మలం ఉంది. ‘మీకు, మీ భారతీయులకి’ అని రాసి ఉంది. రాజకీయ చాణక్యుడైన మన రాష్ట్రపతికి ఇదో లెక్కా? పాకిస్థాన్ ప్రెసిడెంట్‌కి భారత రాష్ట్రపతి నించి బదులుగా అలాంటి ఓ పార్సెల్ వెళ్ళింది. దాన్ని వాళ్ళు విప్పి చూస్తే అందులో వాళ్ళు భయపడ్డట్లుగా బాంబ్ కాక, ఏ మొబైల్ ఫోన్తోనైనా ఆపరేట్ చేేన 1800 జిబి మెమొరీ గల అతి చిన్న కంప్యూటర్, త్రిడి హాలోగ్రాం మానిటర్ కనిపించాయి. అది భారతీయ ఐటి నిపుణులు రూపొందించిన అత్యాధునిక లేప్టాప్. దాంతోపాటు వచ్చిన కాగితంలో ఇలా రాసి ఉంది. ‘ఓ నాయకుడు తమ ప్రజలు తయారు చేసేదే ఇంకో దేశాధినేతకి బహుమతిగా పంపగలడు.’’ ప్రేక్షకులంతా గట్టిగా ఈలలు వేసూ చప్పట్లు కొట్టారు. ‘‘పాకిస్థాన్‌లోని రావల్పిండిలో దిగిన ఓ విమానం లోంచి ఓ ఆఫ్ఘనిస్తానీ దిగి ఇమిగ్రేషన్ కౌంటర్‌కి వెళ్ళాడు. ‘మీరేం చేస్తూంటారు?’ అని పాకిస్థానీ ఇమిగ్రేషన్ అధికారి ప్రశ్నిస్తే ‘నేను అఫ్ఘనిస్తాన్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్‌ని’ అని జవాబు చెప్పాడు. ‘అబద్ధం. అఫ్ఘనిస్తాన్కి సముద్రమే లేనప్పుడు నీ అండ్ పోర్ట్స్ మినిస్టర్ ఎలా ఉంటాడు?’ అని ఇమిగ్రేషన్ అధికారి గద్దిస్తే ‘మీ పాకిస్థాన్‌లో లా లేకపోయినా లా మినిష్టర్ ఉన్నట్లుగానే’ అని అతను జవాబు చెప్పాడు.’’ మళ్ళీ గట్టిగా ఈలలు, చప్పట్లు వినిపించాయి. ‘‘ఇంకొక్క జోక్‌కి టైం ఉన్నట్లుంది... అనగనగా ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగారు. ఎలాగైనా గెలవాలనుకున్న ఓ అభ్యర్థి ఓటుకి వెయ్యి రూపాయల చొప్పున తళతళలాడే కొత్త కరెన్సీ నోట్లని పంచిపెట్టి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఈ సంగతి తెలుసుకున్న రెండో అభ్యర్థి ఓటర్ల వద్దకి వెళ్ళి ఆ అభ్యర్థి పంచిన నోట్లన్నీ దొంగ నోట్లని ప్రచారం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. మూడో అభ్యర్థి పాత ఐదు వందల రూపాయల నోట్లతో ఓటర్లని కలుసుకుని కొత్త వెయ్యి నోటుకి పాత ఐదు వందల నోటు మార్పిడి చేసి ‘చూశారా? మీ దొంగ నోటుకి అసలు నోటిచ్చాను. మీ ఓట్లన్నీ నాకే’ అని చెప్పాడు. ఓట్లతో పాటు ఓటరుకి అయిదు వందల రూపాయల చొప్పున అతగాడు లాభం పొందాడు... థాంక్స్ ఫర్ ఎంజాయింగ్ ది జోక్స్. బికాస్ ఐ యామ్ నాట్ గ్రేట్. బికాస్ దే ఆర్ వర్త్ ఎంజాయింగ్.’’ జోక్స్ మధ్యలో కపీష్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలోకి వచ్చాడు. అతను వానర్‌కి కనుసైగ చేశాడు. బదులుగా వానర్ కూడా కనుసైగ చేశాడు. లోపలకి వచ్చిన మర్కట్ కపీష్ చెవిలో ఏదో గుసగుసలాడాడు. ‘‘వెరీ గుడ్’’ కపీష్ చెప్పాడు. ఆ ముగ్గురూ చదివే ఇంజనీరింగ్ కాలేజీకి ముఖ్య అతిథిగా వచ్చింది, దాన్లో బినామీ భాగస్వామ్యం గల ఓ ఎం.పి. ఆయన స్టేజి మీదకి రాగానే విద్యార్థులంతా కావాలని గట్టిగా చప్పుడు చేస్తూ ఆవులిస్తూంటే ప్రిన్స్‌పాల్ గట్టిగా అరిచాడు. ‘‘సెలైన్స్, సెలైన్స్’’. ముందు సీట్లోని కపీష్‌ని, అతను ధరించిన టీషర్ట్ మీది అక్షరాలని చూసి ముఖం చిట్లించాడు. ఆ ఎర్ర టీ షర్ట్ మీద నల్ల అక్షరాల్లో ఇలా ముద్రించి ఉంది. ‘ఐ యాం సెలైంట్లీ కరెక్టింగ్ యువర్ గ్రామర్’ ప్రిన్స్‌పాల్ కోపంగా అందరి వంకా చూసి చెప్పాడు. ‘‘పూర్వం తల మీది టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. మీరు మీ చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని తీసి వీరికి మీ గౌరవాన్ని తెలపండి.’’ అయిష్టంగానే అంతా హెడ్‌ఫోన్స్‌ని ఓ వైపు చెవుల నించి మరోవైపు స్మార్ట్ఫోన్ల నించి తీసేశారు. విద్యార్థుల చేష్టలని పట్టించుకోకుండా ముఖ్య అతిథి స్పీచ్‌ని చెప్పాడు. తన సెక్రటరీ రాసిచ్చిన స్పీచ్ కాదది. ఆశువుగా చెప్పాడు. ‘‘ముందుగా నాకు చాలా మంచి బట్టలు ఉన్నాయి. ప్రతిపక్షాలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాసిన బట్టలతో వచ్చాను. మీరు కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ జీవితంలోని చివరి దశ దాకా ప్రభుత్వం మీ జీవితాలని ఎన్నోవిధాల టచ్ చేస్తూనే ఉంటుంది. అసలు ప్రభుత్వం ఎలా పని చేస్తుంది? ప్రభుత్వంలో నేనో చిన్న భాగాన్ని కాబట్టి నాకు తెలిసింది చెప్తా వినండి. మీ అందరికీ ఇటుక అంటే ఏమిటో తెలుసు. తెలీని వాళ్ళు చేతులు ఎత్తండి.’’ దాదాపు అంతా చేతులు ఎత్తారు. ‘‘గుడ్. ప్రభుత్వం చేతికి ఇటుకని ఇస్తే ఇది వాటిని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తుందో చూడండి. దీన్నిబట్టి ప్రభుత్వం అంటే ఏమిటో మీకు తెలిసిపోతుంది.’’ వెంటనే ఆవులింత శబ్దాలు ఆగిపోయాయి. (కాలేజీలో నాలుగు గాడిదలు ఏవో తెలుసా?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * కపీస్, మర్కట్. వానర్ పేర్లు త్రీమంకీస్కు ఎంతగానో ఇమిడాయి. కలలో ఫేస్బుక్లో స్టేటస్ మార్చడం చివరి కోరికగా వానర్ చెప్పటం సహజసిద్ధ హాస్యాన్ని పండించింది. నవ్విస్తూ చదివిస్తున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి అభినందనలు. - కటుకోఝ్వుల రమేష్, ఇల్లందు, ఖమ్మం జిల్లా. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గురించిన కామెడీ వివరణ నాకు బాగా నచ్చింది.సీరియల్ ఫన్నీగా ఉంది. - సాయి కీర్తి ముత్యాల (mutyalasaikeerthi@gmail.com) -
త్రీ మంకీస్ - 18
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 18 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ఓ ధనవంతుడు ప్రధానమంత్రి అవచ్చని నెహ్రూ ఋజువు చేశాడు. ఓ బీదవాడు ప్రధానమంత్రి అవచ్చని లాల్‌బహదూర్ శాస్త్రి ఋజువు చేశాడు. ఓ మహిళ ప్రధానమంత్రి అవచ్చని ఇందిరాగాంధీ ఋజువు చేసింది. ఓ వృద్ధుడు ప్రధానమంత్రి అవచ్చని మొరార్జీ దేశాయ్ ఋజువు చేశాడు. ఓ చదువు రాని వాడు ప్రధానమంత్రి అవచ్చని చరణ్ సింగ్ ఋజువు చేశాడు. ఓ అసమర్థ పైలట్ ప్రధానమంత్రి అవచ్చని రాజీవ్ గాంధీ ఋజువు చేశాడు. ఓ రాజవంశీకుడు ప్రధానమంత్రి అవచ్చని వి పి సింగ్ ఋజువు చేశాడు. ఓ పండితుడు ప్రధానమంత్రి అవచ్చని పివి నరసింహారావు ఋజువు చేశాడు. ఓ కవి ప్రధానమంత్రి అవచ్చని వాజ్‌పేయ్ ఋజువు చేశాడు. ఎవరైనా ప్రధానమంత్రి అవచ్చని దేవెగౌడ ఋజువు చేశాడు. ఓ టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అవచ్చని మోడీ ఋజువు చేశాడు. భారతదేశానికి అసలు ప్రధానమంత్రి అవసరమే లేదని మన్మోహన్ సింగ్ ఋజువు చేశాడు.’’ గట్టిగా నవ్వులు, ఈలలు, చప్పట్లు. ‘‘మై డియర్ ఫ్రెండ్స్, నేనా మధ్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ముంబై వెళ్తూంటే ఎయిర్‌హోస్టెస్ సెల్‌ఫోన్స్‌ని ‘మన్మోహన్ సింగ్ మోడ్‌లో ఉంచమని’ ప్రకటించింది. అంటే ఏమిటో మీకు తెలుసు... మన్మోహన్ సింగ్ ఇప్పుడు తన ఆత్మకథని రాస్తున్నాడని తెలుసా? దాని పేరు? ఫోర్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ : టు జి, త్రి జి, సోనియాజి, రాహుల్జి... సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌కి ఎస్సెమ్మెస్ పంపింది, విసుగ్గా ఉందని, ఏదైనా మంచి జోక్‌ని పంపమని! ‘ఇప్పుడు కుదరదు మేడం. నేను మంత్రిమండలి మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నాను’ అని జవాబు ఎస్సెమ్మెస్ పంపారు మన్మోహన్. వెంటనే సోనియాజీ నించి ఆయనకి ఇంకో ఎస్సెమ్మెస్ వచ్చింది - ‘చాలా మంచి జోక్. ఇంకోటి పంపండి’ అని! ‘‘మీరీ జోక్స్ ఎంజాయ్ చేస్తున్నారా?’’ సిద్ధాంత్ అడిగాడు. ‘‘యస్’’ చాలామంది అరిచారు. ‘‘గుడ్. రజనీకాంత్ జోకులు మీ అందరికీ తెలుసు. విలన్ పేల్చిన బుల్లెట్‌ని చేత్తో పట్టుకుని దాన్ని విలన్ మీదకే విసిరి చంపేది ప్రపంచంలో ఒక్క రజనీకాంతే. ఆయన్నించి జేమ్స్ బాండ్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అలాంటి రజనీకాంత్‌కి ప్రధానమంత్రి అవాలనే కోరిక గల ప్రణబ్ ముఖర్జీ ఓ సవాల్ విసిరాడు. ‘నేను చెప్పిన మూడిటిని లేపితే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు. లేదా నేషనల్ జోక్వి అవుతావు.’ రజనీకాంత్ ఆ సవాలుని అంగీకరించాక ఎవరెస్ట్ దగ్గరకి తీసుకెళ్ళి దాని శిఖరాన్ని ఓసారి లేపి కింద పెట్టమని ప్రణబ్ ముఖర్జీ కోరాడు. మన రజనీకాంత్‌కి అదో లెక్కా? నిమిషంలో ఎడం చేత్తో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి బాబాలోని తన పెద్ద డైలాగ్‌ని చెప్పి దాన్ని యథాస్థానంలో ఉంచాడు. తర్వాత ఆల్ఫ్స్ పర్వతం దగ్గరకి తీసుకెళ్ళి దాన్ని ఓసారి ఎత్తమని ప్రణబ్ సవాల్ విసిరాడు. రజనీకాంత్ మళ్ళీ దాన్ని ఎత్తి అరుణాచలం సినిమాలోని పెద్ద డైలాగ్‌ని చెప్పి కింద ఉంచాడు. ‘ఈ రెండూ తేలికే. మూడోది చాలా కష్టం. దాంట్లో గెలిస్తే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు’ అని మన్మోహన్ సింగ్ కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ కుర్చీ దగ్గరకి తీసుకువెళ్ళి సింగ్ గారిని కుర్చీలోంచి లేపమని, ఆయన లేవగానే తను కూర్చోడానికి తయారుగా నిలబడ్డారు. ఎవరు? ప్రణబ్ గారు. ‘లే’ అంటూ ఎడం చేత్తో రజనీకాంత్ మన్మోహన్ చెయ్యి పట్టుకుని లాగాడు. ఊహు. లేపలేకపోయాడు. ఈసారి రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఎత్తినా మన్మోహన్ సింగ్ లేవలేదు. ‘ఎత్తు నాయినా. ఎత్తు’ అని ఆయన గారు నవ్వారు. రజనీకాంత్ రెండు చేతులని సింగ్ గారి చంకల కిందకి పోనించి లేపే ప్రయత్నం చేశారు. రజనీకాంత్‌కి చమటలు కమ్మాయి తప్ప మన్మోహన్ సింగ్ మిల్లీమీటర్ కూడా కదల్లేదు. ‘ఏనుగులని మింగావా? పర్వతాలని ఫలహారం చేశావా?’ అని అరిచి ఎంత ప్రయత్నించినా రజనీకాంత్ ప్రైమ్ మినిస్టర్ సీట్లోంచి మన్మోహన్ సింగ్‌ని లేపలేకపోయాడు’’ మన్మోహన్ సింగ్ మీద మరికొన్ని పొలిటికల్ జోక్స్ చెప్పాక సిద్ధార్థ చెప్పాడు. ‘‘ఇరవయ్యవ శతాబ్దంలో రెండు దేశాలకి ఒకేరోజు స్వతంత్రం వచ్చింది. వాటిలోని ఓ దేశం మార్స్‌కి రాకెట్‌ని పంపింది. రెండో దేశం ఇంకా పక్క దేశంలోకి చొరబడాలనే ప్రయత్నిస్తూ విఫలం అవుతోంది... ముఖ్య అతిథి దారిలో ఉన్నారని తెలిసింది... ఈలోగా కొన్ని పొలిటికల్ సామెతలు చెప్తాను... పార్టీ పోరు, పార్టీ పోరు ఓటరు తీర్చాడు... గంజికి లేనమ్మకి గేస్స్టవ్ ఇచ్చినట్లు... అపోజిషన్ పార్టీ లీడర్ని ఎందుకు కలిశావంటే మన పార్టీ పరిస్థితి తెలుసుకోడానికన్నాట్ట... రాజకీయాల్లో తల దూర్చి రౌడీలకి భయపడితే ఎలా?... జగమెరిగిన జయప్రదకి రాజమండ్రి అయినా ఒకటే, రాంపూర్ అయినా ఒకటే... సీటు రాక సిట్టింగ్ ఎంఎల్ఏ ఏడుస్తూంటే రెబెల్ వచ్చి రాళ్ళేద్దాం రమ్మన్నాట్ట... సర్వేలు చేసి సన్న్యాసికి టికెట్ ఇచ్చినట్టు... పరుగెత్తి పక్క పార్టీలో చేరే కంటే, నిలబడి ఉన్న పార్టీలో ఉండటం మేలు... టికెట్ చిక్కిన వేళ, పదవి దక్కిన వేళ... దేశానికి అధినేత అయినా ఓటరుకు అభ్యర్థే. నక్సలైట్లతో నారాయణ! కుబేర్లతో గోవిందా! ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి...’’ ఒకతను స్టేజి మీదకి వచ్చి సిద్ధార్ధ చెవిలో ఏదో చెప్పి వెళ్ళాడు. (పూర్వం తల మీద టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. ఇప్పుడో?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ 1. ముగ్గురు టెక్ దొంగల పేర్లు టైటిల్‌కి జస్టిఫై అయ్యాయి. జైలర్ అటెన్డెన్స్ తీసుకునే సన్నివేశం కామెడీగా ఉంది. ట్రూలీ దిసీజ్ కామెడీ అండ్ థ్రిల్లర్. - క్రిష్ టి. (kittu.onair85@gmail.com) 2. కథనం చాలా ఆసక్తిగా ఉండి, నేటి యువతరం చదువు తర్వాత వారి ఆలోచనా సరళిని తెలియజేస్తోంది. ఈ సీరియల్ పుణ్యమా అని నేను పాతికేళ్ళు వెనక్కి వెళ్లాను... రచనల స్వర్ణయుగంలోకి! - టి. భాస్కర బాబు (babubhaskar04@gmail.com) -
త్రీ మంకీస్ - 17
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ - 17 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘చూస్తూండండి. వానర్! వెళ్ళి అందరికీ మళ్ళీ గ్లాసులు నింపుకురా’’ కపీష్ నర్మగర్భంగా చెప్పాడు. ‘‘నాకు ఐస్ ఒద్దు’’ మటర్కట్ చెప్పాడు. అతను ట్రేలో ఆ మూడు గ్లాసులని తీసుకెళ్ళి కోక్ని నింపుకుని రాగానే మేక్‌డొనాల్డ్స్ మేనేజర్ వీళ్ళ టేబిల్ దగ్గరకి వచ్చాడు. ‘‘చచ్చాం! నేను నింపుకోవడం చూశాడు. పోలీసులకి ఫోన్ చేస్తాడేమో?’’ వానర్ భయంగా చెప్పాడు. ‘‘వాడి వైపు చూడకండి’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ ఆయన పలకరించాడు. అంతా మేకపోతు గాంభీర్యంతో అతని వంక చూశారు. ‘‘ఎలా ఉంది కోక్?’’ ‘‘కోక్ ఎప్పటి కోక్లానే తియ్యగా ఉంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఐస్?’’ ‘‘ఐస్ ఐస్‌లా చల్లగా ఉంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీరు ఐస్ తక్కువ వేసుకున్నట్లున్నారు?’’ ‘‘లేదు. కరిగింది. ఐనా తాగాల్సింది చల్లటి కోక్ని కాని, చల్లటి నీళ్ళని కాదు కదా?’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కాని, ఫిర్యాదు కానీ లేదు కదా?’’ మేనేజర్ మర్యాదగా అడిగాడు. ‘‘లేదు.’’ ‘‘థాంక్స్. ప్లీజ్ కీప్ కమింగ్.’’ అతను వెనక్కి తిరిగి వెళ్ళాక ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు. ‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సి రావచ్చని భయపడి చచ్చాను’’ వానర్ చెప్పాడు. కపీష్ జేబులోంచి చేతి రుమాలు తీసిముక్కుకి అడ్డం పెట్టుకుని కిందకి చూశాడు. వానర్ చుట్టూ నేల మీద చిన్న మడుగు. పేంట్ తడిసి ఉంది. ‘‘ఏమిటీ పని?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘భయపడితే నాకిలా అవుతుందని ఇప్పుడే తెలిసింది గురూ.’’ ‘‘పనైందిగా. ఇంక లేవండి’’ కపీష్ లేస్తూ చెప్పాడు. ఆరోజు హైద్రాబాద్‌లో పటాన్‌చెరువులోని ఆ ఇంజనీరింగ్ కాలేజిలోని వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంది. సీనియర్ విద్యార్ధులకి జూనియర్లు సెండాఫ్ చెప్పే వేడుక కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతోంది. ముఖ్యఅతిథి రావడానికి ఇంకా టైం ఉండటంతో ఫ్యాన్సీ డ్రన్ వేడుక తర్వాత సెకండియర్ విద్యార్ధి సిద్ధాంత్ జోక్స్ చెప్తాడనే ప్రకటన వినపడగానే చాలామంది ఆనందంగా చప్పట్లు కొట్టారు. కొందరు విజిల్స్ కూడా వేశారు. అంతా చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని ఉత్సాహంగా తీసేశారు. అతను వచ్చి మైక్‌లో చెప్పాడు. ‘‘హలో జూనియర్స్, సీనియర్స్, ఫెలో స్టూడెంట్స్, లేడీస్ అండ్ లేడీస్ అండ్ ఎవ్విరిబడీ! దిసీజ్ యువర్ సిద్ధూ టెలింగ్ యు ది జోక్స్... ఆరతి! నీకొక్కదానికే కాదు డార్లింగ్... అందరికీ చెప్తున్నాను... మరేం లేదు. మన కాలేజీలో నన్ను సిద్ధూ అని పిలిచేది ఒక్క ఆరతే... చీకట్లో. ముందుగా కొన్ని పొలిటికల్ జోక్స్ చెప్తాను. దానికి ముందుగా ఇది మీరు తప్పనిసరిగా వినాలి. యూరప్‌లో స్పెయిన్ దేశం ఉంది. జిందగీ న మిలేగీ దుబారా చూశారుగా...’’ కొన్ని ఈలలు వినపడ్డాయి. ‘‘ఆ స్పెయిన్‌లో బార్సిలోనా ఉంది. ఆ నగరంలో టీట్రెన్యూ అనే కామెడీ క్లబ్ ఉంది. అక్కడి ప్రభుత్వం నాటకాల మీద వినోదపు పన్నుని ఎనిమిది నించి ఇరవై ఒక్క శాతానికి పెంచడంతో... బహుశ మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీనే సలహా ఇచ్చి ఉంటారు... ఏమిటీ? చిదంబరమా?... వీటిలో ఆయన ఎక్కువ సమర్థుడు కాబట్టి చిదంబరం సలహా మీద ఏడాదిలో టిక్కెట్ల అమ్మకాలు ముప్ఫై శాతం తగ్గాయి. దాంతో టీట్రెన్యూ కామెడీ క్లబ్ ‘పే-పర్-లాఫ్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని కనుక్కొంది. నాటకశాలలో ప్రతీ సీన్ ముందు ప్రేక్షకుడి మొహంలోని చిరునవ్వుని గుర్తించే ఓ ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంని అమర్చారు. అది మనిషి నవ్వినప్పుడల్లా లెక్క కడుతుంది. ప్రవేశం ఉచితం. వారి ప్రదర్శన ప్రేక్షకుడిలో నవ్వులని సృష్టించకపోతే ఏం చెల్లించకుండా బయటకి వెళ్ళచ్చు. ఎన్నిసార్లు నవ్వితే అన్ని ముప్ఫై యూరో సెంట్లు చెల్లించాలన్న నిబంధనతో తమ నాటకాలని ప్రదర్శించసాగారు. అలా సగటున ప్రతీ ప్రేక్షకుడు ఓ నాటకానికి ఆరు యూరోలని చెల్లిస్తున్నాడు. మీడియా కవరేజ్ వల్ల ముప్ఫై ఐదు శాతం ప్రేక్షకులు పెరిగారు. ఒకో నాటకానికి ఇరవై ఎనిమిది వేల యూరోలు వసూలవుతున్నాయట! అదృష్టవశాత్తు మీరు బార్సిలోనాలో లేరు. నేను చెప్పే జోక్‌లకి మొహమాటపడకుండా నవ్వండి. మీ నవ్వులని కొలిచే ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ఈ ఆడిటోరియంలో అమర్చలేదు. నవ్వినందుకు మీ ఆస్తిని ఎవరికీ రాసివ్వక్కర్లేదు. కాబట్టి మజా చేయండి. గట్టిగా పోటీపడి నవ్వండి.’’ ఆ ఓపెనింగ్ తమకి నచ్చినట్లుగా కొందరు ఈలలు వేశారు. ‘‘సరే. పొలిటికల్ జోక్స్‌తో మొదలెడతాను. పొలిటికల్ జోక్ అనగానే మనకి గుర్తొచ్చేది ఖచ్చితంగా మన మాజీ ప్రధానమంత్రి. మన మాజీ ప్రధానమంత్రుల్లో అధికంగా జోక్స్‌కి అర్హుడు ఎవరో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. (పొలిటికల్ జోక్స్ అనగానే గుర్తొచ్చే ప్రధానమంత్రి ఎవరో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ మల్లాది గారి ‘3 మంకీస్’ సీరియల్ ఆకర్షణీయమైన పేర్లతో, అబ్బురపరిచే సన్నివేశాల మేళవింపుతో కామెడీ-థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ‘పాఠకుల అభిరుచి మారింది. ప్రముఖ రచయితలు అందరూ అస్త్రసన్యాసం చేశారు’ అని రచనల పరంపరను కొనసాగించలేక, అభియోగాన్ని పాఠకుల మీదకు నెట్టి పక్కకు తప్పుకున్నది రచయితలు మాత్రమే. ఆసక్తికర రచనలు చేస్తే పాఠకులు ఎప్పుడూ చదువుతారని ఈ సీరియల్ నిరూపిస్తోంది. ఇలాంటి రచనలను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యానికి పాఠకులందరి తరఫున కృతజ్ఞతలు. మున్ముందు కూడా సాక్షిలో సీరియల్ సీక్వెన్స్ కొనసాగుతుందని, కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ... - యంజర్లపాటి కమలాకర్‌రెడ్డి, ఖమ్మం -
త్రిమంకీస్
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 16 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘దీన్నిబట్టి నాకోటి అర్థమైంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘ఎవరైనా తమ బెస్ట్ఫ్రెండ్స్ని కలుసుకోవాలనుకుంటే జైలుకి వెళ్ళాలి.’’ ‘‘నాలుగో గాడిద ఏమైంది?’’ మర్కట్ కపీష్‌ని ప్రశ్నించాడు. ‘‘అవును. నాలుగో గాడిద ఏమైంది?’’ వానర్ కూడా ప్రశ్నించాడు. వాళ్ళా ప్రశ్నలు అడిగింది వారి నాలుగో మిత్రుడి గురించి అనుకుంటే పొరపాటే. అసలు ఈ ముగ్గురూ కూడా గాడిదలు అనుకుంటే పొరపాటే. వాళ్ళని వాళ్ళు గాడిదలుగా భావించడం లేదు. ఆ నాలుగో గాడిద గురించి తెలుసుకోవాలనుకుంటే, ఓ ఏడాది వెనక్కి వెళ్ళాలి. ఏడాది క్రితం ఎక్కడికి? ముందుగా వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని మేక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్లోకి! తర్వాత కాలేజీ లోకి! 5 ‘‘మన దగ్గర తైలం ఉందా?’’ మెక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్ బయట నిలబడ్డ కపీష్ మిగిలిన ఇద్దరు మిత్రుల్నీ అడిగాడు. ‘‘ఎంత?’’ ‘‘ఓ ఒన్ ఫిఫ్టీ. మూడు కోక్స్కి.’’ ‘‘లేదు’’ ఇద్దరూ చెప్పారు. ‘‘ప్లాన్ ఏ ఫెయిలైంది. సరే. పదండి. తాగుదాం.’’ ‘‘నీ దగ్గర డబ్బుందా?’’ మర్కట్ అడిగాడు. ‘‘లేదు. ప్లాన్ బి ఉంది. పదండి.’’ ముగ్గురిలోకి తెలివైన కపీష్ దారిలోని రెండు టేబిల్స్ మీద ఉన్న ట్రేల్లోని రెండు ఖాళీ కోక్ గ్లాస్‌లని తీసుకుని, మిత్రులకి ఇచ్చి చెప్పాడు. ‘‘వెళ్ళి ఫౌంటెన్‌లో నింపుకుని రండి.’’ తర్వాత ట్రాష్ బిన్లో చేతిని ఉంచి లాఘవంగా ఇంకో డిస్పోజబుల్ కోక్ గ్లాస్‌ని తీసుకుని అందులోని ఐస్‌ని ఆ బిన్లో కుమ్మరించాడు. వాళ్ళ వెనక నిలబడి తన వంతు రాగానే కోక్ని నింపుకున్నాడు. ‘‘భలే ట్రిక్’’ వానర్ కోక్ని రుచి చూసి చెప్పాడు. ‘‘ఇది ఇక్కడే సాధ్యం. మనం కోక్ అడిగితే వాళ్ళు డబ్బు తీసుకుని ఖాళీ గ్లాస్‌ని ఇస్తారు. ఫౌంటెన్లోంచి నింపుకోవాలి. తర్వాత ఆ ఖాళీ గ్లాస్‌ని వెనక్కి తీసేసుకోరు. వాటిని మళ్ళీ ఎన్నిసార్లు నింపుకున్నా ఎవరూ ఏమీ అనరు. ఈ సిస్టమ్‌లోని లోపాన్ని పట్టేసాను. ఇదే ప్లాన్ బి’’ కపీష్ చెప్పాడు. ‘‘ముగ్గురం మూడు ఏభై రూపాయలు ఆదా చేశాం’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురూ కూర్చున్నాక ఎమ్మెస్ అలర్ట్ రాగానే మర్కట్ మెసేజ్ ఎక్కడ నించో చూశాడు కాని దాన్ని చదవకపోవడంతో వానర్ అడిగాడు. ‘‘ఏం మెసేజ్?’’ ‘‘నా బేంక్ నించి బేలన్స్ తెలియచేస్తూ ఎస్సెమ్మెస్ వచ్చింది. దాన్ని చూడను. నా అకౌంట్లో ఎంత లేదో తెలుస్తుందని భయం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇవాళే మన కాలేజీ ఆఖరి రోజు’’ వానర్ విచారంగా చెప్పాడు. ‘‘అవును. అందుకేగా ఇవాళ ప్రిన్సిపాల్ కాలేజీ ఆడిటోరియంలో మనందరికీ స్పీచ్ ఇస్తున్నాడు.’’ ‘‘కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’’ కపీష్ తన ఇద్దరు మిత్రులని అడిగాడు. ‘‘ముందుగా నీది చెప్పు’’ వానర్ కోరాడు. ‘‘ఎస్సై ఉద్యోగం సంపాదించడం’’ కపీష్ జవాబు చెప్పాడు. ‘‘ఇంజనీరింగ్ చదివి ఎస్సై ఉద్యోగమా?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఇప్పటికే చాలామంది ఇంజనీర్లు ఎస్సైలయ్యారని తెలీదా? నీ ప్లాన్ ఏమిటి?’’ కపీష్ వానర్ని అడిగాడు. ‘‘పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ట్లో చేరాలని! జీతం కోసం కాదు... పై సంపాదన కోసం. నువ్వు చెప్పు భాయ్’’ వానర్ మర్కట్‌ని అడిగాడు. ‘‘కోటీశ్వరుడు అవ్వాలని. నా ముప్ఫై ఐదో ఏడు వచ్చేలోగా ఓ ఐదు కోట్లు సంపాదించాలని. కుదిరితే డాలర్లు. లేదా కనీసం రూపాయలు.’’ ‘‘బావుంది.’’ వానర్ మెచ్చుకున్నాడు. ‘‘మనం కోటీశ్వరుడు కావడానికి జస్ట్ ఒక్క స్టెప్ దూరంలో ఉన్నాం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏమిటా స్టెప్?’’ మర్కట్ అడిగాడు. ‘‘మనం ఓ కోటిని సంపాదించాలి.’’ ‘‘కాని అందుకు ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ వానర్ అడిగాడు. ‘‘కోట్లు సంపాదించడం తేలికే కాని పోలీసులతో సమస్య వస్తుంది.’’ ‘‘ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. కాబట్టి ఆ పరిష్కారం కనుక్కుంటే అది సాధ్యమే అంటాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఈ ఆఖరి రోజు మనం అందరికీ గుర్తుండి పోయేలా గోల చేయాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘ప్రిన్స్‌పాల్ స్పీచ్ ఇస్తూండగా మన పేర్లు రాసిన కాగితం విమానాలు ఆయన మీదకి వేేన్త సరి. విసిరింది మనమని తెలిసినా కాలేజీ నించి ఇక డిస్మిస్ చెయ్యలేడుగా?’’ ‘‘అది ప్రైమరీ స్కూల్ వాళ్ళు చేేన అల్లరి. మనం గ్రాడ్యుయేట్ విద్యార్ధి స్థాయిలో అల్లరి చేయాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘అంటే?’’ (పే-ఫర్-లాఫ్ కాన్సెప్ట్ అంటే?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3ఝౌజుజ్ఛీట.ట్చజుటజిజీఃజఝ్చజీ.ఛిౌఝ లెటర్స్ The names of the three monkeys are very different and their robberies are quite unexpected and humourous which make a reader curious. Thanks to Malladi sir. - Sowjanya Reddy (sowjanyareddy155@gmail.com) త్రీ మంకీస్ సీరియల్ స్టోరీ బావుంది. ముగ్గురు మిత్రులు కలిశాక ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఉంది. - దేవేందర్ నాయక్, (devendar.nayak75@gmail.com) -
త్రీ మంకీస్ - 15
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 15 - మల్లాది వెంకటకృష్ణమూర్తి దుర్యోధన్ గార్డ్ వెనకే నడిచాడు. ‘‘సర్. నేనోటి అడగచ్చా?’’ గార్డ్ సందేహిస్తూ అడిగాడు. ‘‘ఏమిటో చెప్తే అడగచ్చో, లేదో చెప్తాను.’’ ‘‘మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా అని అడగచ్చా?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘సార్. మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా?’’ ‘‘ఎవరూ పెట్టలేదు. నేనూ పెట్టుకోలేదు. మా నాన్నే ఆ పేరు పెట్టాడు.’’ ‘‘దేనికని అడగచ్చా సార్?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘దేనికి మీ నాన్న మహాభారతంలోని ఓ విలన్ పేరు మీకు ఎందుకు పెట్టారు?’’ ‘‘మా నాన్న మహాభారతం చదవలేదు. చూడలేదు. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ ఎన్టీఆర్ కాదు. ఇతన్ని పుట్టించిన బాబుని పుట్టించిన ఎన్టీఆర్ అభిమాని. ఆయన నటించిన డివిఎస్ కర్ణ చూసి మూర్ఛపోయి నాకీ పేరు పెట్టారు.’’ ‘‘డివిఎస్ కర్ణ? అంటే?’’ ‘‘దాన వీర శూర కర్ణ. అందులో ఆయన దుర్యోధనుడిగా నటించిన తీరు చూసి మా నాన్న నాకా పేరు పెట్టారు.’’ ‘‘మీ అన్న పేరు సర్?’’ ‘‘మీ అన్న పేరు అడగచ్చా అని అడగాలి.’’ ‘‘మీ అన్న పేరు అడగచ్చా సర్?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘మీ అన్న పేరు సర్?’’ ‘‘రావణ్.’’ ‘‘ఆ పేరుకీ ఓ చరిత్ర ఉందాండి అని అడగచ్చా?’’ ‘‘అడగచ్చు. ఉంది. మా నాన్న ఎన్టీఆర్ నటించిన సీతారామకళ్యాణం, భూకైలాస్లు చూశాడు. వాటిలో రావణుడిగా నటించిన ఎన్టీఆర్ నటనని చూసి మూర్ఛపోయాడు. ఆయన నటనతో ఆ పాత్రల మీద అభిమానం ఏర్పడి మా అన్నకి స్ట్టైల్గా రావణ్ అనే పేరు పెట్టాడు.’’ ఇద్దరూ జైలు ఆవరణలోని ఆరుబయటకి చేరుకున్నారు. అక్కడ ఓ వైపు రిమాండ్ ఖైదీలంతా వరసగా నిలబడి ఉన్నారు. దుర్యోధన్ ఆ వరసలోకి వెళ్ళి నిలబడ్డాడు. అతను రాగానే జైలర్ విజిల్ ఊది రోల్ కాల్ పిలవసాగాడు. ‘‘అంతా వచ్చేసినట్లేనా?’’ ‘‘వచ్చేసినట్లే’’ కొందరు జవాబు చెప్పారు. ‘‘రాని వారు చేతులెత్తండి... వెరీ గుడ్. ఎవరూ చేతిని ఎత్తలేదంటే ఎవరూ సెల్స్‌లో లేరన్నమాట... నంబర్ ఫైవ్ సిక్స్ త్రి ఎయిట్.’’ ‘‘ప్రజెంట్ సార్’’ ఓ జేబు దొంగ ఓ అడుగు ముందుకి వేసి చెప్పాడు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ త్రి నైన్.’’ ‘‘ఎస్సార్’’ ఓ చెయిన్ స్నాచర్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో.’’ ‘‘హాజర్ సాబ్’’ ఇళ్ళకి కన్నం వేసేదొంగ ఓ అడుగు ముందుకు వేసి చెప్పాడు. అక్కడికి కొద్ది దూరంలో ఆడ ఖైదీలు నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర రక్షణగా ఉన్న మహిళా గార్డ్ ఇటువైపు చూస్తే, తన వంకే కళ్ళప్పగించి చూసే మర్కట్ కనిపించాడు. ఆమె తన వంక చూడగానే అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె ముందు సందేహించినా తర్వాత నవ్వింది. అతను చేతిని ఊపాడు. ఆమె బదులుగా చేతిని ఊపలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్’’ జైలర్ తర్వాతి నంబర్ పిలిచాడు. ఎవరూ ముందుకు రాలేదు. హాజరు పలకలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్... కపీష్’’ తన పేరు వినగానే కపీష్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు. ‘‘ప్రజెంట్ సార్. పేరు పెట్టి పిలుస్తారనుకున్నాను.’’ ‘‘ఇక్కడ పేర్లుండవు. అందుకే నంబర్లు ఇచ్చారు. నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు...’’ మళ్ళీ ఎవరూ ముందుకు రాలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... మర్కట్.’’ ‘‘ప్రజెంట్ సార్.’’ ‘‘నీకూ ప్రత్యేకంగా చెప్పాలా, పేర్లుండవు, నంబర్లకే హాజరు పలకాలని? మీ ఇంజనీర్ క్లాసుల్లో నంబర్లు పిలిచేవారా లేక పేర్లా? నాకు తెలీకడుగుతున్నాను చెప్పు.’’ ‘‘మేం క్లాస్‌కి వెళ్ళకపోయినా మా హాజరు ఇంకెవరైనా పలికేవారు సార్. ఇక్కడా అంతే అనుకున్నాను.’’ అప్పటికే కపీష్, మర్కట్ ఒకర్ని మరొకరు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రి సర్. వానర్ సార్. ఉన్నాను సర్’’ వానర్ ముందుకి ఓ అడుగేని చెప్పాడు. కపీష్, మర్కట్లు అతన్ని చూశారు. అతనూ వీళ్ళ వంక చూశాడు. మళ్ళీ అందరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. ‘‘లైన్ డిస్మిస్డ్ ఎవరైనా సరే, పారిపోయే ప్రయత్నం చేస్తే చర్మం ఒలుస్తా. వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నావు?’’ జైలర్ వానర్ వంక చూస్తూ కోపంగా అడిగాడు. ‘‘ఏం లేదు సార్. నథింగ్.’’ ‘‘నథింగ్? నథింగ్? లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసన్. బట్ వెన్ యు లాఫ్ వితౌట్ రీజన్ యు నీడ్ మెడిసన్. చీల్చేస్తాను జాగ్రత్త. యు ఆర్ ఆల్ డిస్మిస్డ్ వెళ్ళండి.’’ అందరి హాజరు పూర్తవడంతో జైలర్ హాజర్ పుస్తకంతో వెళ్ళిపోయాడు. అంతా తమ తమ సెల్స్‌కి వెళ్ళసాగారు. కాని ఆ ముగ్గురు యువకులూ కదల్లేదు. ఒకరివైపు మరొకరు అడుగులు వేశారు. తర్వాత ముగ్గురూ ఒకేసారి ఆనందంగా అరిచారు. ‘‘హుర్రే.’’ ముగ్గురూ ఒకరిని మరొకరు ఆనందంగా కౌగిలించుకున్నారు. (మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ముగ్గురు మిత్రులు కోక్ని ఎలా సంపాదించారు?) -
త్రీమంకీస్ - 10
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 10 చాలామంది యమధర్మరాజుతో కరచాలనం చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ఆయన చిరునవ్వుతో అందరికీ ‘థాంక్యూ, ‘థాంక్యూ’ అని జవాబు చెప్తున్నాడు. ఓ మహిళ శవం ఓ వైపు నేల మీది చాప మీద పడుకోపెట్టి ఉంది. ఆవిడ చేతిలోని సెల్ ఫోన్ చెవి దగ్గర ఆనించి ఉంది. సెల్‌ఫోన్ గుప్పెట్లో బిగిసిపోవడంతో ఎంత ప్రయత్నించినా రాలేదు. ఆ మహోత్సవాన్ని ఫొటోలు, వీడియో తీసే ఒకతను ఇంకొకరికి చెప్పడం ముద్దాయి విన్నాడు. ‘‘నేను ఫొటోగ్రఫీని ఎందుకు హాబీగా చేసుకున్నానంటే, నేను ద్వేషించే వారిని షూట్ చేసి, జైలుకి వెళ్ళకుండా వారి తలలు కట్ చేయగలను కాబట్టి.’’ సీఐ యమధర్మరాజు దగ్గరికి నడిచి సెల్యూట్ చేసి చెప్పాడు. ‘‘కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆనర్.’’ ‘‘థాంక్యూ. థాంక్యూ’’ ఆయన ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు. ‘‘మీకు తీరిక ఉంటే ఓ ముద్దాయిని రిమాండ్ కోసం తీసుకువచ్చాను యువర్ ఆనర్.’’ ‘‘ఇతనేనా?’’ ఆయన ఆ యువకుడి వంక చూస్తూ అడిగాడు.‘‘అవును యువర్ ఆనర్. నేనే దొంగని.’’ అతను చెప్పాడు. ‘‘పేరు?’’ ‘‘వానర్.’’ ‘‘తండ్రి పేరు?’’ ‘‘కిష్కింధ.’’ ‘‘సోదరుడి పేరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు. ‘‘అయోధ్య.’’ ‘‘రాముడికీ, మీకూ ఏమైనా సంబంధం ఉందా?’’ ‘‘ఉంది యువర్ ఆనర్. మా నాన్న సీతారామకళ్యాణం నడిచే సినిమా హాల్లో కర్టెన్లని లాగేవాడు.’’ సీఐ ఇచ్చిన స్టేట్మెంట్ని చదివి అడిగాడు. ‘‘దీని మీద సంతకం నీదేనా?’’ ‘‘నాదే యువరానర్. అది చేసి అరగంటైంది. సిఐ గారికి తొందరెక్కువ సార్. ‘తొందర లేదు. ఆగుదాం’ అన్నా తీసుకొచ్చేశారు’’ వానర్ చెప్పాడు. ‘‘నిన్ను జైలుకి కస్టడీకి పంపిస్తున్నాను. చెప్పుకోడానికి ఏమైనా ఉందా?’’ ‘‘నాక్కావాల్సింది జైలు కాదు. బెయిల్.’’ ‘‘నీకు జీవితంలో మంచి మిత్రుడు ఉన్నాడో లేడో రేపటి కల్లా తెలుసుకోవచ్చు.’’ ఆయన నవ్వుతూ చెప్పాడు. ‘‘ఎన్ని రోజులు రాసుకోను సార్?’’ సీఐ ప్రశ్నించాడు. ‘‘రాసుకో ఓ నాలుగు రోజులు.’’ ‘‘థాంక్యూ సర్. పాపం. మీ ఆవిడ పోయినందుకు మీకు నా సానుభూతి యువర్ ఆనర్’’ వానర్ చెప్పాడు. యమధర్మరాజు అతని వంక కోపంగా చూసి చెప్పాడు. ‘‘ప్లన్ మూడు. ఏడు రోజులు రాయి.’’ తర్వాత అతని టీ షర్ట్ మీద పదాలని చదివాడు. ‘ఐ కెన్ ఓన్లీ ప్లీజ్ ఒన్ పర్సన్ పర్ డే. టు డే ఈజ్ నాట్ యువర్ డే’ ‘‘ప్లస్ నాలుగు. పదకొండు రోజులు రాసుకో’’ యమధర్మరాజు మళ్ళీ చెప్పాడు. ‘‘ఎస్సార్.’’ ‘‘భార్య పోతే ఏమిటి ఈయనకి ఇంత ఆనందం?’’ వానర్ వేన్లో సీఐని అడిగాడు. ‘‘నీకు పెళ్ళి కాలేదా?’’ ‘‘కాలేదు సార్.’’ ‘‘అందుకే తెలీలేదు.’’ ‘‘ఏమిటి ఇవాళ ఇంత మందిని తెస్తున్నారు?’’ జైలర్ వానర్ని ఎగాదిగా చూసి ిసీఐని అడిగాడు. ‘‘వాతావరణం వేడిగా ఉంది కదండి.’’ వాతావరణం నలభై డిగ్రీల సెల్సియ్‌స్ దాటితే నేరాలు అధికంగా జరుగుతాయన్నది పోలీస్ శాఖలో పని చేేన సీఐ అనుభవం. పోలీసులకి వానర్ ఇచ్చిన స్టేట్మెంట్ని చదివి జైలర్ అడిగాడు. ‘‘ఇది నీ సంతకమేగా?’’ ‘‘అవునండి. నేను దాన్ని ఫోర్జరీ చేయలేదండి’’ వానర్ జవాబు చెప్పాడు. ‘‘నిన్నెక్కడో చూసినట్లుంది?’’ ‘‘టివిలో చూసి ఉంటారు సార్.’’ ‘‘టివి ఏక్టర్వా?’’ ‘‘కాదు సార్. హిజ్రా అసోసియేషన్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం వారానికి నాలుగు గంటలు ఛారిటీ వర్క్ చేస్తూంటాను.’’ ‘‘నీ పేరు?’’ ‘‘వానర్.’’ జైలర్ ఉలిక్కిపడి సిఐని చూసి అడిగాడు. ‘‘ఇవాళ వరసగా కోతుల్ని పట్టుకొస్తున్నారేమిటి?’’ ‘‘ప్రజలు ఒకప్పుడు వెరైటీ పేర్ల కోసం తెగ ఇదైపోయేవారండి. ఈ రోజుల్లో ఎవరికీ లేని కొత్త పేర్ల కోసం ఇదవుతున్నారు. మా అన్నయ్య కొడుక్కి మృగ్ అనే పేరు పెట్టారు’’ ిసీఐ వివరించాడు. ‘‘పాపం! నీ వయసెంతో?’’ జైలర్ అడిగాడు. ‘‘నలభై రెండు సార్’’ సీఐ వెంటనే చెప్పాడు. ‘‘నీది కాదు. నీది’’ వానర్ వంక వేలితో చూపించాడు. ‘‘ఈయన వయసుకి పంతొమ్మిది తక్కువ సార్.’’ ‘‘నేను ఇంజనీరింగ్ చదవలేదు. లెక్కలు సరిగ్గా రావు. నీ వయసెంతో సూటిగా చెప్పు.’’ ‘‘ఇరవై మూడు సార్.’’ ‘‘నువ్వు కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షనా?’’ ‘‘అవును సార్.’’ ‘‘ఆపరేషన్స్ రీసెర్చ్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో?’’ ‘‘ఎయిటీ ఫైవ్ సర్.’’ ‘‘ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేశావా?’’ ‘‘చేసాను సార్.’’ ‘‘మరి దాంట్లో ఎందుకు చేరలేదు?’’ ‘‘ఇంటర్వ్యూలో తుస్సుమంది సార్.’’ (వానర్ ఏ మూర్ఖపు పనితో పోలీసుకి పట్టుబడ్డాడు?) -
త్రీ మంకీస్ - 2
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 2 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నమ్ముతాను, చెప్పు.’’ ‘‘మా పక్కిల్లే.’’ ‘‘యువర్ ఆనర్. సాక్షి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు’’ లాయర్ మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేసాడు. ‘‘మీ అన్ని ప్రశ్నలకి సరైన జవాబులు ఇస్తూనే ఉన్నాడుగా? సరే. మిగిలిన సాక్షులని విచారించండి’’ యమధర్మరాజు డిఫెన్స్ లాయర్‌కి సూచించాడు. ‘‘వారు రాలేదండి.’’ ‘‘సాక్షులు లేకుండా కేసు ఎలా విచారించను? విట్నెన్ నంబర్ ఫైవ్ లక్ష్మీపతి గారు వచ్చారా?’’ యమధర్మరాజు ఫైల్లోకి చూసి టిక్ పెట్టుకుంటూ అడిగాడు. ‘‘లేరు యువర్ ఆనర్. ఆయన అప్పు కోసం వెళ్ళారు.’’ ‘‘మిగిలిన విట్నెస్ల మాటేమిటి?’’ ‘‘యువర్ ఆనర్, విట్నెస్ నంబర్ సిక్స్ గుండురావు గారు హెయిర్ కటింగ్ చేయించుకోడానికి వెళ్ళారు. నంబర్ సెవెన్ కరుణాకర్ గారు కబేళాకి డ్యూటీకి వెళ్ళారు. క్రైమ్ సీన్లో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ సూర్యారావు గారు కూడా డార్క్ రూంలో ఉన్నారు. శవపరీక్ష చేసిన డాక్టర్ భిక్షపతి గారు అన్నదానం చెయ్యడానికి వెళ్ళారు. కాబట్టి వాయిదా కోరుతున్నాను యువర్ ఆనర్’’ డిఫెన్స్ లాయర్ చెప్పాడు. దాన్ని పదహారో తారీకుకి వాయిదా వేసాక తర్వాతి కేసు విచారణ చివరికి రావడంతో దాని కోసం మెజిస్ట్రేట్ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. ‘‘యువర్ ఆనర్, సెప్టెంబర్ పదహారవ తారీకు పర్చేస్ ఆర్డర్ ప్రకారం సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో నించి టమోటా బుట్టలు నగరంలోని సంక్షేమ ప్రభుత్వ హాస్టల్‌కి అందాయి. ఐతే అవన్నీ కుళ్ళిపోయి పనికి రాకుండా పోయాయి. అందువల్ల సంక్షేమ శాఖ డెరైక్టర్ పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పించమని కోర్టు వారిని చివరగా అభ్యర్థిస్తున్నాను.’’ సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో లాయర్ కోరాడు. ‘‘కాని నా క్లయింట్ ఆర్డర్ చేసింది మంచి టమోటా పళ్ళు తప్ప కుళ్ళినవి కావు. ఎగ్జిబిట్ ఏ గా ప్రవేశపెట్టబడ్డ పర్చేస్ ఆర్డర్‌ని చూడండి’’ సంక్షేమ శాఖ డెరైక్టర్ తరఫు ప్రభుత్వ లాయర్ తన వాదనని వినిపించాడు. ‘‘యువర్ ఆనర్. నా క్లయింట్ సత్తిపండు అఫిడవిట్లోనే కారణం పేర్కొన్నాడు. దారిలో తుఫాను వచ్చి, వాగు పొంగి, చెట్లు కూలి వాటిని రవాణా చేేన లారీ నాలుగు రోజులు ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఒక్క లారీనే గాలికి ఎగిరిపోలేదు. లేదా వాళ్ళకి చితికిన పళ్ళు సరఫరా అయేవి. సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో వారు సరైన సమయానికే టమోటా పళ్ళని లారీకి ఎక్కించారు కాబట్టి నా క్లయింట్ తప్పు లేదు.’’ వారిద్దరి వాదనలు పూర్తయ్యాక యమధర్మరాజు తీర్పు చదివాడు. ‘‘సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో యజమాని అయిన సత్తిపండు దురదృష్టవశాత్తు దేవుడు కాడు. కాబట్టి అతనికి తుఫాను వస్తుందని ముందుగా తెలీదు. దేవుడు కాడు కాబట్టి సత్తిపండు ఆ తుఫానుని కూడా సృష్టించలేదు. అతను దేవుడై ఉంటే అతను సరఫరా చేసిన టమోటాలకి ఏం చెల్లించక్కర్లేదు అన్నది న్యాయం. కాని సత్తిపండుకి దేవుడితో పరిచయం ఉందని, ఆయన వాళ్ళింటికి వచ్చి పోతుంటాడని కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి నేను విశ్వసించను. టమోటా పళ్ళు సకాలానికి చేరుతాయనే విశ్వాసంతో అతను వాటిని లారీకి ఎక్కించాడు కాబట్టి సంక్షేమ శాఖ డెరైక్టర్ అతని బిల్‌ని పర్చేస్ ఆర్డర్ ప్రకారం చెల్లించి తీరాలి. జరిగిన ఆలస్యానికి డిఫెండెంట్ కోరిన ఖర్చులు, పన్నెండు శాతం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పడమైనది. నె క్ట్స్ కేస్.’’ ‘‘మీవి కొత్త మొహాల్లా ఉన్నాయి. యువర్ ఆనర్ గారు శబ్దాన్ని భరించలేరు. పెద్దగా దగ్గడం, తుమ్మడం చేయకండి’’ గుమ్మం దగ్గర కోర్టు బంట్రోతు సిఐ లోపలికి తీసుకెళ్ళే ఇద్దరు ముద్దాయిలని హెచ్చరించాడు. ‘‘అవును. ఓసారి పెద్దగా ఆవలించిన వాడిని కోర్టు ముగిసేదాకా కోర్టు హాల్లో ఒంటి కాలి మీద నించోవాలనే శిక్షని విధించాడు’’ సిఐ కూడా ముద్దాయిలకి చెప్పాడు. ‘‘ఎందుకని?’’ ఓ ముద్దాయి లింబాద్రి అడిగాడు. ‘‘మిసెస్ యువర్ ఆనర్ గయ్యాళి గంపమ్మ. ఇంట్లో ఆవిడ నిద్రపోయే దాకా ఆయన చెవులకి పని ఇస్తూనే ఉంటుంది. దాంతో ఆయన ఇటీవల ఓ సెల్ ఫోన్‌ని కొనిచ్చాక ఈయనతో ఆవిడ గారి మాటలు కొద్దిగా తగ్గాయట. కాని కోర్టులో శబ్దాన్ని భరించలేరు’’ బంట్రోతు చెప్పాడు. ‘‘భార్య గుర్తొస్తుందని కాబోలు’’ రెండో ముద్దాయి కపీష్ సానుభూతిగా చెప్పాడు. యూనిఫాంలో ఉన్న సిఐ యమధర్మరాజుకి నమస్కరించి చెప్పాడు. ‘‘సర్! ఇద్దరు ముద్దాయిలని కస్టడీకి ఇవ్వమని కోరడానికి తెచ్చాను.’’ ‘‘ఎవరు వారు? ఏమిటా కేసులు?’’ చేతి గడియారం వంక చూసుకుని యమధర్మరాజు విసుగ్గా అడిగాడు. ‘‘మొదటి ముద్దాయి పాత కేడీ లింబాద్రి. సినిమా హాల్లో ఓ మహిళ పదకొండు గ్రాముల బంగారు గొలుసు కొట్టేని దాన్ని గుటుక్కున మింగాడు. ఎక్స్‌రేలో అది కనిపించలేదు. ఎండోస్కోపీలో కనిపించింది సార్.’’ సిఐ మెజిస్ట్రేట్‌కి హాస్పిటల్ రిపోర్ట్లని అందించి చెప్పాడు. ‘‘ఎందుకు మింగావు?’’ యమధర్మరాజు గద్దించాడు. ‘‘రెండు రోజుల నించి భోజనం లేక సార్’’ లింబాద్రి మెల్లిగా చెప్పాడు. ‘‘సరే. అరటిపళ్ళు తినిపించారా?’’ రిపోర్ట్లని చూసాక మెజిస్ట్రేట్ అడిగాడు. ‘‘లేదండి.’’ ‘‘ఐతే వాటిని వెంటనే తినిపించండి’’ యమధర్మరాజు చెప్పాడు. ‘‘ఎన్ని యువర్ ఆనర్?’’ ‘‘ఓ ఎనిమిది డజన్లు.’’ ‘‘అంటే తొంభై ఆరు’’ లింబాద్రి చెప్పాడు. ‘‘నీకు లెక్కలు సరిగ్గా రాకపోతే నోరు మూసుకో. తొంభై రెండు’’ యమధర్మరాజు మళ్ళీ గద్దించాడు. ‘‘యస్ యువర్ ఆనర్’’ సిఐ చెప్పాడు. ‘‘హైద్రాబాద్ ట్రాఫిక్ని నమ్మలేం. రిమాండ్‌కి చేరుకునేదాకా మాత్రం అరటిపండన్నది తినిపించకండి. పధ్నాలుగు రోజులు రిమాండ్.’’ అకస్మాత్తుగా కోర్టు హాల్లో ఎవరిదో సెల్ ఫోన్ మోగింది. ‘రింగరింగరింగరింగారే’ అంటూ రింగ్ టోన్. ‘‘చచ్చాడు’’ సిఐ లోగొంతుకతో ఇద్దరు ముద్దాయిలకీ చెప్పాడు. ‘‘ఎవరిదా ఫోన్?’’ అది ఎక్కడ్నించి వస్తోందో అర్థం కాక తీవ్రంగా చూస్తూ యమధర్మరాజు అడిగాడు. ఎవరూ బదులు పలకలేదు. ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. 3monkies.sakshi@gmail.com