త్రీ మంకీస్ - 2
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 2
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘నమ్ముతాను, చెప్పు.’’
‘‘మా పక్కిల్లే.’’
‘‘యువర్ ఆనర్. సాక్షి సరైన సమాధానాలు ఇవ్వడం లేదు’’ లాయర్ మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేసాడు.
‘‘మీ అన్ని ప్రశ్నలకి సరైన జవాబులు ఇస్తూనే ఉన్నాడుగా? సరే. మిగిలిన సాక్షులని విచారించండి’’ యమధర్మరాజు డిఫెన్స్ లాయర్‌కి సూచించాడు.
‘‘వారు రాలేదండి.’’
‘‘సాక్షులు లేకుండా కేసు ఎలా విచారించను? విట్‌నెన్ నంబర్ ఫైవ్ లక్ష్మీపతి గారు వచ్చారా?’’ యమధర్మరాజు ఫైల్‌లోకి చూసి టిక్ పెట్టుకుంటూ అడిగాడు.
‘‘లేరు యువర్ ఆనర్. ఆయన అప్పు కోసం వెళ్ళారు.’’
‘‘మిగిలిన విట్‌నెస్‌ల మాటేమిటి?’’
‘‘యువర్ ఆనర్, విట్‌నెస్ నంబర్ సిక్స్ గుండురావు గారు హెయిర్ కటింగ్ చేయించుకోడానికి వెళ్ళారు. నంబర్ సెవెన్ కరుణాకర్ గారు కబేళాకి డ్యూటీకి వెళ్ళారు. క్రైమ్ సీన్‌లో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ సూర్యారావు గారు కూడా డార్క్ రూంలో ఉన్నారు. శవపరీక్ష చేసిన డాక్టర్ భిక్షపతి గారు అన్నదానం చెయ్యడానికి వెళ్ళారు. కాబట్టి వాయిదా కోరుతున్నాను యువర్ ఆనర్’’ డిఫెన్స్ లాయర్ చెప్పాడు.
దాన్ని పదహారో తారీకుకి వాయిదా వేసాక తర్వాతి కేసు విచారణ చివరికి రావడంతో దాని కోసం మెజిస్ట్రేట్ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు.
‘‘యువర్ ఆనర్, సెప్టెంబర్ పదహారవ తారీకు పర్చేస్ ఆర్డర్ ప్రకారం సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో నించి టమోటా బుట్టలు నగరంలోని సంక్షేమ ప్రభుత్వ హాస్టల్‌కి అందాయి. ఐతే అవన్నీ కుళ్ళిపోయి పనికి రాకుండా పోయాయి. అందువల్ల సంక్షేమ శాఖ డెరైక్టర్ పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పించమని కోర్టు వారిని చివరగా అభ్యర్థిస్తున్నాను.’’ సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో లాయర్ కోరాడు.
‘‘కాని నా క్లయింట్ ఆర్డర్ చేసింది మంచి టమోటా పళ్ళు తప్ప కుళ్ళినవి కావు. ఎగ్జిబిట్ ఏ గా ప్రవేశపెట్టబడ్డ పర్చేస్ ఆర్డర్‌ని చూడండి’’ సంక్షేమ శాఖ డెరైక్టర్ తరఫు ప్రభుత్వ లాయర్ తన వాదనని వినిపించాడు.
‘‘యువర్ ఆనర్. నా క్లయింట్ సత్తిపండు అఫిడవిట్లోనే కారణం పేర్కొన్నాడు. దారిలో తుఫాను వచ్చి, వాగు పొంగి, చెట్లు కూలి వాటిని రవాణా చేేన లారీ నాలుగు రోజులు ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఒక్క లారీనే గాలికి ఎగిరిపోలేదు. లేదా వాళ్ళకి చితికిన పళ్ళు సరఫరా అయేవి. సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో వారు సరైన సమయానికే టమోటా పళ్ళని లారీకి ఎక్కించారు కాబట్టి నా క్లయింట్ తప్పు లేదు.’’
వారిద్దరి వాదనలు పూర్తయ్యాక యమధర్మరాజు తీర్పు చదివాడు.
‘‘సత్తిపండు అండ్ ఫ్రూట్స్ కో యజమాని అయిన సత్తిపండు దురదృష్టవశాత్తు దేవుడు కాడు. కాబట్టి అతనికి తుఫాను వస్తుందని ముందుగా తెలీదు. దేవుడు కాడు కాబట్టి సత్తిపండు ఆ తుఫానుని కూడా సృష్టించలేదు. అతను దేవుడై ఉంటే అతను సరఫరా చేసిన టమోటాలకి ఏం చెల్లించక్కర్లేదు అన్నది న్యాయం. కాని సత్తిపండుకి దేవుడితో పరిచయం ఉందని, ఆయన వాళ్ళింటికి వచ్చి పోతుంటాడని కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి నేను విశ్వసించను. టమోటా పళ్ళు సకాలానికి చేరుతాయనే విశ్వాసంతో అతను వాటిని లారీకి ఎక్కించాడు కాబట్టి సంక్షేమ శాఖ డెరైక్టర్ అతని బిల్‌ని పర్చేస్ ఆర్డర్ ప్రకారం చెల్లించి తీరాలి. జరిగిన ఆలస్యానికి డిఫెండెంట్ కోరిన ఖర్చులు, పన్నెండు శాతం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పడమైనది. నె క్ట్స్ కేస్.’’
‘‘మీవి కొత్త మొహాల్లా ఉన్నాయి. యువర్ ఆనర్ గారు శబ్దాన్ని భరించలేరు. పెద్దగా దగ్గడం, తుమ్మడం చేయకండి’’ గుమ్మం దగ్గర కోర్టు బంట్రోతు సిఐ లోపలికి తీసుకెళ్ళే ఇద్దరు ముద్దాయిలని హెచ్చరించాడు.
‘‘అవును. ఓసారి పెద్దగా ఆవలించిన వాడిని కోర్టు ముగిసేదాకా కోర్టు హాల్లో ఒంటి కాలి మీద నించోవాలనే శిక్షని విధించాడు’’ సిఐ కూడా ముద్దాయిలకి చెప్పాడు.
‘‘ఎందుకని?’’ ఓ ముద్దాయి లింబాద్రి అడిగాడు.
‘‘మిసెస్ యువర్ ఆనర్ గయ్యాళి గంపమ్మ. ఇంట్లో ఆవిడ నిద్రపోయే దాకా ఆయన చెవులకి పని ఇస్తూనే ఉంటుంది. దాంతో ఆయన ఇటీవల ఓ సెల్ ఫోన్‌ని కొనిచ్చాక ఈయనతో ఆవిడ గారి మాటలు కొద్దిగా తగ్గాయట. కాని కోర్టులో శబ్దాన్ని భరించలేరు’’ బంట్రోతు చెప్పాడు.
‘‘భార్య గుర్తొస్తుందని కాబోలు’’ రెండో ముద్దాయి కపీష్ సానుభూతిగా చెప్పాడు.
యూనిఫాంలో ఉన్న సిఐ యమధర్మరాజుకి నమస్కరించి చెప్పాడు.
‘‘సర్! ఇద్దరు ముద్దాయిలని కస్టడీకి ఇవ్వమని కోరడానికి తెచ్చాను.’’
‘‘ఎవరు వారు? ఏమిటా కేసులు?’’ చేతి గడియారం వంక చూసుకుని యమధర్మరాజు విసుగ్గా అడిగాడు.
‘‘మొదటి ముద్దాయి పాత కేడీ లింబాద్రి. సినిమా హాల్లో ఓ మహిళ పదకొండు గ్రాముల బంగారు గొలుసు కొట్టేని దాన్ని గుటుక్కున మింగాడు. ఎక్స్‌రేలో అది కనిపించలేదు. ఎండోస్కోపీలో కనిపించింది సార్.’’
సిఐ మెజిస్ట్రేట్‌కి హాస్పిటల్ రిపోర్ట్‌లని అందించి చెప్పాడు.
‘‘ఎందుకు మింగావు?’’ యమధర్మరాజు గద్దించాడు.
‘‘రెండు రోజుల నించి భోజనం లేక సార్’’ లింబాద్రి మెల్లిగా చెప్పాడు.
‘‘సరే. అరటిపళ్ళు తినిపించారా?’’ రిపోర్ట్‌లని చూసాక మెజిస్ట్రేట్ అడిగాడు.
‘‘లేదండి.’’
‘‘ఐతే వాటిని వెంటనే తినిపించండి’’ యమధర్మరాజు చెప్పాడు.
‘‘ఎన్ని యువర్ ఆనర్?’’
‘‘ఓ ఎనిమిది డజన్లు.’’
‘‘అంటే తొంభై ఆరు’’ లింబాద్రి చెప్పాడు.
‘‘నీకు లెక్కలు సరిగ్గా రాకపోతే నోరు మూసుకో. తొంభై రెండు’’ యమధర్మరాజు మళ్ళీ గద్దించాడు.
‘‘యస్ యువర్ ఆనర్’’ సిఐ చెప్పాడు.
‘‘హైద్రాబాద్ ట్రాఫిక్‌ని నమ్మలేం. రిమాండ్‌కి చేరుకునేదాకా మాత్రం అరటిపండన్నది తినిపించకండి. పధ్నాలుగు రోజులు రిమాండ్.’’
అకస్మాత్తుగా కోర్టు హాల్లో ఎవరిదో సెల్ ఫోన్ మోగింది. ‘రింగరింగరింగరింగారే’ అంటూ రింగ్ టోన్.
‘‘చచ్చాడు’’ సిఐ లోగొంతుకతో ఇద్దరు ముద్దాయిలకీ చెప్పాడు.
‘‘ఎవరిదా ఫోన్?’’ అది ఎక్కడ్నించి వస్తోందో అర్థం కాక తీవ్రంగా చూస్తూ యమధర్మరాజు అడిగాడు.
ఎవరూ బదులు పలకలేదు.
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,
సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. 3monkies.sakshi@gmail.com