త్రీ మంకీస్ - 19 | three monkeys daily serial - 19 | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 19

Published Fri, Nov 7 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

త్రీ మంకీస్ - 19

త్రీ మంకీస్ - 19

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 19 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

‘‘మన ముఖ్య అతిథి వచ్చేశారు... ఇది ఆఖరి జోక్... పాకిస్థాన్ ప్రెసిడెంట్ నుంచి భారత రాష్ట్రపతికి కానుకగా ఓ పార్సెల్ అందింది. సెక్యూరిటీ వారు దాన్ని తనిఖీ చేసి బాంబులేం లేవని నిర్ధారించాక ఆయన దాన్ని తెరిచి చూస్తే అందులో మలం ఉంది. ‘మీకు, మీ భారతీయులకి’ అని రాసి ఉంది. రాజకీయ చాణక్యుడైన మన రాష్ట్రపతికి ఇదో లెక్కా? పాకిస్థాన్ ప్రెసిడెంట్‌కి భారత రాష్ట్రపతి నించి బదులుగా అలాంటి ఓ పార్సెల్ వెళ్ళింది. దాన్ని వాళ్ళు విప్పి చూస్తే అందులో వాళ్ళు భయపడ్డట్లుగా బాంబ్ కాక, ఏ మొబైల్ ఫోన్‌తోనైనా ఆపరేట్ చేేన 1800 జిబి మెమొరీ గల అతి చిన్న కంప్యూటర్, త్రిడి హాలోగ్రాం మానిటర్ కనిపించాయి. అది భారతీయ ఐటి నిపుణులు రూపొందించిన అత్యాధునిక లేప్‌టాప్. దాంతోపాటు వచ్చిన కాగితంలో ఇలా రాసి ఉంది. ‘ఓ నాయకుడు తమ ప్రజలు తయారు చేసేదే ఇంకో దేశాధినేతకి బహుమతిగా పంపగలడు.’’
 
ప్రేక్షకులంతా గట్టిగా ఈలలు వేసూ చప్పట్లు కొట్టారు.
‘‘పాకిస్థాన్‌లోని రావల్పిండిలో దిగిన ఓ విమానం లోంచి ఓ ఆఫ్ఘనిస్తానీ దిగి ఇమిగ్రేషన్ కౌంటర్‌కి వెళ్ళాడు. ‘మీరేం చేస్తూంటారు?’ అని పాకిస్థానీ ఇమిగ్రేషన్ అధికారి ప్రశ్నిస్తే ‘నేను అఫ్ఘనిస్తాన్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్‌ని’ అని జవాబు చెప్పాడు. ‘అబద్ధం. అఫ్ఘనిస్తాన్‌కి సముద్రమే లేనప్పుడు నీ అండ్ పోర్ట్స్ మినిస్టర్ ఎలా ఉంటాడు?’ అని ఇమిగ్రేషన్ అధికారి గద్దిస్తే ‘మీ పాకిస్థాన్‌లో లా లేకపోయినా లా మినిష్టర్ ఉన్నట్లుగానే’ అని అతను జవాబు చెప్పాడు.’’
 మళ్ళీ గట్టిగా ఈలలు, చప్పట్లు వినిపించాయి.

 ‘‘ఇంకొక్క జోక్‌కి టైం ఉన్నట్లుంది... అనగనగా ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగారు. ఎలాగైనా గెలవాలనుకున్న ఓ అభ్యర్థి ఓటుకి వెయ్యి రూపాయల చొప్పున తళతళలాడే కొత్త కరెన్సీ నోట్లని పంచిపెట్టి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఈ సంగతి తెలుసుకున్న రెండో అభ్యర్థి ఓటర్ల వద్దకి వెళ్ళి ఆ అభ్యర్థి పంచిన నోట్లన్నీ దొంగ నోట్లని ప్రచారం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. మూడో అభ్యర్థి పాత ఐదు వందల రూపాయల నోట్లతో ఓటర్లని కలుసుకుని కొత్త వెయ్యి నోటుకి పాత ఐదు వందల నోటు మార్పిడి చేసి ‘చూశారా? మీ దొంగ నోటుకి అసలు నోటిచ్చాను. మీ ఓట్లన్నీ నాకే’ అని  చెప్పాడు. ఓట్లతో పాటు ఓటరుకి అయిదు వందల రూపాయల చొప్పున అతగాడు లాభం పొందాడు... థాంక్స్ ఫర్ ఎంజాయింగ్ ది జోక్స్. బికాస్ ఐ యామ్ నాట్ గ్రేట్. బికాస్ దే ఆర్ వర్త్ ఎంజాయింగ్.’’
 
జోక్స్ మధ్యలో కపీష్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలోకి వచ్చాడు. అతను వానర్‌కి కనుసైగ చేశాడు. బదులుగా వానర్ కూడా కనుసైగ చేశాడు. లోపలకి వచ్చిన మర్కట్ కపీష్ చెవిలో ఏదో గుసగుసలాడాడు.
 ‘‘వెరీ గుడ్’’ కపీష్ చెప్పాడు.
 ఆ ముగ్గురూ చదివే ఇంజనీరింగ్ కాలేజీకి ముఖ్య అతిథిగా వచ్చింది, దాన్లో బినామీ భాగస్వామ్యం గల ఓ ఎం.పి. ఆయన స్టేజి మీదకి రాగానే విద్యార్థులంతా కావాలని గట్టిగా చప్పుడు చేస్తూ ఆవులిస్తూంటే ప్రిన్స్‌పాల్ గట్టిగా అరిచాడు.
 ‘‘సెలైన్స్, సెలైన్స్’’.
 ముందు సీట్లోని కపీష్‌ని, అతను ధరించిన టీషర్ట్ మీది అక్షరాలని చూసి ముఖం చిట్లించాడు. ఆ ఎర్ర టీ షర్ట్ మీద నల్ల అక్షరాల్లో ఇలా ముద్రించి ఉంది.
 
‘ఐ యాం సెలైంట్లీ కరెక్టింగ్ యువర్ గ్రామర్’
 ప్రిన్స్‌పాల్ కోపంగా అందరి వంకా చూసి చెప్పాడు.
 ‘‘పూర్వం తల మీది టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. మీరు మీ చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని తీసి వీరికి మీ గౌరవాన్ని తెలపండి.’’
 
అయిష్టంగానే అంతా హెడ్‌ఫోన్స్‌ని ఓ వైపు చెవుల నించి మరోవైపు స్మార్ట్‌ఫోన్‌ల నించి తీసేశారు. విద్యార్థుల చేష్టలని పట్టించుకోకుండా ముఖ్య అతిథి స్పీచ్‌ని చెప్పాడు. తన సెక్రటరీ రాసిచ్చిన స్పీచ్  కాదది. ఆశువుగా చెప్పాడు.
 ‘‘ముందుగా నాకు చాలా మంచి బట్టలు ఉన్నాయి. ప్రతిపక్షాలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాసిన బట్టలతో వచ్చాను. మీరు కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ జీవితంలోని చివరి దశ దాకా ప్రభుత్వం మీ జీవితాలని ఎన్నోవిధాల టచ్ చేస్తూనే ఉంటుంది. అసలు ప్రభుత్వం ఎలా పని చేస్తుంది? ప్రభుత్వంలో నేనో చిన్న భాగాన్ని కాబట్టి నాకు తెలిసింది చెప్తా వినండి. మీ అందరికీ ఇటుక అంటే ఏమిటో తెలుసు. తెలీని వాళ్ళు చేతులు ఎత్తండి.’’
 
దాదాపు అంతా చేతులు ఎత్తారు.
 ‘‘గుడ్. ప్రభుత్వం చేతికి ఇటుకని ఇస్తే ఇది వాటిని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తుందో చూడండి.  దీన్నిబట్టి ప్రభుత్వం అంటే ఏమిటో మీకు తెలిసిపోతుంది.’’
  వెంటనే ఆవులింత శబ్దాలు ఆగిపోయాయి.
 
 (కాలేజీలో నాలుగు గాడిదలు ఏవో తెలుసా?)
 - మళ్లీ  రేపు
 
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
లెటర్స్
* కపీస్, మర్కట్. వానర్ పేర్లు త్రీమంకీస్‌కు ఎంతగానో ఇమిడాయి. కలలో ఫేస్‌బుక్‌లో స్టేటస్ మార్చడం చివరి కోరికగా వానర్ చెప్పటం సహజసిద్ధ హాస్యాన్ని పండించింది. నవ్విస్తూ చదివిస్తున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి అభినందనలు.
 - కటుకోఝ్వుల రమేష్, ఇల్లందు, ఖమ్మం జిల్లా.
 ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గురించిన కామెడీ వివరణ నాకు బాగా నచ్చింది.సీరియల్ ఫన్నీగా ఉంది. - సాయి కీర్తి ముత్యాల (mutyalasaikeerthi@gmail.com)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement