త్రీ మంకీస్ | Three Monkeys | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్

Published Mon, Nov 10 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

త్రీ మంకీస్

త్రీ మంకీస్

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 22
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘మొదటి సారా జైలుకి రావడం?’’
 ‘‘అవును.’’
 ‘‘జైల్లో స్పూన్‌లు ఇవ్వరు. దాన్ని అరగదీసి కత్తిలా ఉపయోగించి తోటి ఖైదీలని చంపుతారని’’ వడ్డించేవాడు చెప్పాడు.
 ముగ్గురూ ఖాళీగా ఉన్న ఓ బల్ల ముందు కూర్చున్నారు. వాళ్ళు ప్లేట్‌లోది తాగబోతూంటే ఇందాక బాత్‌రూంలోని శాల్తీ గద్దించాడు.
 ‘‘లెండి. ఇది బాస్ బల్లని తెలీదా?’’
 వాళ్ళు లేచి ఇంకో బల్ల ముందు కూర్చుని ఉడికీ ఉడకని ఇడ్లీని తాగసాగారు.
 ‘‘ఛ! ఆకల్లేకపోతే ఇలాంటి ఇడ్లీలని పెట్టినందుకు హంగర్ స్ట్రయిక్ చేసేవాడిని.’’ మర్కట్ చెప్పాడు.    
 ‘‘తరచు జైల్లోంచి ఖైదీలు ఎందుకు పారిపోతూంటారో ఇప్పుడు నాకు అర్థమైంది. జైలుని అత్తవారింటితో పోల్చడం అనుభవం లేని వాళ్ళు చేసేది.’’ వానర్ కసిగా చెప్పాడు.
 ‘‘వాడి ప్లేట్‌లో చూడండి’’ కపీష్ గొంతు తగ్గించి చెప్పాడు.
 చూస్తే పక్క టేబిల్‌లో దుర్యోధన్ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అతని ప్లేట్‌లో యంఎల్‌ఏ పెసరట్, ఓ గారె, వెన్న రాసి నవనవలాడే రెండు ఇడ్లీలు కనిపించాయి.
 ‘‘అది హోటల్ నించి తెచ్చిందిలా ఉంది’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘అదిగో. కవర్ మీద మినర్వా కాఫీ షాప్ అని ఉంది. వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ ఉందని మనకి ఎవరూ చెప్పలేదే?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘అదేం కాదు. బలం రిజర్వేషన్ కేసు. జైల్లో ఏదైనా జరగచ్చు’’ కపీష్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
 ‘‘అన్నట్లు మన కాలేజీలో రమ్య రాముతో నీ ప్రేమ వ్యవహారం ఎంతదాకా వచ్చింది?’’ వానర్ మర్కట్‌ని అడిగాడు.
 ‘‘అవును. మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు కదా?’’ కపీష్ అడిగాడు.
 ‘‘అది ఫెయిలైంది’’ మర్కట్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
 ‘‘అరెరె! నువ్వు ఆ అమ్మాయిని పీజా హట్‌కి. కెఎఫ్‌సికి, కాఫీ డేకి బాగానే తీసుకెళ్ళే వాడివిగా?’’
 ‘‘అవును. రమ్య రాము ఓ రోజు అసలు విషయం కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది’’ మర్కట్ బాధగా చెప్పాడు.
 ‘‘ఏమని?’’ వానర్ ఆసక్తిగా అడిగాడు.
   
 వాళ్ళిద్దరూ ఇనార్బిట్ మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో చైనీస్ నూడుల్స్ తింటున్నారు.
 ‘‘నీకు ఇవాళ ఆకలి ఎక్కువగా ఉన్నట్లుంది?’’ మర్కట్ రమ్య రాముని అడిగాడు.
 ‘‘అవును. ఎందుకంటే ఇది నువ్వు నాకు చెల్లించే ఆఖరి బిల్లు కదా? ఓ ప్లేట్ ఇడ్లీ కూడా తీసుకురా.’’
 ‘‘ఆఖరి బిల్లేమిటి?’’
 ‘‘చెప్తే ఇడ్లీ తీసుకురావు. ముందు అది తే.’’
 మర్కట్ లేచి వెళ్ళి ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాక అడిగాడు.
 ‘‘ఊ. ఇప్పుడు చెప్పు.’’
 ‘‘ఇక మీదట మనం కలవం కదా.’’
 ‘‘కలవమా? మనం ప్రేమికులం కదా. ఎందుకు కలవం?’’
 ‘‘మనది కాలేజీ ప్రేమ మాత్రమే. నీకోటి తెలుసా? నూడుల్స్‌కి సాంబార్ మంచి కాంబినేషన్. కాలేజీ గోడలు దాటి బయటకి వచ్చాక మన ప్రేమ బంద్.’’
 ‘‘ఎందుకని?’’
 ‘‘ఇక లైఫ్‌లో సీరియస్‌గా ప్రేమించదలచుకున్నాను.’’
 ‘‘ప్రేమలో ఈజీ, సీరియస్ ప్రేమలు ఉంటాయా?’’
 ‘‘అవును.’’
 ‘‘ఈజీ ప్రేమంటే?’’
 ‘‘శిక్షణా తరగతి లాంటిది. ఎలా ప్రేమించాలి అన్నది నేర్చుకోడానికి ఉపయోగించేది. నేను లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకునేది పిడబ్ల్యుడిలో ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ, ఎండలో నిలబడి రోడ్లు వేయించి, తారు అంటిన దుస్తుల్లో ఇంటికి వచ్చే భర్త కాదు. స్వంత కారు డ్రైవ్ చేసుకుంటూ శాన్‌ఫ్రాన్సిస్కోలోనో, న్యూజెర్సీలోనో స్వంత వ్యాపారం చేసేవాడిని.’’
 ‘‘నీ కడుపులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని నేను ఎన్నడూ అనుకోలేదు.’’
 ‘‘ఇప్పుడు ప్రతి అమ్మాయి కడుపులో ఉన్నది ఇదే. గుండెలు బాదుకోకు. ఎవర్ని ప్రేమిస్తే, అష్టకష్టాలైనా పడి, వాడినే పెళ్ళి చేసుకోవాలనుకునే బ్లాక్ అండ్ వైట్, తర్టీ ఫైవ్ ఎంఎం రోజులు కావివి. వైడ్ స్క్రీన్, కలర్, స్ట్టీరియోఫోనిక్, డిజిటల్ రోజులు. ఒకవేళ నచ్చి ప్రేమించినా వాడ్ని కాక ఎవరు కన్వీనియంటో వాడినే చేసుకునే రోజులివి. నా లైఫ్‌మేట్ దొరికాడు.’’
 ‘‘ముందే చెప్తే ఇడ్లీని కొనేవాడ్ని కాదు’’ మర్కట్ పళ్ళు పటపట కొరికాడు.
 ‘‘నాకది తెలుసు కనుకే ముందే కొనిపించాను. నీక్కావాలంటే ఇడ్లీ తిను. ఈ రోజుల్లో యూత్ ఎవరూ బర్గర్లు తప్ప ఇడ్లీలు తినరు. సాంబార్ కోసం కొనిపించానంతే.’’
 ‘‘ఎవరతను?’’
 ‘‘ఇప్పటికే ఫేస్‌బుక్‌లో పరిచయం అయి, చాట్‌లో అభిప్రాయాలు కలిసి స్కైప్‌లో పెళ్ళిచూపులు అయిపోయాయి.’’
 ‘‘ఇదన్యాయం రమ్యరాము.’’
 ‘‘నా ఫ్రెండ్స్‌ని ఎవర్నైనా ఇదే ప్రశ్న అడుగు. అన్యాయం కాదని చెప్పకపోతే చెప్పు తీసుక్కొట్టు. అక్కడ మసాలా టీ బావుంటుంది. ఇద్దరికీ పట్రా. ఇంద.’’
 హేండ్ బేగ్ తెరిచి డబ్బు ఇవ్వబోయింది.
 (ఫేస్‌బుక్ తెరవడం ఎందుకంత కష్టం?)
 
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement