త్రీ మంకీస్ - 15
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 15
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
దుర్యోధన్ గార్డ్ వెనకే నడిచాడు.
‘‘సర్. నేనోటి అడగచ్చా?’’ గార్డ్ సందేహిస్తూ అడిగాడు.
‘‘ఏమిటో చెప్తే అడగచ్చో, లేదో చెప్తాను.’’
‘‘మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా అని అడగచ్చా?’’
‘‘అడగచ్చు. అడుగు.’’
‘‘సార్. మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా?’’
‘‘ఎవరూ పెట్టలేదు. నేనూ పెట్టుకోలేదు. మా నాన్నే ఆ పేరు పెట్టాడు.’’
‘‘దేనికని అడగచ్చా సార్?’’
‘‘అడగచ్చు. అడుగు.’’
‘‘దేనికి మీ నాన్న మహాభారతంలోని ఓ విలన్ పేరు మీకు ఎందుకు పెట్టారు?’’
‘‘మా నాన్న మహాభారతం చదవలేదు. చూడలేదు. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ ఎన్టీఆర్ కాదు. ఇతన్ని పుట్టించిన బాబుని పుట్టించిన ఎన్టీఆర్ అభిమాని. ఆయన నటించిన డివిఎస్ కర్ణ చూసి మూర్ఛపోయి నాకీ పేరు పెట్టారు.’’
‘‘డివిఎస్ కర్ణ? అంటే?’’
‘‘దాన వీర శూర కర్ణ. అందులో ఆయన దుర్యోధనుడిగా నటించిన తీరు చూసి మా నాన్న నాకా పేరు పెట్టారు.’’
‘‘మీ అన్న పేరు సర్?’’
‘‘మీ అన్న పేరు అడగచ్చా అని అడగాలి.’’
‘‘మీ అన్న పేరు అడగచ్చా సర్?’’
‘‘అడగచ్చు. అడుగు.’’
‘‘మీ అన్న పేరు సర్?’’
‘‘రావణ్.’’
‘‘ఆ పేరుకీ ఓ చరిత్ర ఉందాండి అని అడగచ్చా?’’
‘‘అడగచ్చు. ఉంది. మా నాన్న ఎన్టీఆర్ నటించిన సీతారామకళ్యాణం, భూకైలాస్‌లు చూశాడు. వాటిలో రావణుడిగా నటించిన ఎన్టీఆర్ నటనని చూసి మూర్ఛపోయాడు. ఆయన నటనతో ఆ పాత్రల మీద అభిమానం ఏర్పడి మా అన్నకి స్ట్టైల్‌గా రావణ్ అనే పేరు పెట్టాడు.’’
ఇద్దరూ జైలు ఆవరణలోని ఆరుబయటకి చేరుకున్నారు. అక్కడ ఓ వైపు రిమాండ్ ఖైదీలంతా వరసగా నిలబడి ఉన్నారు. దుర్యోధన్ ఆ వరసలోకి వెళ్ళి నిలబడ్డాడు. అతను రాగానే జైలర్ విజిల్ ఊది రోల్ కాల్ పిలవసాగాడు.
‘‘అంతా వచ్చేసినట్లేనా?’’
‘‘వచ్చేసినట్లే’’ కొందరు జవాబు చెప్పారు.
‘‘రాని వారు చేతులెత్తండి... వెరీ గుడ్. ఎవరూ చేతిని ఎత్తలేదంటే ఎవరూ సెల్స్‌లో లేరన్నమాట... నంబర్ ఫైవ్ సిక్స్ త్రి ఎయిట్.’’
‘‘ప్రజెంట్ సార్’’ ఓ జేబు దొంగ ఓ అడుగు ముందుకి వేసి చెప్పాడు.
‘‘నంబర్ ఫైవ్ సిక్స్ త్రి నైన్.’’
‘‘ఎస్సార్’’ ఓ చెయిన్ స్నాచర్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు.
‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో.’’
‘‘హాజర్ సాబ్’’ ఇళ్ళకి కన్నం వేసేదొంగ ఓ అడుగు ముందుకు వేసి చెప్పాడు.
అక్కడికి కొద్ది దూరంలో ఆడ ఖైదీలు నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర రక్షణగా ఉన్న మహిళా గార్డ్ ఇటువైపు చూస్తే, తన వంకే కళ్ళప్పగించి చూసే మర్కట్ కనిపించాడు. ఆమె తన వంక చూడగానే అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె ముందు సందేహించినా తర్వాత నవ్వింది. అతను చేతిని ఊపాడు. ఆమె బదులుగా చేతిని ఊపలేదు.
‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్’’ జైలర్ తర్వాతి నంబర్ పిలిచాడు.
ఎవరూ ముందుకు రాలేదు. హాజరు పలకలేదు.
‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్... కపీష్’’
తన పేరు వినగానే కపీష్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు.
‘‘ప్రజెంట్ సార్. పేరు పెట్టి పిలుస్తారనుకున్నాను.’’
‘‘ఇక్కడ పేర్లుండవు. అందుకే నంబర్లు ఇచ్చారు. నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు...’’
మళ్ళీ ఎవరూ ముందుకు రాలేదు.
‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... మర్కట్.’’
‘‘ప్రజెంట్ సార్.’’
‘‘నీకూ ప్రత్యేకంగా చెప్పాలా, పేర్లుండవు, నంబర్లకే హాజరు పలకాలని? మీ ఇంజనీర్ క్లాసుల్లో నంబర్లు పిలిచేవారా లేక పేర్లా? నాకు తెలీకడుగుతున్నాను చెప్పు.’’
‘‘మేం క్లాస్‌కి వెళ్ళకపోయినా మా హాజరు ఇంకెవరైనా పలికేవారు సార్. ఇక్కడా అంతే అనుకున్నాను.’’
అప్పటికే కపీష్, మర్కట్ ఒకర్ని మరొకరు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది.
‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రి సర్. వానర్ సార్. ఉన్నాను సర్’’ వానర్ ముందుకి ఓ అడుగేని చెప్పాడు.
కపీష్, మర్కట్‌లు అతన్ని చూశారు. అతనూ వీళ్ళ వంక చూశాడు. మళ్ళీ అందరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది.
‘‘లైన్ డిస్‌మిస్డ్ ఎవరైనా సరే, పారిపోయే ప్రయత్నం చేస్తే చర్మం ఒలుస్తా. వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నావు?’’ జైలర్ వానర్ వంక చూస్తూ కోపంగా అడిగాడు.
‘‘ఏం లేదు సార్. నథింగ్.’’
‘‘నథింగ్? నథింగ్? లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసన్. బట్ వెన్ యు లాఫ్ వితౌట్ రీజన్ యు నీడ్ మెడిసన్. చీల్చేస్తాను జాగ్రత్త. యు ఆర్ ఆల్ డిస్‌మిస్డ్ వెళ్ళండి.’’
అందరి హాజరు పూర్తవడంతో జైలర్ హాజర్ పుస్తకంతో వెళ్ళిపోయాడు. అంతా తమ తమ సెల్స్‌కి వెళ్ళసాగారు. కాని ఆ ముగ్గురు యువకులూ కదల్లేదు. ఒకరివైపు మరొకరు అడుగులు వేశారు. తర్వాత ముగ్గురూ ఒకేసారి ఆనందంగా అరిచారు.
‘‘హుర్రే.’’
ముగ్గురూ ఒకరిని మరొకరు ఆనందంగా కౌగిలించుకున్నారు.
(మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ముగ్గురు మిత్రులు కోక్‌ని ఎలా సంపాదించారు?)