త్రీమంకీస్ - 20
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 20
‘‘ప్రభుత్వం ఇటుకని గాలికి కొట్టుకోకుండా డోర్ స్టాపర్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. పొడి చేసి పళ్ళపొడిగా ఇస్తుంది. ఆఫీసుల్లో పేపర్ వెయిట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. వెయిట్ లిఫ్టర్స్‌కి వెయిట్ లిఫ్టింగ్ రాళ్ళుగా ఇస్తుంది. విసిరే ఆయుధంగా, తల మీద కొట్టే ఆయుధంగా ఇస్తుంది. షూటింగ్ రేంజ్‌లో గుళ్ళు బయటకి వెళ్ళకుండా ఆపడానికి ఇస్తుంది. ఫ్లవర్ పాట్స్ నిర్మించడానికి ఇస్తుంది. ఎయిర్ హోస్టెస్ శిక్షణలో వాళ్ళు కరెక్ట్ పోశ్చర్‌లో నడవడానికి తల మీద ఉంచడానికి ఇటుకలని ఇస్తుంది. రాత్రుళ్ళు కొవ్వొత్తులని వెలిగించుకోడానికి హోల్డర్లుగా ఇటుక మీద రెండు రంధ్రాలని చేసి ఇస్తుంది. బీదలు కుంకుడుకాయలని కొట్టుకోడానికి ఇస్తుంది. దాన్ని పొడి చేసి నీళ్ళు కలిపి పెయింట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. కారు చక్రాలు జారిపోకుండా టైర్లకి అడ్డంగా పెట్టుకోడానికి ఇస్తుంది. పార్కుల్లో దారికి అటు, ఇటు నలభై అయిదు డిగ్రీల్లో పాతడానికి ఇస్తుంది. పేవ్‌మెంట్ మీద పరవడానికి ఇస్తుంది. ఇటుక మీద ఇటుక పేర్చి ఎత్తు చేసి, దాని మీద నించుని అటక మీద నించి ఏదైనా దింపుకోడానికి ఇస్తుంది. పండగలకి గిఫ్ట్ రేపర్ చుట్టి బహుమతిగా ఇస్తుంది. ఇంకా ఇటుకలతో కొత్త కొత్త ఉపయోగాలని కనుక్కుంటుంది. అంతే తప్ప అది ఇళ్ళు, గోడలు కట్టుకోడానికి ఇటుకలని చస్తే ఇవ్వదు. అలా ఇచ్చే ప్రభుత్వాలు చరిత్రలో ఇంతదాకా ఏ దేశాన్నీ పాలించలేదు. అలాంటి ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు.’’
విద్యార్థులు శ్రద్ధగా వినసాగారు.
‘‘ఓ పొలిటికల్ పార్టీ తమకే ఓటు వేస్తే ప్రజల కష్టాలని తీరుస్తామని పెన్నుల మీద ముద్రించి ఉచితంగా పంచింది. ‘మీకేమైనా సమస్య ఉంటే మీరు ఎన్నుకునే నాకు ఫోన్ చేయండి’ అని ఆ అభ్యర్థి ఫోన్ నంబర్ దాని మీద అచ్చు వేశారు. చాలామంది ఫోన్ చేసి ఆ పెన్ రాయడం లేదని తమ సమస్యగా ఫిర్యాదు చేశారు. ఇలా చేయకండి. యువత కాబట్టి మీరు ఈ దేశాన్ని చేతైతే బాగు చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇంకాస్త చెడగొట్టకండి. మీరు ఓటర్లు కాబట్టి ఈసారైనా జాగ్రత్తగా ఆలోచించి ఓట్లు వేయండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మా పార్టీ ప్రభుత్వానికి ఓటు వేయండి. చివరగా త్రీ ఆర్స్ ప్రిన్సిపల్ గురించి చెప్పి నేను ముగిస్తాను. రెస్పాన్సిబిలిటీ ఫర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్. ఈ రెండూ పాటిస్తేనే రైట్ అనేది వస్తుంది. జైహింద్.’’ యం పి స్పీచ్ పూర్తవగానే విద్యార్థులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని ప్రకటించారు. ప్రిన్స్‌పాల్ లేచి చెప్పాడు.
‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ అకస్మాత్తుగా హాల్‌లోంచి గట్టిగా గాడిదల ఓండ్ర వినిపించింది. ‘‘సెలైన్స్. సెలైన్స్’’ ఆయన కోపంగా అరిచాడు. ఆయన మళ్ళీ తన స్పీచ్‌ని మొదలెట్టాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ మరోసారి గాడిద అరుపులు వినిపించాయి. ‘‘సెలైన్స్... నేనింత కాలం గాడిదలకి పాఠాలు చెప్తున్నానని అనుకోలేదు’’ స్టేజి మీది వైస్ ప్రిన్స్‌పాల్ మైక్‌ని అందుకుని కోపంగా చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ ప్రిన్స్‌పాల్ మళ్ళీ చెప్పగానే, కూర్చున్న విద్యార్థ్ధులంతా అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. వారి మధ్య నించి రెండు గాడిదలు స్టేజి ముందుకు వచ్చి నిలబడి, స్టేజీ మీది వారి వంక చూస్తూ ఓండ్ర పెట్టాయి. ఆ స్టేజి మీది పెద్ద మనుషులంతా వాటి వంక నివ్వెరపోతూ చూశారు.
‘‘నాకు చెప్పకుండా అసలు వీటిని కాలేజీలో ఎందుకు చేర్చుకున్నారు? ఫీజ్ కోసమా?’’ యం పి కోపంగా అడిగాడు.
‘‘లేదు సార్. ఇవి మన కాలేజీలో చదివే గాడిదలు కావు. అల్లరి చేయడానికి ఎవడో అడ్డగాడిద వీటిని ఇక్కడ తెచ్చి వదిలాడు’’ ప్రిన్స్‌పాల్ ఆందోళనగా చెప్పాడు.
గాడిదల మీద బొగ్గుతో అంకెలు, పేర్లు రాసి ఉండటం యం పి గమనించాడు. ‘‘వాటి మీద ఏం రాశారు?’’ ఆయన అడిగాడు.
‘‘సర్. ఓ గాడిదకి ఓ వైపు నంబర్ 1 అని, ఇంకోవైపు సెక్రటరీ అని రాశారు’’ ఓ విద్యార్థి చెప్పాడు. యం పి పగలబడి నవ్వుతూ అడిగాడు.
‘‘రెండో గాడిద మీద?’’ ‘‘నంబర్ 2- వైస్‌ప్రిన్సిపాల్.’’ ‘‘మూడోది?’’ యం పి నవ్వు ఇంకా పెరిగింది. ‘‘నంబర్ 3. ప్రిన్సిపాల్’’ విద్యార్థులు అరిచారు. ‘‘నాలుగో గాడిద?’’ యం పి పొట్ట పట్టుకుని నవ్వుతూ అడిగాడు. ‘‘నంబర్ 5. చీఫ్ గెస్ట్’’ వెంటనే ఆయన నవ్వు ఠక్కున ఆగిపోయింది. ముఖం కందగడ్డలా మారింది. ముక్కు పుటాలు అదిరాయి. ‘‘నంబర్ 4 గాడిద ఏది?’’ సెక్రటరీ అడిగాడు.
వెంటనే విద్యార్థులంతా కలిసి ఆడిటోరియం మొత్తం వెదికారు. అది కనపడలేదు. తర్వాత కాలేజీ ఆవరణ, క్లాస్ రూంలు అంతా వెదికారు. ఎక్కడా నంబర్ ఫోర్ గాడిద ఎవరికీ కనపడలేదు. (ముగ్గురు మిత్రులు, దుర్యోధనుల ముఖాముఖి ఎలా ఉంటుంది?)