త్రీమంకీస్ - 37
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 37
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘నా ఖైదీ నంబర్ మార్చుకోవచ్చాండి?’’ వానర్ అడిగాడు.
‘‘ఎందుకో?’’
‘‘ఫేన్సీ నంబర్ ఉంటే బావుంటుందని. 5555 ఇస్తారా? అదెంత?’’
‘‘త్రీ మంకీస్! ఇంకోసారి పారిపోయే ప్రయత్నం చేస్తే అదో కొత్త నేరమై మీ శిక్ష పెరుగుతుంది. నీకు కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్‌లో ఎయిటీ సెవెన్ వచ్చినందుకు, నీకు ప్రొడక్షన్ సిస్టమ్స్‌లో ఎయిటీ సిక్స్ వచ్చినందుకు, నీకు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో ఎయిటీ ఫైవ్ వచ్చినందుకు మొదటిసారి తప్పు కాబట్టి ఉపేక్షిస్తున్నాను. వెళ్ళి స్నానం చేయండి. పొండి.’’
‘‘నేను జర్మనీలో పుట్టినా బావుండేది. ఇంటర్నెట్లో చదివాను. అక్కడ జైళ్ళ నించి పారిపోవడం నేరం కాదు. ఎందుకంటే ప్రతీ మనిషి స్వాభావికంగా స్వేచ్ఛని కోరుకుంటాడని వారికి తెలుసు’’ వానర్ చెప్పాడు.
‘‘నేను స్వీడన్‌లో పుట్టినా బావుండేది. ఇంటర్నెట్లో చదివాను. అక్కడ ఖైదీలు లేక జైళ్ళని మూసేస్తున్నారు’’ జైలర్ కసురుతూ చెప్పాడు.
‘‘పిల్లలన్నాక తప్పు చేస్తారు. దానికే ఉరి తీయాలా?’ అని రేపిస్ట్‌లని సమర్థిస్తూ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు కదా. నేను అంత పెద్ద తప్పు కాదు కదండీ చేసింది? జస్ట్ చిన్న దొంగతనమేగా. నన్ను వదిలేసేయండి’’ వానర్ చెప్పాడు.
‘‘ఆయన విడిచి పెట్టమంది బలాత్కారం చేసే చిన్న నేరస్థులని తప్ప పెద్ద నేరమైన దొంగతనాన్ని చేసే దొంగల్ని కాదు.’’
ఆయన తిడుతూంటే వానర్ చుట్టూ మడుగు కట్టింది. అదే సమయంలో అతనికి కిటికీలోంచి ఓ దృశ్యం కనిపించింది. ఓ ఖైదీ పేంట్ అడుగుభాగంలోంచి నేల మీదకి మట్టి జార విడుస్తున్నాడు.
‘‘అసలు నువ్వు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతావు? వెళ్ళి స్నానం చేయండి’’ ఆ మడుగుని, వారి వంటి మీది మురికిని చూసి జైలర్ అరిచాడు.
‘‘ఇప్పుడు నాకు జూలోని జంతువులు అన్నిటికీ బెయిల్ ఇప్పించాలని అనిపిస్తోంది’’ బయటకి వచ్చాక వానర్ చెప్పాడు.
ముగ్గురూ బాత్‌రూంలో స్నానాలు చేస్తూ మాట్లాడుకోసాగారు.
‘‘దైవం నా వైపు లేడు’’ వానర్ చెప్పాడు.
‘‘మా ఇలవేల్పు కూడా నా వైపు లేడు’’ మర్కట్ చెప్పాడు.
‘‘మనం మన పక్షం ఉన్నంతసేపు ఎవరూ మన పక్షం ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ సినిమాల్లో రాని కొత్త మార్గం మనం కనుక్కుందాం’’ కపీష్ ధైర్యం చెప్పాడు.
‘‘యస్’’ మిగిలిన ఇద్దరూ స్థిర నిశ్చయంతో చెప్పారు.
‘‘ఇందాక జైలర్ గదిలోంచి ఓ విచిత్రాన్ని చూశాను’’ వానర్ చెప్పాడు.
‘‘ఏమిటది?’’ కపీష్ అడిగాడు.
‘‘ఒకడు మట్టి మూత్రానికి వెళ్ళడం చూశాను.’’
‘‘మట్టి మూత్రమా? పిచ్చా? అదేంటి?’’
‘‘బాస్‌గారి అనుచరుడు పేంట్ రెండు కంతల్లోంచి నేల మీదకి మట్టి జార్చడం స్పష్టంగా చూశాను.’’
‘‘మట్టి?’’ మర్కట్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
‘‘ఐతే అది అతని శరీరంలోంచి వచ్చి ఉండదు. వాడి జేబులోంచి బయటకి పోశాడు’’ కపీష్ ఉత్సాహంగా చెప్పాడు.
‘‘చిత్రంగా ఉంది. పేంట్ జేబుల్లోకి అసలు అంత మట్టి ఎలా వచ్చినట్లు?’’ మర్కట్ అడిగాడు.
‘‘నేను చెప్పానే, ది గ్రేట్ ఎస్కేప్ సినిమా. అది ఇదే కథ. ఇక్కడ వాళ్ళు బయటకి సొరంగం తవ్వుతున్నట్లున్నారు. తవ్వగా వచ్చిన మట్టిని ఆ సినిమాలోలా బయట పోస్తున్నారు.’’
‘‘కాని వాళ్ళకి గునపాలు, పారలు ఎక్కడివి?’’ వానర్ సందిగ్ధంగా అడిగాడు.
‘‘చెంచాలని, గరిటలని కాజేసి అరగదీసి వాటితో తవ్వుతారా సినిమాలో.’’
‘‘మనం వీరి సొరంగం రహస్యాన్ని కనుక్కోవాలి’’ మర్కట్ ఉత్సాహంగా చెప్పాడు.
తనని తిరిగి సెల్‌కి తీసుకెళ్ళే గార్డ్‌ని మర్కట్ వేమన గురించి అడిగాడు.
‘‘ఆయన ఎవరో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. పేరు తెలీదు. ప్రజలే వేమన అనే పేరు పెట్టారు.’’
‘‘దేనికి? దిగంబరంగా తిరిగేవాడా?’’
‘‘కాదు. అబిడ్స్, కోటీ మధ్య తిరుగుతూ దారిన పోయే అందర్నీ వేదాంత ప్రశ్నలు వేసేవాడు. ‘దేవుడికి, మనిషికి మధ్య గల తేడా ఏమిటి?, దేవుడున్నాడా? ఇలాంటివి. ఓ రోజు ఆయన వెళ్ళే ఓ కారుని ఆపి కారులోని ఆవిడ్ని ‘జీవితాంతం దేవుడు లేడని నమ్మి చివరకి ఆయన ఉన్నాడని తెలుసుకోవడం మంచిదా? లేక జీవితాంతం ఆయన ఉన్నాడని నమ్మి చివరికి లేడని తెలుసుకోవడం మంచిదా? ఏది ఉత్తమ మార్గం?’ అని ప్రశ్నించాడు. ఆవిడ డీజీపి భార్య! ఫలితంగా పబ్లిక్ న్యూసెన్స్ కేస్ కింద పధ్నాలుగు రోజుల రిమాండ్‌తో ఇక్కడికి వారం క్రితమే వచ్చాడు.’’
‘‘అదేమిటి? కన్యాకుమారిలో దొంగ నోట్లని మార్చే నేరంలో పట్టుబడ్డానని చెప్పాడే నాకు?’’
‘‘ఇంకోసారి ఆయన్ని ఏ నేరం మీద వచ్చాడని అడిగి చూడండి’’ గార్డ్ నవ్వాడు.
సెల్‌కి వెళ్ళాక మర్కట్ ఆయన్ని అదే ప్రశ్న వేశాడు.
‘‘అదా? నేను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను. మొదటి పెళ్ళాం పోలీసులకి ఫిర్యాదు చేస్తే పట్టుకొచ్చారు’’ వేమన చెప్పాడు.
(పారిపోవడానికి అతికష్టమైన జైలు ఏది?)
మళ్లీ రేపు
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
లెటర్స్
మల్లాది గారి త్రీమంకీస్ సీరియల్ చాలా బాగుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నేను మొదటిగా చదువుతున్నాను. ఈ సీరియల్ మొదటినుంచీ మిస్సవకుండా చదువుతున్నాను. మల్లాది గారు రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. సాక్షి నుంచి ఇలాంటి మరెన్నో సీరియల్స్ ఆశిస్తున్నాను. - భరత్‌రెడ్డి పత్తి (bharathreddy.patti@gmail.com)
3 మంకీస్ చదువుతున్నంతసేపు పాత్రలకి, జోక్స్‌కి నవ్వుకుంటున్నాం.
ఇస్తున్న సాక్షికి థ్యాంక్స్. - బి. ప్రేమాలాల్, నిజామాబాద్