త్రీమంకీస్ - 35 | special story to malladi | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 35

Published Sat, Nov 22 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

త్రీమంకీస్  -  35

త్రీమంకీస్ - 35

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 35
 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 

 ‘‘అది మంచిది కాదు.’’
 ‘‘ఏది మంచిది కాదు?’’
 ‘‘వడ్డీ పెరగడం.’’
 ‘‘అవును. అది మంచిది కాదు.’’
 ‘‘అలాంటప్పుడు జైలర్‌కి చెప్పి నాకు డబ్బు ఇప్పించచ్చుగా?’’
 ‘‘ఏం ఇప్పించచ్చుగా?’’
 ‘‘డబ్బు. జైలర్‌కి చెప్పు.’’
 ‘‘ఎవరికి చెప్పి?’’
 ‘‘ఆ అమ్మాయికి చెప్పి’’ సేఠ్ కోపంగా గదిమాడు.
 ‘‘ఏం చెప్పి?’’
 ‘‘నీకు తద్దినం పెట్టాలని’’ సేఠ్ కోపం పెరిగిపోయింది.
 ‘‘అలాగే పెడదాం’’ కపీష్ చెప్పాడు.
 ‘‘అటు కాదు. నేనున్నది ఇటు’’ సేఠ్ గద్దించాడు.
 కపీష్ ఇహలోకంలోకి వచ్చి ఆయన్ని చూస్తూ చెప్పాడు.
 ‘‘ఏమన్నారు?’’
 ‘‘జైలర్ దగ్గర ఉన్న డబ్బులోంచి నాకు నా వడ్డీ డబ్బుని ఇప్పించమన్నాను. ఈసారైనా వినపడిందా?’’
 ‘‘ది. కాని నాకా నియమాలు తెలీవు. కనుక్కుంటాను.’’
 ‘‘కనుక్కో. మళ్ళీ రేపు వస్తాను. ఇక్కడ లంచాలకే నా డబ్బంతా అయిపోయేట్లుంది’’
 ఆయన సెల్‌ఫోన్ మోగింది.
 ‘‘నాకా సెల్‌ఫోన్ ఇవ్వరాదూ? రేపు ఫోన్ చేస్తే జైలర్ ఏమన్నాడో చెప్తాను. మీకు లంచాలు, ఇంత దూరం రావడాలు తప్పుతాయి’’ కపీష్ కోరాడు.
 ‘‘చాల్లే.’’ కోపంగా చెప్పి తులసీరాం వెళ్ళిపోయాడు.
 ‘‘ఇక లే’’ గార్డ్ చెప్పాడు.
 కపీష్ ఆమెని చూసి చిన్నగా నవ్వుతూ చేతిని ఊపాడు. ఆమె కూడా బదులుగా చేతిని ఊపింది. ఆమె వైపు గాల్లోకి ముద్దుని విసిరాడు. ఆమె దాన్ని అందుకున్నట్లు నటించి, హేండ్ బేగ్ తెరిచి అందులో ఉంచినట్లు అభినయించింది.
 ‘‘ఇదేమైనా కాలేజీ అనుకున్నావా? లెమ్మన్నానా?’’ గార్డ్ అరిచాడు.
 ‘‘ఓ! లెమ్మన్నావా? ఈయనేరి? వెళ్ళిపోయారా?’’ కపీష్ లేచాడు.
   
 సాయంత్రం ఏడుకి వానర్ లాండ్రీ సెక్షన్‌కి వెళ్ళాడు. ఉదయం నించి ఇస్త్రీ చేసిన దుస్తులన్నీ సహ ఖైదీ తోపుడు బండిలో తీసుకెళ్ళాక, ఖైదీలు విడిచిన బట్టలన్నీ మూటకట్టి అందులోకి దూరాడు. రెండు చేతులు బయటకి వచ్చి, మూటకి ముళ్ళని బిగించి లోపలకి వెళ్ళాయి.
 అదే సమయానికి వంట ముగించిన మర్కట్ కిచెన్‌ని ఫినాయిల్‌తో శుభ్రంగా కడిగాడు. తర్వాత చెత్తని వేేన  ప్లాస్టిక్ చెత్త సంచీలోకి దిగి దాక్కున్నాడు. మిత్రులు ఇద్దరూ స్వేచ్ఛకోసం ఉత్కంఠగా వేచి చూడసాగారు.
 రాత్రి సరిగ్గా ఏడున్నరకి అధికారుల పర్యవేక్షణలో జైలు మెయిన్‌టనెన్స్ వేన్‌లోకి బట్టల మూటని ఎక్కించారు. ఓ ఎంఎల్‌ఏకి చెందిన వాషింగ్ కంపెనీ వాటిని ఉతికి పంపడానికి జైళ్ళ విభాగం నించి ఏన్యువల్ కాంట్రాక్ట్‌ని తీసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం వారు దీన్ని నిరసించారు కూడా. వంట చేయిస్తున్నట్లే ఖైదీల చేతే ఉతికించచ్చు కదా? ఎంఎల్‌ఏని బాగుచేయడానికే ఆ పనిని అతనికి పక్షపాతంతో ఇచ్చారని వారు ఆరోపించారు.
 బట్టల మూట వేన్‌లోకి ఎక్కే దాకా అందులోని వానర్ ఊపిరి బిగబట్టాడు. తన గుండె కొట్టుకునే చప్పుడు ఒక్క తనకే కాక బయటకి కూడా వినిపిస్తుందేమోనని భయపడ్డాడు. అతను భయపడ్డట్లుగా జరగకుండా అది వేన్‌లోకి ఎక్కింది. ఆ వేన్ కదిలి కిచెన్ ముందు ఆగింది. అందులోంచి చెత్త సంచీని ఎత్తుకొచ్చి ఖైదీలు దాన్ని వేన్‌లో పెట్టాక వేన్ ముందుకి కదిలింది. అది మెయిన్ గేట్ దగ్గరకి వచ్చి ఆగాక మర్కట్‌కి మిరప ఘాటుకి తుమ్ము వచ్చింది. కాని దాన్ని బలవంతంగా అణచుకోవడంతో గాలి నిశ్శబ్దంగా ముక్కులోంచి బయటకి పోయింది. గేట్ పక్కన కుర్చీలో తలవంచుకుని కూర్చుని, తన గోళ్ళని కత్తిరించుకునే ఓ గార్డ్ తల ఎత్తకుండానే చెప్పాడు.
 ‘‘బయటకి వచ్చేయండమ్మా.’’
 ఆ మాటలు విన్న వానర్, మర్కట్‌లు అవి తమని ఉద్దేశించి మాట్లాడినవిగా అనుకోలేదు.
 ‘‘వేన్‌లోని మిత్రుల్లారా! దిగి రండి.’’
 ఈసారి కూడా వాళ్ళు తాము ఆ వేన్‌లో దాక్కున్న సంగతి గార్డ్‌కి ఎలా తెలుస్తుంది, ఇంకెవర్నో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు.
 ‘‘మిమ్మల్నే. బయటకి రండి. లేదా నేనే లేచి రావాలా?’’
 అతను కొద్దిసేపు ఎదురు చూసి వేన్‌లోంచి ఎవరూ దిగకపోవడంతో విసుగ్గా నెయిల్ కటర్‌ని జేబులో వేసుకుని, బాయ్‌నెట్ అమర్చిన తుపాకీని అందుకుని వేన్ దగ్గరకి వచ్చి దాని వెనక తలుపు తెరిచాడు.
 (ముగ్గురు మిత్రులు ఎలా దొరికారు?)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement