త్రీమంకీస్ - 36 | special story to malladi | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 36

Published Sun, Nov 23 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

త్రీమంకీస్ - 36

త్రీమంకీస్ - 36

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 36
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి.


‘‘మీరు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. వెంటనే బయటకి వచ్చారా సరి. లేదా బట్టల మూటలోకి తుపాకీ బాయ్‌నెట్‌తో పొడుస్తాను- రక్తం కనిపించే దాకా!’’
 ఆ మాటలకి వానర్ దాక్కున్న బట్టల మూటలోంచి ఓ ద్రవం కారడం గార్డ్ గమనించాడు.
 ‘‘మిత్రమా! పొడవక. వస్తున్నాను.’’
 రెండు చేతులు మూటలోంచి మళ్ళీ బయటకి వచ్చి ముళ్ళని విప్పాయి. అతను బయటకి వచ్చాక గార్డ్ అతని నెత్తి మీది అండర్‌వేర్‌ని తీసి చెప్పాడు.
 ‘‘రెండో మిత్రమా! నీకూ ప్రత్యేకంగా చెప్పాలా? చెత్త సంచీలోకి పొడవనా?’’
 తను దాక్కున్న చోటు అతనికి ఎలా తెలిసిందా అనుకుంటూ మర్కట్ కూడా సంచీని తెరచి లోపల నించి బయటకి వచ్చాడు. అతని ముక్కుకి అంటుకున్న ఉల్లిపాయ తొక్కలని, నెత్తి మీది వంకాయ ముచికలని వానర్ తొలగించాడు.
 ‘‘నువ్వు గ్రేట్ మిత్రమా. ఇట్టే కనుక్కున్నావు’’ మర్కట్ గార్డ్‌తో చెప్పాడు.
 ‘‘నాకు ఓపిక లేదు. మూడోవాడు కూడా త్వరగా బయటకి రావాలి’’ ఆ గార్డ్ అరిచాడు.
 వేన్ కింద అడ్డంగా ఉన్న ఓ రాడ్‌కి కాళ్ళని పెనవేసి మరో రాడ్‌ని పట్టుకుని ఊపిరి బిగబట్టి వేలాడుతున్న కపీష్ కదల్లేదు. అతనికి కింద నించి తుపాకీ బాయ్‌నెట్ వెతుకుతూ లోపలకి పొడుచుకురావడం కనిపించడంతో ఠక్కున కాళ్ళని నేల మీదకి పెట్టి, కింద పడుకుని ఇవతలికి దొర్లాడు.
 గార్డ్ వేన్ తలుపు మూసిగేట్ తెరిచి ‘రైట్ రైట్’ అంటూ తుపాకీ బాయ్‌నెట్‌తో వేన్ వెనక కొట్టాడు. వేన్ ముందుకి సాగిపోయింది. గేట్ మూస్తున్న గార్డ్ వంక చూసి వానర్ అడిగాడు.
 ‘‘మేం పారిపోతున్నామని నీకు ఎవరు చెప్పారు?’’
 ‘‘నాతో కిచెన్‌లో పని చేేన వాడు చెప్పాడా?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘ఊహూ. జైల్లోకి కొత్త ఖైదీలు వచ్చిన రెండో రోజే పారిపోవాలనుకుంటారు. సాధారణంగా వారికి లాండ్రీ, వంట గది డ్యూటీలనే వేస్తారు. వారు మీ పద్ధతిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తారు. నా పధ్నాలుగేళ్ళ సర్వీస్‌లో ఎన్నోసార్లు చూశాను. నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమందిని ఇదే పద్ధతిలో పారిపోతూండగా పట్టుకున్నాను. ప్రత్యేకంగా వెదకనక్కర్లేకుండా ఇలా పిలిేన్త చాలు. వాళ్ళు బయటకి వస్తారు.’’
 ‘‘ఓ! నువ్వు చాలా గ్రేట్.’’
 ‘‘జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ వేన్ కింద వేలాడుతూ పారిపోయే సన్నివేశం వచ్చాక ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు’’ గార్డ్ చెప్పాడు.
 ‘‘ఆ సినిమా పేరు ఏమిటి? గుర్తు రావడం లేదు’’ కపీష్ అడిగాడు.
 ‘‘వెళ్ళండి. జైలర్ తన గదిలో మీకోసం ఎదురు చూస్తున్నాడు’’ గార్డ్ చెప్పాడు.
 వారిలో ఒకరి నించి మాసిన బట్టల కంపు, ఇంకొకరి నించి కుళ్ళిన కూరగాయల కంపు కొడుతూండటంతో కపీష్ వారి వంక క్షమించమన్నట్లుగా చూశాడు.
   
 ‘‘ఈ జైల్లో అభివృద్ధి ఏ సెల్‌లో ఉంటుంది సార్?’’ వానర్ అడిగాడు.
 ‘‘అదేం ప్రశ్న?’’ జైలర్ అడిగాడు.
 ‘‘ప్రస్తుత పాలకులు అభివృద్ధిని అరెస్ట్ చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణని పేపర్లలో చాలాసార్లు చదివాను.’’
 ‘‘మిమ్మల్ని పిలిపించింది మీ ప్రశ్నలకి నేను జవాబు చెప్పడానికి కాదు. నా ప్రశ్నలకి మీరు జవాబు చెప్పడానికి. ఎందుకీ ప్రయత్నం చేశారు?’’ జైలర్ వాళ్ళని గద్దిస్తూ అడిగాడు.
 ‘‘జైలు నించి విడుదలై వచ్చానని బయటకి వెళ్ళాక చెప్పుకోవడం బావుండదనుకుని’’ వానర్ చెప్పాడు.
 ‘‘నిజానికి జైలుకి వెళ్ళొచ్చానని బయటకి వెళ్ళాక మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అందువల్ల మీకో ప్రయోజనం కూడా ఉంది.’’
 ‘‘ఏం ప్రయోజనం?’’
 ‘‘జైలుకి వెళ్ళొచ్చా అని చెప్పేవాడు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. నిజానికి మీ క్లోజ్‌డ్ హార్టే మీ ఘోరమైన జైలు.’’
 ‘‘కాని అక్కడ జైలర్ ఉండడు కదండి.’’
 ‘‘ఈ జైల్లోని బెస్ట్ ఖైదీ అనే పేరు తెచ్చుకుంటానన్నావు. ఏం వానర్! ఇదేనా అలా పేరు తెచ్చుకోవడం?’’ జైలర్ ప్రశ్నించాడు.
 ‘‘జైలుకి వచ్చిన విఐపిలంతా తక్షణం హాస్పిటల్‌లో దేనికి చేరుతారు సర్? జైలు పనికి రాకేగా? బెయిల్‌కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తూంటారు కదా? మేమూ వాళ్ళల్లా స్పందించే మనుషులమేగా?’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఐనా ఇది నా ఐడియా కాదు సార్. నా బుద్ధిని చెడగొట్టింది వీడే’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఎవరు?’’
 కొద్దిసేపు మర్కట్ వైపు, కొద్దిసేపు కపీష్ వైపు తన వేలిని చూపించాడు. జైలర్ ఆ ముగ్గుర్నీ ఛడామడా తిట్టి గద్దిస్తూ అడిగాడు.
 ‘‘అసలు ఈ పథకం ఎవరిది?’’
 ‘‘నాది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘విమానంలో పర్స్ కొట్టేసి పారిపోవడానికి పరిగెత్తే వాడిలా కనిపించే వానర్ లాంటి మూర్ఖుడ్ని అసలు ఎలా ఫ్రెండ్ చేసుకున్నావు?’’
 ‘‘మూర్ఖుడైన మేథావి కన్నా, తెలివిగల మూర్ఖుడు బెటర్ అని!’’
 
 (మట్టి మూత్రం? ఇదెక్కడి విచిత్రం? ... రేపు)
-  మళ్లీ  రేపు
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
లెటర్స్
* నవలలు చదవడం అంతరించిపోతున్న ఈరోజుల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి చేత కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ని మా అభిమాన దినపత్రిక సాక్షి అందించడం సంతోషంగా ఉంది. - మధుసూదన్ (msrk250@gmail.com)

* సాక్షి ఫ్యామిలీ పేజీకి నేను బానిసని. మొదటి సంచిక నుంచే క్రైమ్ కామెడీ సస్పెన్స్ సీరియల్ 3 మంకీస్ నన్ను తనవైపు లాగేసుకున్నది.
 - ఎ. రాజశేఖర్ (rajaannumalla@gmail.com)
3 మంకీస్ సీరియల్ ఫన్నీగా భలే బావుంది. - పి. దీప, సాలూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement