Malladi venkatakrishnamurthi
-
త్రీమంకీస్ - 37
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 37 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నా ఖైదీ నంబర్ మార్చుకోవచ్చాండి?’’ వానర్ అడిగాడు. ‘‘ఎందుకో?’’ ‘‘ఫేన్సీ నంబర్ ఉంటే బావుంటుందని. 5555 ఇస్తారా? అదెంత?’’ ‘‘త్రీ మంకీస్! ఇంకోసారి పారిపోయే ప్రయత్నం చేస్తే అదో కొత్త నేరమై మీ శిక్ష పెరుగుతుంది. నీకు కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్‌లో ఎయిటీ సెవెన్ వచ్చినందుకు, నీకు ప్రొడక్షన్ సిస్టమ్స్‌లో ఎయిటీ సిక్స్ వచ్చినందుకు, నీకు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో ఎయిటీ ఫైవ్ వచ్చినందుకు మొదటిసారి తప్పు కాబట్టి ఉపేక్షిస్తున్నాను. వెళ్ళి స్నానం చేయండి. పొండి.’’ ‘‘నేను జర్మనీలో పుట్టినా బావుండేది. ఇంటర్నెట్లో చదివాను. అక్కడ జైళ్ళ నించి పారిపోవడం నేరం కాదు. ఎందుకంటే ప్రతీ మనిషి స్వాభావికంగా స్వేచ్ఛని కోరుకుంటాడని వారికి తెలుసు’’ వానర్ చెప్పాడు. ‘‘నేను స్వీడన్లో పుట్టినా బావుండేది. ఇంటర్నెట్లో చదివాను. అక్కడ ఖైదీలు లేక జైళ్ళని మూసేస్తున్నారు’’ జైలర్ కసురుతూ చెప్పాడు. ‘‘పిల్లలన్నాక తప్పు చేస్తారు. దానికే ఉరి తీయాలా?’ అని రేపిస్ట్‌లని సమర్థిస్తూ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు కదా. నేను అంత పెద్ద తప్పు కాదు కదండీ చేసింది? జస్ట్ చిన్న దొంగతనమేగా. నన్ను వదిలేసేయండి’’ వానర్ చెప్పాడు. ‘‘ఆయన విడిచి పెట్టమంది బలాత్కారం చేసే చిన్న నేరస్థులని తప్ప పెద్ద నేరమైన దొంగతనాన్ని చేసే దొంగల్ని కాదు.’’ ఆయన తిడుతూంటే వానర్ చుట్టూ మడుగు కట్టింది. అదే సమయంలో అతనికి కిటికీలోంచి ఓ దృశ్యం కనిపించింది. ఓ ఖైదీ పేంట్ అడుగుభాగంలోంచి నేల మీదకి మట్టి జార విడుస్తున్నాడు. ‘‘అసలు నువ్వు రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతావు? వెళ్ళి స్నానం చేయండి’’ ఆ మడుగుని, వారి వంటి మీది మురికిని చూసి జైలర్ అరిచాడు. ‘‘ఇప్పుడు నాకు జూలోని జంతువులు అన్నిటికీ బెయిల్ ఇప్పించాలని అనిపిస్తోంది’’ బయటకి వచ్చాక వానర్ చెప్పాడు. ముగ్గురూ బాత్రూంలో స్నానాలు చేస్తూ మాట్లాడుకోసాగారు. ‘‘దైవం నా వైపు లేడు’’ వానర్ చెప్పాడు. ‘‘మా ఇలవేల్పు కూడా నా వైపు లేడు’’ మర్కట్ చెప్పాడు. ‘‘మనం మన పక్షం ఉన్నంతసేపు ఎవరూ మన పక్షం ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ సినిమాల్లో రాని కొత్త మార్గం మనం కనుక్కుందాం’’ కపీష్ ధైర్యం చెప్పాడు. ‘‘యస్’’ మిగిలిన ఇద్దరూ స్థిర నిశ్చయంతో చెప్పారు. ‘‘ఇందాక జైలర్ గదిలోంచి ఓ విచిత్రాన్ని చూశాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ కపీష్ అడిగాడు. ‘‘ఒకడు మట్టి మూత్రానికి వెళ్ళడం చూశాను.’’ ‘‘మట్టి మూత్రమా? పిచ్చా? అదేంటి?’’ ‘‘బాస్‌గారి అనుచరుడు పేంట్ రెండు కంతల్లోంచి నేల మీదకి మట్టి జార్చడం స్పష్టంగా చూశాను.’’ ‘‘మట్టి?’’ మర్కట్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘ఐతే అది అతని శరీరంలోంచి వచ్చి ఉండదు. వాడి జేబులోంచి బయటకి పోశాడు’’ కపీష్ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘చిత్రంగా ఉంది. పేంట్ జేబుల్లోకి అసలు అంత మట్టి ఎలా వచ్చినట్లు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నేను చెప్పానే, ది గ్రేట్ ఎస్కేప్ సినిమా. అది ఇదే కథ. ఇక్కడ వాళ్ళు బయటకి సొరంగం తవ్వుతున్నట్లున్నారు. తవ్వగా వచ్చిన మట్టిని ఆ సినిమాలోలా బయట పోస్తున్నారు.’’ ‘‘కాని వాళ్ళకి గునపాలు, పారలు ఎక్కడివి?’’ వానర్ సందిగ్ధంగా అడిగాడు. ‘‘చెంచాలని, గరిటలని కాజేసి అరగదీసి వాటితో తవ్వుతారా సినిమాలో.’’ ‘‘మనం వీరి సొరంగం రహస్యాన్ని కనుక్కోవాలి’’ మర్కట్ ఉత్సాహంగా చెప్పాడు. తనని తిరిగి సెల్‌కి తీసుకెళ్ళే గార్డ్ని మర్కట్ వేమన గురించి అడిగాడు. ‘‘ఆయన ఎవరో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. పేరు తెలీదు. ప్రజలే వేమన అనే పేరు పెట్టారు.’’ ‘‘దేనికి? దిగంబరంగా తిరిగేవాడా?’’ ‘‘కాదు. అబిడ్స్, కోటీ మధ్య తిరుగుతూ దారిన పోయే అందర్నీ వేదాంత ప్రశ్నలు వేసేవాడు. ‘దేవుడికి, మనిషికి మధ్య గల తేడా ఏమిటి?, దేవుడున్నాడా? ఇలాంటివి. ఓ రోజు ఆయన వెళ్ళే ఓ కారుని ఆపి కారులోని ఆవిడ్ని ‘జీవితాంతం దేవుడు లేడని నమ్మి చివరకి ఆయన ఉన్నాడని తెలుసుకోవడం మంచిదా? లేక జీవితాంతం ఆయన ఉన్నాడని నమ్మి చివరికి లేడని తెలుసుకోవడం మంచిదా? ఏది ఉత్తమ మార్గం?’ అని ప్రశ్నించాడు. ఆవిడ డీజీపి భార్య! ఫలితంగా పబ్లిక్ న్యూసెన్స్ కేస్ కింద పధ్నాలుగు రోజుల రిమాండ్‌తో ఇక్కడికి వారం క్రితమే వచ్చాడు.’’ ‘‘అదేమిటి? కన్యాకుమారిలో దొంగ నోట్లని మార్చే నేరంలో పట్టుబడ్డానని చెప్పాడే నాకు?’’ ‘‘ఇంకోసారి ఆయన్ని ఏ నేరం మీద వచ్చాడని అడిగి చూడండి’’ గార్డ్ నవ్వాడు. సెల్‌కి వెళ్ళాక మర్కట్ ఆయన్ని అదే ప్రశ్న వేశాడు. ‘‘అదా? నేను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను. మొదటి పెళ్ళాం పోలీసులకి ఫిర్యాదు చేస్తే పట్టుకొచ్చారు’’ వేమన చెప్పాడు. (పారిపోవడానికి అతికష్టమైన జైలు ఏది?) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ మల్లాది గారి త్రీమంకీస్ సీరియల్ చాలా బాగుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నేను మొదటిగా చదువుతున్నాను. ఈ సీరియల్ మొదటినుంచీ మిస్సవకుండా చదువుతున్నాను. మల్లాది గారు రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. సాక్షి నుంచి ఇలాంటి మరెన్నో సీరియల్స్ ఆశిస్తున్నాను. - భరత్‌రెడ్డి పత్తి (bharathreddy.patti@gmail.com) 3 మంకీస్ చదువుతున్నంతసేపు పాత్రలకి, జోక్స్‌కి నవ్వుకుంటున్నాం. ఇస్తున్న సాక్షికి థ్యాంక్స్. - బి. ప్రేమాలాల్, నిజామాబాద్ -
త్రీమంకీస్ - 36
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 36 - మల్లాది వెంకటకృష్ణమూర్తి. ‘‘మీరు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. వెంటనే బయటకి వచ్చారా సరి. లేదా బట్టల మూటలోకి తుపాకీ బాయ్‌నెట్‌తో పొడుస్తాను- రక్తం కనిపించే దాకా!’’ ఆ మాటలకి వానర్ దాక్కున్న బట్టల మూటలోంచి ఓ ద్రవం కారడం గార్డ్ గమనించాడు. ‘‘మిత్రమా! పొడవక. వస్తున్నాను.’’ రెండు చేతులు మూటలోంచి మళ్ళీ బయటకి వచ్చి ముళ్ళని విప్పాయి. అతను బయటకి వచ్చాక గార్డ్ అతని నెత్తి మీది అండర్‌వేర్‌ని తీసి చెప్పాడు. ‘‘రెండో మిత్రమా! నీకూ ప్రత్యేకంగా చెప్పాలా? చెత్త సంచీలోకి పొడవనా?’’ తను దాక్కున్న చోటు అతనికి ఎలా తెలిసిందా అనుకుంటూ మర్కట్ కూడా సంచీని తెరచి లోపల నించి బయటకి వచ్చాడు. అతని ముక్కుకి అంటుకున్న ఉల్లిపాయ తొక్కలని, నెత్తి మీది వంకాయ ముచికలని వానర్ తొలగించాడు. ‘‘నువ్వు గ్రేట్ మిత్రమా. ఇట్టే కనుక్కున్నావు’’ మర్కట్ గార్డ్‌తో చెప్పాడు. ‘‘నాకు ఓపిక లేదు. మూడోవాడు కూడా త్వరగా బయటకి రావాలి’’ ఆ గార్డ్ అరిచాడు. వేన్ కింద అడ్డంగా ఉన్న ఓ రాడ్‌కి కాళ్ళని పెనవేసి మరో రాడ్‌ని పట్టుకుని ఊపిరి బిగబట్టి వేలాడుతున్న కపీష్ కదల్లేదు. అతనికి కింద నించి తుపాకీ బాయ్నెట్ వెతుకుతూ లోపలకి పొడుచుకురావడం కనిపించడంతో ఠక్కున కాళ్ళని నేల మీదకి పెట్టి, కింద పడుకుని ఇవతలికి దొర్లాడు. గార్డ్ వేన్ తలుపు మూసిగేట్ తెరిచి ‘రైట్ రైట్’ అంటూ తుపాకీ బాయ్‌నెట్‌తో వేన్ వెనక కొట్టాడు. వేన్ ముందుకి సాగిపోయింది. గేట్ మూస్తున్న గార్డ్ వంక చూసి వానర్ అడిగాడు. ‘‘మేం పారిపోతున్నామని నీకు ఎవరు చెప్పారు?’’ ‘‘నాతో కిచెన్‌లో పని చేేన వాడు చెప్పాడా?’’ మర్కట్ అడిగాడు. ‘‘ఊహూ. జైల్లోకి కొత్త ఖైదీలు వచ్చిన రెండో రోజే పారిపోవాలనుకుంటారు. సాధారణంగా వారికి లాండ్రీ, వంట గది డ్యూటీలనే వేస్తారు. వారు మీ పద్ధతిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తారు. నా పధ్నాలుగేళ్ళ సర్వీస్‌లో ఎన్నోసార్లు చూశాను. నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమందిని ఇదే పద్ధతిలో పారిపోతూండగా పట్టుకున్నాను. ప్రత్యేకంగా వెదకనక్కర్లేకుండా ఇలా పిలిేన్త చాలు. వాళ్ళు బయటకి వస్తారు.’’ ‘‘ఓ! నువ్వు చాలా గ్రేట్.’’ ‘‘జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ వేన్ కింద వేలాడుతూ పారిపోయే సన్నివేశం వచ్చాక ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు’’ గార్డ్ చెప్పాడు. ‘‘ఆ సినిమా పేరు ఏమిటి? గుర్తు రావడం లేదు’’ కపీష్ అడిగాడు. ‘‘వెళ్ళండి. జైలర్ తన గదిలో మీకోసం ఎదురు చూస్తున్నాడు’’ గార్డ్ చెప్పాడు. వారిలో ఒకరి నించి మాసిన బట్టల కంపు, ఇంకొకరి నించి కుళ్ళిన కూరగాయల కంపు కొడుతూండటంతో కపీష్ వారి వంక క్షమించమన్నట్లుగా చూశాడు. ‘‘ఈ జైల్లో అభివృద్ధి ఏ సెల్లో ఉంటుంది సార్?’’ వానర్ అడిగాడు. ‘‘అదేం ప్రశ్న?’’ జైలర్ అడిగాడు. ‘‘ప్రస్తుత పాలకులు అభివృద్ధిని అరెస్ట్ చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణని పేపర్లలో చాలాసార్లు చదివాను.’’ ‘‘మిమ్మల్ని పిలిపించింది మీ ప్రశ్నలకి నేను జవాబు చెప్పడానికి కాదు. నా ప్రశ్నలకి మీరు జవాబు చెప్పడానికి. ఎందుకీ ప్రయత్నం చేశారు?’’ జైలర్ వాళ్ళని గద్దిస్తూ అడిగాడు. ‘‘జైలు నించి విడుదలై వచ్చానని బయటకి వెళ్ళాక చెప్పుకోవడం బావుండదనుకుని’’ వానర్ చెప్పాడు. ‘‘నిజానికి జైలుకి వెళ్ళొచ్చానని బయటకి వెళ్ళాక మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అందువల్ల మీకో ప్రయోజనం కూడా ఉంది.’’ ‘‘ఏం ప్రయోజనం?’’ ‘‘జైలుకి వెళ్ళొచ్చా అని చెప్పేవాడు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. నిజానికి మీ క్లోజ్డ్ హార్టే మీ ఘోరమైన జైలు.’’ ‘‘కాని అక్కడ జైలర్ ఉండడు కదండి.’’ ‘‘ఈ జైల్లోని బెస్ట్ ఖైదీ అనే పేరు తెచ్చుకుంటానన్నావు. ఏం వానర్! ఇదేనా అలా పేరు తెచ్చుకోవడం?’’ జైలర్ ప్రశ్నించాడు. ‘‘జైలుకి వచ్చిన విఐపిలంతా తక్షణం హాస్పిటల్లో దేనికి చేరుతారు సర్? జైలు పనికి రాకేగా? బెయిల్‌కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తూంటారు కదా? మేమూ వాళ్ళల్లా స్పందించే మనుషులమేగా?’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఐనా ఇది నా ఐడియా కాదు సార్. నా బుద్ధిని చెడగొట్టింది వీడే’’ వానర్ చెప్పాడు. ‘‘ఎవరు?’’ కొద్దిసేపు మర్కట్ వైపు, కొద్దిసేపు కపీష్ వైపు తన వేలిని చూపించాడు. జైలర్ ఆ ముగ్గుర్నీ ఛడామడా తిట్టి గద్దిస్తూ అడిగాడు. ‘‘అసలు ఈ పథకం ఎవరిది?’’ ‘‘నాది’’ కపీష్ చెప్పాడు. ‘‘విమానంలో పర్స్ కొట్టేసి పారిపోవడానికి పరిగెత్తే వాడిలా కనిపించే వానర్ లాంటి మూర్ఖుడ్ని అసలు ఎలా ఫ్రెండ్ చేసుకున్నావు?’’ ‘‘మూర్ఖుడైన మేథావి కన్నా, తెలివిగల మూర్ఖుడు బెటర్ అని!’’ (మట్టి మూత్రం? ఇదెక్కడి విచిత్రం? ... రేపు) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * నవలలు చదవడం అంతరించిపోతున్న ఈరోజుల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి చేత కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ని మా అభిమాన దినపత్రిక సాక్షి అందించడం సంతోషంగా ఉంది. - మధుసూదన్ (msrk250@gmail.com) * సాక్షి ఫ్యామిలీ పేజీకి నేను బానిసని. మొదటి సంచిక నుంచే క్రైమ్ కామెడీ సస్పెన్స్ సీరియల్ 3 మంకీస్ నన్ను తనవైపు లాగేసుకున్నది. - ఎ. రాజశేఖర్ (rajaannumalla@gmail.com) 3 మంకీస్ సీరియల్ ఫన్నీగా భలే బావుంది. - పి. దీప, సాలూరు -
త్రీమంకీస్ - 35
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 35 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అది మంచిది కాదు.’’ ‘‘ఏది మంచిది కాదు?’’ ‘‘వడ్డీ పెరగడం.’’ ‘‘అవును. అది మంచిది కాదు.’’ ‘‘అలాంటప్పుడు జైలర్‌కి చెప్పి నాకు డబ్బు ఇప్పించచ్చుగా?’’ ‘‘ఏం ఇప్పించచ్చుగా?’’ ‘‘డబ్బు. జైలర్‌కి చెప్పు.’’ ‘‘ఎవరికి చెప్పి?’’ ‘‘ఆ అమ్మాయికి చెప్పి’’ సేఠ్ కోపంగా గదిమాడు. ‘‘ఏం చెప్పి?’’ ‘‘నీకు తద్దినం పెట్టాలని’’ సేఠ్ కోపం పెరిగిపోయింది. ‘‘అలాగే పెడదాం’’ కపీష్ చెప్పాడు. ‘‘అటు కాదు. నేనున్నది ఇటు’’ సేఠ్ గద్దించాడు. కపీష్ ఇహలోకంలోకి వచ్చి ఆయన్ని చూస్తూ చెప్పాడు. ‘‘ఏమన్నారు?’’ ‘‘జైలర్ దగ్గర ఉన్న డబ్బులోంచి నాకు నా వడ్డీ డబ్బుని ఇప్పించమన్నాను. ఈసారైనా వినపడిందా?’’ ‘‘ది. కాని నాకా నియమాలు తెలీవు. కనుక్కుంటాను.’’ ‘‘కనుక్కో. మళ్ళీ రేపు వస్తాను. ఇక్కడ లంచాలకే నా డబ్బంతా అయిపోయేట్లుంది’’ ఆయన సెల్‌ఫోన్ మోగింది. ‘‘నాకా సెల్‌ఫోన్ ఇవ్వరాదూ? రేపు ఫోన్ చేస్తే జైలర్ ఏమన్నాడో చెప్తాను. మీకు లంచాలు, ఇంత దూరం రావడాలు తప్పుతాయి’’ కపీష్ కోరాడు. ‘‘చాల్లే.’’ కోపంగా చెప్పి తులసీరాం వెళ్ళిపోయాడు. ‘‘ఇక లే’’ గార్డ్ చెప్పాడు. కపీష్ ఆమెని చూసి చిన్నగా నవ్వుతూ చేతిని ఊపాడు. ఆమె కూడా బదులుగా చేతిని ఊపింది. ఆమె వైపు గాల్లోకి ముద్దుని విసిరాడు. ఆమె దాన్ని అందుకున్నట్లు నటించి, హేండ్ బేగ్ తెరిచి అందులో ఉంచినట్లు అభినయించింది. ‘‘ఇదేమైనా కాలేజీ అనుకున్నావా? లెమ్మన్నానా?’’ గార్డ్ అరిచాడు. ‘‘ఓ! లెమ్మన్నావా? ఈయనేరి? వెళ్ళిపోయారా?’’ కపీష్ లేచాడు. సాయంత్రం ఏడుకి వానర్ లాండ్రీ సెక్షన్‌కి వెళ్ళాడు. ఉదయం నించి ఇస్త్రీ చేసిన దుస్తులన్నీ సహ ఖైదీ తోపుడు బండిలో తీసుకెళ్ళాక, ఖైదీలు విడిచిన బట్టలన్నీ మూటకట్టి అందులోకి దూరాడు. రెండు చేతులు బయటకి వచ్చి, మూటకి ముళ్ళని బిగించి లోపలకి వెళ్ళాయి. అదే సమయానికి వంట ముగించిన మర్కట్ కిచెన్‌ని ఫినాయిల్‌తో శుభ్రంగా కడిగాడు. తర్వాత చెత్తని వేేన ప్లాస్టిక్ చెత్త సంచీలోకి దిగి దాక్కున్నాడు. మిత్రులు ఇద్దరూ స్వేచ్ఛకోసం ఉత్కంఠగా వేచి చూడసాగారు. రాత్రి సరిగ్గా ఏడున్నరకి అధికారుల పర్యవేక్షణలో జైలు మెయిన్టనెన్స్ వేన్లోకి బట్టల మూటని ఎక్కించారు. ఓ ఎంఎల్ఏకి చెందిన వాషింగ్ కంపెనీ వాటిని ఉతికి పంపడానికి జైళ్ళ విభాగం నించి ఏన్యువల్ కాంట్రాక్ట్‌ని తీసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం వారు దీన్ని నిరసించారు కూడా. వంట చేయిస్తున్నట్లే ఖైదీల చేతే ఉతికించచ్చు కదా? ఎంఎల్ఏని బాగుచేయడానికే ఆ పనిని అతనికి పక్షపాతంతో ఇచ్చారని వారు ఆరోపించారు. బట్టల మూట వేన్లోకి ఎక్కే దాకా అందులోని వానర్ ఊపిరి బిగబట్టాడు. తన గుండె కొట్టుకునే చప్పుడు ఒక్క తనకే కాక బయటకి కూడా వినిపిస్తుందేమోనని భయపడ్డాడు. అతను భయపడ్డట్లుగా జరగకుండా అది వేన్లోకి ఎక్కింది. ఆ వేన్ కదిలి కిచెన్ ముందు ఆగింది. అందులోంచి చెత్త సంచీని ఎత్తుకొచ్చి ఖైదీలు దాన్ని వేన్లో పెట్టాక వేన్ ముందుకి కదిలింది. అది మెయిన్ గేట్ దగ్గరకి వచ్చి ఆగాక మర్కట్కి మిరప ఘాటుకి తుమ్ము వచ్చింది. కాని దాన్ని బలవంతంగా అణచుకోవడంతో గాలి నిశ్శబ్దంగా ముక్కులోంచి బయటకి పోయింది. గేట్ పక్కన కుర్చీలో తలవంచుకుని కూర్చుని, తన గోళ్ళని కత్తిరించుకునే ఓ గార్డ్ తల ఎత్తకుండానే చెప్పాడు. ‘‘బయటకి వచ్చేయండమ్మా.’’ ఆ మాటలు విన్న వానర్, మర్కట్లు అవి తమని ఉద్దేశించి మాట్లాడినవిగా అనుకోలేదు. ‘‘వేన్‌లోని మిత్రుల్లారా! దిగి రండి.’’ ఈసారి కూడా వాళ్ళు తాము ఆ వేన్లో దాక్కున్న సంగతి గార్డ్‌కి ఎలా తెలుస్తుంది, ఇంకెవర్నో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ‘‘మిమ్మల్నే. బయటకి రండి. లేదా నేనే లేచి రావాలా?’’ అతను కొద్దిసేపు ఎదురు చూసి వేన్లోంచి ఎవరూ దిగకపోవడంతో విసుగ్గా నెయిల్ కటర్‌ని జేబులో వేసుకుని, బాయ్నెట్ అమర్చిన తుపాకీని అందుకుని వేన్ దగ్గరకి వచ్చి దాని వెనక తలుపు తెరిచాడు. (ముగ్గురు మిత్రులు ఎలా దొరికారు?) -
త్రీమంకీస్ - 20
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 20 ‘‘ప్రభుత్వం ఇటుకని గాలికి కొట్టుకోకుండా డోర్ స్టాపర్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. పొడి చేసి పళ్ళపొడిగా ఇస్తుంది. ఆఫీసుల్లో పేపర్ వెయిట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. వెయిట్ లిఫ్టర్స్కి వెయిట్ లిఫ్టింగ్ రాళ్ళుగా ఇస్తుంది. విసిరే ఆయుధంగా, తల మీద కొట్టే ఆయుధంగా ఇస్తుంది. షూటింగ్ రేంజ్లో గుళ్ళు బయటకి వెళ్ళకుండా ఆపడానికి ఇస్తుంది. ఫ్లవర్ పాట్స్ నిర్మించడానికి ఇస్తుంది. ఎయిర్ హోస్టెస్ శిక్షణలో వాళ్ళు కరెక్ట్ పోశ్చర్‌లో నడవడానికి తల మీద ఉంచడానికి ఇటుకలని ఇస్తుంది. రాత్రుళ్ళు కొవ్వొత్తులని వెలిగించుకోడానికి హోల్డర్లుగా ఇటుక మీద రెండు రంధ్రాలని చేసి ఇస్తుంది. బీదలు కుంకుడుకాయలని కొట్టుకోడానికి ఇస్తుంది. దాన్ని పొడి చేసి నీళ్ళు కలిపి పెయింట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. కారు చక్రాలు జారిపోకుండా టైర్లకి అడ్డంగా పెట్టుకోడానికి ఇస్తుంది. పార్కుల్లో దారికి అటు, ఇటు నలభై అయిదు డిగ్రీల్లో పాతడానికి ఇస్తుంది. పేవ్మెంట్ మీద పరవడానికి ఇస్తుంది. ఇటుక మీద ఇటుక పేర్చి ఎత్తు చేసి, దాని మీద నించుని అటక మీద నించి ఏదైనా దింపుకోడానికి ఇస్తుంది. పండగలకి గిఫ్ట్ రేపర్ చుట్టి బహుమతిగా ఇస్తుంది. ఇంకా ఇటుకలతో కొత్త కొత్త ఉపయోగాలని కనుక్కుంటుంది. అంతే తప్ప అది ఇళ్ళు, గోడలు కట్టుకోడానికి ఇటుకలని చస్తే ఇవ్వదు. అలా ఇచ్చే ప్రభుత్వాలు చరిత్రలో ఇంతదాకా ఏ దేశాన్నీ పాలించలేదు. అలాంటి ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు.’’ విద్యార్థులు శ్రద్ధగా వినసాగారు. ‘‘ఓ పొలిటికల్ పార్టీ తమకే ఓటు వేస్తే ప్రజల కష్టాలని తీరుస్తామని పెన్నుల మీద ముద్రించి ఉచితంగా పంచింది. ‘మీకేమైనా సమస్య ఉంటే మీరు ఎన్నుకునే నాకు ఫోన్ చేయండి’ అని ఆ అభ్యర్థి ఫోన్ నంబర్ దాని మీద అచ్చు వేశారు. చాలామంది ఫోన్ చేసి ఆ పెన్ రాయడం లేదని తమ సమస్యగా ఫిర్యాదు చేశారు. ఇలా చేయకండి. యువత కాబట్టి మీరు ఈ దేశాన్ని చేతైతే బాగు చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇంకాస్త చెడగొట్టకండి. మీరు ఓటర్లు కాబట్టి ఈసారైనా జాగ్రత్తగా ఆలోచించి ఓట్లు వేయండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మా పార్టీ ప్రభుత్వానికి ఓటు వేయండి. చివరగా త్రీ ఆర్స్ ప్రిన్సిపల్ గురించి చెప్పి నేను ముగిస్తాను. రెస్పాన్సిబిలిటీ ఫర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్. ఈ రెండూ పాటిస్తేనే రైట్ అనేది వస్తుంది. జైహింద్.’’ యం పి స్పీచ్ పూర్తవగానే విద్యార్థులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని ప్రకటించారు. ప్రిన్స్‌పాల్ లేచి చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ అకస్మాత్తుగా హాల్లోంచి గట్టిగా గాడిదల ఓండ్ర వినిపించింది. ‘‘సెలైన్స్. సెలైన్స్’’ ఆయన కోపంగా అరిచాడు. ఆయన మళ్ళీ తన స్పీచ్‌ని మొదలెట్టాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ మరోసారి గాడిద అరుపులు వినిపించాయి. ‘‘సెలైన్స్... నేనింత కాలం గాడిదలకి పాఠాలు చెప్తున్నానని అనుకోలేదు’’ స్టేజి మీది వైస్ ప్రిన్స్‌పాల్ మైక్‌ని అందుకుని కోపంగా చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ ప్రిన్స్‌పాల్ మళ్ళీ చెప్పగానే, కూర్చున్న విద్యార్థ్ధులంతా అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. వారి మధ్య నించి రెండు గాడిదలు స్టేజి ముందుకు వచ్చి నిలబడి, స్టేజీ మీది వారి వంక చూస్తూ ఓండ్ర పెట్టాయి. ఆ స్టేజి మీది పెద్ద మనుషులంతా వాటి వంక నివ్వెరపోతూ చూశారు. ‘‘నాకు చెప్పకుండా అసలు వీటిని కాలేజీలో ఎందుకు చేర్చుకున్నారు? ఫీజ్ కోసమా?’’ యం పి కోపంగా అడిగాడు. ‘‘లేదు సార్. ఇవి మన కాలేజీలో చదివే గాడిదలు కావు. అల్లరి చేయడానికి ఎవడో అడ్డగాడిద వీటిని ఇక్కడ తెచ్చి వదిలాడు’’ ప్రిన్స్‌పాల్ ఆందోళనగా చెప్పాడు. గాడిదల మీద బొగ్గుతో అంకెలు, పేర్లు రాసి ఉండటం యం పి గమనించాడు. ‘‘వాటి మీద ఏం రాశారు?’’ ఆయన అడిగాడు. ‘‘సర్. ఓ గాడిదకి ఓ వైపు నంబర్ 1 అని, ఇంకోవైపు సెక్రటరీ అని రాశారు’’ ఓ విద్యార్థి చెప్పాడు. యం పి పగలబడి నవ్వుతూ అడిగాడు. ‘‘రెండో గాడిద మీద?’’ ‘‘నంబర్ 2- వైస్‌ప్రిన్సిపాల్.’’ ‘‘మూడోది?’’ యం పి నవ్వు ఇంకా పెరిగింది. ‘‘నంబర్ 3. ప్రిన్సిపాల్’’ విద్యార్థులు అరిచారు. ‘‘నాలుగో గాడిద?’’ యం పి పొట్ట పట్టుకుని నవ్వుతూ అడిగాడు. ‘‘నంబర్ 5. చీఫ్ గెస్ట్’’ వెంటనే ఆయన నవ్వు ఠక్కున ఆగిపోయింది. ముఖం కందగడ్డలా మారింది. ముక్కు పుటాలు అదిరాయి. ‘‘నంబర్ 4 గాడిద ఏది?’’ సెక్రటరీ అడిగాడు. వెంటనే విద్యార్థులంతా కలిసి ఆడిటోరియం మొత్తం వెదికారు. అది కనపడలేదు. తర్వాత కాలేజీ ఆవరణ, క్లాస్ రూంలు అంతా వెదికారు. ఎక్కడా నంబర్ ఫోర్ గాడిద ఎవరికీ కనపడలేదు. (ముగ్గురు మిత్రులు, దుర్యోధనుల ముఖాముఖి ఎలా ఉంటుంది?)