weightlifting
-
పసిడి పతకం నెగ్గిన పల్లవి
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. -
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు తొలి పసిడి పతకం
డెహ్రడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. శుక్రవారం పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కొమెర నీలం రాజు పసిడి పతకాన్ని సాధించాడు. నీలం రాజు మొత్తం 289 కేజీలు (స్నాచ్ లో 128+క్లీన్ అండ్ జర్క్ లో 161) బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. పురుషుల సైక్లింగ్ రోడ్ రేసు మాస్ స్టార్ట్ ఈవెంట్ లో తెలంగాణ ప్లేయర్ ఆశీర్వాద్ సక్సేనా (2గం:48ని:39.029 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మరోవైపు భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి జాతీయ క్రీడల్లో పసిడి పతకంతో సత్తాచాటింది. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి 201 కేజీల (88+113) బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. బింద్యారాణి స్నాచ్‌లో 88 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తగా... ఇప్పుడు బింద్యారాణి దాన్ని బద్దలు కొట్టింది. -
బరువైపోయిందా ?
రెండు దశాబ్దాల క్రితం ఆమదాలవలస పేరు చెబితే జాతీయ స్థాయిలో ఠక్కున గుర్తుకొచ్చేది వెయిట్ లిఫ్టింగ్. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటేవారు. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్‌లోనూ ఆమదాలవలస వైభవాన్ని చాటిచెప్పారు. కానీ నేడు ఆ వైభవమంతా గతకాలపు స్మృతిగా మిగిలిపోయింది. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి దిగ్గజ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం నేడు ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంది. ప్రోత్సాహం కరువై క్రీడాకారులు ఇటువైపు చూడటమే మానుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఒలింపిక్ పతకంతో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షణా కేంద్రానికి నేడు నిర్లక్ష్యపు గ్రహణం కమ్మేసింది. పట్టించుకునే నాథుడు లేక దయనీయ స్థితికి చేరుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పేరు మారుమ్రోగింది. ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమదాలవలస ప్రాంతం నుంచి వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు ఎక్కువగా వస్తుండటంతో 1987లో ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసింది.మెరిసిన ఆణిముత్యాలు.. ఈ ప్రాంతం నుంచి తొలిసారిగా ఊసవానిపేటకు చెందిన నీలం శెట్టి గురువునాయుడు సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఆ తరువాత నీలంశెట్టి సూర్యనారాయణ, కరణం నరసమ్మలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే సీతమ్మ అనే క్రీడాకారిణి స్టేట్ చాంపియన్‌గా నిలిచింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించి నీలంశెట్టి లక్ష్మి సిక్కోలు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్ధాయిలో నిలిపింది. ఇక 2000 సంవత్సరంలో ఆ్రస్టేలియాలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకంతో కరణం మల్లీశ్వరి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచిన పూజారి శైలజ ప్రతిభ చెప్పనవసరంలేదు. వీరితోపాటు యామిని, కరణం కల్యాణి, కరణం కృష్ణవేణి, గౌరి, నీలంశెట్టి ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, చీర రాజేశ్వరి, ఎన్ని శ్రీదేవి ఇలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆదరణ లేకే.. ఆమదాలవలసలో తొలుత కొత్తకోట అమ్మినాయుడు అనే వ్యక్తి మారుతి వ్యాయామ మండలిని ఏర్పాటు చేశారు. అనంతరం 1983లో అప్పటి ప్రభుత్వం చిన్న శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది శిధిలావస్థకు చేరడంతో అమ్మినాయుడు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించుకున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. వాటితో నూతన భవనాన్ని నిర్మించారు. నీలంశెట్టి అప్పన్న అనే వ్యక్తి కోచ్‌గా ఉండేవారు. ఆయన రిటైరయ్యాక కోచ్‌ను నియమించలేదు. దీంతో సీనియర్ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, ఔత్సాహికులు కూడా ముందుకు రాకపోవడంతో శిక్షణా కేంద్రం దయనీయ స్థితికి చేరుకుంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. సామగ్రి లేకపోవడంతో క్రీడాకారులు వెళ్లడం మానేశారు. దీంతో పూర్తిగా మూతపడిపోయింది. ఇటీవల ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి చిగురుపల్లి రాజ్యలక్ష్మి తన సొంత డబ్బులతో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ సామగ్రి ఏర్పాటు చేశారు. అక్కడే తన కుమార్తె చిగురుపల్లి హారికరాజ్కు శిక్షణ ఇస్తున్నారు. ఆ బాలిక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో మరో 8 మంది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఆ వైభవం గతమే.. ఆమదాలవలసలో వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జాతీయ ,అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సుమారు 60నుంచి 80మంది వరకు ఉండేవారు. ఇప్పుడు పది విభాగాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులే కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమదాలవలస వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం శిధిలావస్థకు చేరిపోవడం బాధగాఉంది. 2001లో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్నాను. ప్రస్తుతం సరైన ప్రోత్సాహం, వసతులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావడంలేదు. ఈ ప్రాంతంలో ఈ క్రీడ కనుమరుగైపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో నా సొంత డబ్బుతో సామగ్రి కొనుగోలు చేసి నాకున్న సామర్థ్యం మేరకు శిక్షణ ఇస్తున్నాను. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఇటీవల రూ.50వేలు ఇచ్చి ప్రోత్సహించారు. నా కుమార్తెకు కూడా ఆయనే స్పాన్సర్ చేసి పోటీలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా శిక్షణా కేంద్రంలో సామగ్రి ఏర్పాటు చేసి, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఆదుకోవాలి. కోచ్‌ను ఏర్పాటు చేయాలి. – చిగురుపల్లి రాజ్యలక్ష్మి, వెయిట్ లిప్టర్, ఆమదాలవలసక్రీడాకారులు కరువు వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ క్రీడాంశాన్ని ఎంచుకుంటుంటారు. ఆరి్థక పరిస్థితులు అంతగా సహకరించక రాణించలేకపోతున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించినవారికి కనీసం హోంగార్డు పోస్టులో అయినా ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా ముందుకువచ్చేవారు. పతకం తెచ్చిన క్రీడాకారుడిని నాయకులు ఆరోజు అభినందించడం తప్ప తరువాత పట్టించుకోవడంలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే పాల్గొంటున్నారు. – బలివాడ తిరుపతిరావు, వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి, వెయిట్‌లిఫ్టర్ -
ప్రగతి ఉడుంపట్టు.. ఈసారి సిల్వర్ మెడల్..
సీనియర్ నటి ప్రగతి ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోయిన్గా జర్నీ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే స్థిరపడిపోయింది. తల్లి, వదిన, అత్త పాత్రల్లో కనిపించి కనువిందు చేసింది. అయితే ఈ మధ్య సినిమాల జోరు తగ్గించేసిన ఈమె ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా జిమ్‌లో బరువులు ఎత్తుతూ ఆ వీడియోలు షేర్ చేసేది. ఇది చూసిన జనాలు.. ఎప్పుడు చూసినా ఆ జిమ్‌లో ఉంటుందేంటి? అనుకునేవారు. కట్ చేస్తే మొన్నామధ్య బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. కేవలం పార్టిసిపేట్ చేయడమే కాదు ఏకంగా మూడోస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా వెయిట్ లిఫ్టింగ్‌లో మరో అవార్డు సాధించింది ప్రగతి. సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో రెండో స్థానంలో నిలిచింది. వెండి పతకాన్ని అందుకున్నానోచ్ అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నటి. అందులో బరువులు ఎత్తిన నటి తర్వాత సిల్వర్ మెడల్ అందుకుంది. ఇది చూసిన అభిమానులు ప్రగతికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెయిట్ లిఫ్టింగ్‌పై పట్టు సాధిస్తూ అవార్డులు కొల్లగొట్టడం అంత ఈజీ కాదని పొగుడుతున్నారు. చదవండి: ఫోన్ చేస్తే స్పందన లేదు.. సోహైల్ అనగానే కట్.. -
ఆసియా పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన సాధియా ఆల్మస్
కేరళలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ సాధియా ఆల్మస్ సత్తా చాటింది. మంగళగిరికి చెందిన సాధియా 57 కేజీల జూనియర్ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని సాధియా కోచ్, తండ్రి ఎస్కే సందాని పేర్కోన్నాడు. కాగా పోటీల్లో ఆల్మస్ స్వ్కాట్లో 57 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా సాధియా ఆల్మస్ను రాష్ట్ర పవర్ లిఫ్గింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ సూర్యనారాయణ తదితరులు అభినందించారు. చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ
2000, సెప్టెంబర్ 19.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం.. ఒలింపిక్స్ బహమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతు లేని ఆనందం! బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో పాతికేళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరో వైపు భారత్‌లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతో మంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత ‘భారత్ కీ బేటీ’ అంటూ దేశ ప్రధాని వాజ్‌పేయి నుంచి వచ్చిన ఏకవాక్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకమది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్న గొప్ప విజయమది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్స్‌లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని, పతకం ఆశించని భారత క్రీడాభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మలీశ్వరి గెలిచిన మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. సిడ్నీ ఒలింపిక్స్‌కు ముందు భారత్ ఖాతాలో రెండు వ్యక్తిగత పతకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కె.డి. జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో లియాండర్ పేస్ ఆ పతకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్ పతకంపై అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించగా.. మల్లీశ్వరి వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండింది. 1993, 1994, 1995, 1996లలో వరుసగా నాలుగేళ్ల పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించింది. అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొనకపోగా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేళ్లయింది. దాంతో మల్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఆ రోజు ఏం జరిగిందంటే... ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిపోగా, ముగ్గురి మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లీశ్వరి మరో లిఫ్టర్‌తో కలసి సమానంగా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్ అండ్ జర్క్ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్ విసిరారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరికంటే మల్లీశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం, ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది. అయితే ఈ సమయంలో కోచ్‌లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది. ప్రాక్టీస్‌లో దీనిని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండటం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలే ఎత్తిన మల్లీశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ‘ఫౌల్’గా మారింది. చివరకు ఓవరాల్‌గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం.. భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. అమ్మ అండగా.. మల్లీశ్వరి ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో పాతకాలపు పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆట వైపు ఆకర్షితురాలైంది. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలంశెట్టి అప్పన్న తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెకు అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురుని ప్రోత్సహించింది. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్ లియోనిడ్ తారానెంకో గుర్తించి సరైన దిశ చూపించాడు. దాంతో బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది. ఆపై జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న ఆమె వరల్డ్ చాంపియన్ షిప్‌లలో సంచలన ప్రదర్శనతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకుంది. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగడం విశేషం. ఆమె స్ఫూర్తితోనే.. ‘80వ దశకం చివర్లో మన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తుండటం మొదలైంది. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించారు. కానీ మలీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో సైనా, సింధు, మేరీకోమ్వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్ దిగ్గజం అంజూ జార్జ్ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది. సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫొగాట్ వెల్లడించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినప్పుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించే మాకు ట్రైనింగ్‌లో మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి హరియాణా అమ్మాయే’ అని గీత గుర్తు చేసుకుంది. నిజంగానే ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిందనడంలో సందేహం లేదు. కొత్త బాధ్యతతో... సహచర వెయిట్‌లిఫ్టర్ రాజేశ్త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హరియాణాలోనే..యమునా నగర్లో మల్లీశ్వరి స్థిరపడిపోయింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పురస్కారాలు అందుకున్న మల్లీశ్వరి ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతోంది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్స్‌లర్‌గా ఆమెను నియమించారు. -
భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు. HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥 Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪 Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India 1/1 pic.twitter.com/cBasuHichz — SAI Media (@Media_SAI) August 4, 2022 This is so special 😍 6 gold 🥇for Bharat 🇮🇳 thanks to Sudhir lifting 212 kg in para power lifting setting new Games record !! Many congrats to u bhai 👏👏 Billion Indian’s proud of you 👏 #ParaPowerlifting #Sudhir pic.twitter.com/TZ6VEnef4b — Soug (@sbg1936) August 4, 2022 చదవండి: CWG 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం -
వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో ‘సమోవా’ దేశానికి చెందిన డాన్ ఒపెలాజ్ మంగళవారం స్వర్ణ పతకం గెలుచుకున్నాడు... అయితే 24 గంటలు తిరగక మందే ఒపెలాజ్ కుటుంబంలో మరో పతకం వచ్చి చేరింది. బుధవారం 109 కేజీల కేటగిరీలో డాన్ సోదరుడు జాక్ ఒపెలాజ్ రజతం సాధించాడు. కామన్వెల్త్ క్రీడల పతకాలతో ఈ కుటుంబ అనుబంధం చాలా పాతదే. సరిగ్గా చెప్పా లంటే ఆ దేశంలో వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’. 12 మంది సభ్యుల కుటుంబంలో 10 మంది అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్లే కావడం విశేషం. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో డాన్ సోదరు డు న్యూసిలా ఒపెలాజ్ స్వర్ణం గెలుచుకోగా (105 కేజీలు), అదే రోజు అతని సోదరి ఎలె ఒపెలాజ్ కూడా 75 కేజీల కేటగిరీలో పసిడి సొంతం చేసుకుంది. న్యూసెలా 2002 మాంచెస్టర్ క్రీడల్లోనూ కాంస్యం సాధించగా, 2014లో ఎలె ఖాతాలో రజతం చేరింది. మరో సోదరి మేరీ ఒపెలాజ్ 2014 గ్లాస్గో క్రీడల్లో రజత పతకం అందుకుంది. గత గోల్డ్ కోస్ట్ క్రీడల్లోనూ డాన్ ఒపెలాజ్ రజతం సాధించగా... అందరికంటే చిన్నవాడు జాక్ పతకం సాధించడంతో ఈ కుటుంబం కామన్వెల్త్ క్రీడల్లో గెలుచుకున్న పతకాల సంఖ్య ‘8’కు చేరింది. పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు 2 లక్షల జనాభా ఉండే సమోవా ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక పతకం కూడా ఎ లె ఒపెలాజ్దే కావడం విశేషం. 2008 బీజింగ్ క్రీడల్లో 75+ కేజీల కేటగిరీలో ఎలె రజతం గెలుచుకుంది. -
Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. బుధవారం జరిగిన పోటీల్లో జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. స్వర్ణం బరిలోకి దిగిన భారత జూడోకా తులిక మన్ తుది పోరులో తడబడింది. మహిళల ప్లస్ 78 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్కు చెందిన సారా అడ్లింగ్టన్ చేతిలో తులిక ఓటమి పాలైంది. పురుషుల స్క్వాష్‌లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో స్క్వాష్ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్ సౌరవ్ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్ జేమ్స్ విల్స్ట్రాప్ (ఇంగ్లండ్)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్ పెరిక్లెక్స్ (కామెరూన్; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్ ఒపెలాజ్ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. వెయిట్‌లిఫ్టింగ్‌పై ‘లవ్’తో... లవ్‌ప్రీత్ సింగ్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని బల్ సచందర్ గ్రామం. 13 ఏళ్ల వయసులో కొందరి స్నేహితుల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అతను ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఊర్లో చిన్న టైలర్ దుకాణం నడిపే తండ్రి కృపాల్ సింగ్‌కు కొడుకును క్రీడాకారుడిగా మార్చే శక్తి లేదు. ముఖ్యంగా అతని ‘డైట్’కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయలేని పరిస్థితి. చాలా మందిలాగే దీనిని లవ్‌ప్రీత్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే తన ప్రయత్నం తండ్రికి భారం కారాదని భావించి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డాడు. అందుకే అమృత్‌సర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో పని చేయడం ప్రారంభించాడు. పెద్ద వ్యాపారులకు అమ్మకాల్లో సహాయంగా ఉంటే రూ. 300 వచ్చేవి. వీటిని తన డైట్, ప్రొటీన్స్ కోసం లవ్‌ప్రీత్ వాడుకున్నాడు. అయితే అతని శ్రమ, పట్టుదల వృథా పోలేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టిన తర్వాత వరుస విజయాలు వచ్చాయి. ఈ ప్రదర్శన కారణంగా భారత నేవీలో ఉద్యోగం లభించింది. దాంతో ఆర్థికపరంగా కాస్త ఊరట దక్కడంతో అతను పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని జాతీయ క్యాంప్‌కు ఎంపిక కావడంతో అతని రాత పూర్తిగా మారిపోయింది. 2017లో ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కాంస్యంతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న అతను జూనియర్ కామన్వెల్త్ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన మొదటి పతకం 24 ఏళ్ల లవ్‌ప్రీత్ స్థాయిని పెంచింది. నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం బాక్సింగ్ క్రీడాంశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించగా... హుసాముద్దీన్ 4–1తో ట్రైఅగేన్ మార్నింగ్ ఎన్‌డెవెలో (నమీబియా)పై, నిఖత్ 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచారు. రజతంతో సరి కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్ ఫాంగ్ చియా–వుయ్ యిక్ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్ జె యోంగ్ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్–కూంగ్ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. -
కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం
బర్మింగహమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి. కాగా స్నాచ్ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్ కౌర్.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది. 9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩 After high voltage 🤯 drama India's #HarjinderKaur bags 🥉 in Women's 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022 Snatch- 93kg Clean & Jerk- 119kg With this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
Commonwealth Games 2022: అన్నయ్య అభయహస్తమై...స్ఫూర్తిదాయకం అచింత ప్రస్థానం
సాక్షి, క్రీడావిభాగం: పసిడి పతకం గెలవగానే అన్నింటికంటే ముందు అచింత నోటి నుంచి వచ్చిన మాట... ‘ఈ పతకం నా అన్నయ్యకు అంకితం’... అతడిని దగ్గరి నుంచి చూసిన వారికి ఇది ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ రోజు అచింత కామన్వెల్త్ పతకధారిగా సగర్వంగా నిలబడ్డాడంటే దాని వెనక అలోక్ ఉన్నాడు. తమ్ముడి కోసం తన ఆటకు దూరమైన ఆ అన్నయ్య, అంతటితో ఆగకుండా అన్నీ తానై, అంతటా వెనకుండి నడిపించాడు. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కూడా ఆటలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చంటూ అన్ని రకాలుగా స్ఫూర్తినిచ్చేలా అచింత జీవితం కనిపిస్తుంది. కోల్‌కతాలోనే హౌరా నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది దియూల్పూర్ గ్రామం. అక్కడ ఎక్కువ మందికి ‘జరీ’ పనినే జీవనాధారం. రిక్షా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి 2014లో హఠాత్తుగా చనిపోయిన సమయంలో అచింత వయసు 12 ఏళ్లు! ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తల్లి ‘జరీ’ పనిలో చేరిపోయింది. ఆమెకు అండగా తనకంటే ఏడేళ్లు పెద్ద అయిన అన్నయ్య కూడా వెళ్లక తప్పలేదు. వయసు చిన్నదే అయినా తన చిట్టి చేతులతో అచింత తానూ ఆ పనిలో సాయం చేయడం మొదలు పెట్టేశాడు. ఇలాంటి ఆర్థిక స్థితిలో ఆటలు అనేవి ఆలోచనకు కూడా అందవు. దాంతో అప్పటి వరకు తన ఆసక్తి కొద్దీ వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అన్న అలోక్ ఆ బరువును పక్కన పడేసి ఇంటి భారం తన మీద వేసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం ‘జరీ’ వర్క్‌తో పాటు ఉదయం వేళ హౌరా మిల్లుల్లో లేబర్‌గా పని చేసేందుకు సిద్ధమైన అలోక్... అదే సమయంలో తన తమ్ముడిలో తనకంటే మంచి ప్రతిభ ఉందని గుర్తించడం మర్చిపోలేదు. అందుకే ఏం చేసైనా అచింతను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అన్న కష్టాన్ని అచింత వృథా పోనీయలేదు. ఒకవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆటకు పదును పెట్టుకుంటూనే మరోవైపు తనకు ఇచ్చే డబ్బుల్లో ఒక్కో పైసాను అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు. 2014 జాతీయ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో వచ్చినా... కోచ్ దృష్టిని ఆకర్షించడంతో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం వచ్చి ంది. దాంతో అచింత రాత మారింది. తీవ్ర సాధన తో సత్తా చాటుతూ ఆసియా యూత్ చాంపియన్ షిప్లో రజతం, కామన్వెల్త్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత గత ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతంతో అచింత సంచలనం సృష్టించి దూసుకుపోయాడు. ఆర్మీ ఉద్యోగం ఉండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు కావడంతో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిన ఈ బెంగాల్ కుర్రాడు ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ ఘనతను సగర్వంగా అందుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్... కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో అచింత భారత్‌కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్‌లో 143+క్లీన్ అండ్ జెర్క్‌లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు. అజయ్‌కు నిరాశ 81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ అజయ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో అజయ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. అజయ్ స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 176 కేజీలు (మొత్తం 319 కేజీలు) బరువెత్తాడు. ఈ కేటగిరీలో క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు), కైల్ బ్రూస్ (ఆస్ట్రేలియా; 323 కేజీలు), నికోలస్ వాకన్ (కెనడా; 320 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి ఛానును బింద్యారాణి దేవి రోల్ మోడల్‌గా భావించింది. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుంచి వచ్చిన బింద్యారాణ దేవి ఇవాళ అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించింది. మీరాబాయి చానులాగే మణిపూర్ నుంచి వచ్చిన బింద్యారాణి దేవి, ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఓ చిన్న గుడిసెలో జీవనం సాగించిన మీరాబాయి ఛాను లైఫ్ స్టైల్, ఒలింపిక్ మెడల్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే తనలాగే పేదరికాన్ని అనుభవిస్తూ కూడా భారత్‌కి పతకాలు సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న బింద్యారాణి దేవి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మీరాబాయి ఛాను... ఖరీదైన బూట్లను కానుకగా ఇచ్చింది. అవే బూట్లు వేసుకొని బరిలోకి దిగిన బింద్యారాణి దేవి తాజాగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో 55 కేజీల విభాగంలో రజతం సాధించింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం బింద్యారాణి దేవి మాట్లాడుతూ.. ‘నా సక్సెస్‌లో మీరా దీ పాత్ర చాలా ఉంది. నా టెక్నిక్, ట్రైయినింగ్‌లో మీరా ఎంతగానో సాయం చేసింది. క్యాంప్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంతో అప్యాయంగా పలకరించి, మాట్లాడింది. నా దగ్గర బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి, తన షూస్ నాకు ఇ్చింది. ఆమె నాకు ఆదర్శం... నేను తనకి పెద్ద అభిమానిని అయిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది. -
భారత్ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్లిప్టింగ్లో బింద్యారాణికి రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. అయితే బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు. అయితే చివరి రౌండ్లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం లభించింది. SUPER SENSATIONAL SILVER FOR BINDYARANI 🔥🔥 Bindyarani Devi 🏋♀️wins 🥈in the Women's 55kg with a total lift of 202kg, after an amazing come back 💪💪 Snatch - 86 kg (PB & Equalling NR) Clean & Jerk - 116 kg (GR & NR) With this 🇮🇳 bags 4️⃣🏅 @birminghamcg22#Cheer4India pic.twitter.com/iFbPHpnBmK — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి -
మన 'బంగారు' మీరాబాయి
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం వచ్చి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ వచ్చింది. అలసటను దరి చేరనీయలేదు.. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. వాస్తవానికి మీరాబాయి చానూ ఈసారి 55 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఈ సారి ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఆమెను 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. దీంతో మీరాబాయి తన బరువును పెంచుకుంటూనే ఎంతోగానో శ్రమించింది. కానీ ఆఖరి క్షణంలో ఒక్క విభాగం నుంచి ఒక్కరే ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. అలా తనకు అచ్చొచ్చిన విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఇక 2014 గ్లాస్కో గేమ్స్ రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం.. తాజాగా మరోసారి స్వర్ణంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. మరి వచ్చే పారిస్ ఒలింపిక్స్(2024)లో టోక్యోలో వచ్చిన రజతాన్ని స్వర్ణంగా మారుస్తుందేమో చూడాలి. Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
నాలుగేళ్ల కిందటి హామీ.. పతకధారిగా ‘పాన్వాలా’
నాలుగేళ్ల క్రితం... గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజ పుజారి పోటీ పడుతున్నాడు. తన ‘పాన్ షాప్’లో కూర్చొని ఈ ఈవెంట్‌ను సంకేత్ టీవీలో చూస్తున్నాడు. గురురాజ 56 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఆ సమయంలో సంకేత్ ‘నాలుగేళ్ల తర్వాత ఎలాగైనా నేనూ అక్కడికి వెళతాను. కష్టపడి కచ్చితంగా పతకం సాధిస్తాను’ అని తనకు తాను చెప్పుకున్నాడు. నిజంగానే అతను తన కల నెరవేర్చుకున్నాడు. 2013 నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు 22 ఏళ్ల వయసులో కామన్వెల్త్ పతకంతో సత్తా చాటాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో సంకేత్ తండ్రికి పాన్‌షాప్‌తో పాటు చిన్నపాటి టిఫిన్ సెంటర్ కూడా ఉంది. మొదటినుంచి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే అతను ఆటపై దృష్టి పెట్టాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న తండ్రి ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్ వైపు నడిచాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా తండ్రి మహదేవ్ ఎప్పుడూ సంకేత్‌ను నిరుత్సాహపర్చలేదు. ఒక వైపు వెయిట్‌లిఫ్టర్‌గా గుర్తింపు వస్తున్న సమయంలో సంకేత్ కూడా ఏనాడూ పాన్‌షాప్‌లో కూర్చొని పని చేయడాన్ని తక్కువగా భావించలేదు. 2020లో కోల్‌కతాలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో సంకేత్ తొలిసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఏడాది సింగపూర్‌లో మొత్తం 256 కేజీల బరువు ఎత్తడంతో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అర్హత లభించింది. ఫిబ్రవరిలో పటియాలలోని నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించిన తర్వాత హెడ్ కోచ్ విజయ్ శర్మ పర్యవేక్షణలో మరింతగా రాటుదేలిన సంకేత్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ‘ఇప్పటి వరకు అంతా సంకేత్ పాన్వాలా అని పిలిచేవారు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల పతక విజేత సంకేత్ పాన్వాలా అని పిలుస్తారేమో’ అని ఉద్వేగంగా చెప్పాడు. సోదరుడి బాటలో వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగు పెట్టిన అతను చెల్లెలు కాజల్ ఇటీవలే ఖేలో ఇండియా గేమ్స్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణం గెలవడం విశేషం. -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Tokyo Olympics: వయసు 37.. ఎత్తినది 374 కేజీలు.. రికార్డుతో పాటు స్వర్ణం
శనివారం జరిగిన పురుషుల 81 కేజీల వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగిన 37 ఏళ్ల చైనా లిఫ్టర్ లియూ జియోజున్ 374 కేజీల (స్నాచ్‌లో 170+ క్లీన్ అండ్ జెర్క్‌లో 204) బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్రకెక్కాడు. విశ్వక్రీడల్లో లియూకిది మూడో పతకం. 2012లో పసిడి... 2016 రియోలో రజతం సాధించాడు. -
Weightlifter Meso: తండ్రి వల్ల కానిది తనయుడు సాధించాడు
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ (96 కేజీల విభాగం)లో ఖతర్ దేశానికి చెందిన మెసో హసూనా స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి అతను మొత్తం 402 కిలోల బరువు ఎత్తాడు. ఒలింపిక్ చరిత్రలో గతంలో 1 రజతం, 4 స్వర్ణాలు గెలుచుకున్న ఖతర్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దేశానికి తొలి స్వర్ణమే కాదు, హసూనా గెలుపు వెనక ఆసక్తికర నేపథ్యం ఉంది. 37 సంవత్సరాలుగా అతని కుటుంబం ఒలింపిక్ పతకం కోసం ఎదురు చూస్తోంది. మెసో తండ్రి ఇబ్రహీం హసూనా కూడా వెయిట్‌లిఫ్టర్. ఈజిప్ట్ దేశం తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ (1984, 1988, 1992)లలో పాల్గొన్నాడు. కానీ ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన అతను ఆ తర్వాత ఖతర్‌కు వలస వచ్చాడు. పట్టుదలగా తానే శిక్షణ ఇచ్చి తన కొడుకు మెసో హసోనాను కూడా వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చి దిద్దాడు. జూనియర్ స్థాయి నుంచే రాణిస్తూ సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో రజత, కాంస్యాలు గెలుచుకున్న 23 ఏళ్ల మెసో తొలి ఒలింపిక్స్‌లోనే సత్తా చాటాడు. తండ్రి సమక్షంలోనే ఏకంగా స్వర్ణం గెలుచుకొని తన కుటుంబం 37 సంవత్సరాల ఎదురు చూపులకు తెరదించాడు. -
రజతంతో స్వదేశంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి భారత్ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంతగడ్డపై అడుగు పెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ఎయిర్పోర్ట్ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. భారత ఆర్మీ జవాన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మీరాబాయి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమ ఉద్యోగి అయిన మీరాబాయికి రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. 2018 నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా పని చేస్తున్న మీరాబాయికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైనా లిఫ్టర్ డోపింగ్ వార్తలతో అలజడి... మీరాతో పోటీ పడి స్వర్ణం సాధించిన జిహుయ్ హౌ ‘డోపింగ్’కు పాల్పడినట్లు, నిర్ధారణ అయితే మీరాకు స్వర్ణం లభిస్తుందంటూ సోమవారం ఉదయం నుంచి పలు పత్రికలు, వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పోటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జిహుయ్కు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తుందంటూ ఒక భారత మీడియా ప్రతినిధి రాసిన వార్త దీనికంతటికీ కారణమైంది. అయితే ఐఓసీ నుంచి గానీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత ఒలింపిక్ సంఘం కూడా తమకేమీ తెలీదని స్పష్టం చేసింది. నిజానికి కనీస సమాచారం, ఆధారం లేకుండా కేవలం జిహుయ్ రెండోసారి పరీక్షకు వెళుతోంది కాబట్టి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలపై ఆధారపడి ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినట్లు తర్వాత తేలింది. పోటీ ముగియగానే తీసుకున్న ‘శాంపిల్’పై అనుమానం ఉండటం వల్లే స్పష్టత కోసం రెండో ‘శాంపిల్’ తీసుకుంటున్నారని వినిపించినా... దానిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. రోజూ ఐఓసీ నిర్వహించే సుమారు 5000 డోపింగ్ పరీక్షల్లో ఇది కూడా ఒక రొటీన్ పరీక్ష కూడా కావచ్చు! -
తెలంగాణలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమెతో టీ–స్పోర్ట్స్ చైర్మన్, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు వెబీనార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకారమిస్తే హైదరాబాద్ కేంద్రంగా వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తానని, తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతిభావంతులైన ఎంతోమంది యువ వెయిట్‌లిఫ్టర్లు ఉన్నారని... అయితే వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీ లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదని టీ–స్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. మల్లేశ్వరి ఫౌండేషన్‌తో కలిసి తెలంగాణ లిఫ్టర్లకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మల్లేశ్వరి హైదరాబాద్‌కు రావాలని ఈ వెబీనార్‌లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాట్లపై చర్చిద్దామని ఆయన అన్నారు. -
అధిక బరువెత్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
-
అధిక బరువెత్తి ప్రాణం మీదకు..
మాస్కో : వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఓ రష్యన్ పవర్ లిఫ్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వందలు, మూడు వందలు కాదు.. ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో విఫలమై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో వేదికగా జరిగిన ఈ వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ సెడిఖ్ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు. అదృష్టవశాత్తు బారెల్ వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సెడిఖ్ రెండు మోకాళ్లతో పాటు తొడ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు దాదాపు 6 గంటల పాటు శ్రమించి విరిగిపోయిన రెండు కాళ్ల ఎముకలను, కండరాలను ఆపరేషన్ చేసి అతికించారు. ఈ ప్రమాదంతో అలెగ్జాండర్ రెండు నెలలపాటు మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాలో 2019లో వరల్డ్ రా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల రడోస్కేవిచ్ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది. -
‘అర్జున’ రేసులో రాహుల్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) నామినేట్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అంతకుముందు 2015, 2017లలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రాహుల్... 2014 యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో రజతం... 2013 ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం... 2013 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మీరాబాయి, పూనమ్ పేర్లను కూడా... రాహుల్‌తోపాటు మీరాబాయి చాను (మణిపూర్), పూనమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) పేర్లను ఐడబ్ల్యూఎల్ఎఫ్ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. అయితే మీరాబాయి ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకుంది. వాస్తవానికి ‘ఖేల్‌రత్న’ కోసం ఎవరినైనా నామినేట్ చేయాలంటే ముందుగానే వారికి ‘అర్జున’ వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ‘ఖేల్‌రత్న’ను అందజేసింది. ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నా ‘అర్జున’ అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. పూనమ్ యాదవ్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్‌లిఫ్టర్‌కు ‘అర్జున’ లభించలేదు. -
తెలంగాణకు రెండు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్ –17 బాలుర వెయిట్‌లిఫ్టింగ్‌లో 73 కేజీల విభాగం లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ధనావత్ గణేశ్ రజత పతకం గెలిచాడు. అతను మొత్తం 245 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అండర్–17 బాలుర ఖో–ఖోలో తెలంగాణ జట్టుకు కాంస్యం లభిం చింది. అండర్–17 బాలికల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ షేక్ మహబూబా చాంద్ కాంస్య పతకం గెలిచింది. డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ (కడప)కు చెందిన మహబూబా మొత్తం 144 కేజీలు బరువెత్తింది. -
జెరెమీకి రజతం
న్యూఢిల్లీ: ఈజీఏటీ కప్ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో పతకం లభించింది. థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పురుషుల 67 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా రజత పతకం గెల్చుకున్నాడు. మిజోరం రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల లాల్రినుంగా మొత్తం 288 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అతడు స్నాచ్‌లో 131 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 157 కేజీలు బరువెత్తాడు. ఇండోనేసియా వెయిట్‌లిఫ్టర్ డెనీ 303 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్ రాహుల్
విజయవాడ స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. -
రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన హవా కొనసాగిస్తోంది. సోమవారం (భారత కాలమానం ప్రకారం) ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న ప్రదీప్ 352 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చారు. స్నాచ్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కేజీలు ఎత్తారు. సమోవాకు చెందిన సనేలే మావో 360 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓయిన్ బాక్సాల్ 351 కేజీల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించింది. -
జయహో రాహుల్
ఒకవైపు పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకున్నా... మరోవైపు ఫిజియో సేవలు అందుబాటులో లేకున్నా ... ఇంకోవైపు గాయాలు వేధిస్తున్నా... కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల పతకాల వేట మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. తొలి రెండు రోజుల్లో మహిళల విభాగంలో మీరాబాయి చాను, సంజిత చాను పసిడి పతకాలతో మెరవగా... మూడో రోజు పురుషుల విభాగంలో రాగాల వెంకట్ రాహుల్, సతీశ్ కుమార్ శివలింగం ‘స్వర్ణ’ కాంతులు విరజిమ్మారు. వీరిద్దరి ప్రతిభతో మూడో రోజు పోటీలు ముగిసేసరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలతో నాలుగో స్థానానికి చేరుకుంది. గోల్డ్‌కోస్ట్: తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్‌లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్నారు. తమ ప్రతిభతో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలను జమ చేశారు. తొలి రోజు స్వర్ణం, రజతం... రెండో రోజు స్వర్ణం, కాంస్యం రాగా... మూడో రోజు మాత్రం రెండూ స్వర్ణాలే కావడం విశేషం. పురుషుల 77 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సతీశ్ కుమార్ 317 కేజీలు (స్నాచ్‌లో 144+క్లీన్ అండ్ జెర్క్‌లో 173) బరువెత్తి విజేతగా నిలిచాడు. 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డాన్ ఒపెలోగ్ (సమోవా–331 కేజీలు) రజతం... ఫజ్రుల్ (మలేసియా–328 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మహిళల 63 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వందన గుప్తా ఐదో స్థానంలో నిలిచింది. పోటాపోటీ... గతేడాది ఇదే వేదికపై జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రాహుల్ ఏడాదిలోపే మళ్లీ పసిడితో మెరిశాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలో 147 కేజీలు ఎత్తిన రాహుల్... రెండో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తబోయి విఫలమయ్యాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. స్నాచ్ ఈవెంట్ ముగిశాక రాహుల్, డాన్ ఒపెలోగ్ 151 కేజీలతో సమంగా నిలిచారు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో రాహుల్ తొలి ప్రయత్నంలో 182 కేజీలు, రెండో ప్రయత్నంలో 187 కేజీలు బరువెత్తాడు. మూడో ప్రయత్నంలో 191 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్‌కు గట్టిపోటీనిచ్చిన సమోవా లిఫ్టర్ డాన్ ఒపెలోగ్ స్వర్ణం సాధించేందుకు చివరి ప్రయత్నంగా ఒపెలోగ్ ఈసారి 191 కేజీలకు వెళ్లి ఫెయిల్ కావడంతో రాహుల్‌కు స్వర్ణం ఖాయమైంది. మరోవైపు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన 25 ఏళ్ల సతీశ్కిది కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో స్వర్ణం. 2014 గ్లాస్గో గేమ్స్‌లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. సతీశ్ తండ్రి శివలింగం కూడా మాజీ వెయిట్‌లిఫ్టర్. ప్రస్తుతం ఆయన వీఐటీ యూనివర్సిటీ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. సతీశ్ సాధించిన ఘనతలతో తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. రూ. 50 లక్షలు నజరానా సతీశ్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా తమిళనాడు ప్రభుత్వం అతనికి రూ. 50 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది. గవర్నర్, వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: స్వర్ణం నెగ్గిన ఏపీ లిఫ్టర్ రాహుల్‌ను గవర్నర్ నరసింహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. తన ప్రదర్శనతో భారత్ పేరు నిలబెట్టాడని ప్రశంసించారు. గత ఏడాది మోకాలికి గాయమైంది. కొన్నాళ్ల క్రితం కామెర్లు రావడంతో ఒక్కసారిగా 20 కిలోల బరువు తగ్గిపోయాను. వీటన్నింటిని అధిగమించి ఇక్కడ పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇది అత్యంత విలువైన విజయం. అమ్మ మెట్టెలను అదృష్టంగా భావించాను. అందుకే వాటిని ధరించాను. ఆమె నా తోడుండి ఆశీర్వదించినట్లుగా అని పించింది. - రాహుల్ -
క్రీడా సిరి.. శిరీష
వల్లూరు: ఆమె పుట్టింది గ్రామీణ ప్రాంతమైనా... మక్కువ పెంచుకుని ఎంచుకున్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విశేష ప్రతిభ కనబరుస్తూ పతకాల సాధనలో క్రీడా సిరిగా నిలుస్తోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అసాధారణ రీతిలో రాణిస్తున్న ఆమె పేరు కొప్పర్తి శిరీష. వల్లూరు మండలంలోని పెద్దపుత్త గ్రామానికి చెందిన కొప్పర్తి వెంకట శివారెడ్డి, వెంకట లక్ష్మిల ఏకైక కుమార్తె శిరీష మూడవ తరగతి పూర్తవగానే హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్‌కు జరిగిన ఎంపికల్లో స్థానం సాధించింది. ఆ స్కూల్లో 2001వ సంవత్సరంలో నాలుగవ తరగతిలో చేరింది. 2003లో వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఆకర్షితురాలైంది. అనుకున్నదే తడవు కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణకు శ్రీకారం చుట్టింది. ♦ స్కూల్ గేమ్స్ నుండి వివిధ స్థాయిలలో జరిగే అన్ని పోటీలలో అగ్ర స్థానంలో నిలుస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడా పోటీలలో స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, టోటల్ విభాగాల్లో విశేషంగా రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుతోంది. అంకిత భావంతో కఠోర శ్రమ .. వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడలో రాణించడం మహిళలకు ఒక సవాలు లాంటిది. మిగిలిన క్రీడలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్‌లో మానసికంగా , శారీరకంగా చాలా శక్తివంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి గానూ శిరీష కఠోర శ్రమతో నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగింది. ♦ 2005లో స్టేట్ మీట్లో అరంగేట్రం చేసింది. 2008 లో నేషనల్ గేమ్స్‌లోకి అడుగిడింది. 2010 లో ఇంటర్నేషనల్ స్థాయి పోటీలకు ఎంపికైంది. ♦ 2014 వ సంవత్సరంలో సీనియర్స్ విభాగంలోకి వచ్చిన మొదట్లో ఒకటి రెండు పోటీల్లో అనుకున్నంతగా రాణించక పోయినా రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించి రాణించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2016 లో సెంట్రల్ రైల్వే జోన్ వారు ఈమె ప్రతిభను గుర్తించి క్రీడా కోటాలో ఉద్యోగాన్ని ఇచ్చారు. కొద్ది రోజులకు మోకాలి నొప్పి వేధించడంతో సీనియర్ నేషనల్ గేమ్స్‌కు దూరం కావాల్సి వచ్చినప్పటికీ నిరుత్సాహ పడలేదు. ముంబాయిలో తాను నివాసం వుంటున్న చోటు నుండి ప్రాక్టీస్ చేయడానికి లోకల్ ట్రైన్లో ప్రతి రోజు రాను రెండు గంటలు, పోను రెండు గంటలు ప్రయాణించి స్టేడియంకు చేరుకోవాల్సి వచ్చినప్పటికీ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి గత సంవత్సరం పంజాబ్‌లో జరిగిన ఆల్ ఇండియా రైల్వే ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్‌ను సాధించింది. ♦ ఈ ఏడాది జనవరిలో మంగళూరులో జరిగిన నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మహిళా శక్తికి తిరుగు లేదని నిరూపిస్తోంది. అన్ని పోటీల్లో పతకాలే.. ♦ 2005వ సంవత్సరంలో విశాఖలో జరిగిన సీనియర్ స్టేట్‌మీట్ పోటీలలో 44 కేజీల విభాగంలో రెండవ స్థానంతో శిరీష తన క్రీడా పతకాల ఖాతా తెరిచింది. అప్పటి నుండి తిరిగి చూడకుండా పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాన్ని సాధిస్తూ గొప్పగా రాణిస్తోంది. -
తెలంగాణ లిఫ్టర్లకు 4 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్‌గేమ్స్ అండర్–19 వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో స్వర్ణం, రజతం, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 4 పతకాలను సాధించింది. బాలుర 69 కేజీల విభాగంలో ఆర్ఎస్ఎల్ సాయి (తెలంగాణ) చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 235 కేజీలు (102 స్నాచ్+133 క్లీన్ అండ్ జర్క్) బరువునెత్తి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. 62 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బి. కృష్ణ (222 కేజీలు) రజతాన్ని, ఏవీ యశ్వంత్ (తెలంగాణ, 205 కేజీలు) కాంస్యాన్ని సాధించారు. 77 కేజీల విభాగంలో ఎంహెచ్ నిహాల్ రాజ్ (తెలంగాణ, 256 కేజీలు), ఎ.శివరామకృష్ణ (ఆంధ్రప్రదేశ్, 254 కేజీలు) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించగా... బాలికల 63 కేజీల విభాగంలో వేముల సాహితి (123 కేజీలు) కాంస్యాన్ని దక్కించుకుంది. -
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహమేదీ..?
► వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న లలిత ► పట్టించుకోని క్రీడాశాఖాధికారులు ► క్రీడా మంత్రి ఉన్నా అందని చేయూత నరసన్నపేట: నేతింటి లలిత.. నరసన్నపేట పట్టణానికి చెంది న ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అడుగుపెట్టిన ప్రతి టోర్నీలోనూ పతకాలు కొల్లగొడుతూ శభాష్ అనిపించుకుంటోంది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరకొర వసతులతో ఉన్న వ్యాయామ శాలలో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది. పలు పతకాలను కైవసం చేసుకుంటూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న నేతింటి లలితకు క్రీడాశాఖ అధికారుల నుంచి ప్రోత్సాహం కరువవుతోంది. పతకాలతో మెరుస్తున్నా కనీస ఆర్థిక సాయం చేయడం లేదు. కొంతమంది క్రీడాకారులకు అదే పనిగా నజరానాలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు, క్రీడా శాఖాధికారులు లలిత లాంటి పేద క్రీడాకారిణులకు భరోసా కల్పించలేకపోతున్నారు. క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే గ్రామీణ క్రీడాకారు ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. లలిత సాధించిన విజయాల్లో కొన్ని.. ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్ విభాగంలో స్వర్ణ పతకం. పంజాబ్ రాష్ట్రం చండీఘడ్‌లో జనవరిలో జరిగిన అఖిలభారత విశ్వ విద్యాలయాల స్థాయి పోటీల్లో నాలుగో స్థానం. 2016 డిసెంబరులో భువనేశ్వర్‌లో జరిగిన ఓపెన్ జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం. నవంబర్‌లో విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు. 2015లో బీహార్ రాష్ట్రం పాట్నాలో గత ఏడాది జరిగిన జూనియర్ విభాగం పోటీల్లో మూడు కాంస్య పతకాలు. ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు. ఈ విధంగా ప్రతి పోటీలోనూ పతకం సాధిస్తూ జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న లలితను ఆర్థి కంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు. ఇప్పటికైనా క్రీడాశాఖ అధికారులు స్పందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అవార్డు ఇవ్వాలి లలిత నిరు పేదకుటుంబానికి చెందిన అమ్మాయి. మంచి శిక్షణ ఇస్తే మరిన్ని పతకాలు సొంతం చేసుకుని జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తుంది. లలితను ఆర్థికంగా ఆదుకొని రాష్ట్ర మనీ అవార్డు ఇవ్వాలి. – అప్పలరామయ్య, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జాయింట్ కార్యదర్శి స్టైఫండ్ ఇవ్వాలి ఒలింపిక్, ఇతర ప్రపంచ స్థాయి పోటీల్లో ఏమాత్రం ప్రతిభ చూపినా కాసులు కురిపిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తున్నా క్రీడాకారులను పట్టించుకోవడం లేదు. గ్రామీణ క్రీడాకారులకు నెలవారీ స్టైఫండ్ ఇవ్వాలి. –గొద్దు చిట్టిబాబు, వైఎంసీఏ అధ్యక్షుడు, నరసన్నపేట -
శ్రీనివాసరావుకు రెండు పతకాలు
జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి శ్రీనివాసరావు రెండు పతకాలు సాధించాడు. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మంగళవారం జరిగిన పురుషుల 62 కేజీల విభాగంలో శ్రీనివాసరావు కాంస్యంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. శ్రీనివాసరావు స్నాచ్‌లో 112 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 143 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 255 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్ రాష్ట్ర విభాగంలో శ్రీనివాసరావు (255 కేజీలు) స్వర్ణం సొంతం చేసుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గౌరి బాబు (246 కేజీలు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. -
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బుధవారం డోర్నకల్‌లో జిల్లా జట్టును ఎంపిక చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలోని పైకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకపోతుల రమ్య, జడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, సర్పంచ్ మాదా లావణ్య, పీఏసీఎస్ చైర్మెన్ రాయల వెంకటేశ్వర్రావు, ఎంఈఓ మధులత, మండల క్రీడాధికారి ఇమ్మానియల్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్జనరల్ సెక్రెటరీ కొత్త రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు వాజీద్, ఎస్ఎంసీ చైర్మన్ దాసరి నాగేశ్వర్రావు, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ కొత్త కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు. బాలుర జట్టు.. 48 కేజీల విభాగంలో వి.గణేష్, ఎం వేణు, 56 కేజీల విభాగంలో ఎన్రాజేష్, 62 కేజీల విభాగంలో కె.హర్షిత్చక్రవర్తి, బి.కార్తీక్, 69 కేజీల విభాగంలో కె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎస్కె మదార్, 85 కేజీల విభాగంలో జి.గణేష్, ఎస్కె మెహరాజ్పాషా, ఎండీ అమీర్‌పాషా ఎంపికయ్యారు. బాలికల జట్టు.. 44 కేజీల విభాగంలో వి.వెన్నెల, కె.వైజయంతి, 48 కేజీల విభాగంలో ఎస్ మౌనిక, 53 కేజీల విభాగంలో బి.కావేరి, 58 కేజీల విభాగంలో పి.శ్రావణి, 63 కేజీల విభాగంలో బి.సింధు, 75 కేజీల విభాగంలో బి.అఖిల ఎంపికయ్యారు. -
వెయిట్‌లిఫ్టింగ్ జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : హైదరాబాద్ లో ఆదివారం నుంచి ప్రా రంభమయ్యే రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూని యర్ వెయిట్‌లిఫ్టింగ్ పో టీలకు జిల్లా జట్లను శనివారంమండల కేంద్రంలో ఎంపిక చేశారు. స్థానిక హనుమా¯ŒS వ్యాయామశాలలో జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేష¯ŒS జనరల్ సెక్రటరీ కొత్త్త రాంబాబు జట్లను ప్రకటిం చారు. సబ్‌జూనియర్ బాలుర జట్టుకు సంబంధించి 50 కేజీల విభాగంలో ఎం. వేణు, జి.గణేష్, 56 కేజీల విభాగంలో కె.హర్షిత్, బి.కార్తీక్, 62 కేజీల విభాగంలో ఎ¯ŒS.రాజేష్, 69 కేజీల విభాగంలో జె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎండీ.మాదుర్, 85 కేజీల విభాగంలో జి.గణేష్ ఎంపికైనట్లు తెలిపారు. జూని యర్ బాలుర జట్టుకు 50 కేజీల విభాగంలో కె.ప్రవీణ్, 56 కేజీల విభాగంలో కె.సందీప్, 62 కేజీల విభాగంలో రాజేష్, జి.హేమంత్, 69 కేజీల విభాగంలో జె.సాయి, 77 కేజీల విభాగంలో కె.నరేంద్రబాబు, ఎ¯ŒS ఉమేష్, 85 కేజీల విభాగంలో కె.యాకేష్, 94 కేజీల విభాగంలోఎండీ.ఖలీల్, జె.రమేష్ ఎంపికయ్యారు. సబ్ జూనియర్ బాలికల జట్టుకు 44 కేజీల విభాగంలో బి.కావేరి, 48 కేజీల విభాగంలో ఎం.సుష్మ, 53 కేజీల విభాగంలో పి.స్రవంతి, 58 కేజీల విభాగంలో ఎం.మౌనిక, 63 కేజీల విభాగంలో బి.సింధు, 68 కేజీల విభాగంలో ఎస్.సంధ్య, 75 కేజీల విభాగంలో డి.ప్రియాంక, ఎస్.సోని ఎంపికయ్యారు. జూనియర్ బా లికల జట్టుకు 44 కేజీల విభాగంలో జి.రోజా, 53 కేజీల విభాగంలో బి.వాణీశ్వరి, 63 కేజీల విభాగంలో మహాలక్ష్మి ఎంపికయ్యారు. బాలుర టీంకు కొత్త కుమార్, బాలికల టీంకు అనిల్‌కుమార్ కోచ్‌లుగా వ్యవహరిస్తారని రాం బాబు తెలిపారు. -
పల్లెక్రీడల్లో ధనుం‘జయం’
వెయిట్‌లిఫ్టింగ్, సంగిడిరాయి పోటీల్లో ప్రతిభ పతకాల పంట పండిస్తున్న ధనుంజయరావు గ్రామీణ యువతకు ఆదర్శం నందిగాం: మండలంలోని శివరాంపురం గ్రామానికి చెందిన ఇప్పిలి ధనుంజయరావు పల్లెక్రీడల్లో పతకాల పంట పండిస్తున్నాడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి గ్రామీణ క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. సంగిడీ, ఈడుపురాయి, ఉలవల బస్తా పోటీల్లో సత్తా చూపుతున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏ గ్రామంలో పోటీలు జరిగినా ప్రత్యక్షమవుతాడు. పోటీల్లో తలపడి విజేతగా నిలుస్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి ఆయన విజయపరంపర కొనసాగుతోంది. మొదటలో గ్రామీణప్రాంతంలో సరైన శిక్షణ లేకుండా బరువులను ఎత్తేవాడు. కంచిలి, పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, జలుమూరు, పోలాకి, గార, సారవకోట తదితర మండలాల్లో జరిగిన సంగిడి, ఉలవల బస్తా పోటీల్లో తలపడి బహుమతులు సాధించాడు. 2009లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల జిమ్ కోచ్‌గా ఉన్న వి.ఈశ్వరరావుతో ఏర్పడిన పరిచయంతో సంగిడీలు ఎత్తడం నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు దష్టి మళ్లించాడు. ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ, ఫిట్నెస్ను మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌లో రాష్ట్ర, జిల్లాస్థాయి పోటీల్లో రాణì స్తున్నాడు. ఆయన సాధించిన పతకాలు 2009 సంవత్సరంలో నరసన్నపేట మండలం బుచ్చిపేటలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 150 కిలోల విభాగంలో, 2010లో సారవకోట మండలం కిన్నెరవాడలో 105 కిలోల విభాగంలో విశేష ప్రతిభ చూపిన ధనుంజయరావు, 2011 శ్రీకూర్మాంలో 140 కిలోల రాళ్లు ఎత్తి సత్తా చాటాడు. సంతబొమ్మాళి మండలం గొదలాంలో 125 కిలోల రాళ్లు ఎత్తి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాడు. 2014లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 105 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ధనుంజయరావు ప్రతిభను మెచ్చి రాయలసీమ ఐజీగా పని చేస్తున్న రౌతుపురం గ్రామానికి చెందిన వజ్జ వేణుగోపాలకష్ణ రూ.50 వేల నగదు అందజేశారు. అలాగే, పాలకొండకు చెందిన పల్ల కొండబాబు వెయిట్ లిప్టింగ్ సెట్‌ను అందజేసి ప్రోత్సహించారు. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ గత ఏడాది రూ.50 వేలు అందజేసి ఆర్థిక తోడ్పాటునందించారు. -
వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ తప్పని నిరాశ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో భాగంగా తొలిరోజు తొమ్మిది పతకాలకు గాను మూడు ఈవెంట్లలో పాల్గొన్న భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో జీతూరాయ్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వ చండీలా, అయోనికా పాల్ నిరాశపరచగా, మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మిరాబాయ్ చానూ సైతం ఆకట్టుకోలేకపోయింది. భారతకాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన వెయిట్‌లిప్టింగ్ 48 కేజీల కేటగిరీలో మిరాబాయ్ స్నాచ్ విభాగంలో 82 కేజీలను ఎత్తడంలో విఫలమైంది. దీంతో క్లీన్ అండ్ జర్క్కు అర్హత సాధించలేక భారత అభిమానులు పతకంపై పెట్టుకున్న ఆశలను నిరాశపరిచింది. వెయిట్ లిఫ్టింగ్ పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన సోపితా తనాసన్ స్వర్ణ పతకం సాధించగా, ఇండోనేషియాకు చెందిన ఆగస్టియానికి రజతం సొంతం చేసుకుంది. జపాన్ క్రీడాకారిణి మియాకి కాంస్య పతకం దక్కింది. ఇక వెయిట్ లిఫ్టింగ్‌లో సతీష్ శివలింగం భారత్‌కు మిగిలిన ఆశాకిరణం. ఆగస్టు 10వ తేదీన 77 కేజీల కేటగిరీలో సతీష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
రష్యా వెయిట్‌లిఫ్టింగ్ జట్టుపై నిషేధం
పారిస్ : రష్యా క్రీడారంగానికి మరో గట్టి షాక్ తగిలింది. పటిష్ట వెయిట్‌లిఫ్టింగ్ జట్లలో ఒకటిగా నిలిచే రష్యా జట్టును రియో ఒలింపిక్స్ క్రీడల నుంచి నిషేధించారు. డోపింగ్ కారణంగానే ఎనిమిది మందితో కూడిన ఈ బృందంపై వేటు నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్) ప్రకటించింది. రష్యన్ల కారణంగా వెయిట్‌లిఫ్టింగ్ క్రీడకున్న పేరుప్రతిష్టలు చాలాసార్లు దెబ్బతిన్నాయని, అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామని ఐడబ్ల్యుఎఫ్ పేర్కొంది. 2008, 2012 ఒలింపిక్స్ సందర్భంగా సేకరించిన వీరి శాంపిళ్ల ఫలితాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని గుర్తు చేసింది. రష్యా ఒలింపిక్ కమిటీ నామినేట్ చేసిన అథ్లెట్ల జాబితా నుంచి ఇప్పటికే డోపింగ్ కారణంగా 117 మంది అథ్లెట్లను నిషేధించారు. రష్యా జట్టులో అర్టెమ్ ఒకులోవ్ గతేడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
రష్యాకు మరో ఎదురుదెబ్బ!
పారిస్: రియో ఒలింపిక్స్ విషయంలో ఇప్పటికే పలువురు అథ్లెట్లపై నిషేధం ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రష్యా వెయిట్ లిఫ్టింగ్ బృందాన్ని ఒలింపిక్స్ లో పాల్గొనకుండా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్యూఎఫ్) అడ్డుకుంది. గతంలో బీజింగ్, లండన్ ఒలింపిక్స్ల్లో రష్యా వెయిట్ లిఫ్టర్ల డోపింగ్ ఫలితాల నివేదిక ఆధారంగా ఆ జట్టుపై నిషేధం విధిస్తూ ఐడబ్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐడబ్యూఎఫ్ తాజా ప్రకటన విడుదల చేసింది. గత ఒలింపిక్స్ ల్లో రష్యన్ వెయిట్ లిఫ్టర్లలో అధికశాతం మంది డోపింగ్‌కు పాల్పడి ఆ క్రీడకు మచ్చ తెచ్చారని పేర్కొన్న ఐడబ్యూఎఫ్.. మొత్తం ఆ జట్టుపై ఒలింపిక్స్ నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లతో కలుపుకుని 117 మంది రష్యా క్రీడాకారులపై నిషేధం పడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజా నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీంతో ఆ సమాఖ్యలు తీసుకునే నిర్ణయాన్నే బట్టే రష్యా అథ్లెట్ల భవితవ్యం ఆధారపడివుంది. రియో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్నా...రష్యా అథ్లెట్ల నిషేధ పరంపర కొనసాగుతూనే ఉండటం గమనార్హం. -
వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు ‘రియో’ బెర్త్‌లు
ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శన రెండు ఒలింపిక్ బెర్త్‌లను అందించింది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు ఒక్క పతకం రాకపోయినా... ఓవరాల్ నైపుణ్యంతో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కో బెర్త్ లభించింది. -
భారత్ ‘కనక’ వర్షం
* రెండో రోజు 16 స్వర్ణాలు * రెజ్లింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట * దక్షిణాసియా క్రీడలు గువాహటి: సొంతగడ్డపై జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దుమ్మురేపుతున్నారు. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్లో అదరగొడుతూ పతకాల పంట పండిస్తున్నారు. పోటీల తొలి రోజు శనివారం 14 స్వర్ణాలను సాధించిన భారత ఆటగాళ్లు... రెండో రోజూ మరింత చెలరేగి ఏకంగా 16 పసిడి పతకాలతో అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం భారత్ 30 స్వర్ణాలు, 12 రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, రజతం దక్కాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ ధన్కర్ (70 కేజీలు), ప్రదీప్ (61 కేజీలు)... మహిళల విభాగంలో మమత (53 కేజీలు), మంజూ కుమారి (58 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ గోపాల్ యాదవ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల విభాగంలో సరస్వతి రౌత్ (58 కేజీలు)... రాఖీ హలెర్ (69 కేజీలు)... పురుషుల విభాగంలో సంబూ లాపుంగ్ (69 కేజీలు), అజయ్ సింగ్ (77 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. వుషు క్రీడాంశంలోని చాంగ్‌స్వాన్ ఈవెంట్లో సప్నా దేవి (భారత్) స్వర్ణం దక్కించుకుంది. మహిళల సైక్లింగ్ 40 కిలోమీటర్ల క్రయిటీరియమ్ ఈవెంట్లో లిదియామోల్ సన్నీ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. స్విమ్మింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్... 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అరవింద్... 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో సజన్ ప్రకాశ్... మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సయానీ ఘోష్ భారత్‌కు బంగారు పతకాలను అందించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. మహిళల ఫైనల్లో భారత్ 3-0తో పాకిస్తాన్‌పై, పురుషుల ఫైనల్లో భారత్ 3-0తో శ్రీలంకపై గెలిచాయి. భారత్ 24 - నేపాల్ 0 మహిళల హాకీలో భారత జట్టు గోల్స్ వర్షం కురిపించింది. నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 24-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య (15వ, 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బార్లా నాలుగేసి గోల్స్ చేయగా... రాణి, జస్ప్రీత్ కౌర్, నేహా గోయల్, దీపిక మూడేసి గోల్స్ నమోదు చేశారు. గుర్జీత్ కౌర్, ప్రీతి దూబే రెండేసి గోల్స్ సాధించారు. పురుషుల లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. -
రికార్డు బ్రేక్..
మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పురుష, మహిళల విభాగాల్లో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు రాజేంద్ర చైతన్య ఆరు నూతన రికార్డులు నెలకొల్పి గత రికార్డులు బ్రేక్ చేశాడు. ఆరు రికార్డులు బ్రేక్‌చేసిన చైతన్య = 105 కేజీల విభాగంలో ఆల్‌టైమ్ రికార్డ్ = పురుష, మహిళల విభాగాల్లో ఓవరాల్ చాంపియన్ రంగారెడ్డి = ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు మహబూబ్‌నగర్ క్రీడలు : రాష్ట్రస్థాయి సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు రాజేంద్ర చైతన్య ఆరు నూతన రికార్డులు నెలకొల్పి గత రికార్డులు బ్రేక్ చేశాడు. మహబూబ్‌నగర్ జెడ్పీ మైదానంలో రెండ్రోజులుగా జరుగుతున్న వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. మొదటిరోజు 58 కేజీల విభాగంలో సింధూ బంగారు పతకం కైవసం చేసుకోగా, రెండోరోజు జరిగిన 105 స్నాచ్‌లో వరుసగా 120, 130, 137 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో రాజేంద్రచైతన్య 160, 175, 180 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేసి సంచలనం సృష్టించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో విజేతలు 56కిలోల విభాగంలో శివలింగేశ్వర-రంగారెడ్డి (182 కేజీ), యశ్వంత్-రంగారెడ్డి (151కేజీ), 62కిలోల విభాగంలో వెంకటేశ్-హైదరాబాద్ (210కేజీ), కార్తీక్-రంగారెడ్డి (188కేజీ), సంపత్‌కుమార్-హైదరాబాద్ (180కేజీ), 69కిలోల విభాగంలో రాహుల్సాగర్-హైదరాబాద్ (225కేజీ), 77కిలోల విభాగంలో శ్రీనివాస్‌రావు-రంగారెడ్డి (220కేజీ), కరుణాకర్-హైదరాబాద్ (205కేజీ), నిహల్రాజ్-రంగారెడ్డి (186కేజీ), 94కిలోల విభాగంలో పద్మనాభం-రంగారెడ్డి (228కేజీ), రామ్‌కుమార్-హైదరాబాద్ (221కేజీ), ఆదిగణేష్-కరీంనగర్ (157కేజీ) విభాగంలో విజయం సాధించారు. మహిళల విభాగంలో.. 63 కిలోల్లో దీక్షిత-రంగారెడ్డి (162కేజీ), దీప్తి-వరంగల్ (110కేజీ), యాస్మిన్-ఖమ్మం (54.5కేజీ), 69 కిలోల విభాగంలో సుకన్య-హైదరాబాద్ (90కేజీ), రత్నకుమారి-ఖమ్మం (75కేజీ), సాయిసంయుక్త-రంగారెడ్డి (65కేజీ), 75కిలోల విభాగంలో రాజేశ్వరి-హైదరాబాద్ (180కేజీ), వైభవి-మెదక్ (47కేజీ), 75+కిలోల విభాగంలో రాజ్యలక్ష్మి-హైదరాబాద్ (160కేజీ), స్మృతి-మెదక్ (82కేజీ), సుప్రియ-కరీంనగర్ (70కేజీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన రంగారెడ్డి వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పురుషుల విభాగంలో 206 పాయింట్లు, మహిళల విభాగంలో 180 పాయింట్లతో రంగారెడ్డి జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను పొందింది. రన్నరప్‌గా పురుషుల్లో ఖమ్మం 185 పాయింట్లు, మహిళల్లో 169 పాయింట్లతో హైదరాబాద్ జట్లు నిలిచాయి. టోర్నీలో బెస్ట్మెన్ ప్లేయర్‌గా వెంకటేశ్ (హైదరాబాద్), బెస్ట్వెమన్గా దీక్షిత (రంగారెడ్డి)లు నిలిచారు. -
యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. సమోవాలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టర్ దీపక్ స్వర్ణం సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో 15ఏళ్ల దీపక్ పతకం దక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తొలి రోజు 56 కేజీల విభాగంలో జంజాంగ్ దేరు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. -
వీళ్లు మనకు తెలుసునా..!
గతవారం ఢిల్లీలో క్రీడా ఆవార్డుల కార్యక్రమం ముగిసింది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అంతా రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ప్రొఫెషనల్ టెన్నిస్ లో సానియా సాధించిన విజయాలకు ఖేల్ రత్న ఖచ్చితంగా సముచితమైన గౌరవమే..అయితే సానియా తో పాటు మరో డజను మంది ఆటగాళ్లు గత ఏడాది కాలంగా తమ తమ రంగాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. దురదృష్ట వశాత్తు వీరిని మీడియా పట్టించుకోలేదు. అవార్డుల వెనక రాజకీయాలు... క్రీడా బోర్డుల అతి చొరవ, అనేక వివాదాలు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షస్తాయి. ఆటలంటే.. క్రికెట్, చెస్, సానియా, సైనాలు మాత్రమే కాదు అని ఎంతో మంది తమ అద్వితీయ ఆటతీరుతో నిరూపిస్తున్నా.. కోట్లాది భారతీయుల గుర్తింపునకు మాత్రం నోచుకోవడం లేదు.. అలాంటి అన్ సంగ్ హీరోస్ దేశంలో చాలా మందే ఉన్నా.. కనీసం ఈ ఏడాది రాష్ట్ర పతి చేతులతో అవార్డులు పొందిన క్రీడాకారుల ఎంత మంది మనకు తెలుసు.. ? సందీప్ కుమార్: ఆర్చరీ పూనేకి చెందిన సందీప్ కుమార్ ఆసియా క్రీడల్లో పటిష్ట కొరియాని మట్టి కరిపించి ఈ విభాగంలో తొలి బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. పూనమ్మ: అథ్లెటిక్స్ ఆఫ్రికా, యూరప్, అమెరికాలు డామినేట్ చేసే ఈ విభాగంలో మన పూవమ్మ ప్రపంచ 42 రెండో ర్యాంక్ లో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400మీటర్ల వ్యక్తిగత కాంస్య పతకంతో పాటు, బంగారు పతకం గెలుచుకున్న 4X400 మీటర్ల రిలే టీమ్ లో సభ్యురాలు. అంతే కాదు ఆసియా స్థాయిలో బోలెడు వ్యక్తిగ పతకాలు సాధించి.. అర్జున అవార్డుకు అర్హత పొందింది. దీపా కుమార్: జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీపా కుమార్ చరిత్రే సృష్టించింది. గ్లాస్కో కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించి.. ఈ విభాగంలో పోడియం ఫినిష్ ఇచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల్లో పతకం తృటిలో కోల్పోయినా.. దీపా ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది. శ్రీజేష్ : హాకీ మన జాతీయ క్రీడా హాకీలో అద్భుత ప్రదర్శనకు గానూ.. శ్రీజేష్ అర్జున అవార్డు అందుకున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందుకున్న భారత జట్టు గోల్ కీపర్ శ్రీజేష్. అంతే కాదు. ఈ క్రీడల్లో పాకిస్తాన్ మ్యాచ్ లో శ్రీజేష్ అద్వితీయ ప్రదర్శన ఆయనకు ఆర్జున అవార్డు తెచ్చిపెట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ సంధించిన రెండు పెనాల్టీ స్ట్రోక్ లను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఇక 2014 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సతీష్ కుమార్: వెయిట్ లిఫ్టింగ్ అనామకుడిగా కామన్ వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టిన ఈ 23ఏల్ల తమిళనాడు క్రీడాకారుడు... 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో గేమ్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. బంగారు పతకాన్ని సాధించాడు. స్వరణ్ సింగ్ : రోయింగ్ 2012 సమ్మర్ ఓలింపిక్స్ లో రోయింగ్ లో ఫైనల్ కు చేరిన స్వరణ్.... 2013 ఆసియా రోయింగ్ చాంఫియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. ఇక 2014 ఆసియా క్రీడల్లో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక అందరికంటే స్పెషల్ క్రీడాకారుడిని వరించి అర్జున అవార్డు మరింత వన్నెలద్దుకుంది. అతని పేరు శరత్ గైక్వాడ్. వివిద విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన ప్రఖ్యాత క్రీడాకారిణి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన శరత్ బెంగుళూరు వాసి. 2014 ఆసియా క్రీడల్లో ప్యారా స్విమ్మింగ్ విభాగంలో 6 పతకాలు సాధించాడు. 2012లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న శరత్.. భారత్ తరఫున పారాలంపిక్స్ కు వెళ్లిన తొలి భారతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం. -
రాష్ట్రం గర్వించేలా ఆడండి
నిజామాబాద్ స్పోర్ట్స్ : క్రీడల్లో రాష్ట్రంలో ఇందూరు జిల్లా, దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచేలా ఆటగాళ్లు కృషి చేయాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్, మేయర్ సుజాత సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ అండర్-16 ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి టోర్నీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మేయర్ ఆకుల సుజాత, విశిష్ట అతిథిగా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా అథారిటీ జెండాలను ఆవిష్కరించారు. ఆయా జిల్లాల క్రీడాకారులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల తో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. పాఠశాల, కళాశాలలకే క్రీడలు పరిమితం కాకుండా జీవితాంతం ఆటలు ఆడాలని సూచించారు. క్రీడాకారులను తెలంగాణ సర్కారు ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. అన్ని క్రీడల్లో రాష్ట్రంలో ఇందూరు, దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచేలా ఆడాలన్నారు. పీఈటీలు, పీడీలు ఆ దిశగా కృషి చేయాలన్నారు. టోర్నీలో తెలంగాణలోని హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల ఫుట్‌బాల్ జట్లు, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. రెండు అంశాలకు సంబంధించి 423 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శర్మ తెలిపారు. మూడు రోజులపాటు టోర్నీ సాగుతుందన్నారు. బాలికలకు నిర్మల హృదయ పాఠశాలలో, బాలురకు ఎమ్ఎస్ఆర్ పాఠశాలలో వసతి సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, లింగన్న, ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు షకీల్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒలింపిక్ పతకమే లక్ష్యం
అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, అంతులేని అంకితభావం... ఈ మూడింటికీ చిరునామా మత్స సంతోషి. వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ, పతకాలు కొల్లగొడుతూ జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా రెపరెపలాడిస్తోంది. మామూలు పల్లె నుంచి వచ్చినా తనదైన కృషితో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగి దేశానికి పతకాలు అందిస్తోంది. ఇప్పుడామె రైల్వేలో సీనియర్ టీసీగా విధులు నిర్వహిస్తోంది. సంతోషి ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన కానుక ఇది. ఉద్యోగం రావడం సంతోషమే అయినా, ఒలింపిక్స్‌లో పతకం సాధించినపుడే తన లక్ష్యం నెరవేరుతుందని సంతోషి తెలిపారు. ప్రస్తుతం విజయనగరం రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సంతోషి ‘సాక్షి’తో ముచ్చటించింది. ఆ వివరాలు... - విజయనగరం టౌన్ * వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి * రైల్వే సీనియర్ టీసీగా విధుల నిర్వహణ ప్ర: రైల్వేశాఖలో విధులు నిర్వహించడం ఎలా ఉంది? జవాబు : విజయనగరం రైల్వేస్టేషన్లో సీనియర్ టీసీగా విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు కామన్వెల్త్లో పాల్గొన్న నలుగురికి రైల్వేశాఖ అవకాశం ఇచ్చింది. వారు ఆయా ప్రాంతాల్లో విధుల్లో చేరారు. ఆంధ్రప్రదేశ్ తరఫున నేను విజయనగరం కోరుకున్నాను. ఆరోగ్యం సహకరించక కొన్ని రోజులు లీవులో ఉన్నాను. గత కొద్దిరోజులుగా విధులు నిర్వహిస్తున్నాను. ప్ర: ఈతరం క్రీడాకారులకు మీరిచ్చే సలహా? జవాబు : క్రీడాకారులు తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయాలి. కృషితోనే ఫలి తం ఉంటుంది. శ్రమయేవ జయతే అన్నది అక్షర సత్యం. తల్లిదండ్రులు ప్రోత్సాహం పూర్తిస్థాయిలో ఉండాలి. ఎవరికి ఏ రంగాల్లో ఇంట్రస్ట్ ఉంటుందో అటువైపు వెళ్లేందుకు కు టుంబ సభ్యులు తగిన రీతిలో సహకరించాలి. అప్పుడే క్రీడాకారులు మరిం తగా రాణించగలుగుతారు. నిరుత్సాహం వీడాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది. ప్ర: ప్రస్తుతం మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? జవాబు : ఉద్యోగ రీత్యా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రాక్టీస్ మాత్రం విడువలేదు. నిరంతరం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రైల్వే ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలందిస్తున్నారు. వారి ప్రోత్సాహంతోనే మరింతగా ముందుకు వెళ్లగలుగుతున్నాను. మార్చిలో సీనియర్ నేషనల్స్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉంటాయి. వాటికోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్ర: మీ తదుపరి లక్ష్యం? జవాబు : 2016లో జరిగే ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకం పతకం తీసుకురావడమే నా లక్ష్యం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అహర్నిశలూ శ్రమించి పతకం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. కోచ్ చల్లారాము ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నాను. రైల్వేకు గర్వకారణం విజయనగరం రైల్వేస్టేషన్లో సీని యర్ టీసీగా మత్స సంతోషి రా వడం రైల్వేశాఖకు గర్వకారణం. భారతదేశానికి మరిన్ని పతకాలు తీసుకువచ్చి, రైల్వేశాఖకు, విజ యనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని ఆశిస్తున్నాం. మా డిపార్ట్మెంట్ తరఫున పూర్తి సహాయ,సహకారాలు ఆమెకు అందిస్తున్నాం. - డీవీఎన్.రావు, సీనియర్ కమర్షియల్ మేనేజర్ శుభ పరిణామం క్రీడాకారులకు సముచిత రీతిలో సత్కారం చేయడం ఆనందంగా ఉంది. కేంద్రప్రభుత్వం గుర్తించి సంతోషికి సీనియర్ టీసీగా జి ల్లాలో ఉద్యోగం ఇవ్వడం అభినందనీయం. దీంతో ఎంతో మంది క్రీడాకారులకు ఓ నమ్మకం కలుగుతుంది. సంతోషి భవిష్యత్‌లో మరింతగా రాణించాలి. రైల్వేశాఖ తరుపున పూర్తి సహకారం అందజేస్తాం. - బి.చంద్రశేఖరరాజు, స్టేషన్ మేనేజర్, విజయనగరం -
త్రీమంకీస్ - 20
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 20 ‘‘ప్రభుత్వం ఇటుకని గాలికి కొట్టుకోకుండా డోర్ స్టాపర్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. పొడి చేసి పళ్ళపొడిగా ఇస్తుంది. ఆఫీసుల్లో పేపర్ వెయిట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. వెయిట్ లిఫ్టర్స్కి వెయిట్ లిఫ్టింగ్ రాళ్ళుగా ఇస్తుంది. విసిరే ఆయుధంగా, తల మీద కొట్టే ఆయుధంగా ఇస్తుంది. షూటింగ్ రేంజ్లో గుళ్ళు బయటకి వెళ్ళకుండా ఆపడానికి ఇస్తుంది. ఫ్లవర్ పాట్స్ నిర్మించడానికి ఇస్తుంది. ఎయిర్ హోస్టెస్ శిక్షణలో వాళ్ళు కరెక్ట్ పోశ్చర్‌లో నడవడానికి తల మీద ఉంచడానికి ఇటుకలని ఇస్తుంది. రాత్రుళ్ళు కొవ్వొత్తులని వెలిగించుకోడానికి హోల్డర్లుగా ఇటుక మీద రెండు రంధ్రాలని చేసి ఇస్తుంది. బీదలు కుంకుడుకాయలని కొట్టుకోడానికి ఇస్తుంది. దాన్ని పొడి చేసి నీళ్ళు కలిపి పెయింట్‌గా ఉపయోగించడానికి ఇస్తుంది. కారు చక్రాలు జారిపోకుండా టైర్లకి అడ్డంగా పెట్టుకోడానికి ఇస్తుంది. పార్కుల్లో దారికి అటు, ఇటు నలభై అయిదు డిగ్రీల్లో పాతడానికి ఇస్తుంది. పేవ్మెంట్ మీద పరవడానికి ఇస్తుంది. ఇటుక మీద ఇటుక పేర్చి ఎత్తు చేసి, దాని మీద నించుని అటక మీద నించి ఏదైనా దింపుకోడానికి ఇస్తుంది. పండగలకి గిఫ్ట్ రేపర్ చుట్టి బహుమతిగా ఇస్తుంది. ఇంకా ఇటుకలతో కొత్త కొత్త ఉపయోగాలని కనుక్కుంటుంది. అంతే తప్ప అది ఇళ్ళు, గోడలు కట్టుకోడానికి ఇటుకలని చస్తే ఇవ్వదు. అలా ఇచ్చే ప్రభుత్వాలు చరిత్రలో ఇంతదాకా ఏ దేశాన్నీ పాలించలేదు. అలాంటి ప్రపంచంలోకి మీరు అడుగుపెడుతున్నారు.’’ విద్యార్థులు శ్రద్ధగా వినసాగారు. ‘‘ఓ పొలిటికల్ పార్టీ తమకే ఓటు వేస్తే ప్రజల కష్టాలని తీరుస్తామని పెన్నుల మీద ముద్రించి ఉచితంగా పంచింది. ‘మీకేమైనా సమస్య ఉంటే మీరు ఎన్నుకునే నాకు ఫోన్ చేయండి’ అని ఆ అభ్యర్థి ఫోన్ నంబర్ దాని మీద అచ్చు వేశారు. చాలామంది ఫోన్ చేసి ఆ పెన్ రాయడం లేదని తమ సమస్యగా ఫిర్యాదు చేశారు. ఇలా చేయకండి. యువత కాబట్టి మీరు ఈ దేశాన్ని చేతైతే బాగు చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇంకాస్త చెడగొట్టకండి. మీరు ఓటర్లు కాబట్టి ఈసారైనా జాగ్రత్తగా ఆలోచించి ఓట్లు వేయండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మా పార్టీ ప్రభుత్వానికి ఓటు వేయండి. చివరగా త్రీ ఆర్స్ ప్రిన్సిపల్ గురించి చెప్పి నేను ముగిస్తాను. రెస్పాన్సిబిలిటీ ఫర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్. ఈ రెండూ పాటిస్తేనే రైట్ అనేది వస్తుంది. జైహింద్.’’ యం పి స్పీచ్ పూర్తవగానే విద్యార్థులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ హర్షాన్ని ప్రకటించారు. ప్రిన్స్‌పాల్ లేచి చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ అకస్మాత్తుగా హాల్లోంచి గట్టిగా గాడిదల ఓండ్ర వినిపించింది. ‘‘సెలైన్స్. సెలైన్స్’’ ఆయన కోపంగా అరిచాడు. ఆయన మళ్ళీ తన స్పీచ్‌ని మొదలెట్టాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ మరోసారి గాడిద అరుపులు వినిపించాయి. ‘‘సెలైన్స్... నేనింత కాలం గాడిదలకి పాఠాలు చెప్తున్నానని అనుకోలేదు’’ స్టేజి మీది వైస్ ప్రిన్స్‌పాల్ మైక్‌ని అందుకుని కోపంగా చెప్పాడు. ‘‘ఆనర్డ్ గెస్ట్ శ్రీ...’’ ప్రిన్స్‌పాల్ మళ్ళీ చెప్పగానే, కూర్చున్న విద్యార్థ్ధులంతా అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. వారి మధ్య నించి రెండు గాడిదలు స్టేజి ముందుకు వచ్చి నిలబడి, స్టేజీ మీది వారి వంక చూస్తూ ఓండ్ర పెట్టాయి. ఆ స్టేజి మీది పెద్ద మనుషులంతా వాటి వంక నివ్వెరపోతూ చూశారు. ‘‘నాకు చెప్పకుండా అసలు వీటిని కాలేజీలో ఎందుకు చేర్చుకున్నారు? ఫీజ్ కోసమా?’’ యం పి కోపంగా అడిగాడు. ‘‘లేదు సార్. ఇవి మన కాలేజీలో చదివే గాడిదలు కావు. అల్లరి చేయడానికి ఎవడో అడ్డగాడిద వీటిని ఇక్కడ తెచ్చి వదిలాడు’’ ప్రిన్స్‌పాల్ ఆందోళనగా చెప్పాడు. గాడిదల మీద బొగ్గుతో అంకెలు, పేర్లు రాసి ఉండటం యం పి గమనించాడు. ‘‘వాటి మీద ఏం రాశారు?’’ ఆయన అడిగాడు. ‘‘సర్. ఓ గాడిదకి ఓ వైపు నంబర్ 1 అని, ఇంకోవైపు సెక్రటరీ అని రాశారు’’ ఓ విద్యార్థి చెప్పాడు. యం పి పగలబడి నవ్వుతూ అడిగాడు. ‘‘రెండో గాడిద మీద?’’ ‘‘నంబర్ 2- వైస్‌ప్రిన్సిపాల్.’’ ‘‘మూడోది?’’ యం పి నవ్వు ఇంకా పెరిగింది. ‘‘నంబర్ 3. ప్రిన్సిపాల్’’ విద్యార్థులు అరిచారు. ‘‘నాలుగో గాడిద?’’ యం పి పొట్ట పట్టుకుని నవ్వుతూ అడిగాడు. ‘‘నంబర్ 5. చీఫ్ గెస్ట్’’ వెంటనే ఆయన నవ్వు ఠక్కున ఆగిపోయింది. ముఖం కందగడ్డలా మారింది. ముక్కు పుటాలు అదిరాయి. ‘‘నంబర్ 4 గాడిద ఏది?’’ సెక్రటరీ అడిగాడు. వెంటనే విద్యార్థులంతా కలిసి ఆడిటోరియం మొత్తం వెదికారు. అది కనపడలేదు. తర్వాత కాలేజీ ఆవరణ, క్లాస్ రూంలు అంతా వెదికారు. ఎక్కడా నంబర్ ఫోర్ గాడిద ఎవరికీ కనపడలేదు. (ముగ్గురు మిత్రులు, దుర్యోధనుల ముఖాముఖి ఎలా ఉంటుంది?) -
చైనాదే తొలి స్వర్ణం
మొదటి రోజు కొరియా, చైనా హోరాహోరీ ఇంచియాన్: ఈసారి ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన ఘనతను చైనా సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో గువో వెన్జున్, జాంగ్ మెంగ్యున్, జౌ కింగ్యువాన్లతో కూడిన చైనా బృందం 1146 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్ బరిలో ఒక దేశం తరఫున ఉన్న ముగ్గురు క్రీడాకారిణులు సాధించిన మొత్తం స్కోరు ఆధారంగా పతకాలను నిర్ధారిస్తారు. ఓవరాల్‌గా తొలి రోజు ఐదేసి స్వర్ణాలతో ఆతిథ్య దక్షిణ కొరియా, చైనా దేశాలు పతకాల పట్టికలో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు పోటీల తొలిరోజే కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల 56 కేజీల విభాగంలో ఉత్తర కొరియా లిఫ్టర్, ఒలింపిక్ చాంపియన్ ఒమ్ యున్ చోల్ క్లీన్ అండ్ జెర్క్ అంశంలో నూతన ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను 170 కేజీల బరువెత్తి... 169 కేజీలతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. యూఏఈ జూడో జట్టుపై వేటు ఆదర బాదరగా ఇతర దేశాల నుంచి ఆటగాళ్లను అరువు తెచ్చుకుంటే మొదటికే మోసం వస్తుందని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రీడాధికారులకు తెలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గాలనే ఉద్దేశంతో యూఏఈ రెండేళ్ల క్రితం మాల్దొవా దేశానికి చెందిన ముగ్గురు జూడో క్రీడాకారులు మిహైల్ మార్చితన్, ఇవాన్ రెమరెన్సో, విక్టర్ స్కావొర్తోవ్లకు తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చింది. అయితే ఆసియా క్రీడల్లో ఇతర దేశస్థులు మరో దేశం తరఫున పాల్గొనాలనుకుంటే నిబంధనల ప్రకారం ఆ దేశంలో కనిష్టంగా మూడు సంవత్సరాలు నివసించాలి. కానీ ఈ ముగ్గురు జూడో క్రీడాకారులు ఈ నిబంధనను పూర్తి చేయలేదు. దాంతో యూఏఈ తరఫున పోటీపడాలని ఇంచియాన్‌కు చేరుకున్న ఈ ముగ్గురిపై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ వేటు వేసింది. అంకుల్ కోసం... ఎనిమిదేళ్ల క్రితం దోహా ఆసియా క్రీడల్లో అశ్వంపై స్వారీ చేస్తూ మైదానంలోనే దుర్మరణం పాలైన తన అంకుల్ కిమ్ హ్యుంగ్ చిల్కు... మరోసారి స్వర్ణ పతకం సాధించి ఘనమైన నివాళి ఇస్తానని చెప్పిన దక్షిణ కొరియా రైడర్ కిమ్ క్యున్ సబ్ తన మాట నిలబెట్టుకున్నాడు. శనివారం జరిగిన డ్రెస్సెజ్ టీమ్ ఈవెంట్లో కిమ్ క్యున్ సబ్, యూయోన్ చుంగ్, కిమ్ డాంగ్సియోన్; యంగ్షిక్ హవాంగ్లతో కూడిన కొరియా జట్టు పసిడి పతకాన్ని సాధించింది. 2010 ఆసియా క్రీడల్లోనూ ఈ కొరియా క్రీడాకారుడు స్వర్ణ పతకాన్ని నెగ్గి తన అంకుల్‌కు అంకితం ఇచ్చాడు. -
రజత రాహుల్
►వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు ►యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం నాన్జింగ్ (చైనా): అంతర్జాతీయ యవనికపై తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ మరోసారి మెరిశాడు. గత నాలుగేళ్లుగా వెయిట్ లిఫ్టింగ్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్న రాహుల్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక్కడ జరుగుతున్న రెండవ యూత్ ఒలింపిక్స్‌లో గురువారం 77 కేజీల విభాగంలో జరిగిన పోటీలో రాహుల్ రజత పతకం సాధించాడు. ఆరు రోజులుగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం. స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175 కేజీలు (మొత్తం 316 కేజీలు) బరువు ఎత్తిన రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఆర్మేనియాకు చెందిన హకోబ్ క్రిచియన్ (319 కేజీలు) స్వర్ణ పతకం గెలుచుకోగా, జస్లాన్ కలియెవ్ (కజకిస్థాన్-310 కేజీలు)కు కాంస్యం దక్కింది. ఆఖరి ప్రయత్నం విఫలం... స్నాచ్ విభాగంలో రాహుల్ తొలి ప్రయత్నంలో 135 కేజీల బరువు ఎత్తి ముందంజ వేశాడు. అయితే హకోబ్ 137 కేజీలు ఎత్తి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే రెండో ప్రయత్నంలో రాహుల్ 139 కేజీలు ఎత్తగలిగాడు. మూడో ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకుంటూ 141 కేజీలకు తీసుకెళ్లాడు. అయితే చివరి ప్రయత్నం చేసిన హకోబ్ 142 కేజీల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో రాహుల్ 170, 175 కేజీల బరువు ఎత్తాడు. మరో వైపు ప్రత్యర్థి హకోబ్ మొదటి ప్రయత్నంలో 172 కేజీలు ఎత్తినా...రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. మూడో సారి మాత్రం అతను 177 కేజీలు ఎత్తి రాహుల్‌కు సవాల్ విసిరాడు. దాంతో 179 కేజీలు ఎత్తితే స్వర్ణం నెగ్గే స్థితిలో రాహుల్ నిలిచాడు. అందు కోసం తీవ్రంగా ప్రయత్నించినా లిఫ్ట్ చేయలేకపోయాడు. ఫలితంగా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్నాచ్‌లో 133, క్లీన్ అండ్ జర్క్‌లో 163 (మొత్తం 296 కేజీలు) మాత్రమే ఎత్తగలిగిన రాహుల్... ఈ సారి తన ప్రదర్శనను అద్భుతంగా మెరుగు పర్చుకున్నాడు. ఏకంగా 20 కేజీలు ఎక్కువగా అతను బరువెత్తడం విశేషం. బార్ జారిపోయింది ‘మూడో ప్రయత్నంలో 179 స్కోరు సాధించే క్రమంలో క్లీన్ వరకు బాగానే చేశాను. అయితే జర్క్ సమయంలో మెడపై చెమట ఎక్కువై బార్ జారిపోయింది. దాంతో కొద్ది తేడాతో స్వర్ణం కోల్పోయాను. కాస్త నిరాశగా అనిపించినా ఇది నా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కాబట్టి సంతృప్తిగా ఉన్నాను. ఎన్ఐఎస్లో ఎనిమిది నెలల శిక్షణ యూత్ ఒలింపిక్స్‌లో ఫలితాన్ని ఇచ్చింది. మా కోచ్‌లు ఎంతో సహకరించారు. వచ్చే జనవరిలో ఆసియా చాంపియన్‌షిప్ నా తదుపరి ఈవెంట్. ఆ తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో సీనియర్ కేటగిరీ కోసం సాధన మొదలు పెడతా. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా జీవిత లక్ష్యం’ - ‘సాక్షి’తో నాన్జింగ్ నుంచి రాహుల్ ‘పాల్గొన్న తొలిసారే రాహుల్ యూత్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. చైనా వెళ్లే ముందే గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు. అతని ప్రదర్శన తర్వాత నాకు మిత్రులు, సన్నిహితులనుంచి వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌లోనూ గెలుస్తానని నాకు తరచూ చెబుతున్నాడు. వాడు ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా. రాహుల్ స్ఫూర్తితో మా రెండో అబ్బాయి కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నాడు’ - రాహుల్ తండ్రి మధు కెరీర్లో అత్యుత్తమ విజయం ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 21), ఇదే వేదిక...యూత్ ఆసియా క్రీడల్లో రాహుల్ స్వర్ణ పతకం గెలుచుకొని సత్తా చాటాడు. యాదృచ్ఛికంగా ఇప్పుడు కూడా అదే వేదికపై ఆసియా స్థాయిని దాటి యూత్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం విశేషం. 17 ఏళ్ల రాహుల్, రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి. ఈ ఏడాదే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన అతను స్పోర్ట్స్ స్కూల్ ‘అలుమ్ని’గా ఇక్కడే శిక్షణ కొనసాగిస్తున్నాడు. కోచ్‌లు ఎస్ఏ సింగ్, పి. మాణిక్యాలరావుల పర్యవేక్షణలో అతను తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధిస్తున్నాడు. జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున నిలకడగా రాణించిన తర్వాత రెండేళ్ల క్రితం సమోవాలో జరిగిన యూత్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకొని తొలిసారి అతను అంతర్జాతీయ వేదికపై పతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో యూత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలు, యూత్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం...జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలు అందుకున్నాడు. యూత్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న రాహుల్‌ను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య అభినందించారు. - సాక్షి క్రీడావిభాగం -
అవరోధాలను ఎత్తిపడేసింది!
విజయాన్ని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే దాన్ని తెచ్చి ఒళ్లో వేసుకుంటారు. మత్స సంతోషి ఈ రెండో కోవకు చెందిన అమ్మాయి. విజయాన్ని పొందడమే కాదు... దాన్ని తన ఇంట్లో కట్టి పారేసిందామె. తన ఇంటి అల్మరాలో ఉండే మెడళ్లు, అవార్డులు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సాధన చేయడం, సాధించి తీరడం ఆమెను చూసే నేర్చుకోవాలి ఎవరైనా. తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించిన సంతోషి ఇంతవరకూ చేసిన ప్రయాణం... స్ఫూర్తిదాయకం! ఏదైనా సాధించాలంటే ఏం కావాలి... డబ్బా? పలుకుబడా? కాదు. ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష. అవి మత్స సంతోషికి మెండుగా ఉన్నాయి. అందుకే ఆమె అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. క్రీడాకారిణిగా లెక్కలేనన్ని పతకాలు సాధించింది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం సంతోషిది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. తండ్రి రామారావు జూట్ మిల్లులో కార్మికుడు. తల్లి రాములమ్మ గృహిణి. నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లల్లో మూడవది సంతోషి. చురుకైనది. హుషారైనది. ఆమె ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడానికి పునాది వేసినవి ఆ లక్షణాలే. సంతోషి ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఆ గ్రామానికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు అంతర్జాతీయ పతకాన్ని సాధించారు. ఆయనకు సంతోషి చదువుతున్న పాఠశాలలో సన్మానం జరిగింది. అది సంతోషి చిన్ని మనసు మీద పెద్ద ప్రభావమే చూపించింది. ‘నన్నూ ఇలా సత్కరిస్తే బాగుణ్ను, ఎప్పటికైనా అలా జరుగుతుందా’ అనుకునేది. 2005లో అదే గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ కోచ్ చల్లా రాము సంతోషిలోని ఉత్సాహాన్ని గమనించారు. ‘నువ్వు మంచి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్వవుతావని నా నమ్మకం, ప్రయత్నించు’ అన్నారు. దాంతో తను మొదట వేయాల్సిన అడుగేంటో అర్థమైంది సంతోషికి. కష్టాలకు ఎదురీది... పల్లెటూరు... లోకజ్ఞానం తక్కువ. దానికి తోడు పేదరికం. ఇలాంటి పరిస్థితుల్లో కలను సాకారం చేసుకునే దిశగా సాగడం అంత తేలికేమీ కాదు. రాము ఆధ్వర్యంలో సంతోషి సాధన ప్రారంభించే నాటికి ఆ ఇంట్లో ఒక్క ఆడపిల్లకి మాత్రమే పెళ్లయ్యింది. మిగతా పిల్లల్ని పెంచడానికి తండ్రి నానా ఇబ్బందులూ పడుతున్నాడు. మూడు వేల జీతంతో అయిదుగురి జీవితాలను నడుపుతున్నాడు. ఆయనకు అండగా ఉండేందుకు సంతోషి చిన్నక్క ఓ ఆసుపత్రిలో పని చేసేది. వేణ్నీళ్లకు చన్నీళ్లలా తండ్రి సంపాదనకు తన సంపాదనను జోడించేది. అయినా తీరని కష్టాలు వారివి. అందుకే సంతోషి లక్ష్యసాధనకు ఆటంకాలు ఎక్కువగానే వచ్చాయి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అవసరమా అని ఆలోచించేది. వాళ్లకు కూడా ఇది అదనపు భారమే. అయితే రాము వారిని ఒప్పించారు. సంతోషి భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చారు. దాంతో వారు సరే అన్నారు. ఆ వెంటనే సంతోషి సాధన మొదలుపెట్టింది. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించింది. దాంతో ఆత్మవిశ్వాసం హెచ్చింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదల పెరిగింది. కానీ చదువు విషయంలో ఇబ్బంది పడేది. 2010లో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే అదే ఏడాది ఏషియన్ వెయిట్‌లిప్టింగ్ చాంపియన్‌షిప్ ఉండడంతో 2009 నుంచి కోచింగ్ కోసం పంజాబ్‌లో ఉండిపోవడంతో పరీక్షలకు హాజరు కాలేకపోయింది. 2011లో రాసి పాసయ్యింది. 2012లో నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఇసీ గ్రూపులో చేరింది సంతోషి. అయితే తరచూ ప్రాక్టీసుకు వెళ్లడంతో హాజరు చాలక, ఫైన్ కట్టాల్సి వచ్చింది. కోచింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను కాలేజీ వారికి చూపించినా వారు ప్రోత్సహించలేదు. పీడీ బొమ్మన రామారావు ఒక్కరే సంతోషికి సహకరించేవారు. చివరికి ద్వితీయ సంవత్సరం సంతోషిని రెగ్యులర్ విద్యార్థినిగా కాకుండా ప్రైవేటు విద్యార్థినిగా చేశారు. ఇవన్నీ ఆమెను బాధ పెట్టేవి. కానీ దిగులు పడేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేది. దానికి తోడు ఆర్థికావసరాలు కూడా అడ్డుపడుతుండేవి. మొదటి నేషనల్ పోటీలకు మణిపూర్ వెళ్లేందుకు డబ్బులు లేకపోతే తల్లి తన చెవి కమ్మలు అమ్మి డబ్బులు ఇచ్చింది. రాము ఆమెకు కొన్ని విషయాల్లో సహాయపడేవారు. ఏదైనా పోటీలో ప్రైజ్ మనీ వస్తే, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఆ సొమ్ముతో తన ఆటకు అవసరమైన వాటిని సమకూర్చుకునేది. ఆ కష్టం ఊరికే పోలేదు. ఈరోజు సంతోషి తల్లిదండ్రుల కళ్లు బాధతోనో, కష్టం వల్లనో కాదు... తమ కూతురు సాధించినదాన్ని చూసి గర్వంతో తడుస్తున్నాయి. - నడిపేన బంగారు నాయుడు, సాక్షి, విజయనగరం ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రులతో పాటు తన కోచ్ రాము కూడా ఎంతో తోడ్పడ్డారని అంటుంది సంతోషి. ఆయనే కనుక తన టాలెంట్‌ని గుర్తించి ఉండకపోతే ఇవన్నీ సాధించగలిగేదాన్ని కాదు అంటుంది... తనకొచ్చిన మెడల్స్‌ని చూపిస్తూ! స్పాన్సర్స్ ఎవరూ లేకపోయినా... లయన్స్ క్లబ్ తరఫున తనకు వ్యక్తిగతంగా ప్రోత్సాహాన్ని అందిస్తోన్న డాక్టర్ బీఎస్ఆర్ మూర్తికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోందామె! -
విజయ్ కుమార్ విఫలం
గ్లాస్గో: భారత షూటర్, ఒలింపిక్ కాంస్య పతాక విజేత విజయ్ కుమార్ 20వ కామన్వెల్త్ గేమ్స్ లో నిరాశపరిచాడు. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించకుండానే వెనుదిరిగాడు. రెండు క్వాలిఫైయింగ్ రౌండ్లలో 555 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచాడు. మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్ రౌండ్ లో అడుగుపెడతారు. మరో భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ 14 హిట్స్ తో 573 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియి షూటర్లు బ్రూస్ క్విక్(572), డేవిడ్ జే చాప్మన్(568) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
గ్లాస్గోలో భారత్ 'బలం' పెరిగింది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూసుకెళ్తోంది. ఎప్పటిలాగే షూటింగ్లో భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. భారత్ పతకాల వేటలో షూటింగ్ తర్వాతి స్థానం వెయిట్లిఫ్టింగ్ది. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌తో పోలిస్తే గ్లాస్గోలో భారత్ 'బలం' పెరిగింది. వెయిట్ లిఫ్టింగ్ లో ఎక్కువ పతకాలు కైవసం చేసుకుంది. సొంత వేదికపై జరిగిన గత ఈవెంట్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్‌లో మొత్తం 8 పతకాలు సాధించింది. ఇందులో రెండేసి స్వర్ణాలు, రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. గ్లాస్గోలో జరుగుతున్న తాజా ఈవెంట్లో భారత వెయిట్ లిఫ్టర్లు మరింత మెరుగైన ప్రదర్శనతో పతకాల సంఖ్యను పెంచారు. తొలి ఐదు రోజుల్లో 10 పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు ఉండటం విశేషం. మరో నాలుగు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. సోమవారం నాటికి భారత్ 27 పతకాలు సాధించగా.. షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్లోనే 23 రావడం విశేషం. షూటింగ్లో 13, వెయిట్ లిఫ్టింగ్‌లో 10, జూడోలో 4 పతకాలు వచ్చాయి. రెజ్లింగ్, బాక్సింగ్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు రావాల్సివుంది. -
భారత్ పరువు కాపాడింది ఆ 'రెండే'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఆశించిన ఫలితాలు సాధిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం టాప్-5లో నిలిచింది. తొలి నాలుగు రోజుల్లో మొత్తం 22 పతకాలు సొంతం చేసుకుని ఐదో స్థానంలో నిలిచింది. అయితే భారత్ గౌరవం కాపాడింది మాత్రం రెండు క్రీడాంశాలే. అవే షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత క్రీడాకారుల ఓవరాల్ ప్రదర్శనను పరిశీలిస్తే షూటర్లే ముందంజలో నిలిచారు. పతకాలన్నీ కేవలం మూడు క్రీడాంశాల్లోనే రాగా.. అందులోనూ సింహ భాగం షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలల్లోనే సాధించడం గమనార్హం. ఈ రెండింటిలో తొమ్మిది చొప్పున పతకాలు రావడం విశేషం. గ్లాస్గోలో భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారత్‌కు ఆదివారం నాటికి ఆరు బంగారు పతకాలు రాగా షూటింగ్లో మూడు, వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు పతకాలు వచ్చాయి. ఇక భారత షూటర్లు మరో ఐదు రజతాలు, ఓ కాంస్య పతకం కైవసం చేసుకోగా, లిఫ్టర్లు మరో రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు నెగ్గారు. జూడోలో రెండేసి రజతాలు, కాంస్యాలు లభించాయి. కాగా భారత్ ఆశలు పెట్టుకున్న రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో ఇంకా ఫైనల్స్ జరగాల్సివుంది. ఈ రెండింటిలోనూ మనోళ్లు పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు నిరాశపరిచారు. తొలి నాలుగు రోజుల్లో భారత్ సాధించిన పతకాలు వివరాలు క్రీడాంశాల వారీగా.. భారత్ సాధించిన పతకాలు 22 షూటింగ్ 9-3 స్వర్ణాలు-5 రజతాలు-1 కాంస్యం వెయిట్ లిఫ్టింగ్ 9-3 స్వర్ణాలు-2 రజతాలు-4 కాంస్యాలు జూడో 4-2 రజతాలు-2 కాంస్యాలు -
ఓంకార్ ఒటారికి కాంస్య పకతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ లిఫ్టర్ ఓంకార్ ఒటారి కాంస్య పకతం సాధించాడు. 69 కేజీలో విభాగంలో అతడీ పతకం సాధించాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది. ఇందులో ఐదు బంగారు, ఏడు రజతాలు, ఐదు కాంస్య పతకాలున్నాయి. 50 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఓంకార్ సాధించిన పతకం వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు ఆరో పతకం. కాగా, మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధిస్తుందనే అంచనాలున్న మీనా కుమారి నిరాశపరిచింది. 58 కేజీల విభాగంలో మీనా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మాత్రమే ఎత్తగలిగింది. -
‘అంధ’లమెక్కాడు...
దుర్భర దారిద్య్రం... తల్లీతండ్రి కూలికి వెళితేనే గానీ పూట గడవని పరిస్థితి... ఇంట్లో అన్నయ్య గుడ్డివాడు... వీటన్నింటికీ మించి తానూ అంధుడే... ధైర్యంగా నాలుగు మాటలు చెప్పి, సాయం చేసేవారూ లేరు... ఇలాంటి పరిస్థితుల్లో ఓ పిల్లాడు ఏమవుతాడు..? ఎలాగోలా జీవితం గడిస్తే చాలనుకుంటాడు. కానీ పారపాటి రమేశ్ మాత్రం అలా కాదు. విధితో పోరాడాడు. అంధత్వాన్ని అధిగమించాడు. వెయిట్ లిఫ్టింగ్ లాంటి ‘బరువైన’ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దొరికిన చిన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితం... రాష్ట్రంలో వెయిట్ లిఫ్టింగ్‌లో సబ్‌జూనియర్ కేటగిరీలో అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదిగాడు. అవరోధాలను అధిగమించి... శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన రమేశ్ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మరో సోదరుడు కూడా అతనిలాగే అంధుడే. ఇలాంటి నేపథ్యంలో రమేశ్ ఒక ఒలింపిక్ క్రీడ వైపు ఆసక్తి చూపించడం, అందుకు తగ్గట్లుగా శ్రమించేందుకు సిద్ధపడటం అతని పట్టుదలను సూచిస్తోంది. విజయనగరం అంధుల పాఠశాలలో ఉండగా అతనికి ఈ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే పూర్తిగా కళ్లు కనిపించని అతను ఇలాంటి భారీ క్రీడను ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అది కేవలం సరదాకే పరిమితమవుతుందని అందరూ భావించారు. కానీ అతను మాత్రం ఆటపై అభిమానం పెంచుకున్నాడు. ఆరంభంలో కాస్త బరువైన కర్రను ఎత్తడంతో అతని అభ్యాసం మొదలైంది. ఆ తర్వాత శరీరం ఎలా కదపాలో, చేతులు ఎలా ఎత్తాలో అన్నీ సాధన చేశాడు. మొదట్లో కేవలం ఐరన్ బార్‌ను ఎత్తడం ప్రారంభించిన అతను ఆ తర్వాత వాటికి వెయిట్స్ జత చేశాడు. మెల్లమెల్లగా బరువు పెంచుతూ పోయాడు. ఇదే పాఠశాలలో అనేక మంది రమేశ్‌తో పాటే నేర్చుకున్నా మధ్యలోనే మానేశారు. కానీ అతను మాత్రం మొండిగా ముందుకు సాగాడు. ఆ ముగ్గురి అండతో... జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నా రమేశ్ పట్టుదలగా లిఫ్టర్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొంత మంది అతనికి అన్ని విధాలా అండగా నిలిచారు. ఇందులో మొదటి వ్యక్తి కోచ్ రవికుమార్. అంధుల పాఠశాలలో రమేశ్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్పించి తీర్చిదిద్దింది ఆయనే. ఒక అంధ విద్యార్థికి ఆట నేర్పించడం అంత సులువు కాదు. ఆటగాడిలో పట్టుదలతో పాటు కోచ్‌కు ఎంతో సహనం కూడా కావాలి. నేర్చుకునే దశలో ప్రతీ లోపాన్ని సవరిస్తూ వచ్చిన రవికుమార్, ప్రాక్టీస్‌లో కుర్రాడికి దెబ్బలు తగలకుండా దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. తన ముగ్గురు కూతుళ్లతో సమానంగా రమేశ్‌ను కూడా కుటుంబసభ్యుడిలా చూసుకున్నారాయన. అంధుడితో లిఫ్టింగ్ ప్రమాదమని చెప్పినా సొంత పూచీపై ఆయన నేర్పించారు. విశాఖలో ప్రభుత్వాధికారిగా పని చేస్తున్న కోరుకొండ రమేశ్ ప్రాక్టీస్ కోసం, వివిధ టోర్నీలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందించారు. ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య కూడా తన పరిధిలో ఎంతో సహకారం అందించారు. ఓపెన్ కేటగిరీలో పోటీల్లో తరచూ పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ఆయన అవకాశం కల్పించారు. వీడని సమస్యలు... ఇటీవల గౌహతిలో జాతీయ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించడంతో రమేశ్ కూడా అందరిలాగా రాణించగలడనే నమ్మకం కలిగింది. ఈ నెలలోనే విజయనగరంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల సబ్ జూనియర్ విభాగంలో రమేశ్ బెస్ట్ లిఫ్టర్‌గా నిలవడం విశేషం. అయితే ఇతర క్రీడాకారుల్లాగే అతనికి కూడా సౌకర్యాలలేమి సమస్యగా మారింది. ఇప్పటికీ అతను ఇనుప బార్తోనే సాధన చేస్తున్నాడు. ఎలికో బార్, పవర్ బార్, వెయిట్ డిస్క్‌లు అతనికి ఇంకా అందుబాటులో లేవు. వాటిని కొనేంత ఆర్థిక స్థోమత లేదు. ఇటీవల సాంగ్లీలో జరిగిన నేషనల్స్‌లో లిఫ్టింగ్ షూస్ లేకపోవడంతో నిర్వాహకులు అంగీకరించలేదు. చివరి నిమిషంలో ఏదో షూస్‌తో బరిలోకి దిగినా అతని ప్రదర్శనపై అది ప్రభావం చూపించింది. రమేశ్ అంధుడే అయినా ఓపెన్ పోటీల్లో పాల్గొంటుండటం వల్ల అతనికి నిబంధనల విషయంలో ఎలాంటి సడలింపూ ఉండదు. ఇక వికలాంగుల పింఛన్ కింద నెలకు ఇచ్చే రూ. 500 ఏ మూలకూ సరిపోవు. ఒక లిఫ్టర్‌కు అవసరమయ్యే బలవర్ధకమైన ఆహారం తీసుకునేందుకు కూడా అతనికి డబ్బు సమస్యగా మారింది. అయినా పట్టుదలతో శ్రమిస్తున్న అతడికి ఎవరైనా పూర్తిస్థాయిలో చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తే అద్భుతాలు చేయగలడనడంలో సందేహం లేదు. - బి.ఎస్. రామచంద్రరావు (సాక్షి, విశాఖపట్నం ప్రతినిధి) ఎలా ఆడతాడంటే.. సాధారణంగా కళ్లు కనిపించని వ్యక్తి నడవడమే కష్టం. అలాంటిది వేదిక మీదకు వెళ్లి బార్‌ను కచ్చితంగా పట్టుకుని బరువు లేపడం అసాధారణ విషయం. అందులోనూ తప్పుగా బార్ పట్టుకుంటే ఫౌల్ అవుతుంది. కాబట్టి కోచ్ రవి ఓ కొత్త ఆలోచన చేశారు. ‘నువ్వు వేదిక మీదకు వెళ్లి బార్ పట్టుకో. కరెక్ట్‌గా పట్టుకుని బరువు ఎత్తితే అందరూ చప్పట్లు కొడతారు. సమస్య లేదు. అలా కాకుండా వెళ్లి బార్‌ను తప్పుగా పట్టుకుంటే నేను చప్పట్లు కొడతాను. సరిచేసుకో’ అని రవి సూచించారు. ప్రస్తుతం రమేశ్ ఇదే ఆచరణలో పెడుతున్నాడు. బరువు ఎత్తకముందే చప్పట్లు వినిపించాయంటే తాను తప్పు చేస్తున్నట్లు అర్థం. ‘విజయనగరం స్కూల్లో శరీరం తీవ్రంగా నొప్పి పెట్టినా, మణికట్టు దగ్గర బాధగా అనిపించినా నేను ఆట వదల్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకున్నా. నాతో పాటు మా కోచ్ కూడా చాలా కష్టపడుతున్నారు. అందుకే ఇంకా పెద్ద పోటీల్లో గెలవాలి. మరిన్ని పతకాలు సాధించాలి. కనీసం నేను గెలిచిన మెడల్స్ కూడా చూడలేను. అయినా సరే పెద్ద స్థాయికి చేరుకుంటా. పారాలింపిక్స్‌లో అవకాశం వస్తే స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు సహకరిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు’ - రమేశ్ -
‘స్వర్ణ’ శిరీష
న్యూఢిల్లీ: వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో తెలుగుతేజం దూసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొప్పర్తి శిరీష కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణాలు గెలిచింది. మలేసియాలోని పెనాంగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శిరీష జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో ఈ పతకాలు నెగ్గింది. స్నాచ్‌లో 73 కేజీల బరువెత్తి మొదటి స్థానంలో నిలిచిన ఆమె... క్లీన్ అండ్ జెర్క్‌లో 95 కేజీల బరువెత్తి మరో స్వర్ణాన్ని గెలిచింది. మొత్తం 168 కేజీలతో మూడో పసిడి పతకం గెలుచుకుంది. యూత్ మహిళల 58 కేజీల విభాగంలో జోయతిమాల్ కూడా మూడు స్వర్ణాలు గెలిచింది. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో మినాటి సేథి మూడు కాంస్యాలు గెలిచింది. దీంతో బుధవారం భారత్ ఖాతాలో మొత్తం ఆరు స్వర్ణాలు, మూడు కాంస్యాలు చేరాయి. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటివరకు భారత్‌కు మొత్తం 48 పతకాలు రాగా... ఇందులో 26 స్వర్ణాలు ఉండటం విశేషం.