గ్లాస్గోలో భారత్ 'బలం' పెరిగింది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ దూసుకెళ్తోంది. ఎప్పటిలాగే షూటింగ్లో భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. భారత్ పతకాల వేటలో షూటింగ్ తర్వాతి స్థానం వెయిట్లిఫ్టింగ్ది. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్తో పోలిస్తే గ్లాస్గోలో భారత్ 'బలం' పెరిగింది. వెయిట్ లిఫ్టింగ్ లో ఎక్కువ పతకాలు కైవసం చేసుకుంది.
సొంత వేదికపై జరిగిన గత ఈవెంట్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్లో మొత్తం 8 పతకాలు సాధించింది. ఇందులో రెండేసి స్వర్ణాలు, రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. గ్లాస్గోలో జరుగుతున్న తాజా ఈవెంట్లో భారత వెయిట్ లిఫ్టర్లు మరింత మెరుగైన ప్రదర్శనతో పతకాల సంఖ్యను పెంచారు. తొలి ఐదు రోజుల్లో 10 పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు ఉండటం విశేషం. మరో నాలుగు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. సోమవారం నాటికి భారత్ 27 పతకాలు సాధించగా.. షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్లోనే 23 రావడం విశేషం. షూటింగ్లో 13, వెయిట్ లిఫ్టింగ్లో 10, జూడోలో 4 పతకాలు వచ్చాయి. రెజ్లింగ్, బాక్సింగ్లో ఆశించిన స్థాయిలో పతకాలు రావాల్సివుంది.