Commonwealth Games-2014 - Glasgow 2014
-
స్వర్ణ రజతాలతో భారత్
-
రెజ్లింగ్ లో భారత్ కు మరో రెండు స్వర్ణాలు
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు బబిత కుమారి, యోగీశ్వర్ దత్ లు పసిడి పతకాలను కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటారు. తొలుత మహిళల 55 కేజీల విభాగంలో బబిత కుమారి అద్యంతం ఆకట్టుకుని బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెనడాకు చెందిన బ్రిట్టేన్నీ లెవర్ డ్యూర్ పై ఒడిసి పట్టుకుని స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉండగా 65 కేజీల విభాగంలో భారత్ ఆటగాడు యోగేశ్వర్ దత్ పసిడిని చేజిక్కించుకున్నాడు. కెనాడాకు చెందిన రెజ్లర్ జెవోన్ బాల్ ఫోర్ పై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే గీతికా జఖర్ మాత్రం ఫైనల్ రౌండ్ లో నిరాశ పరిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ రెజ్లింగ్ లో ఐదు బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ మొత్తం మీద 12 బంగారు పతకాలను కైవసం చేసుకుని అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. -
రెజ్లింగ్ లో భారత్ కు పతకాల పంట
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు అమిత్ కుమార్, సుశీల్ కుమార్, వినేష్ పొగట్ లు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. తొలుత 57 కిలోల విభాగంలొ భారత్ ఆటగాడు అమిత్ కుమార్ తన ప్రత్యర్ధి నైజీరియా ఆటగాడు ఎబిక్ వెమినోవాపై విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా 48 కిలోల మహిళల విభాగంలో భారత్ క్రీడాకారిణి వినేష్ పొగాట్.. ఇంగ్లండ్ క్రీడాకారిణి యానాపై విజయం సాధించి పసిడిని తన ఖాతాలో వేసుకుంది. మరో భారత్ ఆటగాడు సుశీల్ కుమార్ 74 కిలోల విభాగంలో తన సమీప ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాడు అబ్బాస్ ను మట్టికరిపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే 124 కిలోల విభాగంలో రాజీవ్ తోమర్ మాత్రం కెనడా ఆటగాడు కోరీ జార్విస్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా పతకాలతో 10 పసిడిలను తన ఖాతాలో వేసుకున్న భారత్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. -
పేదరికంపై పవర్ పంచ్
లక్ష్యం వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్వైపు ఎలా అడుగులు వేశారంటే... నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను. ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్‌మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్‌మెడల్. ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది. సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్‌యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో గోల్డ్‌మెడల్. ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి -
షూటింగ్లో భారత్‌కు మరో పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షూటింగ్ క్రీడాంశంలో మరో పతకం సాధించింది. మంగళవారం భారత షూటర్ మానవజిత్ సంధు కాంస్య పతకం సాధించాడు. పురుషుల ట్రాప్ కాంస్య పతకం పోరులో సంధు.. ఆస్ట్రేలియా షూటర్ మైకేల్ డైమండ్‌ను ఓడించి పతకం సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ రజత పతకం నెగ్గాడు. ఇంతకుముందు భారత షూటర్లు 12 పతకాలు సాధించారు. షూటింగ్లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది. -
భారత రెజ్లర్ల హవా మొదలైంది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు కొల్లగొడుతున్న భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లకు రెజ్లర్లు తోడయ్యారు. మంగళవారం నలుగురు భారత రెజ్లర్లు పతకాలు ఖాయం చేసుకున్నారు. సుశీల్ కుమార్, అమిత్ కుమార్, రాజీవ్ తోమర్, వినేష్ పొగట్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పసిడి పతకాలకు అడుగు దూరంలో నిలిచారు. సెమీస్‌లో 74 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో సుశీల్ కుమార్, 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో అమిత్, 125 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో రాజీవ్ విజయం సాధించారు. ఇక మహిళల 48 కిలోల విభాగం సెమీస్‌లో వినేష్ పొగట్ గెలుపొందింది. ఫైనల్స్ ఇదే రోజు జరగనున్నాయి. -
షూటింగ్లో పతకాల వేట మళ్లీ మొదలైంది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ హర్‌ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. మరో విభాగంలో భారత షూటర్ గగన్ నారంగ్ పతకం రేసులో ఫైనల్స్‌కు చేరాడు. -
గుడ్లు, చికెన్, పాలు.. ఇదే 'బంగారు' రహస్యం
వేలూరు: క్రీడాకారులకు వ్యాయామంతో పాటు బలవర్దక ఆహారం ఎంతో అవసరం. లిఫ్టర్లకయితే చాలా బలం కావాలి కనుక ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తమిళనాడు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం మెనూలో రోజూ గుడ్లు, చికెన్, పాలు ఉండాల్సిందే. ఇదే తన కుమారుడి విజయ రహస్యమని సతీష్ తండ్రి ఎన్ శివలింగం చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్ కోసం సతీష్ కఠోర సాధన చేశాడని, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని వివరించారు. సతీష్ రోజూ ఉదయం రెండు ఆమ్లెట్లతో పాటు నాలుగు ఇడ్లీలు తీసుకుంటాడట. మధ్యాహ్నం పావు కిలో చికెన్‌తో భోజనం, రాత్రి అర లీటర్ పాలు తీసుకుంటాడు. ఇక వారానికోసారి నాణ్యమైన మటన్ ఉండాల్సిందే. బలమైన ఆహారం తీసుకోవడం వల్లే శక్తి వస్తుందని, తన కుమారుడు పతకం సాధించడానికి ఇదే కారణమని ఎన్ శివలింగం సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వీఐటీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. -
డోపీ దొరికింది.. మనకు పతకం వచ్చింది!
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో అనూహ్యంగా మరో పతకం చేరనుంది. మహిళల 53 కిలోల విభాగంలో పతకం సాధించిన నైజీరియా వెయిట్ లిఫ్టర్ చికా అమలహా డోపీగా తేలింది. డోప్ పరీక్షలో పాజిటీవ్‌గా తేలడంతో చికా పతకాన్ని రద్దు చేసే అవకాశముంది. ఇదే విభాగంలో కాంస్యం గెలిచిన తెలుగుతేజం మత్స సంతోషితో పాటు నాలుగో స్థానంలో నిలిచిన భారత లిఫ్టర్ స్వాతి సింగ్‌కు కలసి రానుంది. సంతోషికి రజత పతకాన్ని, స్వాతి సింగ్‌కు కాంస్య పతకాన్ని ప్రకటించే అవకాశముంది. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగడ. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 4వ స్థానం
-
విజయ్ కుమార్ విఫలం
గ్లాస్గో: భారత షూటర్, ఒలింపిక్ కాంస్య పతాక విజేత విజయ్ కుమార్ 20వ కామన్వెల్త్ గేమ్స్ లో నిరాశపరిచాడు. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించకుండానే వెనుదిరిగాడు. రెండు క్వాలిఫైయింగ్ రౌండ్లలో 555 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచాడు. మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్ రౌండ్ లో అడుగుపెడతారు. మరో భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ 14 హిట్స్ తో 573 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియి షూటర్లు బ్రూస్ క్విక్(572), డేవిడ్ జే చాప్మన్(568) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
గ్లాస్గోలో భారత్ 'బలం' పెరిగింది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూసుకెళ్తోంది. ఎప్పటిలాగే షూటింగ్లో భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. భారత్ పతకాల వేటలో షూటింగ్ తర్వాతి స్థానం వెయిట్లిఫ్టింగ్ది. ఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌తో పోలిస్తే గ్లాస్గోలో భారత్ 'బలం' పెరిగింది. వెయిట్ లిఫ్టింగ్ లో ఎక్కువ పతకాలు కైవసం చేసుకుంది. సొంత వేదికపై జరిగిన గత ఈవెంట్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్‌లో మొత్తం 8 పతకాలు సాధించింది. ఇందులో రెండేసి స్వర్ణాలు, రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. గ్లాస్గోలో జరుగుతున్న తాజా ఈవెంట్లో భారత వెయిట్ లిఫ్టర్లు మరింత మెరుగైన ప్రదర్శనతో పతకాల సంఖ్యను పెంచారు. తొలి ఐదు రోజుల్లో 10 పతకాలు సొంతం చేసుకున్నారు. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు ఉండటం విశేషం. మరో నాలుగు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. సోమవారం నాటికి భారత్ 27 పతకాలు సాధించగా.. షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్లోనే 23 రావడం విశేషం. షూటింగ్లో 13, వెయిట్ లిఫ్టింగ్‌లో 10, జూడోలో 4 పతకాలు వచ్చాయి. రెజ్లింగ్, బాక్సింగ్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు రావాల్సివుంది. -
భారత్ 'గురి' భళా!
►ఒకే రోజు స్వర్ణం, రెండు రజతాలు ►మెరిసిన జీతూ రాయ్, గుర్పాల్, గగన్ నారంగ్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఆదివారం పసిడి పతకం నెగ్గకపోయినా... సోమవారం ఆ లోటును తీర్చారు. ఎదురులేని ‘గురి’తో స్వర్ణ పతకంతోపాటు మరో రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్, గుర్పాల్ సింగ్ స్వర్ణ, రజత పతకాలు సాధించగా... 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి ఇప్పటిదాకా షూటింగ్ ఈవెంట్లోనే భారత్‌కు డజను పతకాలు వచ్చాయి. గ్లాస్గో: ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లలో తాను సాధించిన పతకాలు గాలివాటం కాదని భారత రైజింగ్ షూటర్ జీతూ రాయ్ నిరూపించాడు. కామన్వెల్త్ గేమ్స్ అరంగేట్రంలోనే అదరగొడుతూ స్వర్ణ పతకంతో బోణీ చేశాడు. సోమవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ పసిడి పతకం సొంతం చేసుకోగా... భారత్‌కే చెందిన గుర్పాల్ సింగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. 26 ఏళ్ల జీతూ మొత్తం 194.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. పంజాబ్‌కు చెందిన 34 ఏళ్ల గుర్పాల్ సింగ్ 187.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. డానియల్ రెపాచోలి (ఆస్ట్రేలియా-166.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. క్వాలిఫయింగ్‌లో 562 పాయింట్లు సాధించి నంబర్‌వన్ స్థానంలో నిలిచిన జీతూ ఫైనల్లోనూ అదే జోరును కనబరిచాడు. ఆర్మీలో చేరాక షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న జీతూ రాయ్ ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండు వారాల వ్యవధిలో ఇటీవల జర్మనీ, స్లొవేనియాలలో జరిగిన ప్రపంచకప్‌లలో ఈ ఉత్తరప్రదేశ్ షూటర్ స్వర్ణంతోపాటు, రెండు రజత పతకాలు గెలిచాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలిసారే రజతం... కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన తొలిసారే స్టార్ షూటర్ గగన్ నారంగ్ రజతం సాధించాడు. 20 షాట్లతో కూడిన ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ 203.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని పొందాడు. వారెన్ పోటెంట్ (ఆస్ట్రేలియా-204.3 పాయింట్లు) స్వర్ణం సాధించగా... కెన్నెత్ పార్ (ఇంగ్లండ్-182 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో గగన్‌కిది తొమ్మిదో పతకం కావడం విశేషం. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో... 2010 ఢిల్లీ గేమ్స్‌లో గగన్ నాలుగేసి చొప్పున స్వర్ణ పతకాలు గెలిచాడు. మంగళవారం జరిగే 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో గనుక గగన్ నారంగ్ స్వర్ణం గెలిస్తే... కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొమ్మిది స్వర్ణాలు నెగ్గిన మూడో షూటర్‌గా గుర్తింపు పొందుతాడు. గతంలో జస్పాల్ రాణా (భారత్), మైకేల్ గాల్ట్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు. మిగతా విభాగాల్లో నిరాశ సోమవారమే జరిగిన మిగతా షూటింగ్ ఈవెంట్స్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత షూటర్లు మీనా కుమారి (615.3 పాయింట్లు) ఆరో స్థానంలో... లజ్జా గోస్వామి (612.3 పాయింట్లు) 11వ స్థానంలో నిలిచారు. ఈ ఈవెంట్లో సాలీ జాన్స్టన్ (న్యూజిలాండ్-620.7); ఎస్మారీ రీనెన్ (దక్షిణాఫ్రికా-620.1); జెన్ మెకిన్‌టోష్ (స్కాట్లాండ్-619.5 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో భారత వెటరన్ షూటర్లు మన్షేర్ సింగ్, మానవ్‌జిత్ సింగ్ సంధూ రాణించారు. మన్షేర్ 50 పాయింట్లతో అగ్రస్థానంలో... మానవ్‌జిత్ 49 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మంగళవారం క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌తోపాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. మరోవైపు మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు శ్రేయాసి సింగ్, సీమా తోమర్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో శ్రేయాసి ఏడో స్థానంలో, సీమా ఎనిమిదో స్థానంలో నిలిచారు. టాప్-6లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. -
స్వర్ణ సతీశ్... రజత రవి
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు గ్లాస్గో: కెరీర్లో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న వెయిట్‌లిఫ్టర్ సతీశ్ శివలింగం చరిత్ర సృష్టించాడు. 77 కేజీల విభాగంలో గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు స్వర్ణం దక్కించుకున్నాడు. 2013లో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించిన ఈ 22 ఏళ్ల యువ లిఫ్టర్ మొత్తం 328 కేజీల (149+179) బరువు ఎత్తాడు. స్నాచ్‌లో ఎత్తిన 149 కేజీల బరువుతో గత గేమ్స్‌లో ఇదే విభాగంలో యుకో పీటర్ (నౌరు) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఇక ఢిల్లీ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన కత్తుల రవి కుమార్ ఈసారి తన విభాగాన్ని మార్చుకుని రజతంతో సంతృప్తి చెందాడు. రవి 317 కేజీల (142+175) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. అయితే క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో అతను 185 కేజీల బరువు ఎత్తి స్వర్ణం దక్కించుకునే ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాంకోయిస్ ఎటౌండీ (314 కేజీలు) నిలిచాడు. ఓవరాల్‌గా ఢిల్లీ గేమ్స్‌లో ఎనిమిది పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టర్లు ఇక్కడ ఇప్పటికే తొమ్మిది పతకాల (2-2-4)తో ఆ సంఖ్యను అధిగమించి జోరుమీదున్నారు. విభాగం మారినా... ఒడిశాలో స్థిరపడిన తెలుగు తేజం కత్తుల రవికుమార్ వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకాలు సాధించి ఆకట్టుకున్నాడు. బరంపురంలోని వీర్ హనుమాన్ క్లబ్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న అతను అంతకుముందు బాడీ బిల్డర్. సరిగ్గా ఢిల్లీ కామన్వెల్త్కు మూడేళ్ల ముందు తన ట్రైనర్ సలహా మేరకు వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. ఆ గేమ్స్‌లో 321 కేజీల బరువు ఎత్తి స్వర్ణంతో అదరగొట్టాడు. తక్కువ సమయంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టిన అతను ఈసారి గ్లాస్గో గేమ్స్‌లో 77 కేజీల విభాగంలో బరిలోకి దిగి రజతంతో మెరిశాడు. తొలిసారే అదుర్స్... తమిళనాడులోని వెల్లూర్‌కు చెందిన 22 ఏళ్ల సతీశ్ శివలింగంకు గ్లాస్గో గేమ్స్ చిరస్మరణీయంగా మిగిలాయి. మరోవైపు తనయుడి ఘనతపై తండ్రి శివలింగం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘ఇది తనకు తొలి కామన్వెల్త్ గేమ్స్. అయినా స్వర్ణం సాధించి మేం గర్వపడేలా చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం మా వాడి లక్షణం. ఈ స్వర్ణం అతని కెరీర్‌ను మలుపు తిప్పుతుంది’ అని తెలిపారు. -
‘బ్యాడ్’మింటన్...
►నిరాశ పరిచిన భారత షట్లర్లు ►కాంస్య పతక పోరులో ఓటమి కామన్వెల్త్ గేమ్స్‌లో కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న క్రీడాంశాల్లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. 2010లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ జట్టు, కాంస్యం నెగ్గిన టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల జట్టు ఈసారి పతకాలు సాధించడంలో విఫలమయ్యాయి. ఈ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత పురుషుల జట్టు ఒక్క పతకమూ సాధించలేకపోవడం ఇదే తొలిసారి. గ్లాస్గో: బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-3 తేడాతో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది. తొలిమ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-గరుసాయిదత్ మిక్స్డ్ జోడి 19-21, 19-21తో క్రిస్నాంటా-వానెస్సా నియో జంట చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ 21-15, 22-20తో చావో హువాంగ్‌పై గెలిచి స్కోరును సమం చేశాడు. తరువాత జరిగిన పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి 12-21, 16-21తో క్రిస్నాంటా-ట్రియాచార్ట్ చేతిలో ఓడింది. అయితే మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 24-22, 21-13తో జియావోయు లియాంగ్‌పై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది. ఇక నిర్ణాయక మ్యాచ్ అయిన మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి 17-21, 27-29తో షింటా ములై సరి-లీ య యావో జంట చేతిలో ఓటమిపాలై భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లోనూ భారత జట్టు అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శనతో 0-3 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. వరుస మ్యాచ్‌ల్లో జ్వాల-అక్షయ్ మిక్స్డ్ జోడి, సింగిల్స్‌లో కశ్యప్, అక్షయ్-ప్రణవ్ చోప్రా డబుల్స్ జోడి ఓటమి పాలయ్యరు. టీటీలోనూ అదే తీరు... పురుషుల టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టు 1-3 తేడాతో నైజీరియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 3-0తో విజయాన్ని నమోదు చేసినా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓటమే ఎదురైంది. రెండో సింగిల్స్‌లో హర్మీత్ దేశాయ్, డబుల్స్‌లో ఆంటోని-హర్మీత్ జోడి, రివర్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ ఓడిపోయారు. భారత ఆశలన్నీ వ్యక్తిగత విభాగాలపైనే ఉన్నాయి. -
గ్లాస్గోలో మెరిసిన తెలుగుతేజం గ'గన్'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో మరో తెలుగుతేజం మెరిసింది. హైదరాబాదీ స్టార్ షూటర్ గగన నారంగ్ గురి కుదిరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో నారంగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో గగన్ 203.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి దక్కించుకున్నాడు. ఇదే రోజు అంతకుముందు భారత్ షూటింగ్‌లోనే మరో రెండు పతకాలు సాధించింది. భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్లో భారత్‌కు ఇప్పటి వరకు 12 పతకాలు దక్కడం విశేషం. ఇదిలావుండగా, కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగుతేజం మత్స సంతోషి ఇంతకుముందు పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. -
షూటింగ్లో గురి కుదిరినా..
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో ఐదో రోజు సోమవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. షూటింగ్లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించినా.. బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లలో నిరాశ ఎదురైంది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కాంస్య పతకం కోసం జరిగిన మిక్స్డ్ టీమ్స్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో భారత్ 2-3తో సింగపూర్ చేతిలో ఓటమి చవిచూసింది. తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు విజయం సాధించినా.. ఇతర షట్లర్లు నిరాశపరిచారు. ఇక స్క్వాష్‌లో పురుషుల సింగిల్స్ కాంస్య పతకం పోరులో భారత ఆటగాడు ఘోషల్ 1-3తో బార్కర్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. టేబుల్ టెన్నిస్‌లోనూ పురుషుల టీమ్ కాంస్య పతకం పోరులో భారత్ ఓటమి చవిచూసింది. -
రాయ్ బంగారం.. సింగ్ రజతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల ఐదో రోజు సోమవారం స్వర్ణంతో భారత పతకాల వేటకు శ్రీకారం చుట్టారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. జీతూ రాయ్ 174.1, గురుపాల్ సింగ్ 167 పాయింట్లు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్లో భారత్‌కు ఇప్పటి వరకు 11 పతకాలు దక్కాయి. -
కామన్వెల్త్ గేమ్స్‌లో కండోమ్స్‌కు భలే డిమాండ్
గ్లాస్గో: ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్.. ఇలాంటి మెగా ఈవెంట్లు ఎక్కడ జరుగుతున్నా క్రీడాకారుల అద్భత ప్రదర్శన, పతకాల ముచ్చట్లే కాదు కండోమ్స్ విషయం కూడా చర్చకు వస్తుంటుంది. రెండేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో కండోమ్స్‌ను సరఫరా చేసినా కొరత ఏర్పడింది. ఇక ఢిల్లీలో జరిగిన గత కామన్వెల్త్ గేమ్స్‌లో అయితే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది కోసం నిర్మించిన క్రీడాగ్రామంలో కండోమ్స్ అడ్డుపడ్డి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది. మెగా ఈవెంట్ల సందర్భంగా కండోమ్స్‌కు ఎంత డిమాండ్ ఉంటుందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. గత సంఘటనలను దృష్టిలోఉంచుకుని స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో కండోమ్స్‌ను భారీ సంఖ్యలో సరఫరా చేసింది. మహిళల కండోమ్స్ సహా పలు కంపెనీలకు చెందిన నాణ్యమైన పది రకాలను అందుబాటులో ఉంచారు. పోటీలు జరిగే 300 వేదికలకూ కండోమ్స్‌ను సరఫరా చేశారు. దాదాపు 84 వేలకు పైగా కండోమ్స్‌ను సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. క్రీడాకారులు, ఇతర స్టాఫ్ తమకు నచ్చినవాటిని ఉచితంగా తీసుకోవచ్చు. ఈ ఈవెంట్లో 71 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా గ్లాస్గోలో హోటల్స్, బార్లు కళకళలాడిపోతున్నాయి. క్రీడలను తిలకించేందుకు ప్రతివారం 7.5 లక్షల మంది నగరానికి వస్తున్నారు. -
భారత్ పరువు కాపాడింది ఆ 'రెండే'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఆశించిన ఫలితాలు సాధిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం టాప్-5లో నిలిచింది. తొలి నాలుగు రోజుల్లో మొత్తం 22 పతకాలు సొంతం చేసుకుని ఐదో స్థానంలో నిలిచింది. అయితే భారత్ గౌరవం కాపాడింది మాత్రం రెండు క్రీడాంశాలే. అవే షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత క్రీడాకారుల ఓవరాల్ ప్రదర్శనను పరిశీలిస్తే షూటర్లే ముందంజలో నిలిచారు. పతకాలన్నీ కేవలం మూడు క్రీడాంశాల్లోనే రాగా.. అందులోనూ సింహ భాగం షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలల్లోనే సాధించడం గమనార్హం. ఈ రెండింటిలో తొమ్మిది చొప్పున పతకాలు రావడం విశేషం. గ్లాస్గోలో భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారత్‌కు ఆదివారం నాటికి ఆరు బంగారు పతకాలు రాగా షూటింగ్లో మూడు, వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు పతకాలు వచ్చాయి. ఇక భారత షూటర్లు మరో ఐదు రజతాలు, ఓ కాంస్య పతకం కైవసం చేసుకోగా, లిఫ్టర్లు మరో రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు నెగ్గారు. జూడోలో రెండేసి రజతాలు, కాంస్యాలు లభించాయి. కాగా భారత్ ఆశలు పెట్టుకున్న రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో ఇంకా ఫైనల్స్ జరగాల్సివుంది. ఈ రెండింటిలోనూ మనోళ్లు పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు నిరాశపరిచారు. తొలి నాలుగు రోజుల్లో భారత్ సాధించిన పతకాలు వివరాలు క్రీడాంశాల వారీగా.. భారత్ సాధించిన పతకాలు 22 షూటింగ్ 9-3 స్వర్ణాలు-5 రజతాలు-1 కాంస్యం వెయిట్ లిఫ్టింగ్ 9-3 స్వర్ణాలు-2 రజతాలు-4 కాంస్యాలు జూడో 4-2 రజతాలు-2 కాంస్యాలు -
షూటింగ్లో భారత్‌కు మరో పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు పతకాలు సాధించారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయాషి సింగ్ రజత పతకం సొంతం చేసుకోగా, పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో మహమ్మద్ అసబ్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకం కోసం అసబ్తో మాల్టాకు చెందిన నాథన్ ఝూరెబ్ పోటీ పడ్డాడు. అసబ్ 26 పాయింట్లు నమోదు చేయగా, ఝూరెబ్ 24 పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ ఇప్పటి దాకా 9 పతకాలు సాధించడం విశేషం. -
మహిళల షూటింగ్లో భారత్‌కు మరో పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఆదివారం భారత్ మరో పతకం సాధించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్ శ్రేయాషి సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. శ్రేయాషి సింగ్ 92 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో ఇంగ్లండ్ షూటర్ కెర్వూడ్ 94 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం దక్కించుకోగా, కెనడా షూటర్ మేయర్ 91 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది. -
ఓంకార్ ఒటారికి కాంస్య పకతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ మూడో రోజున వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ లిఫ్టర్ ఓంకార్ ఒటారి కాంస్య పకతం సాధించాడు. 69 కేజీలో విభాగంలో అతడీ పతకం సాధించాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది. ఇందులో ఐదు బంగారు, ఏడు రజతాలు, ఐదు కాంస్య పతకాలున్నాయి. 50 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఓంకార్ సాధించిన పతకం వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు ఆరో పతకం. కాగా, మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధిస్తుందనే అంచనాలున్న మీనా కుమారి నిరాశపరిచింది. 58 కేజీల విభాగంలో మీనా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు మాత్రమే ఎత్తగలిగింది. -
గ్లాస్గోలో మెరిసిన భారత 'పసిడి' తేజాలు!
-
వెయిట్ లిఫ్టింగ్ లో మెరిసిన తెలుగమ్మాయి
గ్లాస్గో: కామన్వెల్త్ లో తెలుగు అమ్మాయి మెరిసింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తెలుగు రాష్ట్రానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం చేజిక్కించుకుంది. 53 కేజీల విభాగంలో జరిగిన పోటీలో సంతోషి మత్స ఆద్యంతం ఆకట్టుకుంది. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగడ. ఇదిలా ఉండగా, పతకం సాధిస్తుందనుకున్న మరో వెయిట్ లిఫ్టర్ స్వాతి సింగ్ నిరాశ పరిచింది. చివరి వరకూ భారత ఆశలను రెట్టింపు చేసినా.. నాల్గో స్థానానికే పరిమితమైంది. నిన్న జరిగిన మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సంజితా కుమ్‌చమ్ స్వర్ణం సాధించగా, మీరాబాయి చానురెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ఈ తాజా పతకాలతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది. -
కామన్వెల్త్ గేమ్స్: అభినవ్ బింద్రాకు పసిడి పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల రెండో రోజు శుక్రవారం భారత్ షూటింగ్లో రెండు పతకాలు సాధించగా, కొద్దిలో మరో పతకం చేజారింది. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్, ఒలింపిక్స్ మాజీ చాంపియన్ అభినవ్ బింద్రా పసిడి పతకం సాధించాడు. బింద్రా మొత్తం 205.03 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. కాగా మరో భారత షూటర్ రవికుమార్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్‌లో చివరి వరకు ప్రథమ స్థానంలో కొనసాగిన రవి కుమార్ అనూహ్యంగా రేసులో వెనుకబడి పతకం చేజార్చుకున్నాడు. ఈ ఈవెంట్లో బంగ్లాదేశ్ షూటర్ అబ్దుల్లా బకీ రజతం, ఇంగ్లండ్ షూటర్ డేనియల్ రివర్స్ కాంస్యం దక్కించుకున్నారు. ఇదే రోజు జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ 16 ఏళ్ల మలైకా గోయెల్ రజత పతకంతో మెరిసింది.ఈ తాజా పతకాలతో భారత్ పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. -
కామన్వెల్త్ గేమ్స్: మహిళల షూటింగ్లో భారత్‌కు రజతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. రెండో రోజు శుక్రవారం పది మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ 16 ఏళ్ల మలైకా గోయెల్ రజత పతకంతో మెరిసింది. ఫైనల్స్‌లో గోయెల్ 197.1 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకుంది. మరో భారత షూటర్ హీనా సిద్ధు ఫైనల్స్‌కు అర్హత సాధించినా పతకాల వేటలో వెనుకబడింది. సిద్ధు ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ ఈవెంట్లో సింగపూర్ షూటర్ షున్ ఝీ టియో 198.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. ఇక సింగపూర్ షూటర్‌కు మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది. -
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హాకీ శుభారంభం
గ్లాస్కో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. పూల్-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1తో లౌలీ వేల్స్‌పై అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు ఒక్కో గోల్ మాత్రమే చేశాయి. దీంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు విజృంభించారు. రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్నందించారు. భారత జట్టులో రఘునాథ్, ఆర్ సింగ్, గుర్వీందర్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. -
గ్లాస్గో:తలకిందులైన భారత పతాకం
-
కామన్వెల్త్ లో భారత్ కు తొలి పసిడి
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బోణీ చేసింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బారత్ తొలి బంగారు పతకాన్ని సాధించింది. 48 కిలోల వెయిట్‌లిప్టింగ్ విభాగంలో గురువారం జరిగిన పోటీలో భారత్ కు చెందిన ఖుముక్ చామ్ సంజితా చాను పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలో ఆద్యంతం ఆకట్టుకున్న చాను.. భారత్ కీర్తిని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఇదే విభాగంలో భారత్ కు చెందిన మీరాబాయ్ చాను రజత పతకాన్ని సాధించింది. మణిపూర్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు భారత్ పతాకాన్ని గ్లాస్గో వీధుల్లో రెపరెపలాడించారు. -
ట్రైథ్లాన్ సిరీస్ లో ఇంగ్లండ్ కు బంగారు పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ భాగంగా ఇక్కడ జరిగిన 20వ కామన్వెల్త్ గేమ్స్ లోఇంగ్లండ్ తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. వివిధ విభాగాలకు గాను జరిగే ట్రైథ్లాన్ సిరీస్ లోఇంగ్లండ్ తరుపున బరిలోకి దిగిన జోడీ స్టింప్సన్ బంగారు పతకాన్ని గెలుచుకుని శుభారంభం చేసింది. 2013 లో ప్రపంచ ట్రైథ్లాన్ సిరీస్ లో రజక పతకం గెలుచుకున్న స్టింప్సన్.. మూడు విభాగాల్లోనూ అద్వితీయమైన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. తొలుత 10 కి.మీ పరుగు పందెంలో ఆకట్టుకున్న స్టింప్సన్.. 1.5 కి.మీ స్మిమ్మింగ్ విభాగంలోనూ, 40 కి.మీ సైక్లింగ్ విభాగంలోనూ పై చేయి సాధించింది. ఈ విభాగంలో కెనాడాకు చెందిన కిరెస్టెన్ స్వీట్లాండ్ రజక పతకాన్ని గెలుచుకోగా, ఇంగ్లండ్ కే చెందిన వికీ హోలాండ్ కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.