భారత్ పరువు కాపాడింది ఆ 'రెండే'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఆశించిన ఫలితాలు సాధిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం టాప్-5లో నిలిచింది. తొలి నాలుగు రోజుల్లో మొత్తం 22 పతకాలు సొంతం చేసుకుని ఐదో స్థానంలో నిలిచింది. అయితే భారత్ గౌరవం కాపాడింది మాత్రం రెండు క్రీడాంశాలే. అవే షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటి వరకు భారత క్రీడాకారుల ఓవరాల్ ప్రదర్శనను పరిశీలిస్తే షూటర్లే ముందంజలో నిలిచారు. పతకాలన్నీ కేవలం మూడు క్రీడాంశాల్లోనే రాగా.. అందులోనూ సింహ భాగం షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలల్లోనే సాధించడం గమనార్హం. ఈ రెండింటిలో తొమ్మిది చొప్పున పతకాలు రావడం విశేషం.
గ్లాస్గోలో భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారత్కు ఆదివారం నాటికి ఆరు బంగారు పతకాలు రాగా షూటింగ్లో మూడు, వెయిట్ లిఫ్టింగ్లో మూడు పతకాలు వచ్చాయి. ఇక భారత షూటర్లు మరో ఐదు రజతాలు, ఓ కాంస్య పతకం కైవసం చేసుకోగా, లిఫ్టర్లు మరో రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు నెగ్గారు. జూడోలో రెండేసి రజతాలు, కాంస్యాలు లభించాయి. కాగా భారత్ ఆశలు పెట్టుకున్న రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో ఇంకా ఫైనల్స్ జరగాల్సివుంది. ఈ రెండింటిలోనూ మనోళ్లు పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు నిరాశపరిచారు. తొలి నాలుగు రోజుల్లో భారత్ సాధించిన పతకాలు వివరాలు క్రీడాంశాల వారీగా..
భారత్ సాధించిన పతకాలు 22
షూటింగ్ 9-3 స్వర్ణాలు-5 రజతాలు-1 కాంస్యం
వెయిట్ లిఫ్టింగ్ 9-3 స్వర్ణాలు-2 రజతాలు-4 కాంస్యాలు
జూడో 4-2 రజతాలు-2 కాంస్యాలు