హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్ (2 రోయింగ్, ఒకటి షూటింగ్), 2 బ్రాంజ్ మెడల్స్ (షూటింగ్‌లో ఒకటి, రోయింగ్‌లో ఒకటి) ఉన్నాయి.
మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్ ఘోష్, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ రోయింగ్‌లో భారత జోడీ అర్జున్ లాల్ ఝట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.
రోయింగ్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో బాబు లాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్ మెన్స్ 8 ఈవెంట్‌లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత స్టార్ షూటర్ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది.
కాగా, ఈసారి ఏషియన్ గేమ్స్‌లో భారత్ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్ (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment