జయహో భారత్‌ 107  | Indias best performance in Asian Games | Sakshi
Sakshi News home page

జయహో భారత్‌ 107 

Oct 8 2023 3:53 AM | Updated on Oct 8 2023 4:11 AM

Indias best performance in Asian Games - Sakshi

‘వంద’ పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్‌ అన్నీ ముగిశాయి. చివరిరోజు భారత్‌ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి ‘పతకాల సెంచరీ’ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ  అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది.

 అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌కిదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్‌ అధిగమించింది. శనివారం భారత్‌కు ఆర్చరీలో రెండు స్వర్ణాలు.. కబడ్డీల్లో రెండు పసిడి పతకాలు... పురుషుల టి20 క్రికెట్‌లో, పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది.   

హాంగ్జౌ: చైనా గడ్డపై భారత్‌ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది. ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్‌ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.  

సురేఖ, ఓజస్‌ ‘స్వర్ణ’ చరిత్ర 
శనివారం ముందుగా ఆర్చరీలో భారత్‌ బాణం ‘బంగారు’ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ 149–145తో చేవన్‌ సో (దక్షిణ కొరియా)ను ఓడించింది. జ్యోతి సురేఖ 15 బాణాలు సంధించగా అందులో 14 పది పాయింట్ల లక్ష్యంలో... ఒకటి 9 పాయింట్ల లక్ష్యంలో దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్‌గా జ్యోతి సురేఖకు ఈ ఆసియా క్రీడలు చిరస్మరణీయమయ్యాయి. ఈ క్రీడల్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 3 స్వర్ణాలు సాధించింది.

మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌తోపాటు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ సురేఖ బంగారు పతకాలు గెలిచంది. తద్వారా దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష (1986 సియోల్‌ గేమ్స్‌; 4 స్వర్ణాలు, 1 రజతం) తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో కనీసం 3 స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతకం కూడా భారత్‌ ఖాతాలోనే చేరింది. ప్రపంచ చాంపియన్‌ అదితి స్వామి (భారత్‌) 146–140తో ఫాదిలి జిలిజాటి (ఇండోనేసియా)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్‌కే లభించాయి. ఫైనల్లో ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే 149–147తో అభిషేక్‌ వర్మ (భారత్‌)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో ఓజస్‌కిది మూడో స్వర్ణం. పురుషుల కాంపౌండ్‌ టీమ్, మిక్స్‌డ్‌ విభాగంలో ఓజస్‌ పసిడి పతకాలు గెలిచాడు.   

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ అద్భుతం 
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ‘పసిడి’ కల నెరవేరింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ చాంపియన్‌గా అవతరించి ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు తొలిసారి బంగారు పతకాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–18, 21–16తో చోయ్‌ సోల్‌గు–కిమ్‌ వన్‌హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది.

సెమీస్‌లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్‌ జోడీని బోల్తా కొట్టించిన భారత జంట తుది పోరులోనూ దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో కొరియా జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని దక్కించుకుంది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్‌–ప్రదీప్‌ గాంధే భారత్‌కు పురుషుల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని అందించారు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి సాత్విక్‌–చిరాగ్‌ జోడీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనుంది.   

దీపక్‌ ‘రజత’ పట్టు 
ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ ఈవెంట్‌ను భారత్‌ రజత పతకంతో ముగించింది. 86 కేజీల విభాగంలో దీపక్‌ పూనియా భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్‌ దిగ్గజ రెజ్లర్‌ హసన్‌ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్‌ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు.

రెజ్లింగ్‌ నిబంధనల ప్రకారం బౌట్‌లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్‌ తొలి రౌండ్‌లో 3–2తో షరిపోవ్‌ (ఖతర్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 11–0తో రియాన్‌డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్‌ (జపాన్‌)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన యశ్‌ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు), సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) ఆరంభ రౌండ్‌లలోనే ఓడిపోయారు.   

భారత జట్ల ‘పసిడి’ కూత 
గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను చేజార్చుకున్న భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఈసారి తమ ఖాతాలోకి వేసుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 33–29తో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇరాన్‌ జట్టును ఓడించగా... భారత మహిళల జట్టు 26–25తో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల కబడ్డీ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు ఎనిమిదోసారి స్వర్ణ పతకం నెగ్గగా... మహిళల జట్టు మూడోసారి పసిడి పతకం సాధించింది.   

చెస్‌లో డబుల్‌ ధమాకా
వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్‌ క్రీడాకారులు టీమ్‌ ఈవెంట్‌లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు.  పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లతో కూడిన భారత పురుషుల జట్టు    నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఫిలిప్పీన్స్‌తో  జరిగిన చివరి రౌండ్‌లో భారత్‌ 3.5–0.5తో  గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్‌ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది.  

క్రికెట్‌లో కనకం... 
తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్‌ ఈవెంట్‌లో పోటీపడ్డ భారత క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టి20 ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో శనివారం భారత్, అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్తాన్‌ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన దశలో వచ్చిన వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మెరుగైన ర్యాంక్‌ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించి స్వర్ణ పతకాన్ని అందించగా... అఫ్గానిస్తాన్‌ జట్టుకు రజతం లభించింది. స్వర్ణం నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement