
‘బ్యాడ్’మింటన్...
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-3 తేడాతో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది.
►నిరాశ పరిచిన భారత షట్లర్లు
►కాంస్య పతక పోరులో ఓటమి
కామన్వెల్త్ గేమ్స్‌లో కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న క్రీడాంశాల్లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. 2010లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ జట్టు, కాంస్యం నెగ్గిన టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల జట్టు ఈసారి పతకాలు సాధించడంలో విఫలమయ్యాయి. ఈ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత పురుషుల జట్టు ఒక్క పతకమూ సాధించలేకపోవడం ఇదే తొలిసారి.
గ్లాస్గో: బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-3 తేడాతో సింగపూర్ చేతిలో ఓటమిపాలైంది. తొలిమ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప-గరుసాయిదత్ మిక్స్‌డ్ జోడి 19-21, 19-21తో క్రిస్నాంటా-వానెస్సా నియో జంట చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ 21-15, 22-20తో చావో హువాంగ్‌పై గెలిచి స్కోరును సమం చేశాడు. తరువాత జరిగిన పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి 12-21, 16-21తో క్రిస్నాంటా-ట్రియాచార్ట్ చేతిలో ఓడింది. అయితే మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 24-22, 21-13తో జియావోయు లియాంగ్‌పై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది.
ఇక నిర్ణాయక మ్యాచ్ అయిన మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి 17-21, 27-29తో షింటా ములై సరి-లీ య యావో జంట చేతిలో ఓటమిపాలై భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లోనూ భారత జట్టు అత్యంత నిరాశాజనకమైన ప్రదర్శనతో 0-3 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. వరుస మ్యాచ్‌ల్లో జ్వాల-అక్షయ్ మిక్స్‌డ్ జోడి, సింగిల్స్‌లో కశ్యప్, అక్షయ్-ప్రణవ్ చోప్రా డబుల్స్ జోడి ఓటమి పాలయ్యరు.
టీటీలోనూ అదే తీరు...
పురుషుల టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టు 1-3 తేడాతో నైజీరియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 3-0తో విజయాన్ని నమోదు చేసినా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఓటమే ఎదురైంది. రెండో సింగిల్స్‌లో హర్మీత్ దేశాయ్, డబుల్స్‌లో ఆంటోని-హర్మీత్ జోడి, రివర్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ ఓడిపోయారు. భారత ఆశలన్నీ వ్యక్తిగత విభాగాలపైనే ఉన్నాయి.