గుడ్లు, చికెన్, పాలు.. ఇదే 'బంగారు' రహస్యం
వేలూరు: క్రీడాకారులకు వ్యాయామంతో పాటు బలవర్దక ఆహారం ఎంతో అవసరం. లిఫ్టర్లకయితే చాలా బలం కావాలి కనుక ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన తమిళనాడు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం మెనూలో రోజూ గుడ్లు, చికెన్, పాలు ఉండాల్సిందే. ఇదే తన కుమారుడి విజయ రహస్యమని సతీష్ తండ్రి ఎన్ శివలింగం చెప్పారు.
కామన్వెల్త్ గేమ్స్ కోసం సతీష్ కఠోర సాధన చేశాడని, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని వివరించారు. సతీష్ రోజూ ఉదయం రెండు ఆమ్లెట్లతో పాటు నాలుగు ఇడ్లీలు తీసుకుంటాడట. మధ్యాహ్నం పావు కిలో చికెన్తో భోజనం, రాత్రి అర లీటర్ పాలు తీసుకుంటాడు. ఇక వారానికోసారి నాణ్యమైన మటన్ ఉండాల్సిందే. బలమైన ఆహారం తీసుకోవడం వల్లే శక్తి వస్తుందని, తన కుమారుడు పతకం సాధించడానికి ఇదే కారణమని ఎన్ శివలింగం సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వీఐటీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.