కోడి ముందా, గుడ్డు ముందా? చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం కనిపెట్టేందుకు సైంటిస్టులు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని అలాంటి తాజా పరిశోధన ఒకటి పేర్కొంది.
జంతువుల ఆవిర్భావానికి చాలాకాలం ముందునుంచే జీవుల్లో గుడ్డు వంటి నిర్మాణాలు ఏర్పడేవని తేలి్చంది. క్రోమోస్పెరియా పెర్కిన్సి అనే ఏకకణ జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్టా తెలిపారు. పరిశోధన బృందానికి ఆమే సారథ్యం వహించారు. పునరుత్పత్తి ప్రక్రియ సందర్భంగా సి.పెర్కిన్సిలో జరిగే పాలింటమీ ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్టా వివరించారు.
‘‘ఆ ప్రక్రియ ఫలితంగా గుడ్డును పోలే బోలు కణ పదార్థం రూపొందినట్టు కనిపెట్టాం. సంక్లిష్టమైన బహుళకణ జీవుల ఆవిర్భావానికి చాలాముందే తొలినాటి జీవుల్లో పిండం వంటి నిర్మాణాల జెనెటిక్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ ఉండొచ్చని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు. తొలి నాళ్లలోనే జీవుల్లో బహుళకణ సమన్వయం వంటి ప్రక్రియలు సాగేవనేందుకు మా పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి’’అని చెప్పారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని అంగీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment