భారత్ 'గురి' భళా! | Shooters add more medals to India's account | Sakshi
Sakshi News home page

భారత్ గురి భళా!

Published Tue, Jul 29 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

భారత్ 'గురి' భళా!

భారత్ 'గురి' భళా!

ఒకే రోజు స్వర్ణం, రెండు రజతాలు
మెరిసిన జీతూ రాయ్, గుర్పాల్, గగన్ నారంగ్

అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఆదివారం పసిడి పతకం నెగ్గకపోయినా... సోమవారం ఆ లోటును తీర్చారు. ఎదురులేని ‘గురి’తో స్వర్ణ పతకంతోపాటు మరో రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్, గుర్పాల్ సింగ్ స్వర్ణ, రజత పతకాలు సాధించగా... 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి ఇప్పటిదాకా షూటింగ్ ఈవెంట్‌లోనే భారత్‌కు డజను పతకాలు వచ్చాయి.

గ్లాస్గో: ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లలో తాను సాధించిన పతకాలు గాలివాటం కాదని భారత రైజింగ్ షూటర్ జీతూ రాయ్ నిరూపించాడు. కామన్వెల్త్ గేమ్స్ అరంగేట్రంలోనే అదరగొడుతూ స్వర్ణ పతకంతో బోణీ చేశాడు. సోమవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ పసిడి పతకం సొంతం చేసుకోగా... భారత్‌కే చెందిన గుర్పాల్ సింగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. 26 ఏళ్ల జీతూ మొత్తం 194.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. పంజాబ్‌కు చెందిన 34 ఏళ్ల గుర్పాల్ సింగ్ 187.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

డానియల్ రెపాచోలి (ఆస్ట్రేలియా-166.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. క్వాలిఫయింగ్‌లో 562 పాయింట్లు సాధించి నంబర్‌వన్ స్థానంలో నిలిచిన జీతూ ఫైనల్లోనూ అదే జోరును కనబరిచాడు.
 ఆర్మీలో చేరాక షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న జీతూ రాయ్ ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండు వారాల వ్యవధిలో ఇటీవల జర్మనీ, స్లొవేనియాలలో జరిగిన ప్రపంచకప్‌లలో ఈ ఉత్తరప్రదేశ్ షూటర్ స్వర్ణంతోపాటు, రెండు రజత పతకాలు గెలిచాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించాడు.
 
తొలిసారే రజతం...
కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన తొలిసారే స్టార్ షూటర్ గగన్ నారంగ్ రజతం సాధించాడు. 20 షాట్‌లతో కూడిన ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ 203.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని పొందాడు. వారెన్ పోటెంట్ (ఆస్ట్రేలియా-204.3 పాయింట్లు) స్వర్ణం సాధించగా... కెన్నెత్ పార్ (ఇంగ్లండ్-182 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో గగన్‌కిది తొమ్మిదో పతకం కావడం విశేషం.

2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో... 2010 ఢిల్లీ గేమ్స్‌లో గగన్ నాలుగేసి చొప్పున స్వర్ణ పతకాలు గెలిచాడు. మంగళవారం జరిగే 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో గనుక గగన్ నారంగ్ స్వర్ణం గెలిస్తే... కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొమ్మిది స్వర్ణాలు నెగ్గిన మూడో షూటర్‌గా గుర్తింపు పొందుతాడు. గతంలో జస్పాల్ రాణా (భారత్), మైకేల్ గాల్ట్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు.
 
మిగతా విభాగాల్లో నిరాశ
 సోమవారమే జరిగిన మిగతా షూటింగ్ ఈవెంట్స్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత షూటర్లు మీనా కుమారి (615.3 పాయింట్లు) ఆరో స్థానంలో... లజ్జా గోస్వామి (612.3 పాయింట్లు) 11వ స్థానంలో నిలిచారు. ఈ ఈవెంట్‌లో సాలీ జాన్‌స్టన్ (న్యూజిలాండ్-620.7); ఎస్మారీ రీనెన్ (దక్షిణాఫ్రికా-620.1); జెన్ మెకిన్‌టోష్ (స్కాట్లాండ్-619.5 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు.
 
పురుషుల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో భారత వెటరన్ షూటర్లు మన్షేర్ సింగ్, మానవ్‌జిత్ సింగ్ సంధూ రాణించారు. మన్షేర్ 50 పాయింట్లతో అగ్రస్థానంలో... మానవ్‌జిత్ 49 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మంగళవారం క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌తోపాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. మరోవైపు మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్లు శ్రేయాసి సింగ్, సీమా తోమర్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో శ్రేయాసి ఏడో స్థానంలో, సీమా ఎనిమిదో స్థానంలో నిలిచారు. టాప్-6లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement