రెజ్లింగ్ లో భారత్ కు పతకాల పంట
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు అమిత్ కుమార్, సుశీల్ కుమార్, వినేష్ పొగట్ లు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. తొలుత 57 కిలోల విభాగంలొ భారత్ ఆటగాడు అమిత్ కుమార్ తన ప్రత్యర్ధి నైజీరియా ఆటగాడు ఎబిక్ వెమినోవాపై విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇదిలా ఉండగా 48 కిలోల మహిళల విభాగంలో భారత్ క్రీడాకారిణి వినేష్ పొగాట్.. ఇంగ్లండ్ క్రీడాకారిణి యానాపై విజయం సాధించి పసిడిని తన ఖాతాలో వేసుకుంది. మరో భారత్ ఆటగాడు సుశీల్ కుమార్ 74 కిలోల విభాగంలో తన సమీప ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాడు అబ్బాస్ ను మట్టికరిపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే 124 కిలోల విభాగంలో రాజీవ్ తోమర్ మాత్రం కెనడా ఆటగాడు కోరీ జార్విస్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా పతకాలతో 10 పసిడిలను తన ఖాతాలో వేసుకున్న భారత్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది.