
కామన్వెల్త్ గేమ్స్: అభినవ్ బింద్రాకు పసిడి పతకం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల రెండో రోజు శుక్రవారం భారత్ షూటింగ్లో రెండు పతకాలు సాధించగా, కొద్దిలో మరో పతకం చేజారింది. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్, ఒలింపిక్స్ మాజీ చాంపియన్ అభినవ్ బింద్రా పసిడి పతకం సాధించాడు. బింద్రా మొత్తం 205.03 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. కాగా మరో భారత షూటర్ రవికుమార్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్లో చివరి వరకు ప్రథమ స్థానంలో కొనసాగిన రవి కుమార్ అనూహ్యంగా రేసులో వెనుకబడి పతకం చేజార్చుకున్నాడు.
ఈ ఈవెంట్లో బంగ్లాదేశ్ షూటర్ అబ్దుల్లా బకీ రజతం, ఇంగ్లండ్ షూటర్ డేనియల్ రివర్స్ కాంస్యం దక్కించుకున్నారు. ఇదే రోజు జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ 16 ఏళ్ల మలైకా గోయెల్ రజత పతకంతో మెరిసింది.ఈ తాజా పతకాలతో భారత్ పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది.