స్వర్ణ సతీశ్... రజత రవి
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు
గ్లాస్గో: కెరీర్‌లో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న వెయిట్‌లిఫ్టర్ సతీశ్ శివలింగం చరిత్ర సృష్టించాడు. 77 కేజీల విభాగంలో గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు స్వర్ణం దక్కించుకున్నాడు. 2013లో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించిన ఈ 22 ఏళ్ల యువ లిఫ్టర్ మొత్తం 328 కేజీల (149+179) బరువు ఎత్తాడు. స్నాచ్‌లో ఎత్తిన 149 కేజీల బరువుతో గత గేమ్స్‌లో ఇదే విభాగంలో యుకో పీటర్ (నౌరు) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.
ఇక ఢిల్లీ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన కత్తుల రవి కుమార్ ఈసారి తన విభాగాన్ని మార్చుకుని రజతంతో సంతృప్తి చెందాడు. రవి 317 కేజీల (142+175) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. అయితే క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో అతను 185 కేజీల బరువు ఎత్తి స్వర్ణం దక్కించుకునే ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాంకోయిస్ ఎటౌండీ (314 కేజీలు) నిలిచాడు. ఓవరాల్‌గా ఢిల్లీ గేమ్స్‌లో ఎనిమిది పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టర్లు ఇక్కడ ఇప్పటికే తొమ్మిది పతకాల (2-2-4)తో ఆ సంఖ్యను అధిగమించి జోరుమీదున్నారు.
విభాగం మారినా...
ఒడిశాలో స్థిరపడిన తెలుగు తేజం కత్తుల రవికుమార్ వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకాలు సాధించి ఆకట్టుకున్నాడు. బరంపురంలోని వీర్ హనుమాన్ క్లబ్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న అతను అంతకుముందు బాడీ బిల్డర్. సరిగ్గా ఢిల్లీ కామన్వెల్త్‌కు మూడేళ్ల ముందు తన ట్రైనర్ సలహా మేరకు వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. ఆ గేమ్స్‌లో 321 కేజీల బరువు ఎత్తి స్వర్ణంతో అదరగొట్టాడు. తక్కువ సమయంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టిన అతను ఈసారి గ్లాస్గో గేమ్స్‌లో 77 కేజీల విభాగంలో బరిలోకి దిగి రజతంతో మెరిశాడు.
తొలిసారే అదుర్స్...
తమిళనాడులోని వెల్లూర్‌కు చెందిన 22 ఏళ్ల సతీశ్ శివలింగంకు గ్లాస్గో గేమ్స్ చిరస్మరణీయంగా మిగిలాయి. మరోవైపు తనయుడి ఘనతపై తండ్రి శివలింగం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘ఇది తనకు తొలి కామన్వెల్త్ గేమ్స్. అయినా స్వర్ణం సాధించి మేం గర్వపడేలా చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం మా వాడి లక్షణం. ఈ స్వర్ణం అతని కెరీర్‌ను మలుపు తిప్పుతుంది’ అని తెలిపారు.