
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ (96 కేజీల విభాగం)లో ఖతర్ దేశానికి చెందిన మెసో హసూనా స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి అతను మొత్తం 402 కిలోల బరువు ఎత్తాడు. ఒలింపిక్ చరిత్రలో గతంలో 1 రజతం, 4 స్వర్ణాలు గెలుచుకున్న ఖతర్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దేశానికి తొలి స్వర్ణమే కాదు, హసూనా గెలుపు వెనక ఆసక్తికర నేపథ్యం ఉంది. 37 సంవత్సరాలుగా అతని కుటుంబం ఒలింపిక్ పతకం కోసం ఎదురు చూస్తోంది.
మెసో తండ్రి ఇబ్రహీం హసూనా కూడా వెయిట్‌లిఫ్టర్. ఈజిప్ట్ దేశం తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ (1984, 1988, 1992)లలో పాల్గొన్నాడు. కానీ ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన అతను ఆ తర్వాత ఖతర్‌కు వలస వచ్చాడు. పట్టుదలగా తానే శిక్షణ ఇచ్చి తన కొడుకు మెసో హసోనాను కూడా వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చి దిద్దాడు. జూనియర్ స్థాయి నుంచే రాణిస్తూ సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో రజత, కాంస్యాలు గెలుచుకున్న 23 ఏళ్ల మెసో తొలి ఒలింపిక్స్‌లోనే సత్తా చాటాడు. తండ్రి సమక్షంలోనే ఏకంగా స్వర్ణం గెలుచుకొని తన కుటుంబం 37 సంవత్సరాల ఎదురు చూపులకు తెరదించాడు.