వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జావెలిన్ త్రో సూపర్‌స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం ఆటతోనే కాదు.. తన గుణగణాలతో అందరి మనసులు దోచుకున్నాడంటూ ఈ హర్యానా అథ్లెట్‌ను కొనియాడుతున్నారు అభిమానులు. నీరజ్ పెంపకం కూడా ఎంతో గొప్పగా ఉందంటూ అతడి తల్లిదండ్రులను కూడా ప్రశంసిస్తున్నారు.
పాకిస్తాన్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్ కూడా తమ బిడ్డలాంటి వాడేనని నీరజ్ తల్లి సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అదే విధంగా.. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతకధారిగా భారత హాకీ స్టార్ శ్రీజేశ్‌కు ఫ్లాగ్‌బేరర్‌గా అవకాశం ఇస్తామన్నపుడు.. నీరజ్ సంతోషంగా ఒప్పుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం నీరజ్ చోప్రా విలాసవంతమైన జీవితం, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువల గురించి చర్చిస్తున్నారు. మరి అతడి నెట్‌వర్త్ ఎంతో తెలుసా?!
ఉమ్మడి కుటుంబం
హర్యానాలోని పానిపట్‌లో గల ఖాంద్రా గ్రామంలో డిసెంబరు 24, 1997లో నీరజ్ చోప్రా ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి సతీశ్ కుమార్, తల్లి సరోజ్ దేవి. పందొమ్మిది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబం వారిది. నీరజ్‌కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. చెల్లెల్లు సంగీత- సరిత.
ఇక పదకొండేళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో బాధపడ్డ నీరజ్‌ను తండ్రి సమీప జిమ్‌లో చేర్పించాడు. ఊబకాయం వల్ల ఒత్తిడికి లోనైన నీరజ్‌లో స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపేది అతడి తల్లి. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే కొడుకును జావెలిన్ త్రోయర్‌గా ఎదిగేలా ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రులు.
ఓవర్‌నైట్ స్టార్‌గా
ఈ క్రమంలో అనూహ్య రీతిలో.. అంచనాలు తలకిందులు చేస్తూ భారత ఆర్మీ సుబేదార్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి యావత్ భారతావని దృష్టిని ఆకర్షించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ అథ్లెట్ కోసం వాణిజ్య ప్రచార సంస్థలు క్యూకట్టాయి.
ఈ నేపథ్యంలో నీరజ్ పేరుప్రఖ్యాతులతో పాటు సంపద కూడా అమాంతం పెరిగింది. తమ గ్రామంలోనే అత్యంత విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది నీరజ్ కుటుంబం. ఖాంద్రాలోని ఈ మూడంతస్తుల భవనం విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.
లగ్జరీ కార్లు
ఇక నీరజ్ గ్యారేజీలో ఆనంద్ మహీంద్రా అందించిన ప్రత్యేకమైన వాహనంతో పాటు.. ఫోర్ట్ ముస్టాంగ్ జీటీ(సుమారు రూ. 93.52 లక్షలు), టయోటా ఫార్చునర్(సుమారు రూ. 33.43 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్(రూ. 2 కోట్లు), హార్లే డేవిడ్‌సన్ బైకు(రూ. 11 లక్షలు), బజాజ్ పల్సర్(రూ. లక్ష) ఉన్నాయి.
నెట్‌వర్త్ ఎంతంటే?
కాగా టోక్యోలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి వెండి పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక జావెలిన్ త్రో క్వాలిఫయర్స్ సందర్భంగా నీరజ్ ధరించిన వాచ్‌పై కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఒమేగా బ్రాండ్‌కు చెందిన ఆక్వా టెరా అల్ట్రా వాచ్ విలువ సుమారుగా రూ.52 లక్షలు ఉంటుందని సమాచారం.
అన్నట్లు జాతీయ మీడియా DNA రిపోర్టు ప్రకారం.. నీరజ్ చోప్రా ఆస్తుల నికర విలువ సుమారు 32 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా నీరజ్‌కు అధిక మొత్తంలో ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం.
కష్టే ఫలి
టోక్యోలో స్వర్ణం సాధించిన తర్వాత క్యాష్ ప్రైజ్ రూపంలో నీరజ్ చోప్రాకు మొత్తంగా రూ. 13 కోట్లు దక్కాయి. నైక్, ఒమేగా వంటి ప్రముఖ బ్రాండ్లకు అతడు ప్రచారకర్త. ఆటగాడిగా తనను నిరూపించుకునే క్రమంలో గాయాలతో సతమతమైనా.. ఎన్నో కఠినసవాళ్లు ఎదురైనా వాటిని దాటుకుని ఉన్నతశిఖరాలకు చేరిన నీరజ్ చోప్రా యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.
చదవండి: ఒట్టేసి చెప్పు బాబూ: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి
Comments
Please login to add a commentAdd a comment