పని గంటల గురించి ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్(SN Subramanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి.
ఈ నేపథ్యంలో ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్లపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఘాటుగా స్పందించారు. ఉన్నత విద్యావంతులు కూడా మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చురకలు అంటించారు.
కాగా.. ‘భార్యను భర్త.. భర్తను భార్య ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి.. ఆదివారాలు కూడా ఆఫీసుకు రావాలి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్లపై మెజారిటీ మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్టుబడిదారులు వేల కోట్లు ఆర్జిస్తూ.. తరతరాలకు సంపాదించిపెట్టడానికి సామాన్యుల శ్రమను దోచుకోవడం కోసం అభివృద్ధి అనే సాకును వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?
ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల సైతం సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ‘‘అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏమిటంటే.. భర్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఎందుకు ఉండిపోకూడదు? అది కూడా ఆదివారం మాత్రమే ఇలాంటివి ఉంటాయా!!
బాగా చదువుకున్న వాళ్లు.. ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ల నుంచి కూడా ఇలాంటి మాటలు వినాల్సి రావడం విచారకరం. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కావు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా.
నిరాశ, భయం
అంతేకాదు స్త్రీల పట్ల వారికున్న చిన్నచూపును ఇంత బహిరంగంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. నిరాశగానూ.. భయంగానూ ఉంది’’ అని గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అదే విధంగా.. ఆదివారాలు కూడా పనిచేయడం అందరికీ ఇష్టం ఉండదని.. మానసిక ప్రశాంతత ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని నొక్కివక్కాణించారు.ఏదేమైనా బహిరంగ వేదికపైన సుబ్రమణ్యన్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శించారు.
డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా
కాగా మహారాష్ట్రలో జన్మించిన గుత్తా జ్వాల హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బాల్యం నుంచే బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. పద్నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. అశ్విని పొన్నప్పతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా జ్వాల- అశ్విని ద్వయం నిలిచింది.
ఇక 2011లో లండన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌లో కాంస్యం గెలిచిన గుత్తా జ్వాల.. 2010 కామన్‌వెల్త్ గేమ్స్ వుమెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2014 గేమ్స్‌లో రజతం గెలిచారు.
అదే విధంగా.. 2014లో ప్రతిష్టాత్మక ధామస్- ఉబెర్ కప్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 2009 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో డిజు(లండన్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.
కాగా భారత బ్యాడ్మింటన్ రంగంలో డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా గుత్తా జ్వాల పేరొందారు. తన సేవలకు గానూ అర్జున అవార్డు పొందారు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా.. విద్య, వైద్య, మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై కూడా గుత్తా జ్వాల తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.
నటుడితో రెండో వివాహం
సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు గుత్తా జ్వాల. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తమిళనటుడు, డివోర్సీ విష్ణు విశాల్(Vishnu Vishal)తో ప్రేమలో పడ్డ జ్వాల.. 2021లో అతడితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్.. అవన్నీ నిజం కాకపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment