
ఎల్–టీ చైర్మన్ వ్యాఖ్య
నెటిజన్ల నిరసన
దిద్దుబాటుకు కంపెనీ ప్రయత్నాలు
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ‘ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది ఎవరో కాదు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్.
ఆ మధ్య వారానికి 70గంటలు పనిచేయాలని మాట్లాడి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురయ్యారు. ఇప్పుడు ఆ వంతు సుబ్రమణ్యన్‌ది. మూర్తి మీద జోకులు మీమ్‌లు ఆగకముందే ఎల్–టీ చైర్మన్ ఆయనకు తోడయ్యారు. ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం ఉండదా, ఉండకూడదా అంటూ నెటిజనులు దాడి మొదలెట్టారు. ఇతర కార్పొరేట్ సీఈఓలు కూడా సుబ్రమణ్యన్ మాటల్ని కొట్టిపారేశారు.
ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్ధత సన్నగిల్లుతున్న ఈరోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్–టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు..అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం.
కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయని ఎల్–టీ ప్రకటన జారీ చేసింది. జాతి నిర్మాణమే ఎల్‌అండ్‌టీ ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలుగా దేశ మౌలికసదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను బలపరుస్తున్నాం. ఉద్ధేశాలు, లక్ష్యాలు సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు