*ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు? ఇంట్లో కంటే ఆఫీస్ లో(Office Working Hours) ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి... నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ"
ది గ్రేట్ ఎల్ & టీ చైర్మన్ ఎస్. ఎన్. సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది.
గతంలో ఇన్ఫోసిస్ మెంటార్ నారాయణ మూర్తి(Narayana Murthy) కూడా ఇదే మాదిరి మాట్లాడారు. కాకపోతే మరీ సుబ్రహ్మణ్యన్ లా కాదులెండి.
"మన దేశంలో ఉత్పాదకత చాలా తక్కువ. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ.. పురోభివృద్ధి దిశగా దూసుకుపోవాలంటే మరింత కష్టించి పనిచేయాలి. ఇండియాలో అపారమైన నైపుణ్యాలున్నాయి. అవసరాలూ ఉన్నాయి. వారానికి 70 గంటలు పనిచేస్తే మనం లక్ష్యాల వైపు వెళ్లగలుగుతాం"
ఇవీ అప్పట్లో ఆయన అన్న మాటలు.
ఇద్దరి ఉద్దేశమూ ఒకటే..
మూర్తి గారు రోజుకు 10 గంటలు పనిచేయమంటే..సుబ్రహ్మణ్యన్ గారు ఓ నాలుగాకులు ఎక్కువే చదివి.. రోజుకు 13 గంటల సూత్రం బయటకు తెచ్చారు.
వీళ్ళిద్దరూ సింపుల్ గా చెబుతున్నది ఏమిటంటే.. అన్నీ వదిలేసుకొని గొడ్డు చాకిరీ చేయండి అని..
వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు. ఆయా కంపెనీలకు అధిపతులు.. 70, 90 ఏం ఖర్మ. 120 గంటలైనా పనిచేస్తారు..
నేను ఇన్ని గంటలు పనిచేశా/చేస్తున్నా... మీరూ అలాగే చేయండి అని ఉద్యోగులను అనడమే వివాదాన్ని రాజేస్తోంది...
ఉద్యోగులు అంటే జీతం తీసుకుని పనిచేసే శ్రామికులు. ఎన్నో వ్యక్తిగత బరువులు, బాధ్యతల మధ్య నలిగిపోతూ..నెట్టుకొచ్చే సగటు జీవులు.
వాళ్ళను అనునిత్యం సమస్యలు పలకరిస్తూనే ఉంటాయి. ఓపక్క వాటితో పోరాడుతూనే.. మరోపక్క వృత్తి ఉద్యోగాల్లో అనుక్షణం టెన్షన్ తో సహజీవనం చేసే అభాగ్యులు.
పేరుకు ఎనిమిది గంటల మాటే కానీ.. చాలా కంపెనీల్లో తీసుకునే జీతం కంటే చాకిరీ ఎక్కువ చేసే ఉదంతాలే ఎక్కువ.
ఏసీ కార్లు, చుట్టూ పనివాళ్లు, పెద్ద బంగళాలు, మానవ సంబంధాలకు అతీతంగా విశాలమైన ఛాంబర్లలో కాలం గడుపుతూ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే సుబ్రహ్మణ్యన్లను ఒక్కసారి సగటు ఉద్యోగి ఇంట్లో ఓ నాలుగు రోజుల పాటు కూర్చోపెడితే తెలుస్తుంది... రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలో...??
సుబ్రహ్మణ్యన్ సార్ చేసిన ప్రతిపాదనకే వద్దాం...
రోజుకు 24 గంటల చొప్పున... వారానికి 168 గంటలు.
ఇందులో ఆయన చెప్పినట్లు 90 పని గంటలను తీసేద్దాం.
ఇక మిగిలేవి 78 గంటలు.
సగటు ఆరోగ్యవంతుడు రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.
అంటే మిగిలేవి 22 గంటలు (78 - 7x8 = 56 గంటలు).
పోనీ... 8 గంటలు కాకుండా 6 గంటలు చొప్పునే లెక్కేద్దాం.
అప్పుడు మిగిలేవి 36 గంటలు (78 - 7x6 = 42 గంటలు)
అంటే రోజుకు 5 గంటలు.
సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉండేది నగరాలు, పట్టణాల్లోనే...
ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి... నిత్యట్రాఫిక్ రద్దీ కి కనీసం మూడు గంటలు కేటాయించక తప్పదు.
ఇక మిగిలేవి రెండు గంటలు.
కాలకృత్యాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లకు తక్కువలో తక్కువ గంటన్నర వేసుకుందాం...
ఇక మిగిలేది అరగంట...
ఇంటికి వచ్చాక కనీసం రిలాక్స్ అవ్వకూడదు...టీవీ చూడకూడదు.
పిల్లల బాగోగులు పట్టించుకోనక్కర్లేదు..
సరే.. ఇక భార్యను చూస్తూ కూర్చొద్దని సదరు సుబ్రహ్మణ్యన్ సారే చెప్పారు.
సంసారంలో ఏం జరుగుతోందో... బంధువు ఎవడో.. ఫ్రెండ్ ఎవడో...పక్కన పెట్టేయాలి.
కూరలు, కిరాణా మార్కెట్లకు వెళ్ళకూడదు.
పండగలు, పబ్బాలు చేసుకోకూడదు...
టూర్ల సంగతి పూర్తిగా మర్చిపోవాలి.
అనారోగ్యంగా ఉన్నా సరే... టాబ్లెట్ వేసుకుని ఆఫీస్ కు వచ్చేయాలి. సెలవు తీసుకోకూడదు.
విసుగు పుట్టినా.. చూడాలి అనిపించినా... సినిమా ఊసే ఎత్తకూడదు. టైం ఏదీ ??
ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉంటాయి...
పెద్ద స్థాయిల్లో ఉన్న వ్యక్తులు... మహా మేధావులు, తెల్లారి లేస్తే కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే ఈ ప్రముఖులు.. కనీస మానవతా కోణాన్ని పక్కన పెట్టేసి ఇలా ఎలా మాట్లాడతారో అర్ధం కానీ ప్రశ్న.
ఎక్కువ గంటలు పనిచేస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే పని మీద దృష్టి పెట్టగలుగుతాడు. జీవితానికి, పనికి మధ్య సమతౌల్యం పాటించాలి. అది ఎప్పుడైతే ఉండదో... మానసిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి వ్యక్తి ఎక్కువ గంటలు పనిచేయడం మాట అటుంచి... పని వాతావరణాన్నే దెబ్బ తీస్తాడు.
పైగా గంటల కొద్దీ పని చేసుకుంటూ పోతే... ఒకరకమైన జడత్వం ఆవరిస్తుంది. చేసే పని మీద ఆసక్తి పోతుంది.. అశ్రద్ధ పెరుగుతుంది. తప్పులు జరుగుతాయి. వేల కోట్ల ప్రాజెక్టులను హేండిల్ చేసే కంపెనీల్లో జరిగే తప్పులు ఆ కంపెనీ కొంప ముంచుతాయి. కొండకచో.. కంపెనీలు మూత పడే పరిస్థితి తీసుకొస్తాయి.
కాబట్టి సుబ్రహ్మణ్యన్ సారూ...
అతి సర్వత్రా వర్జయేత్... అన్న మాట ఊరికే రాలేదు. అది తినే తిండి అయినా.. చేసే పని అయినా...
మీలాంటి దిగ్గజాలు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది అనుకుంటా...
మీ సహచర పారిశ్రామికవేత్తే మీ ఆలోచనల్ని తప్పుబట్టారు... "గంటలు గంటలు పనిచేయనక్కర్లేదు.. చేసే పనిలో క్వాలిటీ ఉంటే.. 10 గంటలు పని చేసినా చాలు..."
అంటూ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటలు అక్షర సత్యం.
ఇప్పటికే అందర్లోనూ అభాసు పాలయ్యారు. మహీంద్రా మాటలనైనా కాస్త చెవికెక్కుంచుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచిదే.. లేదంటే.. మరింత చులకన అవుతారు... తస్మాత్ జాగ్రత్త.
పొరపాటు దిద్దుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎల్ & టీ ప్రతినిధి వివరణ ఇచ్చినప్పటికీ ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడం,స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్రహ్మణ్యన్ సార్ ఇప్పటికీ నోరు మెదపకపోవడంతో ఈ వ్యాఖ్యలు వివాదం రేపుతూనే ఉన్నాయి)
-బెహరా శ్రీనివాస రావు
విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment