భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా కంపెనీ స్పోర్ట్ యుటిలిటి వెహికిల్‌ను బహూకరించింది. తమ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఎస్‌యూవీ ‘థార్’ను బహుమతిగా అందించింది. మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌కు థార్‌ను ప్రదానం చేసింది.
మహీంద్రా కంపెనీ సౌత్ జోనల్ హెడ్ రాయ్, రీజినల్ సేల్స్ హెడ్ అభిషేక్, కొత్తగూడ మహీంద్రా వీవీసీ షోరూం ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిఖత్‌కు ఎస్‌యూవీని అందజేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2023లో విజేతగా నిలిచిన నిఖత్‌కు థార్‌ను గిఫ్ట్‌గా అందిస్తామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన మహీంద్రా కంపెనీ.. తాజాగా ఆమెకు ఎస్‌యూవీ తాళాలను అందజేసింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక తనకు ప్రతిష్టాత్మక మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు రావడం పట్ల నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకైతే డ్రైవింగ్ రాదని.. త్వరలోనే ‘థార్’తో తన ప్రయాణం మొదలుకానుందని పేర్కొంది. తన ప్యాషన్‌కు అనుగుణంగా ఈ ఎస్‌యూవీతో సాహసయాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది.
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) ఈ ఏడాది మరోసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది పసిడి సాధించి సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎన్గుయెన్ థిటామ్‌ను ఓడించి విజేతగా అవతరించి.. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment