WORLD BOXING CHAMPIONASHIP
-
Nikhat Zareen: సాహస యాత్రలకు సిద్ధం: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్
భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా కంపెనీ స్పోర్ట్ యుటిలిటి వెహికిల్‌ను బహూకరించింది. తమ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఎస్యూవీ ‘థార్’ను బహుమతిగా అందించింది. మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌కు థార్‌ను ప్రదానం చేసింది. మహీంద్రా కంపెనీ సౌత్ జోనల్ హెడ్ రాయ్, రీజినల్ సేల్స్ హెడ్ అభిషేక్, కొత్తగూడ మహీంద్రా వీవీసీ షోరూం ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిఖత్‌కు ఎస్‌యూవీని అందజేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2023లో విజేతగా నిలిచిన నిఖత్‌కు థార్‌ను గిఫ్ట్‌గా అందిస్తామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన మహీంద్రా కంపెనీ.. తాజాగా ఆమెకు ఎస్యూవీ తాళాలను అందజేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తనకు ప్రతిష్టాత్మక మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు రావడం పట్ల నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకైతే డ్రైవింగ్ రాదని.. త్వరలోనే ‘థార్’తో తన ప్రయాణం మొదలుకానుందని పేర్కొంది. తన ప్యాషన్‌కు అనుగుణంగా ఈ ఎస్‌యూవీతో సాహసయాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) ఈ ఏడాది మరోసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది పసిడి సాధించి సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎన్గుయెన్ థిటామ్ను ఓడించి విజేతగా అవతరించి.. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది. -
ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు
World Boxing Championships 2023: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ముగ్గురు భారత బాక్సర్లు కీలకపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) సెమీఫైనల్ బౌట్లలో పోటీపడనున్నారు. 2022 యూరోపియన్ చాంపియన్ బిలాలా బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; 2022 ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజత పతకాల బరిలో ఉంటారు. ఓడితే కాంస్య పతకాన్ని గెల్చుకుంటారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గం. 5:30కు దీపక్ బౌట్ ఉంది. ఆ తర్వాత హుసాముద్దీన్, నిశాంత్ దేవ్ బౌట్లు జరుగుతాయి. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ బౌట్లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరే ఫైనల్‌కు అర్హత సాధించారు. 2019లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్, నవీన్
తాష్కెంట్: ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) వరుసగా రెండో విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన నవీన్ కుమార్ (92 కేజీలు) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ఆశిష్ చౌధరీ (80 కేజీలు) రెండో రౌండ్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ బౌట్లలో హుసాముద్దీన్ 5–0తో లియు పింగ్ (చైనా)పై, నవీన్ 5–0తో జియోంగ్ జెమిన్ (దక్షిణ కొరియా)పై ఏకపక్ష విజయాలు సాధించారు. ఆశిష్ 2–5తో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అర్లెన్ లోపెజ్ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు. -
తెలంగాణకు నిఖత్ గర్వకారణం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 50 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయస్థాయి ఖ్యాతిగడించే ప్రదర్శన చేస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్ స్వశక్తికి నిదర్శనమని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జరీన్‌ను ఢిల్లీలో మంత్రి అభినందించారు. -
ఇదే కఠినమైన బౌట్.. నా దేశం కోసం ఈ పతకం: నిఖత్ జరీన్ ఉద్వేగం
Nikhat Zareen- World Boxing Championship: ‘‘రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగాఉంది. అందులోనూ ఒలింపిక్ కేటగిరీలో స్వర్ణం గెలవడం ఇంకా సంతృప్తినిచ్చింది. టోర్నీలో సహజంగానే నా దృష్టిలో ఇదే కఠినమైన బౌట్. ఆమె ఆసియా చాంపియన్. హోరాహోరీగా తలపడ్డాం. కామన్వెల్త్ క్రీడల్లో నేను పెద్దగా పోటీని ఎదుర్కోలేదు. ఈ తర్వాత ఇక్కడే మళ్లీ బరిలోకి దిగాను. కానీ ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో వరుస బౌట్లలో తలపడాల్సి వచ్చింది. అందుకే కొన్నిసార్లు నేను వేగంగా కదల్లేకపోయాను. ఫైనల్లో మాత్రం చివరి బౌట్ కాబట్టి పూర్తి శక్తిసామర్థ్యాలు వాడాలని నిశ్చయించుకున్నా. వంద శాతంకంటే ఎక్కువ ప్రయత్నించా. గత ఏడాది పతకంతో పోలిస్తే ఇది ఎక్కువ శ్రమతో వచ్చింది. దీని కోసం బరువు తగ్గించుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సన్నాహానికి సమయం తక్కువగా ఉన్నా పూర్తి ఏకాగ్రతతో సాధన చేశా. ఉత్తమ బాక్సర్‌గా మహీంద్రా థార్ వాహనం బహుమతిగా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి నాకు వచ్చిన ప్రైజ్‌మనీతో అమ్మా, నాన్నను హజ్ యాత్రకు పంపిస్తా’’ అని భారత బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది. బెస్ట్ బాక్సర్‌గా ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) మరోసారి చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాం బాక్సర్ థి టామ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అంతేకాకుండా టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ విజయం అనంతరం ఈ మేరకు స్పందించింది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా తాను ఇక్కడిదాకా చేరుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్రను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్.. ఈ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు పేర్కొంది. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. 2️⃣x World Champion 🇮🇳 @nikhat_zareen ’s reaction right after scripting history 🥳🔥@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @MahindraRise @NehaAnandBrahma https://t.co/29Wd7lBDfx pic.twitter.com/kLcmJzLdcw — Boxing Federation (@BFI_official) March 26, 2023 -
అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
మే 19, 2022... నిఖత్ జరీన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న గుర్తింపు వేరు. ఒకసారి యూత్ వరల్డ్ చాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచినా సరే, సీనియర్ స్థాయికి వచ్చేసరికి కనుమరుగైన వారి జాబితాలో ఆమె కూడా చేరుతుందని చాలా మంది అనుకున్నారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు మరో ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించినా నిఖత్‌పై ఎక్కువగా అంచనాలు లేవు. ఆమె ప్రదర్శనపై కూడా ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అని, మున్ముందు గొప్ప విజయాలు సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అందుకు కారణం అప్పటికే ఉత్తరాది, ముఖ్యంగా హరియాణా బాక్సర్లతోనే భారత బృందం నిండి ఉంది. ఆటా వారిదే, ఫలితాలు వారి నుంచే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా మేరీకోమ్‌తో పోటీ పడేందుకు సిద్ధపడి అదేదో తప్పు చేసినట్లుగా తన ప్రమేయం లేకుండానే చాలా మంది దృష్టిలో నిఖత్ జరీన్ విలన్‌గా మారిపోయింది. కానీ... కానీ... ఒక్క అద్భుత ప్రదర్శన అంతా మార్చేసింది... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో నిఖత్ సత్తా అందరికీ అర్థమైంది. నిఖత్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది. భారత్ నుంచి విశ్వ వేదికపై నిలబడగల అథ్లెట్ల జాబితాలో ఆమె కూడా చేరింది. అసలు కర్తవ్యంపైనే దృష్టి... గత వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం నుంచి నిఖత్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఎందుకంటే అగ్రశ్రేణి ఆటగాళ్లు విజయాలు సాధించడం మాత్రమే కాదు, వాటిని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గొప్ప ఘనతల తర్వాత వచ్చే కీర్తి కనకాదులు, ప్రచారాలు ప్లేయర్లను ఒక్కసారిగా ఆటకు దూరం చేసిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. సరిగ్గా ఈ విషయంలోనే నిఖత్ తడబడలేదు. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఎన్నో ప్రచార, బ్రాండింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవాలు, ఆపై టీవీ, సినిమా షోలు, అవార్డుల స్వీకరణ... ఇలా ఒక్కసారిగా నిఖత్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సమయంలోనూ ఆమె తన అసలు కర్తవ్యాన్ని మరచిపోలేదు. వెయిట్ కేటగిరీ మారినా... గత విజయం తర్వాత నిఖత్ ముందు నిలిచిన పెద్ద సవాల్ వెయిట్ కేటగిరీ! 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 52 కేజీల విభాగంలో టైటిల్ సాధించింది. దాంతో పారిస్ ఒలింపిక్స్–2024 అనేది అసలు లక్ష్యంగా మారింది. అయితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 52 కేజీల విభాగం లేకపోవడంతో తప్పనిసరిగా దానిని మార్చుకోవాల్సి వచ్చింది. ముందుకెళితే 54 కేజీల్లో అప్పటికే అక్కడ సత్తా చాటుతున్న అంతర్జాతీయ స్టార్ బాక్సర్లు, అనుభవజ్ఞులు ఉంటారు. దాంతో తన పంచ్ పవర్ పదును పని చేసేందుకు వెయిట్ తగ్గడమే సరైందని భావించి 50 కేజీలకు మారింది. దానికి అనుగుణంగా తన బరువును మార్చుకొని తీవ్రంగా సాధన చేసింది. భారత కోచ్ జాన్ వార్‌బర్టన్ సాధన విషయంలో నిఖత్‌కు అన్ని రకాలుగా సరైన దిశానిర్దేశం చేశారు. ఆమె శ్రమ ఫలితం బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కనిపించింది. వరల్డ్ చాంపియన్‌గా తన స్థాయిని ప్రదర్శిస్తూ అక్కడ సునాయాసంగా స్వర్ణం గెలుచుకుంది. అదీ తాను కొత్తగా మొదలుపెట్టిన 50 కేజీల కేటగిరీలో కావడంతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆపై మరో ఐదు నెలలకు వచ్చిన జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు మొదటి స్థానం లాంఛనమే అయింది. ఈ ఏడాది వ్యవధిలో ఆమె ఈ రెండు ఈవెంట్లు మినహా మరే టోర్నీలోనూ పాల్గొనలేదు. విదేశాల్లో కొన్ని టోర్నమెంట్లకు ఆహ్వానాలు అందినా... తన ఆట మెరుగవ్వాలంటే అలాంటి టోర్నీలలో ఆడి ‘విజేత’ అనిపించుకోవడంకంటే ప్రాక్టీస్ చేయడమే సరైందని జరీన్ భావించింది. చివరకు దాంతో ఫలితాన్ని అందుకుంది. ఆద్యంతం ఆధిపత్యం... సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది. సెమీస్ మినహా మిగిలిన బౌట్లలో ఎక్కడా తడబాటు లేకుండా ఆమె అలవోక విజయాలు అందుకుంది. ఒక బౌట్లో ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్), 4 బౌట్లలో 5–0తో నెగ్గిన ఆమె ఒక్క సెమీస్‌లో 5–2తో ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చింది. తాజా విజయంతో ఈ కేటగిరీలో నిఖత్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఇకపై పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగాల్సి ఉంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ, మెగా ఈవెంట్లో కూడా పతకం అందుకోవడం అసాధ్యం కాబోదు! -సాక్షి క్రీడా విభాగం చదవండి: WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్.. Congratulations to @nikhat_zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions. pic.twitter.com/PS8Sn6HbOD — Narendra Modi (@narendramodi) March 26, 2023 -
మెచ్చుకోలు, ఆశ్చర్యం, ప్రశ్నార్థకం.. ఆమెను సులువుగా మర్చిపోలేరు! ఎందుకు?
ఢిల్లీలో ఇప్పుడు మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. అందరి దృష్టి ఆస్ట్రేలియా బాక్సర్ టినా రహిమి మీద నిలిచింది. ఆమె ప్రపంచంలోనే బహుశా మొదటి హిజాబ్ బాక్సర్. ప్రిలిమినరిస్లోనే రహిమి ఓడిపోయినా హిజాబ్ గురించి ప్రపంచానికి ఉన్న దృష్టి మారడానికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను అని తెలిపింది. ‘ఏం పర్వాలేదు. నా మద్దతుదారులను నిరాశ పరిచాను. కాని 2024 ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాను’ అంది 27 సంవత్సరాల టినా రహిమి. ఆస్ట్రేలియా నుంచి తొమ్మిది మంది బాక్సర్ల బృందంతో ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌కు హాజరైన టినా గట్టి పోరాటం ఇచ్చి ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో వచ్చింది. కాని మన టాలెంటెడ్ బాక్సర్ మనిషా మౌన్ చేతిలో ఓటమి పాలయ్యింది. రింగ్‌లో హిజాబ్ ధరించి తలపడిన ఆమెను మెచ్చుకోలు కళ్లతో, ఆశ్చర్యం కళ్లతో, ప్రశ్నార్థకం కళ్లతో చూసినవారు ఆమెను మర్చిపోవడం మాత్రం కష్టం. ‘అనుకూలంగానో ప్రతికూలంగానో నన్ను అందరూ చూస్తుంటారు. నేను ముస్లింని. నా మతానుసారం దుస్తులు ధరించే స్వేచ్ఛ నాకు ఉంది. నేను ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అవి ఏమాత్రం అడ్డు కాకూడదని భావిస్తాను. నన్ను చూసిన చాలామంది ముస్లిం యువతులు స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఈమె హిజాబ్‌తో ఏకంగా బాక్సింగ్ చేయగలిగితే చదువుకు, ఉద్యోగాలకు అది మనకు ఏం అడ్డం అనుకుంటారు. అలాగే అనుకోవాలని కోరుకుంటాను’ అంది రహిమి. రహిమి 57 కేజీల విభాగంలో ఆస్ట్రేలియా తరఫున విజయాలు సాధిస్తూ ఉంది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో (బర్మింగ్ హామ్) ఫెదర్ వెయిట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెల్చుకునిఆ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా ముస్లింగా నిలిచింది. అలాగే కామన్వెల్త్ క్రీడల్లో హిజాబ్‌తో బాక్సింగ్ చేసిన మొదటి మహిళగా కూడా. ‘ఇప్పటి వరకూ నా హిజాబ్ గురించి ఎటువంటి అభ్యంతరం రాలేదు. అయితే హిజాబ్‌ను సమర్థించే వారు నేను గెలవాలని గట్టిగా కోరుకుంటారు. హిజాబ్‌తో గెలిచింది అని గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నాకు వొత్తిడి కలిగిస్తోంది’ అంటుందామె. సిడ్నిలో స్థిరబడి ఆస్ట్రేలియన్ జాతీయత స్వీకరించిన ఈ ఇరానియన్ మహిళ అక్కడ మేకప్ ఉమెన్‌గా ఉపాధి పొందుతోంది. ‘అయితే 2017లో జిమ్‌లో నేను, నా స్నేహితురాలు సరదాగా స్త్రీల బాక్సింగ్ క్లాసులకు అటెండ్ అయ్యాం. బ్యాగ్‌లను పంచ్ చేస్తుంటే మంచి కిక్‌గా అనిపించింది. ఆ సరదా కాస్త సీరియస్ ప్రాక్టీసుగా మారింది. 2018 నాటికి నేను క్వాలిఫైడ్ బాక్సర్‌గా మారాను’ అంటుంది రహిమి. ఆస్ట్రేలియాలో ముస్లిం అథ్లెట్లకు మంచి ప్రోత్సాహం ఉంది. ప్రతి ఏటా అక్కడ ‘ఆస్ట్రేలియా ముస్లిం అచీవ్మెంట్ అవార్డ్స్’ ఇస్తారు. గత సంవత్సరం రహిమికి ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించారు. ‘హిజాబ్ వారి వారి ఎంపిక. ఎంచుకున్న వారికి అది ఏ విధంగానూ అడ్డు కాదు’ అంటుంది రహిమి. ‘ఇప్పటి వరకూ నా హిజాబ్ గురించి ఎటువంటి అభ్యంతరంరాలేదు. అయితే హిజాబ్‌ను సమర్థించే వారు నేను గెలవాలని గట్టిగా కోరుకుంటారు. హిజాబ్‌తో గెలిచింది అని గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. అది నాకు వొత్తిడి కలిగిస్తోంది’ అంటుందామె. చదవండి: Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ -
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం ( ఫోటోలు)
-
ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ
సంజీత్ ముందంజ బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), ఆకాశ్ (54 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సంజీత్ 4–1తో ఆండ్రీ స్టోట్‌స్కీ (రష్యా)పై గెలిచాడు. ఆకాశ్‌తో తలపడాల్సిన జర్మనీ బాక్సర్ ఒమర్ సలాహ్ అస్వస్థత కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఆకాశ్‌కు ‘వాకోవర్’ లభించింది. జ్వరం కారణంగా భారత బాక్సర్ వరీందర్ (60 కేజీలు) టోర్నీ నుంచి వైదొలిగాడు. ఫైనల్లో సత్యన్–హర్మీత్ జోడీ ట్యూనిస్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ ట్యూనిస్ ఓపెన్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ (భారత్) జంట టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–హర్మీత్ ద్వయం 8–11, 12–14, 11–9, 11–8, 11–9తో నాందోర్ ఎసెకి–ఆడమ్ జుడి (హంగేరి) జంటపై గెలిచింది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నరేందర్ ముందంజ..
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో నరేందర్ 4–1తో ఒస్కార్ సఫర్యాన్ (పోలాండ్)పై నెగ్గగా... సుమిత్ 5–0తో డామన్ ఒనీల్ (జమైకా)ను చిత్తు చేశాడు. గోవింద్ 3–2తో అరియస్ ఒరిట్జ్ (ఈక్వెడార్)పై, నిశాంత్ 5–0తో లాస్లో కొజాక్ (హంగేరి)పై విజయం సాధించారు. 86 కేజీల విభాగంలో భారత బాక్సర్ లక్ష్య చహర్ తొలి రౌండ్లో కిమ్ హైంగ్కియు (కొరియా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్ -
మనీశ్ కౌశిక్ ముందంజ
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): ప్రతిష్టాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు, కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత మనీశ్ కౌశిక్ రెండోరౌండ్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల 63కేజీల బౌట్లో మనీశ్ 5–0తో ఉలూ అర్జెన్ కదిర్‌బెక్ (కిర్గిస్తాన్)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన మనీశ్ పెద్దగా కష్టపడకుండానే విజయాన్ని అందుకున్నాడు. అతని పదునైన పంచ్‌లకు ప్రత్యర్థి వద్ద సమాధానమే లేకుండా పోయింది. రెండో రౌండ్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఎన్రికో లాక్రూజ్‌తో మనీశ్ తలపడతాడు. ఈ టోర్నీలో ఇప్పటికే బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రెండోరౌండ్‌కు అర్హత సాధించగా.. భారత బాక్సర్లు ముగ్గురికి తొలిరౌండ్లో ‘బై’ లభించింది. అమిత్ పంగల్ (52 కేజీలు), కవీందర్ సింగ్ (57 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) నేరుగా రెండోరౌండ్ బౌట్లో తలపడనున్నారు. -
మరో ప్రాణం తీసిన బాక్సింగ్ రింగ్
బ్యూనోస్ ఎయిర్స్: రింగ్‌లో ప్రత్యర్ధి పిడిగుద్దులు మరో బాక్సర్ ప్రాణం తీశాయి. బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్ మంగళవారం తుది శ్వాస విడవగా, మరొక బౌట్లో గాయాలు పాలైన అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. గత శనివారం ఉరేగ్వే బాక్సర్ ఎడ్వర్డో అబ్రెతో జరిగిన బౌట్‌ను డ్రా చేసుకున్న తర్వాత సాంతిల్లాన్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. 10వ రౌండ్ తర్వాత మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరువురి బాక్సర్ల చేతులను పైకి ఎత్తే క్రమంలో సాంతిల్లాన్ నిలబడలేకపోయాడు. దాంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్ ప్రాణాలు విడిచాడు. 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన సాంతిల్లాన్.. ఇప్పటివరకూ 19 విజయాలు సాధించి అరుదైన రికార్డును కల్గి ఉన్నాడు. ఈ విజయాల్లో 8 నాకౌట్ విజయాలు కాగా, రెండు డ్రాగా ముగిశాయి. 2016 సెప్టెంబర్‌లో దక్షిణ అమెరికా సూపర్ ఫెదర్వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో సాంతిల్లాన్ వెలుగులోకి వచ్చాడు. సాంతిల్లాన్ మృతిపై వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లాటినో సిల్వర్ లైట్ వెయిట్ టైటిల్లో భాగంగా అబ్రెతో జరిగిన పోరులో 23 ఏళ్ల సాంతిల్లాన్ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది. (ఇక్కడ చదవండి: ప్రాణం తీసిన పంచ్) -
ఆరో స్వర్ణం మేరీ సొంతం
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మట్టి కరిపించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. దీంతో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్ ఇప్పుడు ఆమెను అధిగమించింది. తాజా స్వర్ణంతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరింది. మేరీ 2002, 2005, 2006, 2008, 2010 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలతో పాటు.. అరంగేట్ర 2001 చాంపియన్ షిప్లో రజతం సాధించింది. గెలుపునంతరం ఆమె భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గత కొన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యంగా పేర్కొంది. వైఎస్ జగన్ అభినందనలు.. ఆరు స్వర్ణాలతో ప్రపంచ రికార్టు సృష్టించిన మేరికోమ్‌కు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
మేరీ... ఆరో స్వర్ణంపై గురి
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. గతంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, ఒకసారి రెండో స్థానం అందుకున్న ఈ మణిపురి మణిపూస ఆరోసారి శిఖరాన నిలిచేందుకు మరింత చేరువైంది. 35 ఏళ్ల మేరీకోమ్ గురువారం ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 48 కేజీల విభాగం సెమీఫైనల్లో మేరీ 5–0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)ను చిత్తుగా ఓడించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 29–28, 30–27, 30–27, 30–27, 30–27 పాయింట్లు ఇవ్వడం భారత స్టార్ బాక్సర్ ఆధిపత్యానికి అద్దం పట్టింది. ఈ మెగా టోర్నీకి ముందు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్ ఇప్పుడు ఆమెను అధిగమించనుంది. ఫైనలో పోరులో నెగ్గి స్వర్ణం సాధిస్తే ఓవరాల్‌గా ఆరు బంగారు పతకాలతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరుతుంది. శనివారం జరిగే ఫైనల్లో మేరీ కోమ్... ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాతో తలపడుతుంది. ఈ ఏడాది పోలాండ్‌లో జరిగిన టోర్నీలో ఆమెను మేరీ ఓడించింది. 69 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన లవ్లీనా బొర్గోహైన్ పోరాటం ముగిసింది. అస్సాంకు చెందిన 21 ఏళ్ల లవ్లీనా సెమీఫైనల్లో 0–4తో చెన్ నియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఐదుగురు జడ్జిల్లో నలుగురు 29–27, 29–27, 29–27, 30–26తో చెన్ నియెన్ చెన్ వైపు మొగ్గగా... మరొకరు ఇద్దరికి 28–28తో సమంగా పాయింట్లు ఇచ్చారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్లు సోనియా చహల్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) బరిలోకి దిగనున్నారు. జో సన్ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్ (చైనా)తో సిమ్రన్‌జిత్ తలపడతారు. సెమీస్‌లో నాతో తలపడిన కిమ్ హ్యాంగ్‌ను గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఓడించాను. కాబట్టి ఈ సారి కూడా నాటి విజయాన్ని నిలబెట్టుకునేందుకు మరింత సన్నద్ధతతో వచ్చాను. ప్రత్యర్థి నాకంటే పొడగరి. దాని వల్ల ఆమెకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే ఒక్కసారి బరిలోకి దిగానంటే దాని గురించి ఆలోచించకుండా నా ఆటపైనే దృష్టి పెడతా. ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. తుది పోరులో తలపడబోతున్న హనాపై కూడా ఇటీవలే గెలిచాను. సరైన వ్యూహంతో బరిలోకి దిగి మళ్లీ ఆమెను ఓడిస్తాననే నమ్మకముంది. –మేరీకోమ్ -
భారత బాక్సర్లకు అనుమతి
పాటియాల : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ ఒక్క టోర్నీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) అనుమతించింది. అయితే దీని తర్వాత జరగబోయే టోర్నీల్లో పాల్గొనాలంటే మాత్రం కచ్చితంగా నవంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)ను ఆదేశించింది. రెండు రోజుల సెలక్షన్ ట్రయల్స్ అనంతరం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 10 మంది సభ్యులుగల భారత జట్టును ఎంపిక చేశారు. ప్రపంచ చాంపియన్‌షిప్ అక్టోబరు 11 నుంచి 27 వరకు కజకిస్థాన్‌లో జరుగుతుంది. భారత జట్టు: నానో సింగ్ (49 కేజీలు), మదన్ లాల్ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (81 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు).