నిఖత్ జరీన్ (PC: BFI)
మే 19, 2022... నిఖత్ జరీన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న గుర్తింపు వేరు. ఒకసారి యూత్ వరల్డ్ చాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచినా సరే, సీనియర్ స్థాయికి వచ్చేసరికి కనుమరుగైన వారి జాబితాలో ఆమె కూడా చేరుతుందని చాలా మంది అనుకున్నారు.
ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు మరో ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించినా నిఖత్‌పై ఎక్కువగా అంచనాలు లేవు. ఆమె ప్రదర్శనపై కూడా ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అని, మున్ముందు గొప్ప విజయాలు సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అందుకు కారణం అప్పటికే ఉత్తరాది, ముఖ్యంగా హరియాణా బాక్సర్లతోనే భారత బృందం నిండి ఉంది.
ఆటా వారిదే, ఫలితాలు వారి నుంచే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా మేరీకోమ్‌తో పోటీ పడేందుకు సిద్ధపడి అదేదో తప్పు చేసినట్లుగా తన ప్రమేయం లేకుండానే చాలా మంది దృష్టిలో నిఖత్ జరీన్ విలన్‌గా మారిపోయింది. కానీ... కానీ... ఒక్క అద్భుత ప్రదర్శన అంతా మార్చేసింది... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో నిఖత్ సత్తా అందరికీ అర్థమైంది. నిఖత్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది.
భారత్ నుంచి విశ్వ వేదికపై నిలబడగల అథ్లెట్ల జాబితాలో ఆమె కూడా చేరింది. అసలు కర్తవ్యంపైనే దృష్టి... గత వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం నుంచి నిఖత్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఎందుకంటే అగ్రశ్రేణి ఆటగాళ్లు విజయాలు సాధించడం మాత్రమే కాదు, వాటిని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గొప్ప ఘనతల తర్వాత వచ్చే కీర్తి కనకాదులు, ప్రచారాలు ప్లేయర్లను ఒక్కసారిగా ఆటకు దూరం చేసిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.
సరిగ్గా ఈ విషయంలోనే నిఖత్ తడబడలేదు. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఎన్నో ప్రచార, బ్రాండింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవాలు, ఆపై టీవీ, సినిమా షోలు, అవార్డుల స్వీకరణ... ఇలా ఒక్కసారిగా నిఖత్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సమయంలోనూ ఆమె తన అసలు కర్తవ్యాన్ని మరచిపోలేదు.
వెయిట్ కేటగిరీ మారినా... గత విజయం తర్వాత నిఖత్ ముందు నిలిచిన పెద్ద సవాల్ వెయిట్ కేటగిరీ! 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 52 కేజీల విభాగంలో టైటిల్ సాధించింది. దాంతో పారిస్ ఒలింపిక్స్–2024 అనేది అసలు లక్ష్యంగా మారింది. అయితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 52 కేజీల విభాగం లేకపోవడంతో తప్పనిసరిగా దానిని మార్చుకోవాల్సి వచ్చింది.
ముందుకెళితే 54 కేజీల్లో అప్పటికే అక్కడ సత్తా చాటుతున్న అంతర్జాతీయ స్టార్ బాక్సర్లు, అనుభవజ్ఞులు ఉంటారు. దాంతో తన పంచ్ పవర్ పదును పని చేసేందుకు వెయిట్ తగ్గడమే సరైందని భావించి 50 కేజీలకు మారింది. దానికి అనుగుణంగా తన బరువును మార్చుకొని తీవ్రంగా సాధన చేసింది. భారత కోచ్ జాన్ వార్‌బర్టన్ సాధన విషయంలో నిఖత్‌కు అన్ని రకాలుగా సరైన దిశానిర్దేశం చేశారు.
ఆమె శ్రమ ఫలితం బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కనిపించింది. వరల్డ్ చాంపియన్‌గా తన స్థాయిని ప్రదర్శిస్తూ అక్కడ సునాయాసంగా స్వర్ణం గెలుచుకుంది. అదీ తాను కొత్తగా మొదలుపెట్టిన 50 కేజీల కేటగిరీలో కావడంతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆపై మరో ఐదు నెలలకు వచ్చిన జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు మొదటి స్థానం లాంఛనమే అయింది.
ఈ ఏడాది వ్యవధిలో ఆమె ఈ రెండు ఈవెంట్లు మినహా మరే టోర్నీలోనూ పాల్గొనలేదు. విదేశాల్లో కొన్ని టోర్నమెంట్‌లకు ఆహ్వానాలు అందినా... తన ఆట మెరుగవ్వాలంటే అలాంటి టోర్నీలలో ఆడి ‘విజేత’ అనిపించుకోవడంకంటే ప్రాక్టీస్ చేయడమే సరైందని జరీన్ భావించింది. చివరకు దాంతో ఫలితాన్ని అందుకుంది. ఆద్యంతం ఆధిపత్యం... సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది.
సెమీస్ మినహా మిగిలిన బౌట్‌లలో ఎక్కడా తడబాటు లేకుండా ఆమె అలవోక విజయాలు అందుకుంది. ఒక బౌట్‌లో ఆర్‌ఎస్‌సీ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్), 4 బౌట్‌లలో 5–0తో నెగ్గిన ఆమె ఒక్క సెమీస్‌లో 5–2తో ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చింది. తాజా విజయంతో ఈ కేటగిరీలో నిఖత్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఇకపై పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగాల్సి ఉంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ, మెగా ఈవెంట్‌లో కూడా పతకం అందుకోవడం అసాధ్యం కాబోదు!
-సాక్షి క్రీడా విభాగం
చదవండి: WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్..
Congratulations to @nikhat_zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions. pic.twitter.com/PS8Sn6HbOD
— Narendra Modi (@narendramodi) March 26, 2023
Comments
Please login to add a commentAdd a comment