మేరీ... ఆరో స్వర్ణంపై గురి | Mary Kom reaches World Boxing Championship final | Sakshi
Sakshi News home page

మేరీ... ఆరో స్వర్ణంపై గురి

Published Fri, Nov 23 2018 1:27 AM | Last Updated on Fri, Nov 23 2018 5:20 AM

Mary Kom reaches World Boxing Championship final - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్‌ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. గతంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, ఒకసారి రెండో స్థానం అందుకున్న ఈ మణిపురి మణిపూస ఆరోసారి శిఖరాన నిలిచేందుకు మరింత చేరువైంది. 35 ఏళ్ల మేరీకోమ్‌ గురువారం ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 48 కేజీల విభాగం సెమీఫైనల్లో మేరీ 5–0తో కిమ్‌ హ్యాంగ్‌ మి (ఉత్తర కొరియా)ను చిత్తుగా ఓడించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది.

బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 29–28, 30–27, 30–27, 30–27, 30–27 పాయింట్లు ఇవ్వడం భారత స్టార్‌ బాక్సర్‌ ఆధిపత్యానికి అద్దం పట్టింది. ఈ మెగా టోర్నీకి ముందు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్‌ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్‌ ఇప్పుడు ఆమెను అధిగమించనుంది. ఫైనలో పోరులో నెగ్గి స్వర్ణం సాధిస్తే ఓవరాల్‌గా ఆరు బంగారు పతకాలతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్‌ దిగ్గజం ఫెలిక్స్‌ సవాన్‌ సరసన చేరుతుంది. శనివారం జరిగే ఫైనల్లో మేరీ కోమ్‌... ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాతో తలపడుతుంది.

ఈ ఏడాది పోలాండ్‌లో జరిగిన టోర్నీలో ఆమెను మేరీ ఓడించింది. 69 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన లవ్లీనా బొర్గోహైన్‌ పోరాటం ముగిసింది. అస్సాంకు చెందిన 21 ఏళ్ల లవ్లీనా సెమీఫైనల్లో 0–4తో చెన్‌ నియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఐదుగురు జడ్జిల్లో నలుగురు 29–27, 29–27, 29–27, 30–26తో చెన్‌ నియెన్‌ చెన్‌ వైపు మొగ్గగా... మరొకరు ఇద్దరికి 28–28తో సమంగా పాయింట్లు ఇచ్చారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్లు సోనియా చహల్‌ (57 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు) బరిలోకి దిగనున్నారు. జో సన్‌ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్‌ (చైనా)తో సిమ్రన్‌జిత్‌ తలపడతారు.  

సెమీస్‌లో నాతో తలపడిన కిమ్‌ హ్యాంగ్‌ను గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఓడించాను. కాబట్టి ఈ సారి కూడా నాటి విజయాన్ని నిలబెట్టుకునేందుకు మరింత సన్నద్ధతతో వచ్చాను. ప్రత్యర్థి నాకంటే పొడగరి. దాని వల్ల ఆమెకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే ఒక్కసారి బరిలోకి దిగానంటే దాని గురించి ఆలోచించకుండా నా ఆటపైనే దృష్టి పెడతా. ఫైనల్‌ చేరడం సంతోషంగా ఉంది. తుది పోరులో తలపడబోతున్న హనాపై కూడా ఇటీవలే గెలిచాను. సరైన వ్యూహంతో బరిలోకి దిగి మళ్లీ ఆమెను ఓడిస్తాననే నమ్మకముంది.
–మేరీకోమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement