weightlifter
-
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు కంఠెవరం బాలిక
సాక్షి, తెనాలి: అనతికాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుని అందరి ప్రశంసలూ అందుకుంటుంది కంఠెవరం బాలిక నాగం జ్ఞాన దివ్య. త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ మెరవనుంది. ఫిట్నెస్ కోసమని సాధన ప్రారంభించిన ఏడాదిలోనే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరగనున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ విభాగంలో సత్తా చాటనుంది. కుటుంబ నేపథ్యం ఇదీ.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలోని కేబుల్ ఆఫీసులో పనిచేసే నాగం వెంకటేశ్వరరావు, సుధారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూజిత బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండో కుమార్తె జ్ఞానదివ్య గత మార్చిలో ఇంటర్ పూర్తిచేసింది. దివ్య ఫిట్నెస్ కోసమని గ్రామంలోని మాతృశ్రీ వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీలో ఏడాది కిందట చేరింది. నిత్యం సాధన చేసింది. ఆమె ఆసక్తిని గమనించిన ఫవర్ లిఫ్టర్ కొల్లిపర నాగశిరీష దివ్యను ప్రోత్సహించారు. పవర్‌లిఫ్టింగ్‌లో మెళకువలు నేర్పారు. నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నాగశిరీష పవర్‌లిఫ్టింగ్‌లో నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్. తనలాగే జ్ఞాన దివ్య కూడా జాతీయస్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంతో చక్కని తర్ఫీదునిచ్చారు. నాగశిరీష, ఆళ్ల వెంకటరెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, సుభాన్‌వలి తదితర లిఫ్టర్ల సలహాలతో దివ్య అనేక పతకాలు సాధించింది. దివ్య విజయాలు ఇవీ.. ► 2021 నవంబరు 21, 22 తేదీల్లో జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్‌మీట్ క్లాసిక్ కేటగిరీలో బంగారు పతకం. ► కేరళలోని అలప్పుజలో జరిగిన జాతీయస్థాయి 84 ప్లస్ కేటగిరీలో బంగారు పతకం. ► అనకాపల్లిలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో ఎక్విప్డ్ విభాగంలో రజతం. ► మంగళగిరిలో గత జూన్ 9న జరిగిన స్టేట్‌మీట్ ఎక్విప్డ్‌లో 84 ప్లస్ విభాగం స్క్వాడ్‌లో 187.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 160 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 55 కిలోల బరువులనెత్తి బంగారు పతకాలు కైవసం. ► హైదరాబాద్‌లో ఈనెల 5న జరిగిన నేషనల్ సెలక్షన్స్‌లో స్క్వాడ్‌లో బంగారు, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో రజత పతకాలు. ► ఈనెల 16న విశాఖపట్టణంలో జరిగిన 9వ రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం. ► ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కేరళలో జరగనున్న నేషనల్స్‌కు అర్హత. ► ఆగస్టు ఆఖరు నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక. (క్లిక్: సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!) -
Tokyo Olympics: ప్రపంచ రికార్డులను ఎత్తేశాడు
జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె సంచలన ప్రదర్శన చేశాడు. బుధవారం పురుషుల +109 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో లాషా... తన ఆకారానికి తగ్గట్టే బరువులను ఇట్టే ఎత్తేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు... 176 కేజీల బరువుతో అజానుబాహుడైన లాషా... మొత్తం 488 కేజీలు (స్నాచ్‌లో 223+క్లీన్ అండ్ జెర్క్‌లో 265) బరువు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌తో పాటు ఓవరాల్ బరువులో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన అలీ డెవౌడి (ఇరాన్) కంటే లాషా 47 కేజీలు ఎక్కువగా ఎత్తడం విశేషం. ఒలింపిక్స్‌లో లాషాకు ఇది రెండో స్వర్ణం. 2016 రియోలో +105 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అతడు బంగారు పతకంతో మెరిశాడు. అలీ డెవౌడి 441 కేజీల (స్నాచ్‌లో 200+క్లీన్ అండ్ జెర్క్‌లో 241)తో రజతాన్ని.... మన్ అసద్ (సిరియా) 424 కేజీల(స్నాచ్‌లో 190+క్జీన్ అండ్ జెర్క్‌లో 234)తో కాంస్యాన్ని దక్కించుకున్నారు. -
Tokyo Olympics: తండ్రి వల్ల కానిది తనయుడు సాధించాడు
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ (96 కేజీల విభాగం)లో ఖతర్ దేశానికి చెందిన మెసో హసూనా స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ కలిపి అతను మొత్తం 402 కిలోల బరువు ఎత్తాడు. ఒలింపిక్ చరిత్రలో గతంలో 1 రజతం, 4 స్వర్ణాలు గెలుచుకున్న ఖతర్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దేశానికి తొలి స్వర్ణమే కాదు, హసూనా గెలుపు వెనక ఆసక్తికర నేపథ్యం ఉంది. 37 సంవత్సరాలుగా అతని కుటుంబం ఒలింపిక్ పతకం కోసం ఎదురు చూస్తోంది. మెసో తండ్రి ఇబ్రహీం హసూనా కూడా వెయిట్‌లిఫ్టర్. ఈజిప్ట్ దేశం తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ (1984, 1988, 1992)లలో పాల్గొన్నాడు. కానీ ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయాడు. తీవ్ర నిరాశకు గురైన అతను ఆ తర్వాత ఖతర్‌కు వలస వచ్చాడు. పట్టుదలగా తానే శిక్షణ ఇచ్చి తన కొడుకు మెసో హసోనాను కూడా వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చి దిద్దాడు. జూనియర్ స్థాయి నుంచే రాణిస్తూ సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో రజత, కాంస్యాలు గెలుచుకున్న 23 ఏళ్ల మెసో తొలి ఒలింపిక్స్‌లోనే సత్తా చాటాడు. తండ్రి సమక్షంలోనే ఏకంగా స్వర్ణం గెలుచుకొని తన కుటుంబం 37 సంవత్సరాల ఎదురు చూపులకు తెరదించాడు. -
ఒలింపిక్ రికార్డు.. 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..
టోక్యో: 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... మహిళా వెయిట్‌లిఫ్టర్ హిదిలిన్ దియాజ్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఫిలిప్పీన్స్ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో 30 ఏళ్ల దియాజ్ మొత్తం 224 కేజీల (స్నాచ్‌లో 97+క్లీన్ అండ్ జెర్క్‌లో 127) బరువెత్తి కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. దాంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. లియావో కియున్ (చైనా–223 కేజీలు) రజతం, జుల్ఫియా చిన్షాన్లో (కజకిస్తాన్–213 కేజీలు) కాంస్యం సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో దియాజ్ రజత పతకాన్ని సాధించింది. 1924 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న ఫిలిప్పీన్స్ ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు సాధించింది. -
గాయం బెడద భయం గొల్పుతోంది
న్యూఢిల్లీ : వెన్ను గాయం నుంచి కోలుకుని సాధన కొనసాగిస్తున్నా... దాని ప్రభావం తిరగబెట్టే ప్రమాదంపై తాను ఆందోళన చెందుతున్నట్లు భారత అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పేర్కొంది. గతేడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం వైద్యులు సైతం నిర్దిష్టమైన కారణం చెప్పలేనంతగా మీరాబాయి వెన్నునొప్పికి గురైంది. దీంతో ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్ షిప్‌నకు ఆమె దూరమైంది. దాదాపు 9 నెలల అనంతరం కోలుకున్న మీరా ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఎగాట్ కప్‌లో బరిలో దిగి 49 కేజీల విభాగంలో స్వర్ణం; ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో లోయర్క్లీన్ అండ్ జర్క్ అంశంలో రజతం సాధించింది. తాజాగా ముగిసిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం గెలుచుకుంది. అయితే, సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని గాయం తిరగబెట్టకుండా ఆమె సాధనలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఈ చాంపియన్‌షిప్‌ను క్వాలిఫయింగ్ టోర్నీగా పరిగణిస్తారు. ఈ నేపథ్యం లోనే మీరాబాయి ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
నేను తప్పు చేయలేదు: సంజిత
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను తనపై విధించిన నిషేధాన్ని అప్పీలు చేస్తానంటోంది. తాను ఎలాంటి నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడలేదని తెలిపింది. ‘నేను తప్పు చేయలేదు. ఎలాంటి నిషేధిత ఉత్ప్రే రకాలు తీసుకోలేదు. వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య సాయంతో ఈ నిషేధంపై అప్పీలు చేయాలనుకుంటున్నా’ అని ఆమె శుక్రవారం పేర్కొంది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 53 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచిన సంజితపై తాత్కాలిక నిషేధం విధిçస్తున్నట్లు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకం టెస్టోస్టిరాన్ వాడినట్లు సమాఖ్య పేర్కొంది. కాగా... గతేడాది నవం బర్లో అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా చాను నుంచి శాంపిల్స్ సేకరించారు. -
శభాష్ పూనమ్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : కామెన్ వెల్త్ క్రీడల్లో భారత వెయిలిఫ్టర్ల హవా కొనసాగుతోంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం వేకువ ఝామున జరిగిన పోటీల్లో ఆమె 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించారు. దీంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరగా.. అందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. కాగా, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పూనమ్ యాదవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, 2014 గ్లాస్గోవ్ కామెన్వెల్త్ క్రీడల్లో ఆమె కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. GOLD to Punam Yadav in 69 Kg weightlifting...big congratulations to her..super performance by our weightlifters continues at #GC2018 #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 8 April 2018 -
స్వర్ణం గెలుచుకున్న వెంకట్ రాహుల్
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో తెలుగబ్బాయి వెంకట్ రాహుల్ రాగల స్వర్ణం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ ల్లో భాగంగా మొత్తం 338 కేజీలను ఎత్తిన వెంకట్ రాహుల్ పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే ఈ నాలుగు బంగారు పతకాలు వెయిట్ లిఫ్టింగ్‌లో రావడం విశేషమైతే ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్‌కు వచ్చిన ఆరు పతకాలు కూడా వెయిలిఫ్టింగ్‌లోనే రావడం మరో విశేషం.ఇక రాహుల్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడు. తొలి రోజు మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను , రెండో రోజు 48 కేజీల విభాగంలో సంజిత చాను, శనివారం 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్ కుమార్ శివలింగంతో పాటు వెంకట్ రాహుల్‌లు పసిడితో మెరిశారు. ఇక పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో మొదటి రోజు గురురాజా రజతం సాధించి శుభారంభం అందించగా, రెండో రోజు శుక్రవారం 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్ లాథర్ కాంస్యం సాధించడంతో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు సొంతమయ్యాయి. రాహుల్‌కు వైఎస్ జగన్ అభినందనలు పసిడి సాధించిన తెలుగబ్బాయి వెంకట్ రాహుల్ రాగలకు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాహుల్ స్వర్ణం గెలిచి దేశం గర్వించేలా చేశాడని కొనియాడారు. -
బంగారు మీరా...
అంచనాలు నిజమయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రోజే భారత్ బంగారు బోణీ చేసింది. మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో ‘రికార్డు’ ప్రదర్శనతో అదరగొట్టింది. గ్లాస్గో గేమ్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న ఆమె ఈసారి ప్రపంచ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత శిబిరంలో ఆనందాన్ని నింపింది. అంతకుముందు పురుషుల 56 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ గురురాజా రజత పతకం నెగ్గి భారత్‌కు ఈ గేమ్స్‌లో తొలి పతకాన్ని అందించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తానికి మొదటి రోజే భారత్ రెండు పతకాలతో తన వేటను మొదలుపెట్టింది. గోల్డ్‌కోస్ట్: క్రితంసారి కంటే ఎక్కువ పతకాలు సాధించాలనే లక్ష్యంతో కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగిన భారత క్రీడాకారులు శుభారంభం ఇచ్చారు. తొలి రోజే ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు. తనపై పెట్టుకున్న ఆశలను, అంచనాలను నిజంచేస్తూ మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలిచింది. ఆమె మొత్తం (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 110) 196 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. మేరీ హనిత్రా రనైవొసోవా (మారిషస్–170 కేజీలు) రజతం నెగ్గగా... దినుషా గోమ్స్ (శ్రీలంక–155 కేజీలు) కాంస్యం సాధించింది. పసిడి గెలిచే క్రమంలో మీరాబాయి ఆరు (మూడు కామన్వెల్త్ చాంపియన్‌షిప్, మూడు కామన్వెల్త్ గేమ్స్) కొత్త రికార్డులు సృష్టించడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్... అదే జోరును గోల్డ్‌కోస్ట్‌లోనూ కనబరిచింది. ముందుగా స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో మీరాబాయి వరుసగా 80, 84, 86 కేజీలు... అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో వరుసగా 103, 107, 110 కేజీలు ఎత్తింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, మొత్తం కేటగిరీలలో మీరాబాయి కామన్వెల్త్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు తన పేరిటే ఉన్న కామన్వెల్త్ రికార్డు (స్నాచ్‌లో 85 కేజీలు; క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు; మొత్తం 194 కేజీలు)ను మీరాబాయి సవరించింది. అంతేకాకుండా 2010లో అగస్టీనా నవకోలో (స్నాచ్‌లో 77 కేజీలు; క్లీన్ అండ్ జెర్క్‌లో 98 కేజీలు; మొత్తంలో 175 కేజీలు) నెలకొల్పిన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును మీరాబాయి తాజా ప్రదర్శనతో తెరమరుగు చేసింది. చివరి ప్రయత్నంలో...: అంతకుముందు పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249కేజీలు (స్నాచ్‌లో 111+క్లీన్ అండ్ జెర్క్ లో 138) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చు కున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైన ఈ కర్ణాటక లిఫ్టర్ మూడో ప్రయత్నంలో సఫలమై పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మొహమ్మద్ ఇజర్ అహ్మద్ (మలేసియా – 261కేజీలు) స్వర్ణం... చతురంగ లక్మల్ (శ్రీలంక–248కేజీలు) కాం స్యం గెలిచారు.పురుషుల 62కేజీల విభాగంలో భారత లిఫ్టర్ రాజా ముత్తుపాండి (266కేజీలు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇతర క్రీడాంశాల్లో భారత ప్రదర్శన... ►బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ లీగ్ పోటీల్లోభారత జట్టు వరుసగా 5–0తో శ్రీలంక, పాకిస్తాన్‌లపై నెగ్గింది. ►బాక్సింగ్: పురుషుల 69కేజీల విభాగం తొలి రౌండ్లో మనోజ్ కుమార్ 5–0తో ఒసిటా ఉమె (నైజీరియా)పై గెలుపొందాడు. ►జిమ్నాస్టిక్స్: పురుషుల రింగ్స్ విభాగంలో రాకేశ్, ఆల్ అరౌండ్ విభాగంలో యోగేశ్వర్ ఫైనల్స్‌కు చేరారు. ►టేబుల్ టెన్నిస్: టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు 3–0తో ట్రినిడాడ్ అండ్ టొబాగోపై, 3–0తో నార్తర్న్ ఐర్లాండ్‌పై గెలుపొందింది. భారత మహిళల జట్టు 3–0తో శ్రీలంకను, 3–1తో వేల్స్‌ను ఓడించింది. ► స్క్వాష్: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్ వన్ సౌరవ్ ఘోషాల్ 2–3తో క్రిస్టోఫర్ బెన్నీ (జమైకా) చేతిలో ఓడిపోయాడు. హరీందర్ పాల్ సింగ్, విక్రమ్, దీపిక పళ్లికల్, జోష్న చినప్ప ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ►స్విమ్మింగ్: వీర్‌ధవల్ ఖడే(50 మీటర్ల బటర్‌ఫ్లయ్) సెమీస్‌లో; శ్రీహరి నటరాజన్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్) సెమీస్‌లో; సాజన్ ప్రకాశ్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో నిష్క్రమించారు. ►బాస్కెట్‌బాల్: లీగ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 57 – 66తో జమైకా చేతిలో... పురుషుల జట్టు 87 – 96తో కామెరూన్ చేతిలో ఓడాయి. ►మహిళల హాకీ: తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో వేల్స్ చేతిలో ఓడింది. తొలి స్వర్ణం బెర్ముడా ఖాతాలో... గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన ఘనత బెర్ముడా దేశానికి చెందిన మహిళా ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ ఖాతాలోకి వెళ్లింది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిమిషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. తొలి రోజు పోటీలు ముగిశాక ఇంగ్లండ్ (6 స్వర్ణాలు+3 రజతాలు+3 కాంస్యాలు) 12 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. రెండు పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది. స్వర్ణ పతకం నెగ్గిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. రికార్డులు బద్దలు కొడతానని అనుకోలేదు. ఇన్నాళ్లుగా నేను పడ్డ కష్టానికి పసిడి పతకం రూపంలో ఫలితం లభించింది. రియో ఒలింపిక్స్‌లో విఫలమైన తర్వాత తీవ్రంగా నిరాశ చెందాను. తాజా ప్రదర్శనతో చాలా ఆనందంగా ఉన్నాను. నా తదుపరి లక్ష్యం ఆసియా క్రీడల్లో పతకం నెగ్గడం. –మీరాబాయి చాను -
‘మనందరిపై బాధ్యత ఉంది’
సాక్షి, చేబ్రోలు: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చెప్పారు. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో తమ అకాడమీ క్రీడాకారులు తప్పక ఒలింపిక్ పతకం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హరియాణాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నామని.. శ్రీకాకుళం జిల్లాలోనూ అకాడమీ స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. యువతరం ఆలోచనలు, ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. కానీ నిధులను వినియోగించే విషయంలో ఇప్పటికీ సమస్యలున్నాయన్నారు. ప్రతిభావంతులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ ఇచ్చేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 49 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొచ్చి వారికి ఉచితంగా చదువులు చెప్పగలిగితే.. తాము వారిని అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. -
‘బెస్ట్ లిఫ్టర్’ రాహుల్
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో 16 రికార్డులు కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ తాజాగా రెండు అవార్డుల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాల్లో ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డులను రాహుల్ చేజిక్కించుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి నాలుగు అవార్డులు రాగా... అందులో రెండు ఏపీ లిఫ్టర్కే దక్కడం విశేషం. మీరాబాయి చానుకు సీనియర్ మహిళల కేటగిరీలో, దీపక్ లాథెర్‌కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి. మొత్తం మీద ఈ టోర్నీలో 34 రికార్డుల్ని భారత లిఫ్టర్లు నెలకొల్పారు. శనివారం చివరి రోజు పోటీల్లో పర్దీప్ సింగ్ బంగారు పతకం సాధించి, వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. 105 కేజీల కేటగిరీలో పర్దీప్ స్నాచ్‌లో 147 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీలు, మొత్తం 342 కేజీల బరువెత్తాడు. జూనియర్ మహిళల ప్లస్ 94 కేజీల విభాగంలో పూర్ణిమా పాండే రజతం నెగ్గగా... జూనియర్ పురుషుల 105 కేజీల కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ స్వర్ణం గెలిచాడు. ప్లస్ 105 కేజీల విభాగంలో గుర్దీప్ సింగ్‌కు కాంస్యం లభించింది. -
లిఫ్టర్ లాపంగ్‌కు రూ.10 లక్షల నజరానా
ఇటానగర్: దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన అరుణాచల్ ప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ సాంబా లాపంగ్ను ఆ రాష్ట్ర గవర్నర్ జేపీ రాజ్ ఖోవా సత్కరించారు. లాపంగ్ కు రూ. రూ.10 లక్షల నజరానా అందజేయడంతో పాటు, ఒక ప్రశంస పత్రాన్ని ఇచ్చి సత్కరించారు. 'నీవు త్వరలో జరిగే ఒలింపిక్స్ లో కూడా పతకాన్ని సాధిస్తావనే నమ్మకం ఉంది. ఒలింపిక్స్ లో భారత కీర్తిని సగర్వంగా చాటిచెప్పు. దాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు' అని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారుకు కొదవలేదని గవర్నర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. సరైన శిక్షణ, చక్కటి మార్గదర్శకత్వం, సహకారం అందిస్తుండటమే తమ రాష్ట్రం నుంచి అత్యధిక శాతం క్రీడాకారులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. -
మాలికి కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 94 కేజీల విభాగంలో చంద్రకాంత్ మాలి 338 కేజీల (స్నాచ్ 150+క్లీన్ అండ్ జర్క్ 188) బరువు ఎత్తి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి రెండు ప్రయత్నాల్లో 146, 150 కేజీలు ఎత్తిన మాలి మూడో ప్రయత్నంలో 153 కేజీల బరువును లేపడంలో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 183, 188 కేజీలను సునాయసంగా ఎత్తిన లిఫ్టర్ 194 కేజీల మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. స్టీవెన్ కుకునా కారీ (పపువా న్యూగినియా), సింప్లిక్ రిబోయెమ్ (ఆస్ట్రేలియా)లు చెరో 349 కేజీల బరువు ఎత్తినా... శరీరం బరువు తక్కువగా ఉండటం వల్ల కారీకి స్వర్ణం, రిబోయెమ్కు రజతం దక్కాయి. ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు లభించాయి. సంతోషికి అధికారికంగా రజతం మహిళల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం మత్స సంతోషికి అధికారికంగా రజత పతకాన్ని అందజేశారు. భారత్‌కే చెందిన స్వాతి సింగ్‌కు కాంస్యం దక్కింది. స్వర్ణం గెలిచిన నైజీరియన్ లిఫ్టర్ చికా అమలహా డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమె పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
స్వర్ణ సతీశ్... రజత రవి
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు గ్లాస్గో: కెరీర్లో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న వెయిట్‌లిఫ్టర్ సతీశ్ శివలింగం చరిత్ర సృష్టించాడు. 77 కేజీల విభాగంలో గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు స్వర్ణం దక్కించుకున్నాడు. 2013లో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించిన ఈ 22 ఏళ్ల యువ లిఫ్టర్ మొత్తం 328 కేజీల (149+179) బరువు ఎత్తాడు. స్నాచ్‌లో ఎత్తిన 149 కేజీల బరువుతో గత గేమ్స్‌లో ఇదే విభాగంలో యుకో పీటర్ (నౌరు) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఇక ఢిల్లీ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన కత్తుల రవి కుమార్ ఈసారి తన విభాగాన్ని మార్చుకుని రజతంతో సంతృప్తి చెందాడు. రవి 317 కేజీల (142+175) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. అయితే క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో అతను 185 కేజీల బరువు ఎత్తి స్వర్ణం దక్కించుకునే ప్రయత్నం చేసినా విఫలమయ్యాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాంకోయిస్ ఎటౌండీ (314 కేజీలు) నిలిచాడు. ఓవరాల్‌గా ఢిల్లీ గేమ్స్‌లో ఎనిమిది పతకాలు సాధించిన వెయిట్‌లిఫ్టర్లు ఇక్కడ ఇప్పటికే తొమ్మిది పతకాల (2-2-4)తో ఆ సంఖ్యను అధిగమించి జోరుమీదున్నారు. విభాగం మారినా... ఒడిశాలో స్థిరపడిన తెలుగు తేజం కత్తుల రవికుమార్ వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకాలు సాధించి ఆకట్టుకున్నాడు. బరంపురంలోని వీర్ హనుమాన్ క్లబ్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న అతను అంతకుముందు బాడీ బిల్డర్. సరిగ్గా ఢిల్లీ కామన్వెల్త్కు మూడేళ్ల ముందు తన ట్రైనర్ సలహా మేరకు వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. ఆ గేమ్స్‌లో 321 కేజీల బరువు ఎత్తి స్వర్ణంతో అదరగొట్టాడు. తక్కువ సమయంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టిన అతను ఈసారి గ్లాస్గో గేమ్స్‌లో 77 కేజీల విభాగంలో బరిలోకి దిగి రజతంతో మెరిశాడు. తొలిసారే అదుర్స్... తమిళనాడులోని వెల్లూర్‌కు చెందిన 22 ఏళ్ల సతీశ్ శివలింగంకు గ్లాస్గో గేమ్స్ చిరస్మరణీయంగా మిగిలాయి. మరోవైపు తనయుడి ఘనతపై తండ్రి శివలింగం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘ఇది తనకు తొలి కామన్వెల్త్ గేమ్స్. అయినా స్వర్ణం సాధించి మేం గర్వపడేలా చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం మా వాడి లక్షణం. ఈ స్వర్ణం అతని కెరీర్‌ను మలుపు తిప్పుతుంది’ అని తెలిపారు. -
మరో సంతోషం: కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యపతకం
సాధించిన వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి హర్షం వ్యక్తం చేసిన జిల్లా వాసులు విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా ఖ్యాతి అంతర్జాతీయ క్రీడా యవనికపై మరోసారి మెరిసింది. మన బంగారు తల్లి ఇంకోసారి ఎనలేని సంతోషాన్ని కానుకగా అందజేసింది. మన సంతోషి మరో పతకం కొల్లగొట్టింది. స్కాట్లాంట్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుని తెలుగు‘వాడి’ని చాటి చెప్పింది. 53 కిలోల విభాగంలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కిలోలు, స్నాచ్‌లో 83కిలోలు కలిపి మొత్తం 188 కిలోలు బరువెత్తి కాంస్య పతకం సాధించింది. సంతోషిది నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం. ఆమె తండ్రి రామారావు స్థానిక జూట్‌మిల్లులో పనిచేస్తుండగా, తల్లి రాములమ్మ గృహిణి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం దక్కించుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంతోషి సాధించిన విజయంపై తల్లిదండ్రులతో పాటు కోచ్‌గా వ్యవహరిస్తున్న చల్లా రాము, జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, పలు క్రీడా సంఘాలు అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. సంతోషి భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని, జిల్లా ఖ్యాతిని చాటి చెప్పాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు. సంతోషి సాధించిన విజయాలు... * 2005లో స్టేట్ చాంపియన్ షిప్ * 2006 నుంచి 2013 వరకు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకాలు సాధించి వరుసగా చాంపియన్‌గా నిలిచింది. అలాగే సీనియర్ వి భాగంలోనూ పలు పతకాలు సాధించింది. * 2010లో ఉజ్బెకిస్తాన్ దేశంలోని సబ్జూని యర్ ఏషియాడ్‌లో బంగారు, రజత పతకాలు, అదే ఏడాది జూనియర్ వరల్డ్ చాంపియన్ షిఫ్‌లో ఆరో స్థానం, సింగపూర్‌లో జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. * 2010 డిసెంబరులో మలేసియాలోని పెనాంగ్‌లో కామన్వెల్త్ యూత్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం. * 2011 దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకం. * 2012లో మలేషియాలో జరిగిన పోటీలో జూనియర్ విభాగంలో బంగారు పతకం.