‘బెస్ట్ లిఫ్టర్’ రాహుల్
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో 16 రికార్డులు కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ తాజాగా రెండు అవార్డుల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాల్లో ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డులను రాహుల్ చేజిక్కించుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి నాలుగు అవార్డులు రాగా... అందులో రెండు ఏపీ లిఫ్టర్‌కే దక్కడం విశేషం. మీరాబాయి చానుకు సీనియర్ మహిళల కేటగిరీలో, దీపక్ లాథెర్‌కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి.
మొత్తం మీద ఈ టోర్నీలో 34 రికార్డుల్ని భారత లిఫ్టర్లు నెలకొల్పారు. శనివారం చివరి రోజు పోటీల్లో పర్దీప్ సింగ్ బంగారు పతకం సాధించి, వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. 105 కేజీల కేటగిరీలో పర్దీప్ స్నాచ్‌లో 147 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీలు, మొత్తం 342 కేజీల బరువెత్తాడు. జూనియర్ మహిళల ప్లస్ 94 కేజీల విభాగంలో పూర్ణిమా పాండే రజతం నెగ్గగా... జూనియర్ పురుషుల 105 కేజీల కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ స్వర్ణం గెలిచాడు. ప్లస్ 105 కేజీల విభాగంలో గుర్‌దీప్ సింగ్‌కు కాంస్యం లభించింది.