
సాక్షి, చేబ్రోలు: ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చెప్పారు. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో తమ అకాడమీ క్రీడాకారులు తప్పక ఒలింపిక్ పతకం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన విజ్ఞాన్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హరియాణాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నామని.. శ్రీకాకుళం జిల్లాలోనూ అకాడమీ స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
యువతరం ఆలోచనలు, ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. కానీ నిధులను వినియోగించే విషయంలో ఇప్పటికీ సమస్యలున్నాయన్నారు. ప్రతిభావంతులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ ఇచ్చేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన 49 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొచ్చి వారికి ఉచితంగా చదువులు చెప్పగలిగితే.. తాము వారిని అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్లుగా తీర్చిదిద్దుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment