న్యూఢిల్లీ : వెన్ను గాయం నుంచి కోలుకుని సాధన కొనసాగిస్తున్నా... దాని ప్రభావం తిరగబెట్టే ప్రమాదంపై తాను ఆందోళన చెందుతున్నట్లు భారత అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పేర్కొంది. గతేడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం వైద్యులు సైతం నిర్దిష్టమైన కారణం చెప్పలేనంతగా మీరాబాయి వెన్నునొప్పికి గురైంది. దీంతో ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్ షిప్‌నకు ఆమె దూరమైంది. దాదాపు 9 నెలల అనంతరం కోలుకున్న మీరా ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఎగాట్ కప్‌లో బరిలో దిగి 49 కేజీల విభాగంలో స్వర్ణం; ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో లోయర్‌క్లీన్ అండ్ జర్క్ అంశంలో రజతం సాధించింది. తాజాగా ముగిసిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం గెలుచుకుంది. అయితే, సెప్టెంబరులో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని గాయం తిరగబెట్టకుండా ఆమె సాధనలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ఈ చాంపియన్‌షిప్‌ను క్వాలిఫయింగ్ టోర్నీగా పరిగణిస్తారు. ఈ నేపథ్యం లోనే మీరాబాయి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment