మాలికి కాంస్యం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 94 కేజీల విభాగంలో చంద్రకాంత్ మాలి 338 కేజీల (స్నాచ్ 150+క్లీన్ అండ్ జర్క్ 188) బరువు ఎత్తి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి రెండు ప్రయత్నాల్లో 146, 150 కేజీలు ఎత్తిన మాలి మూడో ప్రయత్నంలో 153 కేజీల బరువును లేపడంలో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 183, 188 కేజీలను సునాయసంగా ఎత్తిన లిఫ్టర్ 194 కేజీల మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. స్టీవెన్ కుకునా కారీ (పపువా న్యూగినియా), సింప్లిక్ రిబోయెమ్ (ఆస్ట్రేలియా)లు చెరో 349 కేజీల బరువు ఎత్తినా... శరీరం బరువు తక్కువగా ఉండటం వల్ల కారీకి స్వర్ణం, రిబోయెమ్‌కు రజతం దక్కాయి. ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు లభించాయి.
సంతోషికి అధికారికంగా రజతం
మహిళల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం మత్స సంతోషికి అధికారికంగా రజత పతకాన్ని అందజేశారు. భారత్‌కే చెందిన స్వాతి సింగ్‌కు కాంస్యం దక్కింది. స్వర్ణం గెలిచిన నైజీరియన్ లిఫ్టర్ చికా అమలహా డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమె పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.