మరో సంతోషం: కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యపతకం
సాధించిన వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి
హర్షం వ్యక్తం చేసిన జిల్లా వాసులు
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా ఖ్యాతి అంతర్జాతీయ క్రీడా యవనికపై మరోసారి మెరిసింది. మన బంగారు తల్లి ఇంకోసారి ఎనలేని సంతోషాన్ని కానుకగా అందజేసింది. మన సంతోషి మరో పతకం కొల్లగొట్టింది. స్కాట్లాంట్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుని తెలుగు‘వాడి’ని చాటి చెప్పింది. 53 కిలోల విభాగంలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కిలోలు, స్నాచ్‌లో 83కిలోలు కలిపి మొత్తం 188 కిలోలు బరువెత్తి కాంస్య పతకం సాధించింది.
సంతోషిది నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం. ఆమె తండ్రి రామారావు స్థానిక జూట్‌మిల్లులో పనిచేస్తుండగా, తల్లి రాములమ్మ గృహిణి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం దక్కించుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంతోషి సాధించిన విజయంపై తల్లిదండ్రులతో పాటు కోచ్‌గా వ్యవహరిస్తున్న చల్లా రాము, జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, పలు క్రీడా సంఘాలు అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. సంతోషి భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని, జిల్లా ఖ్యాతిని చాటి చెప్పాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.
సంతోషి సాధించిన విజయాలు...
* 2005లో స్టేట్ చాంపియన్ షిప్
* 2006 నుంచి 2013 వరకు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకాలు సాధించి వరుసగా చాంపియన్‌గా నిలిచింది. అలాగే సీనియర్ వి భాగంలోనూ పలు పతకాలు సాధించింది.
* 2010లో ఉజ్బెకిస్తాన్ దేశంలోని సబ్‌జూని యర్ ఏషియాడ్‌లో బంగారు, రజత పతకాలు, అదే ఏడాది జూనియర్ వరల్డ్ చాంపియన్ షిఫ్‌లో ఆరో స్థానం, సింగపూర్‌లో జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది.
* 2010 డిసెంబరులో మలేసియాలోని పెనాంగ్‌లో కామన్వెల్త్ యూత్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం.
* 2011 దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకం.
* 2012లో మలేషియాలో జరిగిన పోటీలో జూనియర్ విభాగంలో బంగారు పతకం.