Santoshi Matsa
-
కుగ్రామం నుంచి కామన్వెల్త్కు...క్రీడా శిఖరం
మారుమూల గ్రామం.. క్రీడా వసతులు శూన్యం.. తండ్రి జూట్‌మిల్ కార్మికుడు.. కుటుంబం గడవడమే కష్టం.. ఇక ఆ వెయిట్ లిఫ్టర్‌కు పౌష్టికాహారం ఎలా? శిక్షణ లేకున్నా సంకల్పం ఉంది.. కండ బలానికి గుండె బలం తోడైంది.. పతకాలు ప్రోత్సాహమందించాయి.. ఆ స్ఫూర్తే ఆమెను కామన్వెల్త్ రజత పతక విజేతగా నిలిపింది. ఆమే ఉత్తరాంధ్ర క్రీడా శిఖరం మత్స సంతోషి.. విశాఖపట్నం: ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు సంతోషి ఎవరో చాలామందికి తెలీదు. ఉత్తరాంధ్రకే ఆమె ఎవరో పరిచయం లేదు. పతకం సాధించాక.. సన్మానాలే సన్మానాలు. జీరో స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగేలోగా... ఆ మధ్యలో ఆమె కఠోర శ్రమ, సంఘర్షణ ఎంతో ఉంది. సాంకేతిక శిక్షణ లేకున్నా సహజమైన ప్రతిభతో ఎదిగారామె. ఆర్ధిక వెసులుబాటు లేకున్నా శక్తికి మించి బరువులనెత్తి పతకాన్ని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఏడో పతకమైనా తన కెరీర్లో కామన్వెల్త్ మెడల్ బెస్ట్ అంటారామె. ఒలింపిక్స్ పతకమే తన లక్ష్యమంటున్న సంతోషి మనోగతం ఆమె మాటల్లోనే... సరదాగా ఆటల్లో... ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఓసారి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా స్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొన్నాను. చక్కటి ప్రతిభ కనబరచడంతో చదువు నుంచి ఆటల్లోకి మారాను. రాము వద్ద శిక్షణతోనే ఈ స్థాయికి వచ్చాను. అమ్మా నాన్నలను ఆయనే ఒప్పించి వెయిట్ లిఫ్టింగ్‌కు తీసుకువచ్చారు. కుగ్రామం నుంచే... విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ఓ చిన్న గ్రామం కొండ వెలగాడ. అక్కడ ఆటలకు ఎటువంటి వసతులు లేవు. నాన్న అక్కడి జూట్‌మిల్‌లో వర్కర్. ఇద్దరు అక్కలు, ఓ అన్నయ్య మా కుటుంబం. అమ్మ ఇంటిదగ్గరే ఉంటుంది. అంతర్జాతీయంగా పతకం సాధించినా ఆనందించడమే తప్ప వారికేమీ తెలీదు. విశాఖలో అరంగేట్రం... 2005లో విశాఖలోని ఏయూలో జరిగిన పోటీల్లోనే తొలిసారిగా పాల్గొన్నాను. అది స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్. చక్కటి ప్రతిభతో 48 కేజీల వెయిట్ విభాగంలో స్వర్ణాన్నే సాధించాను. అదే నేను సాధించిన తొలి పతకం. ప్రస్తుతం 53 కేజీల్లో... ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 53 కేజీల వెయిట్‌లోనే కాంస్యం సాధించాను. 2010 వరకు 48 కేజీల్లోనే చేసినా ఇంజరీస్ కాకుండా నిలువరించుకునేందుకు 53కేజీల్లో తలపడుతున్నాను. డైట్ ఖర్చే నెలకు రూ.40 వేలు... శిక్షణకే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. నెలకు దాదాపుగా 40 వేలు ఖర్చంటే నాకు కాస్త ఆర్ధికంగా కష్టమే. రోజూ 12 గుడ్లు, నాలుగు లీటర్ల పాలు, ఒక కేజీ చికెన్ లాగించేస్తాను. ఒక డ్రై ఫ్రూట్స్లాంటి సప్లిమెంటరీ తప్పనిసరి. నేషనల్ క్యాంప్స్లో మూడేసి నెల లు పాల్గొంటాను. అంతర్జాతీయంగా ఏడు పతకాలు... అంతర్జాతీయ స్థాయిలో పదమూడు టోర్నీల్లో పాల్గొని ఏడుసార్లు పతకాలు అందుకున్నాను. వీటిలో కామన్వెల్త్ క్రీడల్లో అందుకున్న రజత పతకమే కెరీర్ బెస్ట్. సబ్ జూనియర్, జూనియర్లతోపాటు సీనియర్స్‌తోనూ తలపడి పతకాలు సాధించాను. ఆసియన్ చాంపియన్‌షిప్‌లోనూ పతకాలందుకున్నాను. ఉద్యోగం అడిగా... ఆర్థికంగా గతంలో పెద్దగా ప్రోత్సాహం లేకున్నా ప్రస్తుతం బాగుంది. కామన్వెల్త్ పతకంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షలు ప్రకటిస్తే,..కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇచ్చింది. కలెక్టర్ స్థానికంగా స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకో ఉద్యోగమివ్వండి అని అడిగాను. నిన్ననే ఏయూ వీసీ ఉద్యోగమిస్తానన్నారు. ఎక్కడ బాగుంటే అక్కడ చేస్తాను. ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. శిక్షణకు అనువైన ప్రాంతమై ఉండాలి. ఆ అనుభవంతోనే.. 1993లో మా మండలానికి శర్మ అనే కోచ్ వచ్చారు. ఆయన వద్దకు మా చెల్లెల్ని శిక్షణకు తీసుకువెళ్లాను. అప్పుడు ఆయన వద్ద కొన్ని మెళకువల్ని నేర్చుకున్నాను. ఆయన వెళ్లిపోయిన తర్వాత నేనే కొందరికి శిక్షణనిస్తూ సంతోషిని ఈ స్థాయికి చేర్చాను. సంతోషి ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటలు సాధన చేస్తుంది. -రాము, సంతోషి కోచ్ -
అవరోధాలను ఎత్తిపడేసింది!
విజయాన్ని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే దాన్ని తెచ్చి ఒళ్లో వేసుకుంటారు. మత్స సంతోషి ఈ రెండో కోవకు చెందిన అమ్మాయి. విజయాన్ని పొందడమే కాదు... దాన్ని తన ఇంట్లో కట్టి పారేసిందామె. తన ఇంటి అల్మరాలో ఉండే మెడళ్లు, అవార్డులు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సాధన చేయడం, సాధించి తీరడం ఆమెను చూసే నేర్చుకోవాలి ఎవరైనా. తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించిన సంతోషి ఇంతవరకూ చేసిన ప్రయాణం... స్ఫూర్తిదాయకం! ఏదైనా సాధించాలంటే ఏం కావాలి... డబ్బా? పలుకుబడా? కాదు. ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష. అవి మత్స సంతోషికి మెండుగా ఉన్నాయి. అందుకే ఆమె అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. క్రీడాకారిణిగా లెక్కలేనన్ని పతకాలు సాధించింది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం సంతోషిది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. తండ్రి రామారావు జూట్ మిల్లులో కార్మికుడు. తల్లి రాములమ్మ గృహిణి. నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లల్లో మూడవది సంతోషి. చురుకైనది. హుషారైనది. ఆమె ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడానికి పునాది వేసినవి ఆ లక్షణాలే. సంతోషి ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఆ గ్రామానికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు అంతర్జాతీయ పతకాన్ని సాధించారు. ఆయనకు సంతోషి చదువుతున్న పాఠశాలలో సన్మానం జరిగింది. అది సంతోషి చిన్ని మనసు మీద పెద్ద ప్రభావమే చూపించింది. ‘నన్నూ ఇలా సత్కరిస్తే బాగుణ్ను, ఎప్పటికైనా అలా జరుగుతుందా’ అనుకునేది. 2005లో అదే గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ కోచ్ చల్లా రాము సంతోషిలోని ఉత్సాహాన్ని గమనించారు. ‘నువ్వు మంచి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్వవుతావని నా నమ్మకం, ప్రయత్నించు’ అన్నారు. దాంతో తను మొదట వేయాల్సిన అడుగేంటో అర్థమైంది సంతోషికి. కష్టాలకు ఎదురీది... పల్లెటూరు... లోకజ్ఞానం తక్కువ. దానికి తోడు పేదరికం. ఇలాంటి పరిస్థితుల్లో కలను సాకారం చేసుకునే దిశగా సాగడం అంత తేలికేమీ కాదు. రాము ఆధ్వర్యంలో సంతోషి సాధన ప్రారంభించే నాటికి ఆ ఇంట్లో ఒక్క ఆడపిల్లకి మాత్రమే పెళ్లయ్యింది. మిగతా పిల్లల్ని పెంచడానికి తండ్రి నానా ఇబ్బందులూ పడుతున్నాడు. మూడు వేల జీతంతో అయిదుగురి జీవితాలను నడుపుతున్నాడు. ఆయనకు అండగా ఉండేందుకు సంతోషి చిన్నక్క ఓ ఆసుపత్రిలో పని చేసేది. వేణ్నీళ్లకు చన్నీళ్లలా తండ్రి సంపాదనకు తన సంపాదనను జోడించేది. అయినా తీరని కష్టాలు వారివి. అందుకే సంతోషి లక్ష్యసాధనకు ఆటంకాలు ఎక్కువగానే వచ్చాయి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అవసరమా అని ఆలోచించేది. వాళ్లకు కూడా ఇది అదనపు భారమే. అయితే రాము వారిని ఒప్పించారు. సంతోషి భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చారు. దాంతో వారు సరే అన్నారు. ఆ వెంటనే సంతోషి సాధన మొదలుపెట్టింది. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించింది. దాంతో ఆత్మవిశ్వాసం హెచ్చింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదల పెరిగింది. కానీ చదువు విషయంలో ఇబ్బంది పడేది. 2010లో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే అదే ఏడాది ఏషియన్ వెయిట్‌లిప్టింగ్ చాంపియన్‌షిప్ ఉండడంతో 2009 నుంచి కోచింగ్ కోసం పంజాబ్‌లో ఉండిపోవడంతో పరీక్షలకు హాజరు కాలేకపోయింది. 2011లో రాసి పాసయ్యింది. 2012లో నెల్లిమర్లలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఇసీ గ్రూపులో చేరింది సంతోషి. అయితే తరచూ ప్రాక్టీసుకు వెళ్లడంతో హాజరు చాలక, ఫైన్ కట్టాల్సి వచ్చింది. కోచింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను కాలేజీ వారికి చూపించినా వారు ప్రోత్సహించలేదు. పీడీ బొమ్మన రామారావు ఒక్కరే సంతోషికి సహకరించేవారు. చివరికి ద్వితీయ సంవత్సరం సంతోషిని రెగ్యులర్ విద్యార్థినిగా కాకుండా ప్రైవేటు విద్యార్థినిగా చేశారు. ఇవన్నీ ఆమెను బాధ పెట్టేవి. కానీ దిగులు పడేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేది. దానికి తోడు ఆర్థికావసరాలు కూడా అడ్డుపడుతుండేవి. మొదటి నేషనల్ పోటీలకు మణిపూర్ వెళ్లేందుకు డబ్బులు లేకపోతే తల్లి తన చెవి కమ్మలు అమ్మి డబ్బులు ఇచ్చింది. రాము ఆమెకు కొన్ని విషయాల్లో సహాయపడేవారు. ఏదైనా పోటీలో ప్రైజ్ మనీ వస్తే, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఆ సొమ్ముతో తన ఆటకు అవసరమైన వాటిని సమకూర్చుకునేది. ఆ కష్టం ఊరికే పోలేదు. ఈరోజు సంతోషి తల్లిదండ్రుల కళ్లు బాధతోనో, కష్టం వల్లనో కాదు... తమ కూతురు సాధించినదాన్ని చూసి గర్వంతో తడుస్తున్నాయి. - నడిపేన బంగారు నాయుడు, సాక్షి, విజయనగరం ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రులతో పాటు తన కోచ్ రాము కూడా ఎంతో తోడ్పడ్డారని అంటుంది సంతోషి. ఆయనే కనుక తన టాలెంట్‌ని గుర్తించి ఉండకపోతే ఇవన్నీ సాధించగలిగేదాన్ని కాదు అంటుంది... తనకొచ్చిన మెడల్స్‌ని చూపిస్తూ! స్పాన్సర్స్ ఎవరూ లేకపోయినా... లయన్స్ క్లబ్ తరఫున తనకు వ్యక్తిగతంగా ప్రోత్సాహాన్ని అందిస్తోన్న డాక్టర్ బీఎస్ఆర్ మూర్తికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోందామె! -
మరో సంతోషం: కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యపతకం
సాధించిన వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి హర్షం వ్యక్తం చేసిన జిల్లా వాసులు విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా ఖ్యాతి అంతర్జాతీయ క్రీడా యవనికపై మరోసారి మెరిసింది. మన బంగారు తల్లి ఇంకోసారి ఎనలేని సంతోషాన్ని కానుకగా అందజేసింది. మన సంతోషి మరో పతకం కొల్లగొట్టింది. స్కాట్లాంట్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుని తెలుగు‘వాడి’ని చాటి చెప్పింది. 53 కిలోల విభాగంలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కిలోలు, స్నాచ్‌లో 83కిలోలు కలిపి మొత్తం 188 కిలోలు బరువెత్తి కాంస్య పతకం సాధించింది. సంతోషిది నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం. ఆమె తండ్రి రామారావు స్థానిక జూట్‌మిల్లులో పనిచేస్తుండగా, తల్లి రాములమ్మ గృహిణి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం దక్కించుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంతోషి సాధించిన విజయంపై తల్లిదండ్రులతో పాటు కోచ్‌గా వ్యవహరిస్తున్న చల్లా రాము, జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, పలు క్రీడా సంఘాలు అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. సంతోషి భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని, జిల్లా ఖ్యాతిని చాటి చెప్పాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు. సంతోషి సాధించిన విజయాలు... * 2005లో స్టేట్ చాంపియన్ షిప్ * 2006 నుంచి 2013 వరకు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకాలు సాధించి వరుసగా చాంపియన్‌గా నిలిచింది. అలాగే సీనియర్ వి భాగంలోనూ పలు పతకాలు సాధించింది. * 2010లో ఉజ్బెకిస్తాన్ దేశంలోని సబ్జూని యర్ ఏషియాడ్‌లో బంగారు, రజత పతకాలు, అదే ఏడాది జూనియర్ వరల్డ్ చాంపియన్ షిఫ్‌లో ఆరో స్థానం, సింగపూర్‌లో జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. * 2010 డిసెంబరులో మలేసియాలోని పెనాంగ్‌లో కామన్వెల్త్ యూత్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం. * 2011 దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకం. * 2012లో మలేషియాలో జరిగిన పోటీలో జూనియర్ విభాగంలో బంగారు పతకం. -
వెయిట్ లిఫ్టింగ్ లో మెరిసిన తెలుగమ్మాయి
గ్లాస్గో: కామన్వెల్త్ లో తెలుగు అమ్మాయి మెరిసింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తెలుగు రాష్ట్రానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం చేజిక్కించుకుంది. 53 కేజీల విభాగంలో జరిగిన పోటీలో సంతోషి మత్స ఆద్యంతం ఆకట్టుకుంది. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగడ. ఇదిలా ఉండగా, పతకం సాధిస్తుందనుకున్న మరో వెయిట్ లిఫ్టర్ స్వాతి సింగ్ నిరాశ పరిచింది. చివరి వరకూ భారత ఆశలను రెట్టింపు చేసినా.. నాల్గో స్థానానికే పరిమితమైంది. నిన్న జరిగిన మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సంజితా కుమ్‌చమ్ స్వర్ణం సాధించగా, మీరాబాయి చానురెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ఈ తాజా పతకాలతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది.