కుగ్రామం నుంచి కామన్‌వెల్త్‌కు...క్రీడా శిఖరం
మారుమూల గ్రామం.. క్రీడా వసతులు శూన్యం.. తండ్రి జూట్‌మిల్ కార్మికుడు.. కుటుంబం గడవడమే కష్టం.. ఇక ఆ వెయిట్ లిఫ్టర్‌కు పౌష్టికాహారం ఎలా? శిక్షణ లేకున్నా సంకల్పం ఉంది.. కండ బలానికి గుండె బలం తోడైంది.. పతకాలు ప్రోత్సాహమందించాయి.. ఆ స్ఫూర్తే ఆమెను కామన్‌వెల్త్ రజత పతక విజేతగా నిలిపింది. ఆమే ఉత్తరాంధ్ర క్రీడా శిఖరం మత్స సంతోషి..
విశాఖపట్నం: ఇటీవలి కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందు సంతోషి ఎవరో చాలామందికి తెలీదు. ఉత్తరాంధ్రకే ఆమె ఎవరో పరిచయం లేదు. పతకం సాధించాక.. సన్మానాలే సన్మానాలు. జీరో స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగేలోగా... ఆ మధ్యలో ఆమె కఠోర శ్రమ, సంఘర్షణ ఎంతో ఉంది. సాంకేతిక శిక్షణ లేకున్నా సహజమైన ప్రతిభతో ఎదిగారామె. ఆర్ధిక వెసులుబాటు లేకున్నా శక్తికి మించి బరువులనెత్తి పతకాన్ని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఏడో పతకమైనా తన కెరీర్‌లో కామన్‌వెల్త్ మెడల్ బెస్ట్ అంటారామె. ఒలింపిక్స్ పతకమే తన లక్ష్యమంటున్న సంతోషి మనోగతం ఆమె మాటల్లోనే...
సరదాగా ఆటల్లో...
ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఓసారి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా స్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొన్నాను. చక్కటి ప్రతిభ కనబరచడంతో చదువు నుంచి ఆటల్లోకి మారాను. రాము వద్ద శిక్షణతోనే ఈ స్థాయికి వచ్చాను. అమ్మా నాన్నలను ఆయనే ఒప్పించి వెయిట్ లిఫ్టింగ్‌కు తీసుకువచ్చారు.
కుగ్రామం నుంచే...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ఓ చిన్న గ్రామం కొండ వెలగాడ. అక్కడ ఆటలకు ఎటువంటి వసతులు లేవు. నాన్న అక్కడి జూట్‌మిల్‌లో వర్కర్. ఇద్దరు అక్కలు, ఓ అన్నయ్య మా కుటుంబం. అమ్మ ఇంటిదగ్గరే ఉంటుంది. అంతర్జాతీయంగా పతకం సాధించినా ఆనందించడమే తప్ప వారికేమీ తెలీదు.
విశాఖలో అరంగేట్రం...
2005లో విశాఖలోని ఏయూలో జరిగిన పోటీల్లోనే తొలిసారిగా పాల్గొన్నాను. అది స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్. చక్కటి ప్రతిభతో 48 కేజీల వెయిట్ విభాగంలో స్వర్ణాన్నే సాధించాను. అదే నేను సాధించిన తొలి పతకం.
ప్రస్తుతం 53 కేజీల్లో...
ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో 53 కేజీల వెయిట్‌లోనే కాంస్యం సాధించాను. 2010 వరకు 48 కేజీల్లోనే చేసినా ఇంజరీస్ కాకుండా నిలువరించుకునేందుకు 53కేజీల్లో తలపడుతున్నాను.
డైట్ ఖర్చే నెలకు రూ.40 వేలు...
శిక్షణకే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. నెలకు దాదాపుగా 40 వేలు ఖర్చంటే నాకు కాస్త ఆర్ధికంగా కష్టమే. రోజూ 12 గుడ్లు, నాలుగు లీటర్ల పాలు, ఒక కేజీ చికెన్ లాగించేస్తాను. ఒక డ్రై ఫ్రూట్స్‌లాంటి సప్లిమెంటరీ తప్పనిసరి. నేషనల్ క్యాంప్స్‌లో మూడేసి నెల లు పాల్గొంటాను.
అంతర్జాతీయంగా ఏడు పతకాలు...
అంతర్జాతీయ స్థాయిలో పదమూడు టోర్నీల్లో పాల్గొని ఏడుసార్లు పతకాలు అందుకున్నాను. వీటిలో కామన్‌వెల్త్ క్రీడల్లో అందుకున్న రజత పతకమే కెరీర్ బెస్ట్. సబ్ జూనియర్, జూనియర్‌లతోపాటు సీనియర్స్‌తోనూ తలపడి పతకాలు సాధించాను. ఆసియన్ చాంపియన్‌షిప్‌లోనూ పతకాలందుకున్నాను.
ఉద్యోగం అడిగా...
ఆర్థికంగా గతంలో పెద్దగా ప్రోత్సాహం లేకున్నా ప్రస్తుతం బాగుంది. కామన్‌వెల్త్ పతకంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షలు ప్రకటిస్తే,..కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇచ్చింది. కలెక్టర్ స్థానికంగా స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకో ఉద్యోగమివ్వండి అని అడిగాను. నిన్ననే ఏయూ వీసీ ఉద్యోగమిస్తానన్నారు. ఎక్కడ బాగుంటే అక్కడ చేస్తాను. ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. శిక్షణకు అనువైన ప్రాంతమై ఉండాలి.
ఆ అనుభవంతోనే..
1993లో మా మండలానికి శర్మ అనే కోచ్ వచ్చారు. ఆయన వద్దకు మా చెల్లెల్ని శిక్షణకు తీసుకువెళ్లాను. అప్పుడు ఆయన వద్ద కొన్ని మెళకువల్ని నేర్చుకున్నాను. ఆయన వెళ్లిపోయిన తర్వాత నేనే కొందరికి శిక్షణనిస్తూ సంతోషిని ఈ స్థాయికి చేర్చాను. సంతోషి ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటలు సాధన చేస్తుంది.
-రాము, సంతోషి కోచ్