Commonwealth Games 2014
-
కుగ్రామం నుంచి కామన్వెల్త్కు...క్రీడా శిఖరం
మారుమూల గ్రామం.. క్రీడా వసతులు శూన్యం.. తండ్రి జూట్‌మిల్ కార్మికుడు.. కుటుంబం గడవడమే కష్టం.. ఇక ఆ వెయిట్ లిఫ్టర్‌కు పౌష్టికాహారం ఎలా? శిక్షణ లేకున్నా సంకల్పం ఉంది.. కండ బలానికి గుండె బలం తోడైంది.. పతకాలు ప్రోత్సాహమందించాయి.. ఆ స్ఫూర్తే ఆమెను కామన్వెల్త్ రజత పతక విజేతగా నిలిపింది. ఆమే ఉత్తరాంధ్ర క్రీడా శిఖరం మత్స సంతోషి.. విశాఖపట్నం: ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు సంతోషి ఎవరో చాలామందికి తెలీదు. ఉత్తరాంధ్రకే ఆమె ఎవరో పరిచయం లేదు. పతకం సాధించాక.. సన్మానాలే సన్మానాలు. జీరో స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగేలోగా... ఆ మధ్యలో ఆమె కఠోర శ్రమ, సంఘర్షణ ఎంతో ఉంది. సాంకేతిక శిక్షణ లేకున్నా సహజమైన ప్రతిభతో ఎదిగారామె. ఆర్ధిక వెసులుబాటు లేకున్నా శక్తికి మించి బరువులనెత్తి పతకాన్ని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఏడో పతకమైనా తన కెరీర్లో కామన్వెల్త్ మెడల్ బెస్ట్ అంటారామె. ఒలింపిక్స్ పతకమే తన లక్ష్యమంటున్న సంతోషి మనోగతం ఆమె మాటల్లోనే... సరదాగా ఆటల్లో... ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఓసారి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా స్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొన్నాను. చక్కటి ప్రతిభ కనబరచడంతో చదువు నుంచి ఆటల్లోకి మారాను. రాము వద్ద శిక్షణతోనే ఈ స్థాయికి వచ్చాను. అమ్మా నాన్నలను ఆయనే ఒప్పించి వెయిట్ లిఫ్టింగ్‌కు తీసుకువచ్చారు. కుగ్రామం నుంచే... విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ఓ చిన్న గ్రామం కొండ వెలగాడ. అక్కడ ఆటలకు ఎటువంటి వసతులు లేవు. నాన్న అక్కడి జూట్‌మిల్‌లో వర్కర్. ఇద్దరు అక్కలు, ఓ అన్నయ్య మా కుటుంబం. అమ్మ ఇంటిదగ్గరే ఉంటుంది. అంతర్జాతీయంగా పతకం సాధించినా ఆనందించడమే తప్ప వారికేమీ తెలీదు. విశాఖలో అరంగేట్రం... 2005లో విశాఖలోని ఏయూలో జరిగిన పోటీల్లోనే తొలిసారిగా పాల్గొన్నాను. అది స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్. చక్కటి ప్రతిభతో 48 కేజీల వెయిట్ విభాగంలో స్వర్ణాన్నే సాధించాను. అదే నేను సాధించిన తొలి పతకం. ప్రస్తుతం 53 కేజీల్లో... ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 53 కేజీల వెయిట్‌లోనే కాంస్యం సాధించాను. 2010 వరకు 48 కేజీల్లోనే చేసినా ఇంజరీస్ కాకుండా నిలువరించుకునేందుకు 53కేజీల్లో తలపడుతున్నాను. డైట్ ఖర్చే నెలకు రూ.40 వేలు... శిక్షణకే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. నెలకు దాదాపుగా 40 వేలు ఖర్చంటే నాకు కాస్త ఆర్ధికంగా కష్టమే. రోజూ 12 గుడ్లు, నాలుగు లీటర్ల పాలు, ఒక కేజీ చికెన్ లాగించేస్తాను. ఒక డ్రై ఫ్రూట్స్లాంటి సప్లిమెంటరీ తప్పనిసరి. నేషనల్ క్యాంప్స్లో మూడేసి నెల లు పాల్గొంటాను. అంతర్జాతీయంగా ఏడు పతకాలు... అంతర్జాతీయ స్థాయిలో పదమూడు టోర్నీల్లో పాల్గొని ఏడుసార్లు పతకాలు అందుకున్నాను. వీటిలో కామన్వెల్త్ క్రీడల్లో అందుకున్న రజత పతకమే కెరీర్ బెస్ట్. సబ్ జూనియర్, జూనియర్లతోపాటు సీనియర్స్‌తోనూ తలపడి పతకాలు సాధించాను. ఆసియన్ చాంపియన్‌షిప్‌లోనూ పతకాలందుకున్నాను. ఉద్యోగం అడిగా... ఆర్థికంగా గతంలో పెద్దగా ప్రోత్సాహం లేకున్నా ప్రస్తుతం బాగుంది. కామన్వెల్త్ పతకంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షలు ప్రకటిస్తే,..కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇచ్చింది. కలెక్టర్ స్థానికంగా స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకో ఉద్యోగమివ్వండి అని అడిగాను. నిన్ననే ఏయూ వీసీ ఉద్యోగమిస్తానన్నారు. ఎక్కడ బాగుంటే అక్కడ చేస్తాను. ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. శిక్షణకు అనువైన ప్రాంతమై ఉండాలి. ఆ అనుభవంతోనే.. 1993లో మా మండలానికి శర్మ అనే కోచ్ వచ్చారు. ఆయన వద్దకు మా చెల్లెల్ని శిక్షణకు తీసుకువెళ్లాను. అప్పుడు ఆయన వద్ద కొన్ని మెళకువల్ని నేర్చుకున్నాను. ఆయన వెళ్లిపోయిన తర్వాత నేనే కొందరికి శిక్షణనిస్తూ సంతోషిని ఈ స్థాయికి చేర్చాను. సంతోషి ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటలు సాధన చేస్తుంది. -రాము, సంతోషి కోచ్ -
‘ఆసియా’లో అసలు పరీక్ష
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. అయితే ఈ పోటీల్లో ప్రమాణాల స్థాయిని బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతం వచ్చిన పతకాలు కాస్త నిరాశనే కలిగించాయి. ఎందుకంటే భారత క్రీడాకారులకు అసలు సవాల్ వచ్చే నెలలో జరిగే ఆసియాగేమ్స్‌లో ఎదురుకానుంది. కామన్వెల్త్‌తో పోలిస్తే అక్కడ పోటీ, ప్రమాణాలు చాలా ఎక్కువ. కాబట్టి కామన్వెల్త్లో ఏం తప్పులు చేశామనేది వెంటనే సమీక్షించుకోవాలి. లేదంటే ఆసియా క్రీడల్లో భంగపడే ప్రమాదం ఉంది. కామన్వెల్త్ గేమ్స్ జోరును కొనసాగించాలి - టాప్-5లో నిలవాలి - అగ్రశ్రేణి ఆటగాళ్లు కీలకం అంచనాలను అందుకొని గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సంతృప్తికర ప్రదర్శన కనబరిచారు. వరుసగా నాలుగోసారి పతకాల సంఖ్యను 50 దాటించారు. నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ గేమ్స్‌లో భారత్ 101 పతకాలు సాధించినా... నాటి ప్రదర్శనను తాజా గేమ్స్‌తో పోల్చడం సబబుకాదు. న్యూఢిల్లీలో భారత్ పతకాలు నెగ్గిన పలు ఈవెంట్స్‌ను గ్లాస్గోలో నిర్వహించలేదు. ఆర్చరీ, టెన్నిస్ క్రీడాంశాలను పూర్తిగా తప్పించగా... రెజ్లింగ్‌లో గ్రీకో రోమన్ విభాగాన్ని... షూటింగ్లో 18 ఈవెంట్స్‌ను తొలగించి కుదించిన అంశాల్లో పోటీలను నిర్వహించారు. అయినప్పటికీ భారత క్రీడాకారులు స్థాయికి తగ్గ ఆటతీరుతో 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 64 పతకాలు నెగ్గి ఐదో స్థానాన్ని సంపాదించారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ ప్రదర్శనతో భారత క్రీడాకారులు మురిసిపోకుండా ఇదే జోరును వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడల్లో కొనసాగించాల్సిన అవసరం ఉంది. 17వ ఆసియా క్రీడలకు ఈసారి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా ఖండానికి చెందిన 45 దేశాలు పాల్గొనే ఈ క్రీడల్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్ తదితర దేశాలతో భారత్‌కు గట్టిపోటీ ఎదురవడం ఖాయం. గ్లాస్గోలో నెగ్గిన మాదిరిగా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడం అంత సులువేంకాదు. 63 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా క్రీడల్లో పతకాలపరంగా భారత్ ఇప్పటివరకు 2010 గ్వాంగ్జూ క్రీడల్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ క్రీడల్లో భారత్ 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలతో కలిపి మొత్తం 65 పతకాలు సాధించింది. 1986 సియోల్ క్రీడల తర్వాత భారత్ పతకాల పట్టికలో టాప్-5లో నిలువలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి భారత్‌ను టాప్-5లో మళ్లీ చూసే అవకాశముంది. ఇంచియాన్ గేమ్స్‌లో మొత్తం 36 క్రీడాంశాలు మెడల్ ఈవెంట్స్‌గా ఉన్నాయి. ఇందులో 28 ఒలింపిక్ క్రీడాంశాలు కాగా, మిగతా ఎనిమిది నాన్ ఒలింపిక్ క్రీడాంశాలు. గ్వాంగ్జూ క్రీడల్లో ఉన్న చెస్, క్యూ స్పోర్ట్స్, సాఫ్ట్‌బాల్, రోలర్ స్పోర్ట్స్, డాన్స్ స్పోర్ట్, డ్రాగన్ బోట్ అంశాలను ఈసారి తొలగించారు. కొన్ని క్రీడాంశాలను తొలగించినా... ఈసారి భారత్‌కు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, కబడ్డీ, రోయింగ్, షూటింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు క్రీడాంశాల్లో పతకాలు నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో అందలం ఎక్కాలంటే భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఆర్చరీలో దీపిక కుమారి, జయంత తాలుక్దార్... అథ్లెటిక్స్‌లో వికాస్ గౌడ... బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, సింధు, పారుపల్లి కశ్యప్, గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... టెన్నిస్‌లో లియాండర్ పేస్, సానియా మీర్జా, రోహన్ బోపన్న... షూటింగ్లో అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్, జీతూ రాయ్, హీనా సిద్ధూ, రాహీ సర్నోబాత్... రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్, గీత పోగట్, బబిత కుమారి... స్క్వాష్‌లో దీపిక పల్లికల్, జోష్నా చిన్నప్ప తదితరులు ‘పసిడి’ వెలుగులు విరజిమ్మితే భారత్ ఆసియాలో క్రీడాశక్తిగా ఎదిగేదిశగా మరో అడుగు ముందుకేస్తుంది. - సాక్షి క్రీడావిభాగం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలు ఏడాది స్వర్ణం రజతం కాంస్యం మొత్తం 2010 38 27 36 101 2014 15 30 19 64 -
భారత్‌కు ఐదో స్థానం
గ్లాస్గో గేమ్స్‌కు వీడ్కోలు గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. పన్నెండు రోజులపాటు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన క్రీడాకారుల విన్యాసాలకు తాత్కాలికంగా తెర పడింది. గత పోటీల స్థాయిలో కాకపోయినా... ఈసారి కూడా భారత క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో పతకాల పంట పండించారు. జూలై 23న ప్రారంభమైన ఈ క్రీడల్లో తొలిరోజే వెయిట్‌లిఫ్టర్ సుఖేన్ డే భారత్‌కు తొలి స్వర్ణాన్నందించగా... చివరి రోజు బ్యాడ్మింటన్‌లో పారుపల్లి కశ్యప్ సాధించిన స్వర్ణం దాకా భారత్ పసిడి వేట కొనసాగింది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లలో మనవాళ్లు అంచనాలకు అనుగుణంగానే రాణించినా... బాక్సర్లు మాత్రం ఒక్క స్వర్ణమూ సాధించకుండా రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. టేబుల్ టెన్నిస్‌లో ఒకే ఒక్క పతకంతో నిరాశపరిచారు. స్క్వాష్‌లో తొలిసారి పతకాన్ని... అదీ స్వర్ణాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టిం చారు. పసిడి పతకాల్లో కాస్త వెనకబడినా... మొత్తంగా 64 పతకాలతో భారత్ ఐదో స్థానంతో పోటీలను సంతృప్తికరంగా ముగించింది. ఇంగ్లండ్ 174 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక వచ్చే కామన్వెల్త్ గేమ్స్ 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరగనున్నాయి. -
భారత్ పరువు ‘గ్లాస్గో’లో కలిసింది!
►ఐఓఏ ప్రధాన కార్యదర్శి అరెస్టు ►మరో అధికారిపై లైంగిక ఆరోపణలు గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఒకవైపు భారత ఆటగాళ్లు పతకాల కోసం పోరాడుతుంటే... మరోవైపు అధికారులు దేశం పరువు పోగొట్టే పనిలో పడ్డట్లున్నారు! ఈ క్రీడల్లో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే ఉదంతం శనివారం చోటు చేసుకుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో అరెస్టయ్యారు. మరోవైపు రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ని కూడా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిక్‌పై ఏకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పుడు భారత బృందమంతా తలదించుకునే పరిస్థితి తలెత్తింది. ఈ ఇద్దరు అధికారికంగా భారత బృందంతో క్రీడా గ్రామంలో కాకుండా గ్లాస్గోలోని ఒక హోటల్లో ఉంటున్నారు. మాలిక్‌కు అయితే జట్టుతో సంబంధం కూడా లేదు. అరెస్ట్ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించారు. ‘శనివారం 45, 49 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులను వేర్వేరు చోట్ల భిన్నమైన ఆరోపణలతో అరెస్ట్ చేశాం. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేం’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఎడిన్‌బర్గ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా పోలీసులతో మాట్లాడినట్లు, తదుపరి దర్యాప్తునకు సంబంధించి చర్చిస్తున్నట్లు పేర్కొంది. రాజీవ్, వీరేందర్‌లను సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. రాజీవ్ మద్యం సేవించిన మోతాదును బట్టి శిక్షకు గురయ్యే అవకాశం ఉండగా... వీరేందర్‌పై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష తప్పకపోవచ్చు. మరోవైపు ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, దీనిపై తదుపరి స్కాట్లాండ్ పోలీసులే స్పందిస్తారని కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య సీఈఓ మైక్ హూపర్ స్పష్టం చేశారు. కఠిన చర్యలు: క్రీడల మంత్రి అరెస్ట్‌కు గురైన ఇద్దరు భారత అధికారులు తప్పు చేసినట్లు రుజువైతే వారిపై తీవ్ర చర్యలు తప్పవని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ‘మన అథ్లెట్లు దేశం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ తరహా ఘటన ప్రతీ భారతీయుడిని బాధిస్తుంది. కోర్టులో వారు తప్పు చేసినట్లు నిరూపణ అయితే కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి చెప్పారు. ఈ ఉదంతం తనను సిగ్గుపడేలా చేసిందని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ వ్యాఖ్యానించగా, ఐఓఏ మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా.. అరెస్ట్ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌లో కాంస్యం
కామన్వెల్త్ బ్యాడ్మింటన్‌లో సింధు కాంస్యపతకం సొంతం చేసుకుంది. బ్రాంజ్ కోసం కొనసాగిన పోరులో మలేసియా క్రీడాకారిణి జింగ్ ఇ టిపై వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకున్న సింధు.. కాంస్యపతక విజేతగా నిలిచింది. వరుసగా రెండు గేమ్‌లను 23-21, 21-9 తేడాతో గెలిచి భారత ఖాతాలో మరో పతకాన్ని జోడించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను సింధు 23-21తో గెలుచుకుంది. చాలావరకు ఆధిపత్యం కనబర్చిన సింధు, అనుకోకుండా ఒకటి రెండు పొరపాట్లు చేయడంతో ఈ గేమ్ గెలుచుకోడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. మలేసియా క్రీడాకారిణి జింగ్ కంటే ఎత్తుఎక్కువగా ఉండటం సింధుకు అడ్వాంటేజ్‌గా మారింది. కోర్టు నలుమూలలకూ చురుగ్గా కదలడంలో సింధు ముందంజలో ఉంది. దాంతోపాటు ప్లేస్మెంట్లు వేయడంలో కూడా మిచి పరిణితితో వ్యవహరించింది. కోచ్ గోపీచంద్ వెన్నంటి ఉండి సింధుకు మంచి ప్రోత్సాహం అందించారు. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకపోవడానికి తోడు జింగ్ను ముప్పుతిప్పలు పెట్టింది. జింగ్ మధ్యలో ఓ సమయంలో కాస్త తేరుకున్నట్లు కనిపించినా, సింధు మాత్రం ఆమె ఆట సాగనివ్వలేదు. -
సంతోషికి అభినందనల వెల్లువ
విజయనగరం మున్సిపాలిటీ/నెల్లిమర్ల రూరల్: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్యపతకం దక్కించుకున్న నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని అదృష్టం తలుపుతట్టి వరిస్తోంది. ఇన్నాళ్లూ కష్టించిన ఆమెను అదృష్టదేవత పలకరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమెకు రజతం పతకం దక్కింది. ఇదే విభాగంలో స్వర్ణం దక్కించుకున్న క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోవడంతో ఆమెకు దక్కిన పతకాన్ని రద్దుచేశారు. దీంతో రజతం దక్కించుకున్న క్రీడాకారిణికి నిర్వాహకులు స్వర్ణం ప్రకటించడంతో కాంస్యం దక్కించుకున్న సంతోషి రజతపతకం కైవసం చేసుకున్న ట్లయింది. ఈ మేరకు జిల్లాలో మరోసారి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన.అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు సంతోషికి అభినందనలు తెలిపారు. గ్లాస్గో నుంచి హైదరాబాద్ వస్తున్న సంతోషికి స్వాగతం పలికేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ హైదరాబాద్ బయలుదేరారు. మత్స సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో అనూహ్య పరిస్థితుల్లో రెండవ స్థానానికి వెళ్లి రజత పతకం సాధించినట్లు తెలియడంతో ఆమె తల్లిదండ్రులు, కోచ్ చల్లా రాము, సహచరు లు, వివిధ రాజకీయ పార్టీలకు చెం దిన నాయకులు, వివిధ సంఘాలు, అభిమానులు, కొండవెలగాడ గ్రామస్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సం తోషి ప్రతిభను కొనియాడుతున్నారు. -
కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం
గ్లాస్గో: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 20వ కామన్వెల్త్ క్రీడలు భారత బృందం ముందు నడవగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వారి సంస్కృతిని ప్రతిబింభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. క్రీడలు ప్రారంభమైనట్లు రాణీ రెండవ ఎలిజబెత్ ప్రకటించారు. ఈ వేడుకల్లో ప్రధాని డేవిడ్ కామెరూన్, స్కాట్లాండ్ ప్రభుత్వ మొదటి మంత్రి అలెక్స్ సాల్మండ్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రిన్స్ ఇమ్రాన్ టుంకు, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. ఆ తరువాత క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 3వ తేదీ వరకు జరుగుతాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యూనిసెఫ్ ప్రతినిధిగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో డిజిటల్ స్క్రీన్ మీద మెరిశాడు. ప్రపంచం అంతటా పేద పిల్లల జీవన పరిస్థితులు మెరుగుపడటం కోసం డొనేషన్లు అందజేయమని విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులతో గ్లాస్గోలో పండగ వాతావరణం నెలకొంది. క్రీడాభిమానులతో నగరం కళకళలాడుతోంది. కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్ ఇంతకు ముందు రెండు సార్లు ఆతిథ్యమిచ్చింది. ఇది మూడవసారి.