భారత్ పరువు ‘గ్లాస్గో’లో కలిసింది!
►ఐఓఏ ప్రధాన కార్యదర్శి అరెస్టు
►మరో అధికారిపై లైంగిక ఆరోపణలు
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఒకవైపు భారత ఆటగాళ్లు పతకాల కోసం పోరాడుతుంటే... మరోవైపు అధికారులు దేశం పరువు పోగొట్టే పనిలో పడ్డట్లున్నారు! ఈ క్రీడల్లో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే ఉదంతం శనివారం చోటు చేసుకుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో అరెస్టయ్యారు. మరోవైపు రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ని కూడా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిక్‌పై ఏకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పుడు భారత బృందమంతా తలదించుకునే పరిస్థితి తలెత్తింది. ఈ ఇద్దరు అధికారికంగా భారత బృందంతో క్రీడా గ్రామంలో కాకుండా గ్లాస్గోలోని ఒక హోటల్‌లో ఉంటున్నారు.
మాలిక్‌కు అయితే జట్టుతో సంబంధం కూడా లేదు. అరెస్ట్ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించారు. ‘శనివారం 45, 49 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులను వేర్వేరు చోట్ల భిన్నమైన ఆరోపణలతో అరెస్ట్ చేశాం. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేం’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఎడిన్‌బర్గ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా పోలీసులతో మాట్లాడినట్లు, తదుపరి దర్యాప్తునకు సంబంధించి చర్చిస్తున్నట్లు పేర్కొంది.
రాజీవ్, వీరేందర్‌లను సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. రాజీవ్ మద్యం సేవించిన మోతాదును బట్టి శిక్షకు గురయ్యే అవకాశం ఉండగా... వీరేందర్‌పై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష తప్పకపోవచ్చు. మరోవైపు ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, దీనిపై తదుపరి స్కాట్లాండ్ పోలీసులే స్పందిస్తారని కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య సీఈఓ మైక్ హూపర్ స్పష్టం చేశారు.
కఠిన చర్యలు: క్రీడల మంత్రి
అరెస్ట్‌కు గురైన ఇద్దరు భారత అధికారులు తప్పు చేసినట్లు రుజువైతే వారిపై తీవ్ర చర్యలు తప్పవని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ‘మన అథ్లెట్లు దేశం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ తరహా ఘటన ప్రతీ భారతీయుడిని బాధిస్తుంది. కోర్టులో వారు తప్పు చేసినట్లు నిరూపణ అయితే కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి చెప్పారు. ఈ ఉదంతం తనను సిగ్గుపడేలా చేసిందని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ వ్యాఖ్యానించగా, ఐఓఏ మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా.. అరెస్ట్ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు.